మూడు లాంతర్లు – 8

ఇది కాక, ఆధునికుల సాంకేతిక అభివృద్ధికి, ఆర్ధికాభివృద్ధికీ కూడా సృజన (Invention) ఆయువుపట్టు. అందుకే తీవ్రమైన చలనశీలత, అన్వేషణ వీటి పర్యవసానంగా జరిగే సృజన – వీటిని గౌరవించడం, వీటి కోసం అర్రులు చాచటం ఆధునిక సంస్కృతిలో ఒక భాగమైపోయేయి. అన్వేషణ, జిజ్ఞాస, వాటి ప్రోద్బలంతో జరిగే సృజన – వీటిమీద ఆసక్తి తీవ్రంగాను, తప్పనిసరిగాను ఉండేవాళ్ళు సృజనశీలురు. కవులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు, కొత్త కొత్త విషయాల్నీ, వస్తువుల్నీ, సాంకేతిక జ్ఞానాన్నీ కనిపెట్టే పరిశోధకులు, ఇలాంటి మనుషులు. వీళ్ళు నిరంతరం అన్వేషిస్తూ, సృజిస్తూ ఉండే స్వభావం ఉన్నవాళ్ళు కాబట్టి stimulus struggle అని సూచించిన అవస్థతో సరిగ్గా, అంటే సమతూకంగా సమాధానపడలేకపోయిన మనుషులు. వీళ్ళ సృజనలు సమాజానికి పనికొస్తాయి గాని, వీళ్ళ మానసికస్థితి ఏమంత ఆరోగ్యకరమైనది (well-adjusted) అని చెప్పుకొనే వీల్లేదు. ఇలాంటి సృజనశీలురలో చాలామందికి ఇది వరకు చెప్పిన eccentricity అనేలాంటి తిక్క, కొస వెర్రి ఉంటాయట. ఇలాంటివాళ్ళ సృజనశీలతకు చిన్న పిల్లల ఆటకు చాల సామీప్యాలుంటాయి. చిన్న పిల్లల అవసరాలన్నీ వాళ్ళ ప్రమేయం లేకుండానే పెద్దవాళ్ళు తీరుస్తారు. పిల్లల ధ్యాసంతా ఎప్పుడూ ఆట మీదే ఉంటుంది. ఈ ఆటల్లో కూడా కొత్త కొత్త విషయాల్నీ, తోవల్నీ కనిపెట్టి ఆనందించటం చిన్న పిల్లలకు సహజం. వాళ్ళకి ప్రతీదీ కొత్తే, ప్రతీదీ వింతే. ఆ కొత్తల్నీ, వింతల్నీ వెదికి పట్టుకుని, అర్ధం – అంటే అనుభవం చేసుకోవడం వాళ్ళకు గొప్ప ఆనందం. ఇలాంటి సృజనాత్మకమైన అన్వేషణ ఫలితంగా నేర్చుకొనే పాఠాలు వాళ్ళ బతుక్కి ముందు ముందు చాల అవసరం కాబట్టి.

చిన్నతనంలో ఉండే ఈ జిజ్ఞాస, అన్నిటినీ అన్వేషించి చూడాలనీ, కొత్త కొత్తవన్నీ విప్పిచూడాలనీ ఉండే తృష్ణ, అన్నింటినీ లోతుగా ప్రశ్నించే స్వభావం ఇవి కొంతమందిలో పెద్దయినా మాసిపోకుండా అలాగే ఉండిపోతాయి. వీళ్ళను పిల్లల్లాంటి పెద్దవాళ్ళు (childlike adults) అన్నారు. సాధారణంగా పెద్దలకూ పిల్లలకూ తేడాలేమిటంటే పెద్దవాళ్ళు తమ చుట్టు ఉన్న ఆవరణాన్ని, పరిస్థితుల్నీ తమ జీవికకు, లౌకిక ప్రయోజనాలకూ అనుకూలంగా ఉండేలా నిర్వహించుకుంటారు. వాళ్ళ ధ్యాసంతా అప్పటికే పరిచితమైన తోవల్నీ, ఎరిగున్న జవాబుల్నీ, పద్ధతుల్నీ ఉపయోగించుకొని లౌకిక విజయాన్ని సాధించుకోవటం మీదే లగ్నమై ఉంటుంది. లౌకిక విజయం అంటే ఇదివరకు మాస్లో అవసరాల అనుక్రమంలో సృజన కంటే కిందివి, తిండి, ఇళ్ళు, భద్రత, సాంఘిక గౌరవం, ప్రతిష్ట ఇవి సంతృప్తిగా తీర్చుకోవటం. లౌకికుని స్వభావం అన్వేషణ కాదు, సృజన కాదు; మనుగడ, సాంఘిక ప్రతిష్ట, వాటికి అవసరమయ్యే కార్య నిర్వహణ. ఇందుకు భిన్నంగా పిల్లలు కొత్త ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, కొత్త తోవలు తొక్కుతూనే ఉంటారు. సృజనశీలి పిల్లల స్వభావం ఉన్న పెద్దవాడు. ఆతని మౌలికమైన, అనివార్యమైన స్వభావం బాలక్రీడ (pretend play). సృజనకూ బాలక్రీడకూ నడుమ ఉన్న సామ్యాలపైన విశేషమైన చర్చ ఉంది. సదా బాలకుడు ఇస్మాయిల్ అనీ, శ్రీశ్రీ గారిది చిన్న పిల్లడి మనస్తత్వమనీ ఇలా పరిచితమైనవి కొన్ని. పుట్టపర్తి నారాయణాచార్యులుగారు ఇంతేనట. త్రిపుర ఇంతే. రావిశాస్త్రిగారు ఇలాగే. ఎం. ఎఫ్. హుసేన్ ఇంతే. నాకు పరిచితులైన కొద్దిమంది సృజనకారుల్లో సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం అని తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ముమ్మాటికీ ఇంతే. ఇలా చూసి చూసి నేను ఛలోక్తిగా ఏమనుకుంటానంటే మనిషి నడక, మాట్లాడే వాటం చూసి అతను కళాకారుడో లౌక్యుడో ఇట్టే పోల్చుకోవచ్చునని. సృజనశీలుర చరిత్రలు తవ్వుతూ పోతే వివిధ సంస్కృతుల్లోనా ఇలాంటి ఉదాహరణలు లెక్కకు మిక్కిలి కనిపిస్తారు.

పిల్లలందరిలో సామాన్యంగా ఉండే ఉత్సుకతను, సృజనశీలతను చాల వరకు అణచుకొని, పెద్దరికపు బాధ్యతలు, మర్యాదలతో సమాధానపడేలాగ చదువు, సంస్కృతి మనని నిర్దేశిస్తాయి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి పెద్దవాళ్ళ సమాజపు మర్యాదలకు, బాధ్యతలకు కట్టుబడే క్రమంలో జిజ్ఞాసను, సృజనాత్మకతను క్రమంగా కోల్పోతారు. సృజన తీవ్రమైన స్వభావంగా ఉన్నవాళ్ళు అన్వేషణ, నటన, కల్పన, బాలక్రీడ లక్షణాలుగా ఉండే బాల్య ప్రవృత్తిని, వీటిని అంటిపెట్టుకొని ఉండే భోళాతనాన్నీ కోల్పోలేకపోతారు. కళా సాంస్కృతిక వైజ్ఞానిక రంగాలనుండీ ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇటువంటి మనుషుల చరిత్రలను, వాళ్ళ సృజనను పరికించి చూస్తే సృజన ప్రపంచపు తర్కం, ప్రవృత్తీ లౌక్యులు, నాయకులు, శాస్త్రజ్ఞులు, సాంఘిక మేధావుల తర్కానికీ, ప్రవృత్తికీ భిన్నమైనదని స్పష్టమౌతుంది. ఏదో ఒక రకంగా తీవ్రము, అసాధారణమైన బాల్యాన్ని అనుభవించిన ప్రతిభావంతుల్లో పెద్దయ్యీ సృజనశీలత తీవ్రమైన స్వభావంగా ఉంటుందని ఒక ప్రతిపాదన. అసాధారణమైన బాల్యం అంటే అటు పిల్లల సృజనశీలతను, ప్రతిభను అటు తీవ్రమైన హేళణకు, అణచివేతకూ గురిచేసినా, లేకుంటే ఇటు అవధుల్లేని ప్రోత్సాహాన్నీ, పోషణను, గుర్తింపునూ ఇచ్చినా సరే.

ఇందుకు భిన్నంగా లౌక్యులైన సామాజికులు, వాళ్ళ వ్యవహారాలకు నాయకత్వం వహించే ఆసక్తి ఉన్న నాయకులూ ప్రేరణ కోసం వెదుకులాటతో సాధారణమైన తోవల్లో, సాధారణంగా అందుబాటులో ఉండే వినోదాలు, మరిపింతలు, కార్యక్రమాలతో సమాధానపడతారు. లేకుంటే సుమారు అలాంటివే కొత్త కొత్తవి కార్యక్రమాల్ని సృష్టించుకొని వినోదిస్తారు. మనస్తత్వం దృష్టిలో ఇది సహజము, ఆరోగ్యకరమైన ప్రవృత్తి. లోకంతో సబబుగా, సమంజసంగా సర్దుకున్న (well adjusted) స్వభావం. మౌలికంగా వీళ్ళ స్వభావం లౌకికమైన జీవితంలో విజయాన్నీ, సంతోషాన్నీ సాధించుకోవటం కాబట్టి సృజన వీళ్ళకు పరమ ప్రయోజనం కాదు. అది వీళ్ళకు తమ లౌకిక కార్యాచరణ కోసం ఒక సాధనం. ఈ విజయం కోసం, సౌఖ్యం కోసం సృజనశీలి పని ఫలితాలు – అంటే సృజన యొక్క రకరకాల ఫలాలు, సమాజానికి కావాలి. సృజనకూ, పిల్లల వంటి పెద్దవాళ్ళ చిత్తవృత్తికీ ఉన్న సంబంధాన్ని గురించి మరింత వివరించే ముందు ఒక జాగ్రత్త చెప్పుకోవాలి. లౌకికం, సామాజిక నిర్వహణలకు సృజనకూ నడుమ మౌలికంగా సంఘర్షణ, అంటే పేచీ ఉండవలసిన అవసరం లేదు. లౌక్యం – అంటే లోక వ్యవహారం చాల అవసరమైనది. దాన్ని సక్రమంగా నిర్వహించుకుని, నాయకత్వం వహించి, నెగ్గుకొని రావటం ఏమంత సుళువు కావు. అందుకే వేలాదిమందిలో కొద్దిమందే లౌక్యులుగా రాణించగలుగుతారు, వాళ్ళల్లో ఇంకా కొద్దిమందికే నాయకత్వం వహించగలిగే ఆసక్తి, శక్తియుక్తులూ ఉంటాయి. మానవాళికి సృజన కంటె ముందుగా అవసరమైనది మనుగడ. అందుకే లోకవ్యవహారంలో విజయాన్నీ, నాయకత్వాన్నీ విశేషంగా గౌరవిస్తాము. కవిత్వం ఏం, కడుపు నింపుతుందా? అని ప్రశ్నిస్తాము. చిన్నపాటి లౌకిక వ్యవహారాల్నైనా సరే సమర్ధవంతంగా నాయకత్వం వహించి, నిర్వహించి, ఒప్పించగలగడం చాల కష్టతరమైన పని. ఉదాహరణకు పదిమందిని పిలిచి టీ కాచి ఇచ్చి, ఆ పదిమందిలో ఏ ఒక్కరిచేతా విమర్శ – అంటే తిట్లు కాయకుండా బయటపడటం దాదాపు దుర్లభం.

స్పష్టమైన తర్కం, పద్ధతీ ఏర్పడి ఉన్న లౌక్యపు వ్యవహారాలకు నాయకత్వం వహించటమే ఇంత కష్టమైతే, లక్షణ వ్యవస్థ సాంతం చితికి జీర్ణమైపోయి శిధిలావస్థలో ఉన్న కాల్పనిక సృజన ఆవిష్కరణను నిర్వహించటం, అంటే సాంస్కృతిక నాయకత్వం వహించటం ఇంకెంత కష్టతరమైన పని అయిఉంటుంది? అందుకే చరిత్రలో సాంఘిక నాయకులు, రాజనీతి, యుద్ధం, వాణిజ్యం, పరిశ్రమ వంటి వ్యాపారాలకు ఎందరో సమర్ధులైన నాయకులు కనిపిస్తారు కాని, సాంస్కృతిక నాయకులు చాల అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు సృజన తర్కాన్నీ, స్వరూపాన్నీ ఎంతో కొంత అర్ధం చేసుకోకుండా సృజనకు నాయకత్వం వహించలేరు. సృజన అలౌకికమైన అనుభవమేమీ కాదు, అది లోకంలో జరిగేదే కాని లౌక్యుల తర్కానికీ, మర్యాదకూ, పద్ధతులకూ ఎడంగా తనదైన, స్వానుభవపూర్వకమైన తర్కం ప్రాతిపదికగా నెరపవలసినది. ఈ రెండింటి లక్ష్యాల్నీ, స్వరూపాల్నీ, తర్కాన్నీ విడి విడిగా అర్ధం చేసుకుంటే ఒకదానితో ఇంకొకదాన్ని confuse అవకుండా దేనికది సమర్ధవంతంగా నిర్వహించుకొనే వెసులుబాటు ఉంది. ఇలాంటి అవగాహన ప్రాతిపదికగా సృజన చుట్టూ ఉండే రకరకాల సంఘర్షణలను, సంశయాల్నీ సమన్వయం చేసుకొని, పరిష్కరించుకొనే తోవలు కనీసం గోచరమయ్యే వీలవుతుంది. అందుబాటులో ఉన్న సాంస్కృతిక నాయకులు ఒకరిద్దరి చరిత్రలు ముందుకి పరామర్శించవచ్చును.

దర్శనంలో నవ్యత అనేది సృజనకు చాల దగ్గరి చుట్టం. ప్రకృతి, ప్రవర్తన, అంతరంగం ఈ మూడింటిలో తమకు ఆసక్తికరమైన వాటిని కొత్తగా చూడగలగటం సృజనకారుల మౌలికమైన స్వభావం. ఇలా ప్రపంచాన్ని కొత్తగా – అంటే లోక వ్యవహారంలో సాధారణమైన దృష్టుల కంటె భిన్నంగా చూసి, ఆవిష్కరించే శక్తి ఎంత బలంగా ఉంటే ఆ సృజన అంత విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకునే కల్పనల్లో నవ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు నామిని కధలు మొదటి సారిగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఇంద్రాణివి వానకు తడిసిన పువ్వొకటి వంటి కవితల్లోను, ఇదివరకు చెప్పిన గంజిబువ్వ అనే కధ వంటి కధలకూ ఈ నవ్యత ప్రాణప్రదంగా ఉంది. అది వస్తువునుంచి కాక, సృజనకారుల అంతరంగ ప్రపంచపు కెమెరాల్లోని అసాధారణము, ప్రత్యేకమైన దృక్కోణాలనుండి వచ్చింది.

రవిగాంచనిచో కవి గాంచునే అన్నదాన్లో రవి లౌక్యుడు; రోజూ ఎండ కాసే జాగాలను మాత్రం చూడగలిగినవాడు. కవి సృజనశీలి. అతను ప్రకృతిలో, ప్రవర్తనలో, అంతరంగంలోను కొత్తవి, అపరిచితమైన జాగాలను దర్శించి, ఆవిష్కరించగలుగుతున్నాడు. ఇలాంటి నవ్యమైన దృష్టి హేతువుగా ఉన్న సృజనను Stochastic Creativity అన్నారు. ఇటువంటి నవ్యతకు ఉండే లక్షణాలు ఏమంటే: ఒకటి పాతగానే చూసే చూపుకు బందీలై చిక్కి పడకుండా తప్పించుకోగలగడం; రెండవది పాతకు భిన్నమైన రక రకాల తోవల్లో ప్రపంచాన్ని చూస్తూ ఆ దృక్కోణాల్లో తన సృజనకు అవసరమైన కోణాన్ని ఎంపిక చేసుకొని, ఉపయోగించుకోవడం. పాత పద్ధతులు లౌక్యులకు అలవాటైన పద్ధతులు. ఎందుకంటే పాత దారులు క్షేమంగా ఉండేవి, లౌకిక విజయానికి సుగమమైన మార్గాలు. కొత్త తోవలు తొక్కడానికి సాహసం కావాలి, వాటి వెంబడి పోతే లోకవ్యవహారంలో పరాజయమే మిగలవచ్చు. అంచేత లౌక్యుడు పాత తోవల్ని, లేకుంటే సృజనశీలి ఇటీవల తొక్కి చదును చేసిన కొత్త తోవల్నీ స్వీకరించి తన కార్యం చక్కబెట్టుకుంటాడు. ఇలా అనుకరించే ధోరణులు కూడా సారస్వతంలో సాధారణంగా కనిపిస్తాయి.

ఉదాహరణకు పచ్చనాకు సాక్షిగా కధల్లోని ఆత్మ చరిత్రాత్మకము, కన్‌ఫెషన్, బాలక్రీడ, ఎగతాళి, వేదన, పరాచికాలు, మాండలీకం ఇటువంటి రక రకాలుగా నవ్యమైన లక్షణాలను, పద్ధతుల్నే స్వీకరించి అటుపైన అనేకం రచనలు వచ్చేయి. వాటిలో ప్రళయ కావేరి కధలు నాకు ఎక్కువగా నచ్చుతాయి. ఎందుకంటే స. వెం. రమేష్ గారి సృజన తనదైన నవ్యతను కనుక్కొని, బలంగా ఆవిష్కరించగలుగుతుంది. తొలుత కొత్తదే అయిన తోవ, భాష, శైలీ, దృష్టీ మళ్ళీ తొక్కేసరికి మాసిపోతాయి. ఈ ఇబ్బంది ఇలా కొత్త తోవలు తొక్కిన వైతాళికులకే తెలిసిపోతుంది. అంటే వేరెవరో కానక్కర్లేదు, నామిని శైలిని, పద్ధతుల్ని నామినీ, ఇంద్రాణి పద్ధతుల్ని ఇంద్రాణీ, బత్తుల ప్రసాద్ పద్ధతుల్ని బత్తుల ప్రసాద్ ఇలా తమను తామే అనుకరిస్తూ పోతే అవికూడా మాసిపోయి, ఇబ్బంది పెడ్తాయి. తొలినాళ్ళలోని ప్రతిభ వలన మంచి రచయితలు, కవులు అని పేరుపడిపోయిన వాళ్ళు తరువాతి రోజుల్లో చేసిన రచనలు పేలవంగా, ఇబ్బందిగా ఉండటం, అయినప్పటికీ వాళ్ళు వాటినీ పాతవాటినీ కలిపి ప్రాచుర్యంలో తిప్పుకోవటం సృజనలోకంలో సర్వ సాధారణమైన సంగతి. ఇలా కాకుండా కళాకారులు తీసుకొనే జాగ్రత్త ఏమిటంటే పాత కెమెరాతోనే కొత్త కొత్త వస్తువుల్ని చూపించటం, లేకుంటే ఊరకే ఉండటం. అక్కడితో ఈ ఇబ్బంది దాదాపు నివారణ అవుతుంది గాని, సృజన రక్తి కట్టడానికి నవ్యత ఒక్కటే సరిపోదు. ఇప్పటికి ప్రస్తుతం ఏమంటే అందరికీ అందుబాటులో ఉన్న ప్రపంచాల్నే కొత్త కొత్తగా దర్శించటం, లేదు సామాన్యంగా అందుబాటులో లేని ఆవరణాల్ని దర్శించి చూపించటం ఈ రెండూ కొత్తతనానికి పనికొచ్చేవే.

బలమైన సృజనకారులు వస్తువులో కొత్తదనం మీద కంటె తమ దర్శనంలోని నవ్యత పైనే ఎక్కువగా ఆధారపడటం చూస్తాము. అంటే వీళ్ళ సృజనకు వస్తువు ఇదివరకు ఎవరూ ఆట్టే చూడని జాగాలు – కులు మనాలి, హిమాలయాలు, అమెరికా ఇలాంటివే కానక్కర్లేదు. రోజూ చూసేవీ, చాల ‘పరిచితం’ అయినవాటినే వీళ్ళు కొత్తగా, భిన్నంగా చూడగలుగుతారు. ఇలాంటి నవ్యము, సృజనాత్మకమైన దృష్టికి కొన్ని లక్షణాలు ఏమంటే అనూహ్యం, అపరిచితమైన తోవలు అనేకం పోల్చుకుని చూడగలిగే స్ఫురణ – Stochasticity అన్నది, Divergent Thinking అనేది ఒకటి. దీనికి దగ్గరగానే, పాత తోవల్ని తిరస్కరించటం, అంటే suppressing the obvious అనేది ఒకటి. ఉదాహరణకు పిల్లలు అరటిపండునో, కర్ర ముక్కనో తీసుకొని అది ఒక టెలిఫోన్లా చెవి దగ్గర పెట్టుకొని ‘హలో?! హలో!!’ అని మాట్లాడేటప్పుడు వాళ్ళు అరటిపండు తినడానికనీ, కర్ర ముక్క పొయ్యిలోకనీ పూర్వ జ్ఞానాన్ని విస్మరించి, ఆ వస్తువునే కొత్తగా చూడగలుగుతున్నారు. ఇలా కొత్త కొత్త ఉపయోగాల్నీ, సమాధానాల్నీ దర్శించే శక్తి జీవితంలో అన్ని వ్యవహారాలకీ ఎంతో ఉపకరించే సమయస్ఫూర్తికి చాల అవసరం. ధ్యాస నిడివి – అంటే Breadth of Attention అనేది విస్తారంగా ఉండటం ఇంకొకటి. ఉదాహరణకు ఇది అనేక అంశాల మీద, విషయాల మీద ఏక కాలంలోనే ఆసక్తి, ధ్యాస నిలిపే ప్రవృత్తిగా ఉండి, అవధానం వంటి కళలకు పనికొస్తుంది, ఇంకా ఒకే మనిషిని రక రకాల కళలు, విషయాల మీద ఆసక్తిగొనేలా చేస్తుంది. ఈ ప్రవృత్తే ADHD (Attention Deficit Hyperactivity Disorder) వంటి రుగ్మతల్లోనూ కనిపించేది. సృజనశీలురలో ఇది చాల ఎక్కువగా కనిపించే రుగ్మత. మూడవది బాలక్రీడ (Pretend Play) – అంటే దోబూచి, దొంగాట, నటన, అకారణంగా రక రకాల గొంతుల్నీ పాత్రల్నీ పోషించి వినోదించే మనస్తత్వం ఇలా పిల్లల్లో సర్వ సాధారణంగా కనిపించే బాల్య లక్షణాలు. ఈ బాలక్రీడ ద్వారా వేట, ఆత్మ రక్షణ, పెళ్ళి, వృత్తి వంటివి మనుగడకు, వంశానికీ అవసరమైన ఎన్నో కౌశల్యాల్ని రక రకాలుగా పిల్లలకు ప్రకృతి నేర్పిస్తుందట.

(ఇంకా ఉంది)

(ఉపయుక్త గ్రంధ సూచిక: Peter Carruthers ఆయన సహపాఠులవి The Origins of Creativity వంటివి, Desmond Morris రచనలు The Human Zoo, The Naked Ape వంటివి, Lionel Tiger and Robin Fox రచన The Imperial Animal వంటివి.)


రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ ‘ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, ‘బర్సాత్‌ మే బిల్లి’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...