పులి వేషగాడు

అతను సంచీ లోంచి ఒక పులి తోలును తీశాడు. అప్పుడే అతని గుడ్డ సంచీని మేము గమనించింది. దానిని ఒక్క క్షణంలో తన తల మీదుగా తొడుక్కొని, గడ్డం క్రింద పులి ముసుగుని లాక్కున్నాడు. తన సొంత కళ్ళతో చిరుత పులి ముఖం లోనుంచి గదిని ఒక్క క్షణం అటూ ఇటూ చూసుకున్నాడు.

“భేష్!” అన్నారు శర్మ. మేము అతని వైపే చూస్తూ వుండి పోయాము. అతను చేతులను ఒకసారి పైకి ఎత్తి శరీరాన్ని వదులుగా చేసుకున్నాడు. అలాగే వంగి నాలుగు కాళ్ళ మీద నిలబడి ముఖాన్ని అటూ ఇటూ తిప్పి చూసాడు.

“భేష్!” మళ్ళీ అన్నారు శర్మ.

అతను పిల్లిలాగా వీపును మాత్రం పైకి లేపి శరీరాన్ని వంచి అలాగే జలదరింపచేశాడు. తరువాత నోరు తెరిచాడు. అతను ఒకసారి పులిలా గాండ్రించి తన వెనక భాగాన్ని మాత్రం ఊపాడు. మేము ఉలిక్కి పడ్డాము. అంత సమీపంలో భయంకరంగా పులి గాండ్రింపు మేము విన్నది లేదు. అలాగే నాలుగు కాళ్ళ మీద ఖాళీగా ఉన్న కుర్చీ మీదికి దూకాడు. కుర్చీ దడ దడమని ఊగింది. నేను “అయ్యో!” అన్నాను.

అతను నాలుగు కాళ్ళ మీద నా బల్ల మీదికి దూకాడు. కన్ను మూసి తెరిచే లోపు శర్మగారి మేజ మీదికి లంఘించాడు. శర్మగారి మేజ మీద తారు మారుగా కాగితాలు, పుస్తకాలు, తమల పాకుల పొట్లం అన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయి. ఒకదాని మీద కూడా అతని కాళ్ళు పడలేదు. అతను శర్మగారి మేజ మీద పొంచినట్లుగా శర్మగారి వైపు చూసి మళ్ళీ ఒకసారి కడుపులో పేగులు సైతం వణికేటట్లు గర్జించాడు. అక్కడనుంచి అలాగే ఎత్తుకి దూకాడు. మేమందరమూ “ఓ!” అని అరిచాం.

అది పాత కాలపు భవనం. పైగోడ పొడుగునా సుమారు పదడుగుల దూరంలో రెండు అంగుళం వెడల్పుకు అంచు ఉంది. గోడకి ఒక పక్కన ఆ వెడల్పుకు కొంచం పైకి ఊచలు వేసిన కిటికీ ఒకటి వెంటిలేటరుగా ఉంది. అందులో ఒకటే ధూళి, దుమ్ము, బూజు. అతను నాలుగు కాళ్ళతో మనిషెత్తుకు ఎగిరి, మా అందరి తలల పైన ఆ రెండంగుళాల వెడల్పు ఉన్న గోడమీద ఒక్క క్షణం తనని ఇముడ్చుకున్నాడు. తరువాత చేతులతో వెంటిలేటర్ ఊచలని పట్టుకొని మళ్ళీ పులి లాగా గర్జించాడు.

“జాగ్రత్త! జాగ్రత్త!”అని శర్మగారు అరిచారు. ఆ ఎత్తులో అతని ముఖానికి నేరుగా సీలింగ్ ఫాన్ రాక్షస వేగంతో తిరుగుతోంది. అతనికి ఆ ఫానుకీ మధ్య కొన్ని అంగుళాలు కూడా దూరం లేదు.

అతను అంత ఎత్తు నుంచి పులి లాగే కుర్చీ మీదికి దూకాడు. మళ్ళీ అలాగే నేల మీదికి దూకాడు. మేము దిగ్బ్రమ తొలగని షాక్‌లో ఉండి పోయాము. చిరుత పులి ముఖంలో అతని కళ్ళు పిల్లి కళ్ళ లాగా మిల మిల మెరిశాయి. ఇంకోసారి చిరుత భయంకరంగా నోరు తెరిచి గాండ్రించింది. తరువాత నిమిషం అతని శరీరం వదులుగా వేలాడింది. అతను లేచి నిలబడ్డాడు. శర్మగారు ఇప్పుడు ‘భేష్’ అని కూడా అనలేకపోయారు. అతను పులి ముఖాన్ని తీసేశాడు. మేమంతా మాట్లాడలేని స్థితిలో ఉన్నాము. అతనే ముందు మమూలు మనిషయ్యాడు.

“నేను తప్పకుండా ఏదైనా చూస్తాను.” శర్మగారు అన్నారు. ఆయన గొంతు చాలా మారి పోయింది. అతను చేతులు జోడించాడు.

“ఎక్కడ ఉంటున్నావు?” శర్మగారు అడిగారు.

అతను మీర్ సాహిబ్ పేట అని చెప్పి, ఏదో నంబరు, వీధి పేరు చెప్పాడు. నేను నోట్ చేసుకున్నాను. అతను కాస్త ఆగి, “కానీ నేను ఎన్ని రోజులు అక్కడ ఉంటానో తెలియదండీ.” అని అన్నాడు.

“ఎందుకని?” శర్మగారు అడిగారు.

“అది కాదండీ…” ఏదో అనబోతున్న వాడల్లా చటుక్కున శర్మగారి కళ్ళ మీద పడ్డాడు.

“లేవయ్యా… లేవయ్యా, కాదర్!” శర్మగారు అదిరి పడ్డారు. మేము లేచి నిల్చున్నాము. అతను లేచి కళ్ళు తుడుచుకున్నాడు.

“నా భార్య ఇంటి వైపు రావద్దని చెప్పేసిందండి,” కొన్ని నిమిషాలకి ముందు పులిలాగా ఉన్న అతనే.

“నేను సంపాదించి చాలా నెలలవుతుంది. తను మాత్రం ఏం చేస్తుంది? నలుగురు పిల్లలు. అందరూ చిన్న వాళ్ళు.” అతను ఇప్పుడు ఏడుస్తున్నాడు.

శర్మగారికి ఏదోలా అనిపించి “ఈ రోజు నువ్వు తిన్నావా?” అని అడిగారు.

“లేదండీ.”

అతను ఆ రోజు మాత్రమే కాదు. చాలా రోజులుగా తిని ఉండక పోవచ్చని అడిగి తెలుసుకోవలసిన అవసరం లేక పోయింది. శర్మగారు తన జేబులో చెయ్యి పెట్టారు. మేము కూడా వెంటనే మా జేబుల్లో వెతికాం. చిల్లర అంతా కలిపితే పది రూపాయలు ఉండొచ్చు.

“ఇదిగో. దీన్ని తీసుకెళ్ళి మొదట కాంటీనుకు పోయి కడుపు నిండా తిను,” అని అన్నారు.

“వద్దండీ.”

“ఎందుకు వద్దు? పోయి తిను మొదట.”

“ఏదైనా రోల్ ఇప్పించండయ్యా,” ఏడుపుకు మధ్యలో అతనన్నాడు.

శర్మగారికి అంత కోపం వచ్చి నేనెప్పుడూ చూడలేదు. “ఇచ్చిన డబ్బును పుచ్చుకోనని నువ్వు ఎలాగయ్యా అంటావు? డబ్బును తిరస్కరిస్తే నీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? ఒక్క రూపాయి అయినా లక్ష్మీదేవి. నీ దగ్గరకి లక్ష్మి ఎలా వస్తుంది? పో.. మొదట పోయి తిను” అని అరిచారు.

అతను ఏడుపును ఆపి డబ్బును తీసుకున్నాడు. శర్మగారు అనునయిస్తున్నట్లుగా అన్నారు. “రోల్ అంటూ ఏదీ నా చేతిలో లేదు. నా వల్ల ఏదైనా పని అయ్యేటట్లు ఉంటే నేనే చేస్తాను. మొదట కడుపుకు ఏమైనా తిను.” తరువాత నా వైపు చూసి “కాస్త ఇతన్ని కాంటీనుకు తీసికెళ్ళి తినిపించండి” అని అన్నారు. నేను లేచాను. అతను వెంటనే ” వద్దండీ. నేనే వెళ్తాను.. నేను వెళ్ళితింటాను” అని అన్నాడు. మళ్ళీ మా అందరికీ దండం పెట్టి బైటికి వెళ్ళి పోయాడు.

మేము కాస్సేపు మాట్లాడకుండా ఉండి పోయాము. శర్మగారు తనకే తెలియకుండా పెద్ద గొంతుతో అన్నారు. “ఇతనికి ఏం చేయడం? ఇప్పుడు తీస్తున్నదో జానపద చిత్రం.”

కానీ ఆయన ఊరికే ఉండలేదు. రెండు వారాల తరువాత మళ్ళీ కథల విభాగంలో మీటింగ్ జరిగినప్పుడు, కథా నాయకుడు పులి వేషం వేసుకొని శత్రువుల కోటలోకి ప్రవేశించేటట్లు సినిమా తీయాలని ప్రతిపాదించి ఒప్పించారు. పులి వేషగాడు డాన్స్ ఆడేటప్పుడు, కథానాయకుడికి బదులుగా కాదర్‌ని డూప్ పెట్టుకోవచ్చు. అతనికి నూరు రూపాయలైనా ఇప్పించవచ్చు.

నేను కాదర్‌కి ఉత్తరం వ్రాసాను. నాలుగు రోజుల తర్వాత ఎప్పటిలాగే ఆ ఉత్తరం తిరిగి వచ్చింది, చిరునామా దారుడు లేదని. శర్మగారు నటరాజన్‌ని వెంట బెట్టుకొని కాదర్ కోసం వెతికారు. మేము కూడా ఎక్కడెక్కడో అడిగి చూసాము. కథానాయకుడు శత్రువు కోటలో ప్రవేశించే సీన్ తీయవలసిన రోజు సమీపిస్తూ వచ్చింది. కాదర్ దొరకలేదు.
అతను దొరికినా ఎక్కువగా ఉపయోగం లేక పోవచ్చు. ఆ నెలలో రిలీజ్ అయిన ఒక సినిమాలో గ్రామీణ సంగీతం నేపధ్యంలో కథానాయకుడు కావడి మోస్తున్నట్లుగా సీన్ వచ్చింది. ఆ సినిమా తమిళనాడు మొత్తం ప్రేక్షకులను అలరింప చేసింది.

మేము తీస్తున్న సినిమాలో కథానాయకుడు కరగాట్టం ఆడేటట్లు కథ మార్చబడింది.


[ఈ కథను అనువాదం చేయడానికి ఎన్నుకొన్న కారణం :-

తమిళ కథా సాహిత్యంలో ప్రముఖంగా పేర్కొనదగిన రచయితలలో అశోకమిత్రన్ ఒకరు. అసలు పేరు T.త్యాగరాజన్. “అప్పావిన్ స్నేహితర్” (నాన్నగారి స్నేహితుడు) అన్న కథల సంపుటికి 1996లో సాహిత్య అకాడెమి అవార్డ్ లభించింది. వీరి కథలు సాధారణమైన మనుషులను, వారి జీవితాలను ప్రతిబింబిస్తాయి. జెమిని స్టూడియోలో పని చేసిన స్వానుభవంలో వ్రాసిన కథ పులి వేషగాడు. టగర్ పాయిట్ కాదర్ సినిమాలో వేషం కోసం చేసే ప్రయత్నం, పులి వేషగాడిగా అతను ప్రదర్శించే హావభావాలు కళ్ళకి కట్టినట్లుగా పాఠకులను అలరింప చేస్తాయి. మాయజలతారు లాంటి సినిమా లోకం మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆఖరు వాక్యంలో కథ యొక్క మొత్తం విశ్వ రూపం గోచరిస్తుంది.]


గౌరి కృపానందన్

రచయిత గౌరి కృపానందన్ గురించి:

గౌరి కృపానందన్ మాతృభాష తమిళం. తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణాలో స్థిరపడినా, వివాహానంతరం చెన్నైకి వెళ్ళిన తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.

 ...


అశోకమిత్రన్

రచయిత అశోకమిత్రన్ గురించి:

200లకు పైగా చిన్న కథలు, ఎనిమిది నవలలు, అనేక వ్యాసాలు రాసిన అశోకమిత్రన్ (1931-2017) సూక్ష్మ పరిశీలనలు, వాస్తవిక రచనలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ తమిళ రచయిత. \”అప్పావిన్ స్నేహితర్\” నవలకు సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. ఆయన రచనలు సాధారణ జీవితాలను, మానవ సంబంధాలను ప్రతిబింబిస్తాయి.

 ...