“శతమానం భవతి. నాయనా చిన్నవాడివైనా నువ్వు చేసే పూజలూ, జపాలు నీకు మంచిచేసే రోజులని నీకు అందించబోతున్నాయి. ఇప్పట్నుండి దాదాపు ముఫ్ఫై సంవత్సరాల కాలంలో నీకు ఒక మహోన్నతమైన గురువు లభించబోతున్నాడు. ఇప్పుడే అతణ్ణి చూసి వస్తున్నాను. అంచేత నువ్వు ఇప్పుడే సన్యసించి తపస్సు ప్రారంభించు.” స్థూలంగా చెప్పేడు అసితుడు.
“ముఫ్ఫై సంవత్సరాల తర్వాత కదా? అప్పుడు చూసుకుందాం.”
“రోజూ పంజరంలో రామనామం చేసే చిలక, పిల్లి వచ్చినప్పుడు ఏమంటుందో గమనించావా? ప్రాణం మీదకొచ్చినప్పుడు రామనామం ఎలా గుర్తొస్తుంది రోజూ సాధన చేయకపోతే? నువ్వు ముఫ్ఫై సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పటికి గురువుకి తగిన శిష్యుడివౌతావు. ముఫ్ఫై సంవత్సరాల తర్వాత మొదలుపెడితే నీకు జవసత్వాలు ఉంటాయా అప్పటికి? ఏమౌతుందో ఓ సారి ఆలోచించు.”
“మీరే నాకు దారి చూపచ్చు కదా?”
“నేను ఆత్మని దర్శించిన వాణ్ణే. కానీ నువ్వు తధాగతుడి శిష్యుడవ్వడమే మంచిది. అప్పటికి నేను బతికి ఉండను కానీ లేకపోతే నేను కూడా ఆయన శిష్యుణ్ణి అవుతాను. ఇంక కాలాయాపన మంచిది కాదు నీకు.”
“సరే ఆ ఇచ్చే సన్యాసం మీరే ఇవ్వండి.”
“తప్పకుండా. రేపే ఇస్తాను.”
సిద్ధార్దుడు పుట్టి ఆరేళ్ళు కావస్తోంది.
మహా ప్రజాపతి మంచం మీద పడుకుని ఉంది. రెండో కానుపు అయ్యి ఇంకా రెండో రోజే. ఒళ్ళు తెలియని జ్వరం, నీరసంతో ఉన్నా పరిచారిక వచ్చేసరికి కళ్ళు తెరిచి, “సిద్ధార్దుడు అన్నం తిన్నాడా? ఏమి చేస్తున్నాడు?” అనడిగింది.
పరిచారిక కళ్ళు విప్పార్చి చూసింది ప్రజాపతి కేసి. తన మొదటి బిడ్డ ఎలా ఉన్నాడో అడగలేదు. రెండురోజుల క్రితం పుట్టిన బిడ్డ ఎలా ఉన్నాడో అక్కర్లేదా? కానీ తనకి పుట్టని సిద్ధార్దుడు గురించా ఈవిడ పలకరింపు? ఇప్పటిదాకా ఈవిడ తన మొదటి బిడ్డని పట్టించుకోలేదని, వాడి ఆలనా పాలనా పరిచారికలే చూస్తున్నారని తాను వింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది. అదే అంది “మీ బిడ్డ ఎలా ఉన్నాడో అడగరేం?”
“నా బిడ్డకేం? మీరందరూ ఉన్నారుగా చూడ్డానికి? సిద్దార్దుడికెవరున్నారు? అసలే తల్లి లేని పిల్లవాడు. ఒకసారి ఇలా పిలు.”
సిద్ధార్దుడు రాగానే తల నిమురుతూ అడిగింది, “నాయనా నీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయా? ఎవరైనా ఏమీ అనలేదు కదా?”
“లేదమ్మా, నేను తమ్ముడితో ఆడుకుంటున్నాను. అన్నీ బాగున్నాయి. నీకు జ్వరం వచ్చింది కనక నువ్వు విశ్రాంతి తీసుకో. నేను మళ్ళీ వస్తాను తర్వాత నిన్ను చూడ్డానికి. సరేనా?”
కళ్ళు చెమర్చాయి ప్రజాపతికి. తాను ఎంత దూరంగా ఉండాలనుకుంటే అంత దగ్గిరౌతోంది సిద్ధార్దుడికి. పెద్దయ్యాక సిద్ధార్దుడు తనకి దూరంగా వెళ్ళిపోతే తన బెంగ ఎవరు తీరుస్తారు?
రోజులు దొర్లిపోతూనే ఉన్నాయి. సిద్ధార్దుడికిప్పుడు ఇరవై ఐదేళ్ళు దాటి పెళ్ళి కూడా అయింది. ఇంక వీడి గురించి బెంగ పడక్కర్లేదని శుద్ధోధన మహారాజు అనుకుంటున్నాడు. ఎప్పటిలాగానే ప్రజాపతి సిద్ధార్దుడ్ని వదిలి ఉండలేకపోతోంది. ఆటపాటల్లో ఉన్న సిద్ధార్దుడికి బయటలోకం ఇంకా తెలియదని ప్రజాపతి అనుకుంటోంది. చెన్నుడితో బయటకెళ్ళి చూడవల్సిన నాలుగు దృశ్యాలూ శాక్యముని చూసేసినట్టు మహారాణికి ఇంకా తెలియదు. వీటన్నింటినీ చెన్నుడు గోప్యంగా ఉంచాడు.
సాయంత్రం కావొస్తూంది. స్నానం చేసి వచ్చిన సిద్ధార్దుడికి చుట్టూ ఉన్న పాటలు, వాయిద్యాలూ అవీ రోతని కలిగిస్తున్నాయి. కాసేపు పడుకుని లేచేసరికి, అప్పటిదాకా పాడిన జనం అంతా నిద్రపోతున్నారు ఒకళ్ళమీద ఒకళ్ళు పడి. లేచి నుంచుని ఒకసారి చుట్టూ చూసేడు. ఒంటిమీద బట్టలున్నాయోలేదో తెలీనట్టు పడుకున్న అందరూ శవాల్లాగా కనిపించేరు. తినడం, తాగడం, చావడం. ఇదేనా జీవితం? హృదయంతరాళంళోంచి ఒక్కసారి విషాదం ఉప్పెనలాగా తన్నుకొచ్చింది. నోటికి చేయి అడ్డం పెట్టుకుని దాదాపు పరుగు పెడుతూ బయటకొచ్చేడు.
పుట్టిన కొడుకుని వెళ్ళేముందు ఒకసారి చూడాలనిపించింది. ప్రసూతి గృహంలో రాహులుడి మీద ఒక చెయ్యివేసి యశోధర పడుకుని ఉంది, సిద్ధార్దుడొచ్చేసరికి. యశోధర లేవకుండా, తాను రాహులుణ్ణి ఎత్తుకోవడం అసంభవం. యశోధర లేస్తే తన మనసు మారవచ్చు. బయటనుంచే చూసి తనకున్న భవబంధాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. ఆత్మార్థ్థే పృధ్వీం త్యజేత్. వేరు దారి లేదు. మెల్లిగా అక్కడ్నుండి కదిలేడు బయటకి.
సిద్ధార్దుడు బయటకి పోకుండా కట్టుదిట్టమైన కాపలా ఉంచేడు శుద్ధోధనుడు. కానీ ఆ రోజు సిద్ధార్దుడు ద్వారం దగ్గిరకొచ్చేసరికి విశాల ప్రపంచం రారమ్మని పిలుస్తున్నట్టూ తలుపులు బార్లా తీసి ఉన్నాయి. ద్వారం దగ్గిర ఒక్కరే కాపలా కాస్తున్నారు.
“ఎవరక్కడ?”
“నేనే మహారాజా.” చెప్పేడు చెన్నుడు.
“చెన్నా, నువ్వు వెళ్ళి మన కంటకిని తీసుకురా. బయటకెళ్ళే పనుంది.”
“అవశ్యం.”
సిద్ధార్దుడ్ని మోస్తూ కంటకి పరిగెడుతూంటే, చెన్నుడు కూడా దాని తోక పట్టుకుని సమానంగా పరిగెట్టేడు. తెలతెలవారుతూండగా, మగధ చేరింది. శాక్యముని కిందకి దిగి ఒక్కసారి గుర్రం ఒంటిమీద మృదువుగా తడుతూ, “చెన్నా, నేను బుద్ధత్వం కోసం అన్నీ త్యజించేను. ఇంక మీరు వెనక్కి వెళ్ళండి” అన్నాడు. గత నాలుగు సార్లు బయటకి తీసుకొచ్చిన చెన్నుడికి మహరాజు ప్రవర్తన కొంచెం కూడా అనుమానం తెప్పించలేదు. ఓ విధంగా చెన్నుడు ఊహించినదే.
“నేను కూడా వస్తాను మీతో. నేను వెనక్కి వెళ్ళేది కల్ల.” చెప్పేడు చెన్నుడు.
“లేదు చెన్నా. నువ్వు వెనక్కి వెళ్ళాల్సిందే. లేకపోతే మహారాజుకి నేను సన్యసించినట్టు ఎలా తెలుస్తుంది? యశోధరకి చెప్పాలి కదా? నేను బుద్ధత్వం పొందిననాడు తప్పకుండా నీకు సన్యసించే అవకాశాన్ని ఇస్తాను. ఇప్పటికి నన్ను వెళ్ళనియ్యి.”
కంటకి సిద్ధార్దుడి కళ్ళలోకి చూసి తన పని, ఎత్తిన జన్మ సార్ధకం అయిపోయినట్టు గ్రహించింది. దాని ప్రాణాలు గాలిలో కలిసిపోయినై.
చెన్నుడు కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతూన్న శాక్యముని కేసి చూసేడు. కళ్ళు మిరుముట్లు గొలిపే ఒక విధమైన కాంతి అప్పటికే సిద్ధార్దుడి దేహం చుట్టు ఆవరించి ఉంది. తన వంశాన్ని సమూలంగా నాశనం చేసిన రావణుణ్ణి చంపడానికి రాముడే సరైనవాడని తోచి, తాను కైక చేత రాముణ్ణి వనవాసానికి పంపిస్తూంటే, మంధర మనసు ఎందుకు క్షోభ పడలేదు? ఎందుకంటే తానుచేసే పని లోకహితం కాబట్టీ, భగవంతుడికి మీరెందుకా పని చేస్తున్నారో, ఎందుకు చేయవల్సి వచ్చిందో తెల్సు కాబట్టీ. లేదు తాను ఏడ్వకూడదు. శాక్యముని విశ్వానికే గురువౌతాడని అసితుల వారు చెప్పారు కదా? చెన్నుడి మనసు కుదుటబడింది, తన పని తాను సక్రమంగా నిర్వర్తించినందుకు. ముందు ముందు మళ్ళీ కలుసుకుంటామనే ఆశతో వెనక్కి బయల్దేరేడు.
వెనక్కొచ్చిన చెన్నుణ్ణి శుద్ధోధనుడు కడిగి పారేసేడు సవాలక్ష ప్రశ్నలతో. “ఎందుకు వెళ్ళనిచ్చేవు?, నీకెవరు అధికారం ఇచ్చేరు? రాజ ద్వారం తలుపులు నిన్ను ఎవరు తీయమన్నారు?” అంటూ. మహారాజుకి సమాధానం చెప్పి ప్రజాపతి దగ్గిరకొచ్చేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. ఆశ్చర్యంగా ప్రజాపతి కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప ఏమీ అనలేదు చెన్నుణ్ణి. కాసేపు ఉన్నాక చెన్నుడే చెప్పేడు.
“నేను కూడా వెంట వస్తానని చెప్పాను తల్లీ, కాని నన్ను వెనక్కి వెళ్ళమని ఆజ్ఞ జారీ చేసేరు.”
“ఎటు వెళ్ళారో తెలుసా?” ప్రజాపతి నోరు విప్పింది.
“మగధ దాటే దాకా నేను ఉన్నాను వారి వెంటే. ఇప్పుడు అక్కడ ఉండకపోవచ్చు. మనం వేగుల్ని పంపుతామని తెలుసనుకుంటా తల్లీ”
ఇద్దరికీ ఒకేసారి అసిత మహాముని గుర్తుకొచ్చేడు. “సరే చెన్నా, అసితుల వారు ముందే చెప్పారు కదా? సిద్ధార్దుడు విశ్వానికే గురువు కాబోతున్నాడని? నువ్వెళ్ళి నీ పనులు చూసుకో.”