ఒంటిచెట్టు

మరణమందినవారికిఁ దొరగె బాధ,
కాని జానువులూరువుల్ కాళ్ళు కండ్లు
చేతు లంసముల్ మెడలు విచ్ఛిన్నమైన
వారిగోడు లత్యంతదుర్భరములయ్యె.

అట్టి యుప్పెనలోఁ జిక్కి అసువులింకఁ
బాయకున్నవారల ప్రభుత్వమ్మువారు
దూరకాందిశీకశిబిరస్థులను జేసి
మందుమాకులన్నము లిచ్చి మనిచిరపుడు.

అట్టి కాందిశీకులందొక్క వృద్ధుండు
ఊరి యునికి మఱవకున్నవాఁడు
పాదచారి యగుచుఁ బలుమారు లేతెంచు
శిథిలమైన గ్రామసీమఁ జూడ.

ముడుతలుదేఱియున్న ముఖముం, గడలంటఁగ వెండినిగ్గుతో
నడరెడి కేశముల్ భ్రుకుటు లాస్యము నిండిన శ్మశ్రురేఖలున్,
తడబడు యానముల్ గదురఁ దత్తరపాటునఁ బెక్కుసారు లా
తఁడు చనుదెంచు నా జనపదప్రవిలోకనకౌతుకంబునన్.

తన గృహమున్నచో నిపుడు తల్పులు, చూరును లేని గోడలే
కనపడె, ఆఢ్యులైన ధనికావళిసౌధము లెల్ల మంటిదిబ్బలై
పొనరెను, ఆపణంబులు, ప్రభుత్వపుశాలలు రూపుమాసె, దు
ర్భిణికిని గానరావు మును విశ్రుతమైన బజార్లు,తోఁటలున్.

తాతలుదండ్రులున్మును పుదారమతి న్నట నాటినట్టి వి
ఖ్యాతపరస్సహస్రతరుకాండము లిప్పుడు లేవు గాని, యె
ట్లో తదపాయము న్గడచియుండె నొకానొక దేవదారుభూ
జాతము మాత్రమే విపులసాగరసైకతతీరమందునన్.

అఖిలలోకంబు విలయంబు నందినపుడు
తిరిగి సృజియింప నద్దానిఁ బరమపురుషుఁ
డొక్కరుండెట్లు శేషించియుండు, నట్లె
యా తరువొకటె శేషించి యచట నుండె.

వచ్చినయప్పుడెల్ల మది భక్తియు, నమ్రతయుం, గృతజ్ఞతల్
విచ్చుకొనంగ నాతరువు వీక్షణసేయుచు నిల్చు నాతఁ, డ
ట్లచ్చెరువొందుచు న్నిలిచి నాతరురాజము నెంచు నాపదం
బుచ్చి నరుండు ముందునకుఁ బోవలె నిట్లని తెల్పు సాక్షిగన్.

చావఁగా మిగిలినవారు చాలమంది
ఆ తరువు నట్లె భక్తితో నరసి యరసి,
అతుల దైవాంశసంభూతమైన దిదియె
యనుచు నర్చింపఁ దొడగిరి యాదరమున.

కాని పచ్చని యాచెట్టు క్రమముగాను
పత్త్రములఁ బాయు చెఱ్ఱనై వంగసాగె,
దాని కాయూరి వారెంతొ దైన్యమొంది
దానిఁ గాపాడు వెరవులం దరిచి తరిచి,

లక్షకు మీరునట్లు మనలాభముకోసమె పెద్దవార లీ
వృక్షగణంబు లిచ్చటను బెంచిరి, యవ్వి నశింపఁ జిక్కె నీ
వృక్షవరంబు మాత్ర మతిభీమజలప్రళయంబు నోర్చి, త
ద్రక్షణ సేయలేని మన ప్రాభవమేటికి, విద్యలేటికిన్?

కష్టము లెన్ని వచ్చినను గాఢతరంబగు దీక్షతోడ వి
స్పష్టమునైన లక్ష్యమును సాధనచేయునరుండు గాంచు ని
ర్దిష్టఫలంబు లంచు నుపదేశముసేసిడి నీ మహీజమున్
నష్టము గాకయుండ అవనంబొనరించుటె కార్యమౌగదా!

అనుచా జనపదవాసులు
ఘనమగు స్తంభమును నిల్పి కట్టిరి చెట్టున్,
నినిచిరి స్వాదుజలంబులు
మును లవణాంబులు గల తరుమూలమునందున్.

తలకొని వృక్షరక్షణవిధానము దెల్పుడటంచు దవ్వులం
గల తరుశాస్త్రపండితులఁ, గాననపాలురఁ బిల్చి రర్థులై,
తొలిచిరి వృక్షమూలమునఁ దోరపు గర్తము సారవంతమై
చెలఁగెడు మట్టి నింపఁగను, చేసి రికెన్నొ హితోపచారముల్.

ఆవిధినొక్కత్రాటిపయి నందఱిని న్నడిపించి,పూర్వసం
భావితశోకదైన్యభయభావములం దెగఁద్రెంచి, నవ్యకా
ర్యావహకౌతుకం బెదలయందున నందఱికిం ఘటించె నె
ట్లో విపదం దరించిన తదుత్తమ నిస్తులవృక్షరాజమే!

ఆ వృక్షమె విషమస్థితి
కావిషమస్థితిఁ దరింప నవసరమగు స్థై
ర్యావిర్భావంబునకున్
దైవావిష్కృత నిదర్శనంబయి తనరెన్.

ఆ వృక్షావనయత్నస
మావిర్భూతోత్సుకులయి యాయూరి ప్రజల్
నీవృత్తునుద్ధరింపఁగ
నావల నుద్యుక్తులైరి ఐక్యతతోడన్.

గ్రామోద్ధరణాత్పూర్వము
సీమోద్ధరణము జరుగుట శ్రేయంబనుచున్
సాముద్రికతటమందున
భూమిజములనాటిరి మునుపున్నటు వారల్.

అట్టు లాయూరికే కాక యఖిలదేశ
మునకునాదర్శ మయ్యె నాభూరుహంబె,
అదియె స్ఫూర్తిగాఁగొనుచు నాయత్తులైరి
తరణమొనరింప నా యుపద్రవము వారు.

జడములంచును జుల్కన సల్పఁబోక
మనసుగల్గిన కనులతోఁ గనినయెడల
రాయిరప్పలు దరువులుం బ్రగతిమార్గ
బోధకంబులౌగద! మానవులకు నిలను.


(సెప్టెంబరు 2011 ఈమాటలోని వేలూరివెంకటేశ్వరరావువారి “జాపనీస్ పైన్ చెట్టు” – అనే శీర్షికకు పద్యరూపకల్పన యిది. ఇందులోని విషయం జపానుకే పరిమితం చేయకుండా ఏ దేశానికైనా వర్తించునట్లుగా, వృద్ధునికి బదులు చెట్టుకే అధికప్రాధాన్యమిస్తూ మార్చబడింది.)


రచయిత తిరుమల కృష్ణదేశికాచార్యులు గురించి:

డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు ప్రముఖ కవి, పద్యనాటక కర్త. ఆధునిక సాహిత్యంలో పద్యరచనతో పాటు అనేక అరుదైన ఛందోరీతులను ప్రయోగించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. వీరు రచించిన హనుమప్ప నాయకుడు – రాయలసీమ ప్రాంతానికి చెందిన చారిత్రక వీరుని ఇతివృత్తంగా 1986లో రాసిన పద్యకావ్యం. మహాశిల్పి జక్కన చరిత్రము, శిల్పకళా వైభవాన్ని, జక్కన జీవితాన్ని వర్ణిస్తూ సాగిన పద్యకావ్యం.ఇతర రచనల్లో ‘ఋతుసంహారము’ (కాళిదాసు రచనకు అనువాదం), ‘గానభారతి’, ‘పూర్వప్రయోగచంద్రిక’ ముఖ్యమైనవి. సాహిత్యంలో నిష్ణాతులైన వీరు పద్యరచనలో నూతనవృత్తాలను (వసంత కోకిల, నయాగరా, మనోరమా మొదలైనవి) సృష్టించి ఛందోవైవిధ్యాన్ని ప్రదర్శించారు.

 ...