శ్రీపాదరాయలు

కీర్తనల రాగములు

శ్రీపాదరాయల కీర్తనలు ఈ రాగాలలో పొందుపరచబడియున్నవి. ఇవి నేడు ఈ విధముగా పాడబడుతున్నాయో లేకపోతే శ్రీపాదరాయల కాలములో కూడా ఈ రాగాలలో పాడబడినాయో అన్నది వివాదాంశమే. ఎందుకంటే మోహనలాటి రాగాలు అన్నమాచార్యుల రాగిరేకులలో లేవు. బహుశా అవి వేరే పేరులతో ఆ కాలములో పిలువబడుతూ ఉండేవేమో? ఆ రాగాలు ఇవి – ఆనందభైరవి, ఆరభి, ఆహిరి, కల్యాణి, కాంభోజి, కాపి, కురంజి, కేదారగౌళ, గుండక్రియ, గూర్జరి, తోడి, దేశి, ధన్యాసి, నాట, నాదనామక్రియ, నారాయణి, పున్నాగవరాళి, పూర్వి, బౌళి, భైరవి, మధ్యమావతి, మాయామాళవగౌళ, మాళవశ్రీ, ముఖారి, మోహన, రేగుప్తి, వరాళి, వసంత, శంకరాభరణము, శుద్ధసావేరి, శ్రీ, సారంగ, సావేరి, సురటి, సౌరాష్ట్ర, హిందోళ. ఇందులో ఎక్కువగా (నాలుగు లేక ఐదు కీర్తనలు) కల్యాణి, కాంభోజి, తోడి, నాదనామక్రియ, భైరవి, మోహన, శంకరాభరణ రాగములలో ఉన్నవి. కల్యాణి, ఆనందభైరవి, దేవగాంధారి, సారంగ రాగాలను పాటలలో ప్రత్యేకముగా పేర్కొన్నాడు.

సూళాదులు

సంగీతములో తాళము చాల ముఖ్యమైనది, అందుకే భావ, రాగ, తాళములు కీర్తనలకు అవసరము అంటారు. కాని కర్ణాటక సంగీతములో ఒక ఐదు శతాబ్దములకు ముందు తాళరీతులు శాస్త్రీయముగా వాడబడేవి కావు. ఎన్నో విధములైన విభజనలు ఉండేవి. పూర్వ కాలములో సంగీతములో తాళములను మార్గ తాళములు, దేశి తాళములు అనేవారు. ఈ పద్ధతిలో 5 మార్గ, 120 దేశి తాళములు ఉండేవి. తరువాత 108 తాళాలు, 72 మేళకర్త తాళాలు, నవసంధి తాళాలు, ఇలా ఎన్నో తాళాలు ఉండేవి. కాని ప్రస్తుతము అమలులో ఉండే తాళాలకు సూళాది (సుళాది) సప్త తాళాలు అని పేరు. దీని ప్రకారము ఏడు విధములైన తాళాలు మాత్రమే సంగీతములో ఉంటాయి. వాటి వివరాలను క్రింది పట్టికలో చూడ వీలగును. ఇందులో I లఘువు, O ద్రుతము, U అనుద్రుతము. ఈ లఘువులోని అక్షరాల సంఖ్య అది ఏ జాతికి చెందినదో, దానినిబట్టి ఉంటుంది (త్ర్యస్ర లేక తిస్ర – 3, చతురస్ర – 4, ఖండ – 5, మిశ్ర – 7, సంకీర్ణ – 9). కాని ద్రుతము లఘువులో సగమైనా, దానికి అన్ని జాతులలో రెండు అక్షరాలు మాత్రమే, అదే విధముగా ద్రుతములో సగమైన అనుద్రుతానికి ఒక అక్షరము. ఇలా మనకు 35 విధములైన తాళములు లభిస్తాయి. దీనికి తోడుగా మూడు లయలైన విలంబిత (మెల్లగా), దానికి రెండింతలైన మధ్య, మూడింతలైన దురిత (త్వరగా) లయలను చేరిస్తే మనకు 105 తాళాలు లభిస్తాయి.

తాళము   చిహ్నము   త్ర్యస్ర   చతురస్ర   ఖండ   మిశ్ర   సంకీర్ణ  
   
ధ్రువ      OIII      11      14      17      23      29   
మట్య      IOI      8      10      12      16      20   
రూపక      OI      5      6      7      9      11   
ఝంప      IUO      6      7    8      10      12   
త్రిపుట      IOO      7      8      9      11      13   
అట      IIOO      10      12      14      18      22   
ఏక      I      3      4      5      7      9   

ఆ కాలపు ప్రముఖ వాగ్గేయకారులైన శ్రీపాదరాయలు, అన్నమాచార్యులు, వ్యాసరాయలు, పురందరదాసు మున్నగువారందరు తమ కీర్తనాసాహిత్యాన్ని ఈ సూళాది తాళాలకే బద్ధము చేశారు. ఈ ప్రక్రియలో శ్రీపాదరాయల ఘనత ఏమంటే మొట్టమొదటిసారిగా పాటలను తాళమాలికలో వ్రాశాడు. తరువాత ఎందరో వాగ్గేయకారులు ఈ పద్ధతిని అనుసరించినా ఇతడే దీనికి మార్గదర్శి. వీరు నాట (అన్నంతకాలదల్లి నిన్న నానరియదె – ఏడు తాళాలు), భైరవి (ఈ వనదెడెగళు, ఈ లతెవనగళు – తొమ్మిది తాళాలు), సారంగ (నిన్నాధీన శరీర – ఐదు తాళాలు) రాగాలలో మూడు సూళాదులను తాళబద్ధము చేశారు. సూళాదులలో అన్ని తాళాలకు ఒకే రాగము ఉంటుంది., తాళములు కూడ క్రమముగా ధ్రువ, మఠ్య, త్రిపుట, రూపక, ఝంప, అట, ఏక తాళాలలో ఉండాలి. సూళాదులలో కొన్ని తాళాలు మళ్ళీ వాడబడవచ్చును, వాటిలో ఏడుకన్న తక్కువ తాళాలు కూడ ఉండవచ్చును.

ఇతని తరువాత ఎందరో ఇదే చట్రములో సూళాదులను వ్రాశారు. అన్నమాచార్యుల దశావతార సూళాదికి ప్రేరణ కూడ శ్రీపాదారాయలే అని విమర్శకులు భావిస్తారు. పురందరదాసులు, విజయదాసులు కూడ ఎన్నో సూళాదులను వ్రాశారు. ఈ సూళాదులపైన ఒక దీర్ఘ వ్యాసము మరొకప్పుడు మీకు సమర్పిస్తాను.

కీర్తనలలోని భాష, శైలి, యితర విశేషాలు

శ్రీపాదరాయలు వ్రాసిన కన్నడ కీర్తనలను సులభముగా అర్థము చేసికొనవచ్చును. అందులో ఉండే ఆ భాష ఐదు శతాబ్దాల తరువాత ఇప్పుడు కూడ రమ్యముగా, రసవంతముగా, జీవంతముగా ఉంటుంది వినడానికి. ద్వితీయాక్షరప్రాస, అంత్యప్రాసలతో గీతికలు వినసొంపుగా ఉంటాయి. పాటలు నవరసభరితముగా ఉంటాయి. హాస్యము కూడ సున్నితముగా కనబడుతుంది కొన్ని పాటలలో. రుక్మిణీ-సత్యభామల వాదము అందుకొక ఉదాహరణ.

మందరధరను ప్రీతి-
యింద నిన్న పడెదనేనె
ఒందు మణియ కారణది
బందె భామిని సుగుణ కామిని

మందరధరుడు ప్రీతి
తోడ నిన్ను పొందెనేమి
పచ్చ రాయి తెచ్చె ని-
న్నిందు భామిని సుగుణకామిని

అని రుక్మిణి అంటే సత్యభామ ఇలా అంటుంది:

సుమ్మనె బందవళిగె
బ్రహ్మలగ్నది బందెనగె
సామ్యవేనె యాకె నినగె
హెమ్మె రుక్మిణి సుపద్మగంధిని

ఊరకె వచ్చినావు
లగ్నమాడి వచ్చినాను
సామ్య మెకడ మనకు గర్వ
మేల రుక్మిణి సుపద్మగంధిని

సామెతలను, నానుడులను కూడా చక్కగా కీర్తనలలో వాడాడు ఇతడు. ఉదాహరణకు:

ఉంటాద కాలక్కె నెంటరు ఇష్టరు
బంటరాగి బాగిల కాయ్వరు
ఉంటాదతన తప్పి బడతన బందరె
ఒంటెయంతె గోణ మేలెత్తువరు

సంపదల వేళలో బంధు మిత్రులు
బంటులుగా తలుపుల కాతురు
సంపదలు కరిగి బీదగ మారగ
ఒంటెవలె గుడార మెత్తుతారు

మధ్వనామమనే 30 చరణాల కీర్తనలోని ఛందస్సు నాకెంతో యిష్టము. అది పంచమాత్రల సీసపద్యములా ఒక తూగుతో సాగుతుంది. దాని పల్లవి –

జయజయ జగత్రాణ జగదొళగె సుత్రాణ
అఖిలగుణ సద్ధామ మధ్వనామ

జయజయ జగత్రాణ జగములో సుత్రాణ
అఖిలగుణ సద్ధామ మధ్వనామ

శ్రీపాదరాయలు తన పాటలలో యమకములాటి ప్రయోగములను కూడ చేసినాడు. మచ్చుకు ఒక ఉదాహరణ:

ఆనందసదనదొళగె గోపియరు
ఆ నందసుతన కండు
ఆనందభరితరాగి తూగిదరు
ఆనందభైరవియింద

ఆనందసదనములో గోపికలు
ఆ నందసుతుని జూచి
ఆనందభరితులై తూగేరు
ఆనందభైరవిలోన