హాలు ఆవరణలో, చిన్ని చిన్ని గుంపులు తయారయ్యాయి. నిసి ఎందరో స్నేహితురాళ్ళు. కుసుమ, జయ, వీణ, వారి కజిన్లు, ప్రభ, షీల -అందరూ ఆ కుటుంబం లోని వారే. ఎంత మందో సీతాకోక చిలుకల్లాగా అలంకరించుకున్న చిన్నారులు. ఒకరిని మించిన అందగత్తెలు ఒకరు. అందరి చెవులకూ జుంకీలు వేళ్ళాడుతున్నాయి. మెడల్లో సరికొత్త ఫేషన్ నెక్లెసులు. ఆ చిలకలెవరికీ తెలుగు రాదు. నాగేశ్వరరావు వారికి హీరోనూ కాదు. కొంతమంది కాలేజీలో ఇంగ్లీషు, ఫ్రెంచ్ తీసుకుంటున్నారు. ఇంట్లో సినిమా స్టూడియో – డాన్స్ మాస్టర్లే వచ్చి వారికీ డాన్స్ నేర్పుతారు. సంగీతం జోలికి వాళ్ళెవరూ పోలేదు. అప్పుడప్పుడూ గుర్రపు స్వారీ, ఇంగ్లీషు నవలలు చదవటం, సీజను మారినప్పుడల్లా, మద్రాసు, బెంగుళూరు, ఊటీల్లో రేసులు చూస్తూ, తమకు ఫ్యూచర్లో కాబోయే పెళ్ళికొడుకులెవరా అని ఒకరితో ఒకరు సరాగాలాడుకుంటారు. వారి ఊహల్లో హీరోలు వేరు. వాళ్ళు తెలుగు వారు ఎంతమాత్రం కారు.
అవతల, వేరే గుంపుల్లో వీరిని మించిన వారు, ఈ యువతుల అమ్మలూ నాన్నలూ. వారికి మాత్రం వయసెంత? ముప్పయిలూ, నలభైలే. ఎవరి ఆరాధకులు వారికే ఉన్నారు. ఎవరు నడిపించే ప్రేమకథలు వారివే. అప్పుడప్పుడూ ఏ పత్రికా విలేఖరో కూపీ లాగి -ఏ మెరీనా బీచిలో ఒక సినిమా తారతో, ఒక ప్రొడ్యూసర్ నగ్నంగా కనిపించాడనీ, ఒక రేసు గుర్రం ఒక సినిమా డాన్సరుకు బహుమతిగా వెళ్ళిందనీ – ఇలా వారి మీద కథలేవో ప్రచురించి, వాళ్ళూ నాలుగు రాళ్ళు జేబులో వేసుకుంటారు. వీటివల్ల జమిందారీ కుటుంబాల వారికి వచ్చే నామోషీ ఏమిటి? ఇతరులకు, మాకు లేదే ఈ వైభోగం అన్న అసూయ తప్పించి. అక్కడ, ఆ సాయంత్రం, మన్మధుడి బాణాలు చెల్లా చెదరుగా ఎంత మంది మీదో పడుతున్నయి. సినిమా హాలు కర్టెన్ రైజ్ కాక ముందే, అక్కడ మరెన్నో సిజ్లింగ్ ప్రేమ కథలు. ఆ సిల్కుచీరలు, ఆ రెపరెపలు, ఆ నగల తళ తళలు, సిల్కు చొక్కాలు, బిన్నీ పంచలు, సూట్లు, కలిసిపోయి చేస్కుంటున్న చతుర సంభాషణలు -ఎర్ర కార్పెట్ పరిచిన ఆ సినిమా హాలు, బాల్కనీ లౌంజ్ ఎంతో శోభాయమానంగా ఉంది.
ఇంతలో కొంత కోలాహలం. కలెక్టరుగారు వచ్చారని. కలెక్టరు అంటే ఎవరో పెద్ద వయసు ఆయన అనుకుంటే కాదు. చాలా చిన్న వయసే. ఆయన పక్కన విమలను చూసి, నిసి, ఆమెను చూసి విమల, ఆశ్చర్య పోయారు. “అరే! నువ్విక్కడ!”, “అరే! నువ్విక్కడ!” అనుకున్నారు.
కొన్నేళ్ళ కింద వారిద్దరికీ గుంటూరు స్త్రీల కళాశాలలో స్నేహం కలిసింది. అక్కడ లాన్లో, కాలేజీ గ్రౌండ్సులో, గడ్డిలో అమ్మాయిలు గుంపులుగా కూర్చుని క్లాసుల మధ్యలో ఇంటర్వెల్లో పత్రికల్లో కథలు జోరుగా చర్చించుకునే వారు. ఆ డిస్కషన్లు పోట్లాటలుగా మారి, కొన్నాళ్ళు కొంతమంది ఆడపిల్లల మధ్య మాటలుండేవి కాదు. మళ్ళీ వేడి తగ్గాక మామూలుగా కలిసి తిరిగేవారు. నిసికి అప్పుడు చప్పున గుర్తు వచ్చింది. ఐ.ల్. టి.డి ఆఫీసరు గారమ్మాయి విమల, కాబొయే మొగుడు, అసిస్టెంటు కలెక్టరనీ, వాళ్ళూ బ్రాహ్మలేననీ, తన ఫేమిలీ వాళ్ళు, ఒకసారి చెప్పుకోటం.
మిసెస్ కలెక్టర్, నిసిని పక్కకు లాక్కుపోయి, “బుద్ధిమంతుడు సినిమాకోసం వచ్చా. మనిద్దరం కలిసి చూద్దాం. మా పక్కన సీటుంచుతా నీకోసం” అంది.
నిసి ఉషారుగా, విమల ఈ మధ్య చేసిన పెయింటింగుల గురించీ, శిల్పాల గురించీ ఎంతో ఆసక్తితో అడిగి చెప్పించుకుంది. నిసి బీ. యస్సీ చదువుతూ, కప్పల్నీ, మొలస్క్ లనీ కోస్తుంటే, వాటి బొమ్మలు వేస్తుంటే, విమల బి.యే చదువుతూ, కాలేజీలో ఆయిల్ పెయింటింగ్స్ వెయ్యటం, మట్టితో బొమ్మలు చెయ్యటం నేర్చుకుంది. ఆ పిల్ల అవి మాత్రమే చదువుతాను, మరేం చదవను అని మంకు పట్టు పడితే, ఆ కాలేజీలో, కొత్తగా మాస్టర్ను తెప్పించి, ఆర్ట్స్ విభాగం సృష్టించి, ఆ కోర్సులు ప్రవేశపెట్టారు. అందుకని నిసికి, విమల అంటే చాలా ఎడ్మిరేషన్. ఆమె పొడగరితనం, చక్కని రూపు, షార్ప్ పలుకూ అన్నీ నిసికి ఇష్టమే.
కొంచెం సేపటికి సినిమాహాలు ఓనరు భార్య వచ్చి, ఆమెను మరో పక్కకు లాక్కెళ్ళి – “గోపాల్ వస్తానన్నాడు. నిన్ను మా పక్కనే కూర్చో పెట్టుకోమన్నాడు. అలా ఐతేనే తను వస్తానని ఒప్పందం.” అని చెప్పింది.
“గోపాల్‌తో నీకు ఒప్పందమా? నేను కదా నీ ఫ్రెండ్ ని.”
“అవునులే, కానీ మీ అన్నయ్యకు ఈ సినిమా హాలు కట్టటానికి తన గోడౌన్ల నుండి సిమెంటూ, ఇంకా మంత్రులతో మధ్యవర్తిగా మాట్లాడి, బిల్డింగ్ పర్మిట్లూ, ఇలా గోపాల్, చాలా సాయం చేశాడు. జమిందారీ ఫాయీ. ఎవరితో చెప్పరు. కానీ, నేన్నీతో చెపుతున్నా. కాన్ఫిడెన్షియల్ అనుకో. అందుకని ఈ థియేటరు విషయంలో అతడే మాకెక్కువ.”
“వచ్చాడు, అడుగో!”
ఆశ్చర్యంగా, నిసికి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంది. దూరంగా జీ.పి. అన్నయ్య, గోపాల్ మాట్లాడుకుంటూ కనిపించారు. గోపాల్ వారిని చూసి, అక్కడినించే పలకరింపుగా నవ్వాడు. ఇటుక రంగు చొక్కా, పసుపు రంగు కలనేత టై. నిసిని చూస్తూ, అతడు తన టై కొంచెం ఎత్తి సర్దుకున్నాడు. టై మీది జరీ పూలూ, దానితో పాటు అతడి చేతి రోలెక్స్ తళతళా మెరిశాయి. నిసి గుర్తు పట్టింది. ఆ టై, తన చీర, ఒకే రంగు. ఒకే మెటీరియల్.
అందరూ మెల్లిగా వెళ్ళి హాల్లో కూర్చున్నారు. నాగేశ్వర రావు సినిమా చూసే ఎక్సైట్మెంట్లో ఉన్నారు. సినిమా హాల్లో లైట్లు డిమ్ చేశారు. కొంచెం సేపట్లో, గోపాల్ ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు.
నిసిని చూసి, “జస్ట్ లైక్ ఐ థాట్. నిరాభరణ భూషిత.” అని నవ్వి జేబులోకి చెయ్యి పోనిచ్చి, తీసి ఆమె మెళ్ళో ఒక బంగారు జలతారు నెక్లెస్ వేసి, ఒక బంగారు కంకణం చేతికి తొడిగాడు. అతని కంఠంలో ఎక్కడ లేని తియ్యదనం. ఇంత కూడా ఆలస్యం లేకుండా, నిసి చేతిని తన చేతిలోకి తీసుకుని తన పెదాలకు నొక్కిపెట్టి, ఆమె వేళ్ళలొ, వేళ్ళు జొనిపి కూర్చున్నాడు.
‘బుద్ధిమంతుడు’ సినిమాలో ఏం ఉందో, ఆమెకి సరిగా ఇప్పటికీ తెలియదు.
(నిసి 1960ల డైరీల్లోంచి.)