కారు ఆమెను తీసుకు వెళ్ళి, నాంపల్లిలో ఒక డాబా ముందు ఆగింది. ఆ బిల్డింగ్ ముందంతా కొట్లు. రకరకాల సామాన్లు అమ్మే బండ్ల వాళ్ళూ. బిల్డింగ్ మీద ‘డెయిలీ న్యూస్’ అన్న బోర్డ్ వేలాడుతూంది. ఒక ఎర్ర షామియానా కింద నడిచి లోపలికి వెడితే, అక్కడ ముందు గదిలో కొంతమంది స్టాఫ్ కూర్చుని ఉన్నారు. గోపాల్ ఎదురొచ్చి, ఆమెను లోపలి తన ఆఫీస్ లోకి తీసుకు వెళ్ళాడు.
“అంతకు ముందు నా ఇల్లు చూశారుగా, అకస్మాత్తుగా వచ్చి. ఇప్పుడు నేనే నా ఆఫీసొకటి మీకు చూపిద్దామని పిలిచాను. ఇది నా న్యూస్ పేపర్, ప్రిటింగ్ ప్రెస్ నడిపే చోటు. బిల్డింగ్ మాది కాదు. గవర్నమెంట్ -పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అద్దెకు తీసుకున్నాం. ఆ ముందు గదుల్లో మీరు చూసింది, నా సెక్రెటరీ, అకౌంటెంట్ జోసెఫ్, ఆఫీస్ ఆడ్మినిస్ట్రేటర్. ఈ న్యూస్ పేపరుకు నేనే మేనేజింగ్ ఎడిటరూ, పబ్లిషరూ అన్నీ. కూర్చోండి. మంచి ఎండలో వచ్చారు. కాస్త సేద తీరండి ముందు.”
బాయ్ చల్లటి కూల్‌డ్రింక్స్ ట్రేలో తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఇంతలో ఫోన్ మోగింది. అతను ఫోన్‌లో మాట్లాడుతుంటే డ్రింక్ తాగుతూ చుట్టూ చూసింది. గది ఎయిర్ కండిషనింగ్ చేసి ఉంది. చక్కని ఫర్నిచర్. విండో బేలో బోన్సాయ్ మొక్క ఒకటి ఏటవాలుగా పడుతున్న ఎండలో.
“వెళ్దామా? అటు ఆ పక్కగదిలో ప్రూఫ్ రీడర్లు ఉంటారు. రండి. ఈ గది కంపోజింగ్ రూమ్. ఇక్కడ పేపర్ ఎడిటర్లు ఉంటారు. ఇతడు కేశవరావు. ఫెర్నాండెజ్ . శివ మోహన్. నారాయణ, ఆలీ,” – ఇలా చెపుతూ నడుస్తుంటే ఆమె నమస్కారాలు చెపుతూ అతడి వెంట వెళ్ళింది.
“ఈ టెలీ ప్రింటర్స్ మీదుగా వార్తలు యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా నుండి ఎప్పుడూ వరసగా వస్తూ ఉంటయ్. వాటిని ఎడిటర్లు చూసి ఏ వార్తలు మరుసటి రోజు పేపర్లో రావాలో గుర్తులు పెడతారు. తర్వాత కంపోజర్లు ఒక పాతిక ముప్పై మంది ఉన్నారు – వాళ్ళు ఆ వార్తలకు టైప్ సెట్టింగ్ చేస్తారు. ముందు ప్రూఫ్ రీడర్ తప్పులు సరిదిద్ది, నమూనా అచ్చు వేసి ఇచ్చిన పేజ్ ప్రూఫ్ లను, అప్పుడు ఎడిటర్లు చూస్తారు. చీఫ్ ఎడిటర్, అన్నిటిలోకీ ముఖ్యమైన వార్త అనుకున్నదానిని తీసుకుని తన ఎడిటోరియల్ రాస్తాడు.
ఇదిగో, ఇది నా ప్రింటింగ్ షెడ్. ఇది కట్టటానికి నాకు యాభయి వేలు ఖర్చయ్యింది. ఈ రెండు మెషీన్లు రష్యా నుండి, ఈ రెండు చెకోస్లవేకియా నుంచి తెప్పించాను. ఈ చిన్న మెషీన్లు, ఇవి ఇక్కడే లోకల్ తయారీ.
ఆమెకు ఇది పరిచయమున్న లోకం కాదు. ఏం ప్రశ్నలు వెయ్యాలో కూడా తెలియదు. అన్నీ ఆశ్చర్యంతో చూస్తూ, – “పేపర్లు ఎప్పుడు ముద్రిస్తారు?”- అని అడిగింది.
“నా పేపర్ చిన్నది కదా. ఎక్కువ సర్క్యులేషన్ లేదు. మహా ఐతే 5,6 వేల కాపీలు వేస్తాం. పేపర్ ప్రింటింగ్ అర్థరాత్రి జరుగుతుంది. నాకూ, ఇంకో భాగస్వామికీ పుస్తకాలు అచ్చు వేసే బిజినెస్ కూడా ఉంది. ఆ పనులు ఈ పెద్ద షెడ్లో జరుగుతాయి. ఇప్పుడు తెలుగు ఎకాడమి వారికి ఒక తెలుగు పాఠ్య పుస్తకం, ఒక ఫిజిక్స్ పుస్తకం తయారీలో ఉన్నయ్.”
అక్కడ పేజీలను వరుసగా బొత్తులు పెడుతున్నవారిని, పేజిలు కుడుతున్నవారిని, అట్టలు అతికిస్తున్నవారిని చూస్తూ ఆమె బైటికి నడిచింది.
మళ్ళీ ఆఫీసులొకి వెళ్ళాక – “సో! మీకు పుస్తకాల మోజు, రాయటం మీద ఇంటెరెస్ట్ చాలా ఉంది కదా. మా పేపర్కి రాయండీ,” అన్నాడు నవ్వుతూ.
“ఇంకా నయం. నేను రాస్తే ఆంధ్ర పత్రిక, ప్రభ, యువ -ఇలాటి తెలుగు పత్రికలకు రాస్తా. మీ ఈ రెండు పేజీల డింకీ పేపర్‌కి నన్ను రాయమంటారా?”
“పోనీ! పుస్తకం రాయండీ. అచ్చు వేయిస్తా.” అతనికి కోపం రాలేదు. లోపల నవ్వుకుంటున్నాడు.
“మీకు చిన్న కథ కూడా రాయనంటే పుస్తకం రాయమంటారు! మీరెవరండీ, నా రాతలు అచ్చు వెయ్యటానికి?”
“అమ్మో! పోనీ కథ రాసి నాకు పంపిస్తే నేను సుధాకర్ కి పంపిస్తా. యువలోనే వేయిస్తా, మీకదే మోజైతే.”
“మీ సిఫార్సు నా కక్కర్లా. మీరసలు కుటుంబరావు, ఆదివిష్ణు, రాజారాం, భానుమతి, వీరెవరి కథలైనా చదివారా? వీరి కథలన్నీ మీ సిఫారసు మీదే అచ్చవుతున్నయ్యా?” తల ఎగరేస్తూ అడిగింది.
అతడు కళ్ళజోడు తుడిచి పెట్టుకుని, “లేదులెండి. కథలు రాస్తే వాళ్ళకి డబ్బిస్తారు. అందుకు రాస్తారు. మీరైతే నేను పే చెయ్యక్కర్లేదనీ, అడిగా. అంతే. అంత కోపం ఎందుకు?
“ఆశ కాదూ. నాకైతే మీరు ట్రిపుల్ రేట్ ఇవ్వాల్స్సుంటుంది నా రచనలకి.”
“ఊరికెనే అడిగా లేండి. ఇంతకీ నే పంపిన పుస్తకాలు నచ్చాయా?”
“అవేవో, మీరు రాసినట్లు. నేనింటికి పోవాలండీ, ఇంక.”
“మిమ్మల్ని దిగబెట్టమని చెపుతా. పార్టీకి రావటం మానరు గదా?” అన్నాడు శ్యామ్ గోపాల్.
ఆమె వెళ్ళిపోయాక, చాలాసేపు మనసులో నవ్వుకున్నాడతడు. ఈ పిల్లకేం లోకం తెలియదు. వేరే చాలామంది ఆడపిల్లలకు ఉండే తెలివితేటలు ఈమెకు శూన్యం. మరి ఈవిడగారు చదివే ఆ పుస్తకాల్లో ఆ రచయితలు వాళ్ళు ఏం రాసి అఘోరిస్తున్నారు? ఈమెకు లోకం గురించి ఏం చెపుతున్నారు? పేపర్లోనూ, ఎడ్వర్టయిజ్మెంట్ల మీదొచ్చే డబ్బులు, స్టాఫ్ జీతాలకే బొటాబొటీగా సరిపోతాయి. పుస్తకాల్లోనూ ఏమీ లాభాలు రావు. అయినా మనుషులకు ఉపాధి కల్పించాలా, వద్దా? ఏదో ఒక పని కల్పించి, డబ్బు అనే పదార్థాన్ని , ఒకరి జేబులోనుండి ఇంకో జేబులోకి వారం వారమో, నెల నెలో మార్చాలి కదా. అప్పుడే గదా ఎవరైనా తిండి గింజలు కొనుక్కుంటారు. కొంచెం తిన్నని బట్ట కట్టుకుంటారు. ఆ సంగతి నేను చెప్పితే, ఈమె చేసే వీరంగం – అమ్మో, నాకు తలుచుకోటానికే భయం వేస్తున్నది. ఓహో! ఈ పిల్లతో జీవితం చాలా సరదాగా ఉండేట్టుంది – అనుకున్నాడతను.
ఆ తర్వాత, కాసేపు ఆ పని ఈ పనీ చూసుకుని, సిమెంటూ, పంచదార -అమ్మే తన గోడౌన్లు వద్దకు వెళ్ళిపోయాడు.
మర్నాడు ఊళ్ళో చాలా కోలాహలం. ఆంధ్రాలో పెద్ద జమిందార్లుగా, మైకా మైన్ ఓనర్లు, రేస్ హార్స్ ఓనర్లుగా, సినిమా డిస్ట్రిబ్యూటర్లుగా పేరు పడ్డ ఓ కుటుంబం – వారిలో ఒక యువకుడు, కొత్తగా కట్టిన సినిమా హాలు ఓపెనింగ్ ఆ సాయంత్రం. మంచి ఆవరణ. పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసిన సినిమా హాలు. ఎర్ర తివాచీ పరిచిన ఒంపుల రాంప్. పైన ఖరీదు తరగతుల బాల్కనీ, కింద తక్కువ ఖర్చు తరగతులు. హైదరాబాదులో అంత చక్కని థియేటర్ అంతకు ముందు లేదు. ఆ రోజు ‘బుద్ధిమంతుడు’ ఊళ్ళో ప్రముఖులకు మాత్రమే చూపబడుతుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, జడ్జీలు, జర్నలిస్టులు, ఊళ్ళో మోతుబరి కుటుంబాలు ఎందరెందరికో ఆహ్వానాలు. ముందు తేనీటి పార్టీ. తర్వాత సినిమా. నిసి, అమ్మా నాన్నా, అన్నలతో కలిసి పార్టీకి వెళ్ళింది.
ఆ హాలు ఓనరు జీ. పీ. నిసి అతన్ని అన్నా అని పిలుస్తుంది. రమారమి గోపాల్ వయసే. ఇద్దరి వయసూ ఇరవయ్యిల్లొనే. గొప్ప అందగాడు. ఏ సినిమా స్టార్లూ అతని అందానికి చాలరు. అతడి మాటలో విలాసం. నవ్వులో విలాసం. నడకలో ఓ రాజసం. కుర్ర జమిందారు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. అతడికి నాగేశ్వర రావు, రామారావు లాగా జమిందారు పాత్ర నటించాల్సిన అవసరం లేదు.
అతడి భార్య అతనికి దీటైన అందగత్తె. ఆమె ఒక గులాబీ రంగు జరీ పని చేసిన చీర కట్టి, అదే రంగు జాకెట్టు వేసుకుంది. చేతికి ముత్యాలు, రవ్వల గాజులు. ఒక చేతికి వరుస వరసల ముత్యాల బ్రేస్ లెట్. ఆమె ముఖం కోలగా, ఎంతో ముద్దుగా ఉంది. ఇంత వంక పెట్టలేని కనుముక్కు తీరు. తెల్లని తెలుపు. తెలుపు గులాబి పువ్వు రేకుల మడతల్లో కనిపించే గులాబి రంగు స్ఫురిస్తూ ఉంది ఆమె ఒంటి చాయలో. ఉత్తరాదిలొ పెరిగినందున, తెలుగు రాదు. ఎక్కువ హిందీలో, ఇంగ్లీషులో మాట్లాడుతూ, అప్పుడే కొద్దిగా తెలుగు మాట్లాడుతూ ఉంది. ఆమెను అత్తింటివాళ్ళు ముద్దుకి ‘బహూ’ అని పిలుచుకుంటారు. బహురానీకి, ఆ తెలుగు సినిమా ఏం అర్థం కాదు.