మూడు లాంతర్లు – 7

సృజన పూర్తయి, ఆవిష్కృతమయ్యాక దాని యెడల సృజనకారుని దృష్టి రసాస్వాదన కాదు; మూల్యాంకనం, బేరీజూ కావు; స్థైర్యం. జాఁ కాక్తో (Jean Cocteau) అని ఫ్రెంచ్ కవి, రచయిత. విమర్శకుల విమర్శని గురించి ఆయన అన్నది – “One should pay close attention to which they most dislike, which is probably the only original quality you have going for yourself, and you’d best make a note of it and keep doing and doing it.” మేఘదూతం లోని ఈ శ్లోకం కాళిదాసుకు తన సృజన పట్ల ఉన్న స్థైర్యానికి తార్కాణమని ఒక కధ ఉంది:

అద్రేః శృంగం హరతి పవనః కింస్విదిత్యున్ముంఖీభిః
దృష్టోత్సాహః చకిత చకితమ్ ముగ్ధ సిద్ధాంగనాభిః
స్థానాదస్మాత్ సరస నిచులాత్ ఉత్పదోదున్ముఖఃఖమ్
దిజ్ఞానాగానామ్ పధి పరిహరమ్ స్థూల హస్తావలేపామ్

ఆషాడమాసపు తొలి దినాల్లోన మేఘుడు ఆకాశానికెగసి తన దౌత్యానికి ప్రయాణం మొదలుపెడుతున్నాడు. గాలి కాని నల్లని కొండ శిఖరాన్ని ఎత్తుకొని పోతోందా అని ఆకాశంలో ఉండే సిద్ధాంగనలు చకితులై చోద్యం చూస్తున్నారు. దిగ్గజాలు తమ బలిసిన తొండాల్ని ఆడిస్తూ ముందుకి పోదామన్న అతని ప్రయాణానికి పదే పదే అడ్డం పడుతున్నాయి. కాని నిచులములనే రసార్ద్రమైన ఆకాశ లతలు తోడుగా నిలుచున్నాయి. మేఘుడా! ఇంక నీ తోవకు ఆటంకం లేదు అని దీని తాత్పర్యమట. కాని ఈ కధలోని గూఢార్ధమేమంటే – కాళిదాసుకు నిచలుడని ఒక స్నేహితుడుండేవాడు. ఆయన రాసింది గ్రహించేవాడు. దిజ్ఞానాగాచార్యుడని ఒక తర్క పండితుడుండేవాడు. ఆయన కాళిదాసు సృజనను అధిక్షేపిస్తూ అన్నివిధాలా అడ్డుపడేవాడు. ‘దిజ్ఞానాగాచార్యుడు ఎంతగా అడ్డం పడితేనేమిలే రసజ్ఞునుడైన నిచలుడున్నాడు, నీ ప్రయాణానికింక ఆటంకం లేదు, వెళ్ళు! ‘ అని కాళిదాసు అన్యాపదేశంగా తనకు తానే చెప్పుకుంటున్నారని శ్రుతి.

11.

లౌక్యుడు, నాయకుడు, శాస్త్రజ్ఞుడు, సృజనశీలి, యోగి, వెర్రివాడు – ఈ అన్ని రకాల మనుష్యులకు సమానంగా ఉన్నది జాంతవ ప్రకృతి. సంస్కృతి కంటె చాల పురాతనమైనది. సారస్వత సృజనతో వీళ్ళందరి అనుబంధాన్ని, అనుభవాన్ని అర్ధం చేసుకోడానికి ముందుగా మానవ జంతువు ప్రకృతిని గురించి, అవసరాల్ని గురించీ కొంతైనా తెలియాలి. ఉదాహరణకు Boredom ఉంది – ఇది సంస్కృతి పరిణామక్రమం లోన ఇటీవల, అంటే పద్ధెనిమిదవ శతాబ్దం నుండి మనుషుల ప్రవర్తనను శాసించే ప్రబలమైన శక్తిగా మారిందని మనస్తత్వవేత్తలు అనేకులనుండి ప్రతిపాదన. ఈ మాటకు సరైన తెలుగు మాట దొరకదు. పాలుమాలిమి, ఊసుపోక ఇలాగ ఉన్నాయి గాని అవేవీ ఆధునిక సమాజపు బోర్‌డమ్‌కు సమానార్ధకాలు కావు. ఆధునికులు సృజన వెనుకనున్న ప్రబలమైన చోదకశక్తుల్లో ఇది ఒకటని నిర్ధారిస్తున్నారు. “Artists pursue meaninglessness until they can force it to mean something. They immerse themselves in chaos to give it form.” అని మే (Rollo May) అన్నారు.

జీవితపు మౌలికమైన అనుభవం అయోమయం, అర్ధరహితమని, బోర్‌డమ్ దీనికి ఒక చిహ్నమనీ, ఫలితమనీ అస్థిత్వవాదులు – కీర్క్‌గార్డ్ (Kierkegaard), నీచ (Nietzsche), పాస్కల్ (Pascal) వంటివాళ్ళు ప్రతిపాదించేరు. వీళ్ళల్లో పాస్కల్ అవగాహన చాల కఠోరంగాను, నిరాశాజనకంగాను ఉంటుంది. జీవితం అనంతమైన అఖాతానికీ కడపటి మహా శూన్యానికీ నడుమ అర్ధం లేని ఒంటరితనమనీ, మనిషి ఈ నిరర్ధకత్వాన్నుండి తప్పించుకునేందుకు రకరకాల మరిపింతల్ని వెదుక్కొని వినోదింపచూస్తూ కూడా చివరికి సఫలం కాలేడనీ. ఈ బాధనుండి తప్పించుకోడానికి ఆయన సూచించినవాటిలో సృజనకు స్థానం లేదు, ఆలోచనకూ స్థానం లేదు; ఒక్క ఈశ్వరునికే స్థానం ఉంది. “The heart has its reasons of which reason knows nothing. It is the heart which perceives God and not the reason. That is what faith is: God perceived by the heart, not by the reason.” అన్న ఆయన ప్రతిపాదన పదహారవ శతాబ్దం నాటిది. మానవ సమాజపు సమస్యలకి ముఖ్యమైన కారణం బోర్‌డమ్, దాని వలని చాపల్యం అని పాస్కల్ : “All of man’s troubles stem from his inability to sit quietly in a room alone.” మనుషులు చేసే పాపాల్లో సగానికి సగం బోర్‌డమ్ నుండి తప్పించుకోడం కోసమేనని బెర్ట్రండ్ రసెల్ (“At least half the mankind’s sins are caused by the fear of it.”).

ఇందుకు భిన్నంగా నీచ అస్థిత్వపు శూన్యతను, అర్ధరాహిత్యాన్ని సృజన ద్వారా అర్ధవంతంగా, నిరామయంగా మార్చుకోవచ్చునని నొక్కి చెప్పేరు. ఆయన దృష్టిలోన ప్రపంచం – అంటే మనిషికి గోచరమయ్యే ప్రపంచం – ఒక సృజనాత్మక స్థితి. “Only as an aesthetic product can the world be justified to all eternity.” ప్రపంచాన్ని, జీవితాన్ని ఇలా సృజనాత్మకంగా అనుభవించటానికి తప్పనిసరైనది Frenzy అంటే ‘ఉన్మాదం’ వంటి సృజనానుభవం. “If there is to be art, if there is to be any aesthetic doing and seeing, one physiological condition is indispensable: frenzy. Frenzy must first have enhanced the excitability of the whole machine; else there is no art.” కళాకారుడు సృజన ద్వారానే జీవితానుభవాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నాడు. “A man in this state transforms things until they mirror his power – until they are reflections of his perfection. This having to transform into perfection is – Art.” పాస్కల్‌కు భిన్నంగా కళ మతం వంటి ధార్మిక విశ్వాసాలకంటె ఉత్కృష్టమైనదనీ, సృజనానుభవమే మానవ జీవితపు సాఫల్యమనీ ఆయన ప్రతిపాదన – “In art man enjoys himself as perfection.” మనిషి అన్వేషించి, అందుకోవలసింది దైవం కాదు, సృజనానుభవం అనీ, అస్తిత్వపు అర్ధరాహిత్యానికీ శూన్యతకూ అదే ఒకే ఒక్క ఉపశమనమనీ నీచ చేసిన ప్రతిపాదన. మతపరమైన విశ్వాశాలు దైవమనే పరమ సత్యాన్నేదో ప్రతిపాదించి, అన్యాపదేశంగా సృజనను ఒక అసత్యమని చిన్న చూపు చూస్తాయని ఆయన ఆస్తికుల మతాన్ని, దైవ చింతననూ నిరసించేరు. “Art as the single superior counter-force against all will to negation of life, art as the anti-Christian, anti-Buddhist, anti-Nihilist par excellence.” బోర్‌డమ్ నుండి, అస్తిత్వపు అర్ధరాహిత్యం నుండి విముక్తిని, లేకుంటే కనీసం ఉపశమనాన్ని ఇవ్వగలిగిన సృజన, అదే బోర్‌డమ్ బారినపడి పతనం కావటం సినిమా వంటి మాధ్యమాల్లోన, సారస్వతంలోనూ సర్వ సాధారణంగా కనిపిస్తుంది. మరంచేత, సృజననూ బోర్‌డమ్‌నూ కలిపి పరికించవచ్చును.

సృజనకు, బోర్‌డమ్‌కు, అస్తిత్వానికి, అర్ధవంతమైన మనుగడ కోసం ఆరాటానికీ ఉన్న జటిలమైన సంబంధాల్ని గురించి చాల చర్చ, ఇటీవలి కాలంలో మరీ విస్తారంగా వస్తుంది. బోర్‌డమ్‌కు సారస్వతంతో ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి ఉదాహరణకు స్పాక్స్ (Patricia Meyer Spacks) అని మనస్తత్వవేత్త పరిశోధన ఉంది Boredom: The Literary History of a State of Mind అని. ఆవిడ నిర్ధారణలు ఏమంటే రాయటం, చదవటం ఈ రెండు వ్యాసంగాలూ ప్రధానంగా బోర్‌డమ్ బారినుండి తప్పించుకొనే ప్రయత్నాలే. (“As action and as product, writing resists boredom, constituting itself by that resistance. In this sense, all writing is about boredom. The act of writing implicitly claims interest (boredom’s antithesis)… any autonomous process of writing protects the writer for a time against the vacuity of what we call boredom.”) అలాగే సృజననుండి పాఠకులు ఆశించేదీ బోర్‌డమ్ నుండి విముక్తి: “Voluntarily picking up a book, we expect – indeed demand – to have our interest engaged.”

(ఇంకా ఉంది)

(పైన పద్యాన్ని, శ్లోకాన్ని పరిచయం చేసిన ఉపాధ్యాయులు, సృజనకారులు శ్రీ పి. వి. ఆర్. కె. మూర్తి గారికి కృతజ్ఞతలు.)


రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ ‘ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, ‘బర్సాత్‌ మే బిల్లి’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...