మూడు లాంతర్లు – 7

త్రిపుర, బిపిన్ ఇద్దరూ కూడా ఎన్నెన్నో సంగతుల్ని పరామర్శించేటప్పుడు, చదివేటప్పుడు ఒకలాంటి జాగ్రత్త వహిస్తారు అనుకుంటాను – సానుకూల దృష్టి, సంశయం – అంటే suspension of disbelief, skepticism రెండూ కలిసి ఏర్పరుచుకున్నలాంటి వైఖరి; healthy, sympathetic skepticismలాగా. వాళ్ళు చెప్పింది ఏమిటంటే అభిప్రాయాలు, అనుభవాలు, దృక్పధాల్లోన, శక్తియుక్తుల్లోన, సంకల్పం అంటే motivation అనే దాన్లోనూ మనుషుల్లో మన ఊహకు అందనంత వైవిధ్యం ఉంది. ప్రకృతిలో కూడా అనంతమైన వైవిధ్యం ఉంది. అన్ని రకాల అభిరుచులకూ ప్రతినిధిగా ‘సగటు పాఠకుడు ‘ అని ఉండే అవకాశం లేదు గాని, విమర్శకులకు కొన్ని తరగతుల పాఠకులని స్థూలంగా నిర్వచించుకొనే అవకాశం ఉంది. ఈ అన్ని రకాల possibilities లోన ప్రతి సృజనకారునికి, పాఠకునికీ తమవైన తోవల్ని వెదుక్కొని, స్థిరపరుచుకొనే అవకాశం, అవసరం కూడా ఉన్నాయి. అభిరుచి, అంటే tasteని గురించి చర్చించి, నిర్మించుకోవలసిన అవసరాన్ని గురించి నారాయణరావు గారు పదే పదే నొక్కి చెప్పేవారు.

తమ తోవ ఏదో స్థిరంగా తెలుసుకున్నవాళ్ళలోన ఈ స్థైర్యం వాళ్ళు కవులైతే ఇదివరకు ధీరత అనుకున్నది – తమ సృజన స్వరూపం గురించి, అనుభవం మీదను ఆరోగ్యకరమైన ఆత్మ విశ్వాసం గాను, పాఠకులైతే పరిణతమైన అభిరుచిగాను వ్యక్తమౌతున్నాది. వాళ్ళకి ఇతరుల అభిరుచితో పేచీలు లేవు, దాన్ని మార్చాలన్న దుగ్ధ లేదు, తమ సృజన అనుభవపు నాణ్యతని, ‘గొప్ప’తనాన్ని నలుగురికీ నిరూపించుకోవాలన్న తహతహ లేదు. ఇంకొకరికి, తమకంటే తక్కువ తెలిసినవాళ్ళు అనుకున్నవాళ్ళు పదిమందికీ తమ అభిరుచిని, అనుభవాన్నీ ఉవాచలుగా, ఉపదేశంగా పంచివ్వాలన్న కాంక్ష లేదు. వాళ్ళ ఔదార్యానికి ఈ మూర్తిమత్వమే ప్రాతిపదిక. దీన్ని సాధించుకోవటం ఎందుకో అంత కష్టం…! ఎవరైనా ఇలాగ తారసపడితే అద్భుతం అనిపిస్తుంది. కార్ల్ యుంగ్ తను చెప్పవలిసిందంతా విస్తారంగా చెప్పి కూడా చివరికి కాంట్ (Immanuel Kant) వంటి రససిద్ధాంతులే సృజన స్వభావం ఇదీ, స్వరూపం ఇదీ అని ఏమీ చెప్పలేకపోయేరు, నేను కూడా ఖండితంగా ‘ఇలాగ!’ అని ఏమీ చెప్పలేను, ఈ మాట తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించేరు.

త్రిపుర కొన్ని వేల గంటల సంభాషణల్లోన ఏ ఒక్క నాడూ కూడా ‘ఇలా చదువు, అలా రాయి, ఇలాగ చూడకూడదు!’ అని కనీసం సూచనగానైనా నిర్దేశించటం నేను చూడలేదు. బిపిన్ కూడా ఇంతే. ఎంతో చెప్తాడు గాని should అని, should not అనీ చెప్పడు. నాకు అబ్బురంలా ఉంటుంది. చాన్నాళ్ళ కిందట నాకు మురళి అని నా స్నేహితుడు, ఆయన అభిమానం వలన పత్రికలో ప్రచురించటానికి అవకాశం వచ్చింది. నేను ‘చాన్సు దొరికితే కానా మా… మ్మాఁ… మహదేవన్!’ అన్నట్టు రకరకాలుగా రాసి పంపిస్తున్నాను, కార్టూన్లతో సహా. త్రిపుర ఒక ఉత్తరం లోన ‘Must you draw those stupid cartoons too?’ అని మందలించేరు. నేను ఏమీ జవాబు రాయకుండానే ఆ తరువాతి ఉత్తరంలో మళ్ళీ ‘కార్టూన్లు ఎంత బాగున్నాయో చూడు ఆ బొమ్మలూ అవీ…’ అని అనునయిస్తున్నారు. Iowa ఉపాధ్యాయులు విద్యార్ధుల చెవి మెలిపెట్టి, శృంగభంగం చేసే సన్నివేశాలు చాల హృద్యంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మచ్చుకి కొన్ని:

డెల్బాన్కో (Nicholas Delbanco) అని అమెరికన్ నవలా రచయిత, ఉపాధ్యాయుడు. ఇదివరకు అనుకున్నాయన ఎల్కిన్ (Stanley Elkin) అని, ఇంకా నెమెరోవ్ (Howard Nemerov) అని – వాళ్ళిద్దరి సిద్ధాంతం ఏంటంటేనట: The real writer could not be discouraged. You are doing a favor by discouraging everybody, under the assumption that a very small proportion of them would endure. అంటే సహజంగా సృజనశీలురైన వాళ్ళని నిరుత్సాహ పరచటం అసాధ్యం. అంచేత రచయితలమని ఒచ్చిన విద్యార్ధులందర్నీ నిరుత్సాహ పరుస్తుంటేనే మంచిది. నిజంగా బలమైన కవులే అయితే వాళ్ళంతట వాళ్ళే ఎటూ నిలదొక్కుకుంటారు. పొగిడే కొద్దీ అకవులే తయారవుతారు. ఇది కఠినం అనిపిస్తుంది గాని అర్ధం చేసుకోగలిగినవాళ్ళకి అర్ధమవుతుందని డెల్బాన్కో అంటున్నారు.

ఆయన ఏం చేస్తాడంటేనట – సాధారణమైన విద్యార్ధుల్ని “Oh, that’s much better, wonderful…” అని ఎంతగానో పొగిడి పంపిస్తాడు. కాని ప్రతిభ ఉందనిపించే చాల కొద్దిమంది విద్యార్ధుల్ని మాత్రం సీరియస్‌గా తీసుకుని వాళ్ళతో మాత్రం ‘ఎందుకు టైం వేస్ట్? నువ్వింక తట్టా బుట్టా సర్దుకుని ఇంటికెళిపోకూడదా?’ అని నిరుత్సాహపరుస్తాడట. (“You’re wasting my time, you should pull up your socks, go home and do it again!”) అవార్డుల గురించి, గుర్తింపు గురించి త్రిపుర చెప్పిన ఛలోక్తులున్నాయి. రిపబ్లిక్ డే రోజు దేశం నలుమూలల్నుండీ సాహసవంతులైన బాల బాలికల్ని గుర్తించి, ఢిల్లీ రప్పించి ‘బాల వీర చక్ర’ అని ఇలాంటి అవార్డు ఏదో ఇస్తారు. ఒకసారి అగర్తలాలో ఎవరో ఒకబ్బాయి చాల ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎవరినో ప్రమాదం నుండి కాపాడేడు. అతనికి ఆ ఏడాది ఈ బాలచక్ర వచ్చింది. అది అందుకుని వెనక్కొచ్చి వాడు ఇదివరకు బుద్ధిమంతుడైన బాలుడు కాస్తా నలుగురి మీదా దాష్టీకం చేస్తూ పేటకంతా రౌడీలాగ తయారయ్యేడు. ‘అయ్యో! బంగారంలాంటి కుర్రాడు వీడికి బాలచక్ర ఇచ్చి అనవసరంగా చెడగొట్టేరు!’ అనుకుని ఊళ్ళో నవ్వుకునేవాళ్ళట.

సృజన అనుభవంలో, అభిరుచిలో కేవలం ఇతరుల మెప్పు మీదే ఆధారపడని తమదైన స్థైర్యాన్ని కనుక్కోలేనంత కాలం ఏ తోవ తమదో స్థిరంగా అనుభవం లోకి రాక, కవిలోనూ పాఠకునిలోనూ కూడా అపరిపక్వమైన అభిరుచే మంకుతనం, మేకపోతు గాంభీర్యంగా, లేదంటే పరస్పరం పెట్టుడు సామరస్యం, సుహృద్భావంగా, కాకుంటే లోన ఎటుకీ ఏమీ తోచని అయోమయమైన సంశయమూ, పైకి మౌనంగా తప్పించుకు తిరిగే మర్యాదగాను వ్యక్తమౌతాయి. ఇలాంటి సృజనశీలురు తెలివైనవాళ్ళు – అంటే గడుసువాళ్ళు, మాటకారులు అయితే అభిరుచిలో, సృజనానుభవంలోని అపరిపక్వత డాంబికం – అంటే intellectual posturing అనేదానిగా స్థిరపడుతున్నాది. దురదృష్టవశాత్తు సృజనశీలికి తన తోవ ఏమిటో అభిరుచి ఏమిటో ఇతరుల అభిప్రాయలపై, సిద్ధాంతాలపై, మెప్పు లేదా తెగడ్తలపై ఆధారపడకుండా కనుక్కోని, స్థిరపరచుకోక తప్పని అవసరం, అగత్యం ఉన్నాయి. తెలివైనవాళ్ళ ఉవాచలు, అభిప్రాయాల్ని, తాము చెప్తున్న వాటితో సహా, మరీ సీరియస్‌గా నమ్ముకుంటే సృజనకారులు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా అవి అడ్డు తగిలే ప్రమాదం ఉందని ఈ చెప్పిన ఉపాధ్యాయులందరూ సూచిస్తున్నారు.

ఇదివరకు అనుకున్నట్టు కోట్లాది మనుషుల్లో కొన్ని వేలమందైనా చాల తెలివైనవాళ్ళుంటారు. వీళ్ళల్లో మాటకారులుంటారు. తెలివైనవాళ్ళలో చాలా మందికి తమకు తోచిన ఆలోచనల మీద తమకే ఏదో ప్రేమ, నమ్మకం, గౌరవం లాగ ఉంటాయి. కవులు, రచయితలకు తాము రాసినవి సృజనలూ, ఉవాచలూ మంచి నాణ్యమైన రచనలేనని భ్రమలాగ ఉంటుందట. Iowa Writers Workshop వంటి చోట్లలో ఉపాధ్యాయులు పరిశీలించి చెప్పిన సంగతి. ఎవరిది వాళ్ళకి బాగానే ఉంటుందట. ఇదివరకు బింబ ప్రతిబింబ క్రియలని చెప్పుకున్న ప్రక్రియల్లోన పాల్గొంటున్న ఇద్దరూ – రచయిత, పాఠకుడు ఇద్దరూ ఒక్క మనిషే కావడం వలన, సృజన పాఠంతో అంతగా ప్రమేయం లేకుండానే ఎవరు రాసింది వాళ్ళకి సాంతం ‘అర్ధం’, ‘అనుభవం’ అయినట్టే ఉంటాయి. అలాగే వినేవాళ్ళు, పాఠకులు వీళ్ళు కూడా తమదంటూ స్థిరమైన, బలమైన అభిరుచి లేనివాళ్ళయితే తెలివితేటలుగా చెప్పిన మాటలు ఏవైనా ఏదో ఒక మేరకు బాగానే ఉంటాయి. స్థిరంగా, ఉవాచల్లాగ చెప్పేవాటికి విశ్వసనీయత వస్తుంది. ఎల్కిన్ అని ఇది వరకు పరిచయం చేసిన రచయిత ఈ విషయాన్ని గురించి అన్నది: “There is nothing as convincing as an opinion.” అని. అంటే – ఎవరైనా తెలివైనవాళ్ళు స్థిరంగా ఒక అభిప్రాయాన్ని ప్రకటిస్తే నమ్మాలనిపిస్తుంది.

ఆయన ఈ మాటలు ఏ సందర్భంలో అన్నారంటే గార్డ్‌నర్ (John Gardner) అని చాల ప్రసిద్ధుడైన రచయిత, విమర్శకుడు; సృజనను గురించి ఆయన పుస్తకాలు The Forms of Fiction, The Art of Fiction వంటివి చాల ప్రాచుర్యంలోకి వచ్చేయి. ఆయన “Art instructs.” అని అన్న మాటల్ని ఎల్కిన్ ఖండిస్తున్నాడు – సృజనకు ప్రబోధించే శక్తి లేదని. “It ultimately teaches you taste. Taste in fiction, taste in poetry, taste in music, taste in life.” అని ఎల్కిన్. ఆ సందర్భంలో ఆయన ఎవరైనా గంభీరంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని మరీ అమాయకంగా నమ్ముకోకూడదని జాగ్రత్త చెప్తున్నాడు. If somebody says, “Cripples should not be permitted on the street after dark,” somebody will think, ‘well, may be that’s a good idea.” అని. ‘గోధుమ రంగు మేజోళ్ళు వేసుకున్నాడు, వీడేం మనిషయ్యా?’ అని గట్టిగా ఎవరి గురించైనా అంటే ‘అవున్నిజమే! గోధుం రంగు మేజోళ్ళా? తలతిక్క కాకపోతే!’ అని పదిమందికీ రూపించవచ్చని, అభిప్రాయాలు, ఉవాచల గురించి తస్మాత్ జాగ్రత్త! అని.

చాలా ఏళ్ళ కిందట నాకు పుపుల్ జయకర్గారి పుస్తకాలంటే ఇష్టంలాగుండేది. ఆవిడతో మాట్లాడి వచ్చి ఆ సంగతులు త్రిపురకి చెప్తున్నాను. మళ్ళీ నాలో నాకే సందేహం లాగుండి త్రిపురనే అడిగేను. పుస్తకాలూ అవీ రాసేవాళ్ళంటే వాళ్ళేదో ప్రత్యేకమైన మనుషులని ఆరాధనలాగ అవుతుంది కదా త్రిపుర? అని. ఆయన ‘కొంతమందికి అలాగ బాగా రాయడం వస్తుందివై. అంతే. అంతకంటే ఏంలేదు!’ అని హెచ్చరికలాగ చెప్పేరు. జిడ్డు క్రిష్ణమూర్తి గారి రచనలంటే ఆరాధనలాగ ఉండేది. అదొక ప్రత్యేకత లాగాను. త్రిపుర అది కూడా గమనించి, గమనించి తను స్వయంగా జిడ్డు క్రిష్ణముర్తి గారి శిష్యుణ్ణనీ బెనారస్‌లో ఆయనకి పాల గ్లాసు అందించటం ఇలాగ కధలు చెప్పేరు. చెప్పి చివరికి ‘ఆ మాటలు సమ్మోహకరంగా ఉంటాయనుకో! ‘ (“It casts a spell over you!”) అని అలా క్రమంగా కొంత కాలానికి బయటికొస్తామని చేత్తో సైగ చేసేరు. అలాగే అయ్యింది. త్రిపుర మీది వీరాభిమానాన్ని కూడా త్రిపురే సాంతం ఒదలగొట్టేరు – దానికి ఎలాంటి పోషాకూ దొరికే ఆస్కారం లేకుండా చేసి. మంట ముట్టించిన కర్రని మంటలోకే విసిరి తగలబెట్టినట్లు. కర్పూర హారతి ఉద్దేశం ఇదేనట. ఏ ఆనవాలూ మిగలకుండా అంతా కాల్చమని. బిపిన్ కూడా ఇలాగే చేస్తాడు. వాళ్ళతో చర్చ చాల హాయిగ ఉంటుంది.