డిగ్రీ ఫైనలియర్ మొదలైన దగ్గర్నుంచీ, సుజాత ఎప్పుడూ రాకేష్ గురించే చెప్పేది నాకు. అతడి తెలివితేటల గురించి, వాళ్ళ కున్న ఆస్తిపాస్తుల గురించి, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫేమిలీకి గల పేరుప్రతిష్టల గురించి… చాలా గొప్పగా చెప్పేది. రాకేష్‌కు తనంటే చాలా చాలా ఇష్టమని చెప్పేది. నువ్వూ అంతగా రాకేష్‌ను ప్రేమిస్తున్నావా అని అడగాలనిపించింది. సమాధానంగా, తను కూడా అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నానని చెబితే నేను వినలేననిపించింది. ఇలా చదువుకునేప్పుడు ప్రేమించుకోడాలు – కేవలం కథలకు, సినిమాలకు పరిమితం. హీరోలు, హీరోయిన్లూ మాత్రమే అలా చేయగలరు – చేయాలి. మా ఇంటి ప్రక్కనే, చిన్నప్పటినుంచీ నాతో కలిసి పెరిగిన అమ్మాయి ‘హీరోయిన్’ అంటే నా మనసొప్పుకోవడంలేదు.
అందుకేనేమో నేనెప్పుడూ సుజాతనా ప్రశ్న అడగలేదు!
“పెద్దవాళ్ళకు ఇష్టం లేకపోతే?” అడిగాన్నేను. ఎందుకు… ఎందుకు నేనన్నీ నెగెటివ్‌గా ఆలోచిస్తాను?
“ఇష్టం లేకపోతే మేరేజి కాన్సిల్,” అంది చాలా కాజువల్గా. నాకు చాలా ఆశ్చర్యమేసింది.
“మరి ఇన్నాళ్ళూ మీ మధ్య ప్రేమా – అదీ…” అడిగాన్నేను.
“తన విషయం నాకు తెలియదు గానీ – నాకెప్పుడూ తనను ప్రేమిస్తున్నాననిపించలేదు. తను నాకో మంచి ఫ్రెండ్ అంతే! ఇంకో విషయం చెప్పనా? చాలా చోట్ల ప్రేమ గురించి విన్నా, చదివినా కూడా – నాకిప్పటివరకు ప్రేమంటే ఇదీ అని తెలియలేదు. ఇంక నేను తనను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలను? రాకేషుక్కూడా అంతేననుకుంటాను – గాఢమైన స్నేహాన్ని ప్రేమనుకుంటున్నాడేమో!? చూద్దాం ఏమి జరుగుతుందో?” అంది సుజాత. ఈ విషయాలు చెప్పేప్పుడు తనలో ఎలాంటి ఎగ్జయిట్మెంటూ కనిపించలేదు. చాలా మామూలుగా చెప్పింది.
సుజాత, రాకేషుల పెళ్ళికి పెద్దవాళ్ళంగీకరించారని తెలిసి, సుజాతంటే నాకు విపరీతమైన ఈర్ష్యకల్గింది. సుజాత తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోవడంలో నాకేమంత ఆశ్చర్యం కలుగలేదు. ఎందుకంటే చిన్నప్పటినుంచి నాకు తెలిసి ఏ ఆడపిల్లకూ వుండనంత స్వేచ్చ సుజాతకుండేది. మా ఇంట్లో అయితే, చిన్నప్పటి నుంచీ – నాకు కొన్ని పరిమితులూ, నా పైన కొన్ని ఆంక్షలూ ఉండేవి. సుజాతకైతే అలాంటివేమీ లేవు.
ఏదోలా వాళ్ళ మధ్య గానీ, వాళ్ళ పెద్ద వాళ్ళ మధ్య గానీ గొడవలొచ్చి, పెళ్ళి ఆగిపోతే బావుణ్ణనిపించింది.
ఉస్మానియా యూనివర్సిటీలో పిజీలో జాయినయ్యాను నేను. సుజాత, రాకేష్ కూడా అక్కడే జాయినయ్యారు. నేనూ హైదరాబాదు వస్తున్నానని తెలిసి సుజాత చాలా ఆనందపడింది. ఇద్దరం హాస్టల్లో ఒకే రూములో వుందామంది. మళ్ళీ చిన్నప్పటి రోజులొచ్చాయని సంబరపడింది. సుజాతకు కలిగినంత ఆనందం నాక్కలగలేదనిపించింది. సుజాతకు ఫ్రెండ్స్ ఎక్కువ. అందరితో కలివిడిగా ఉండేది. నేను హైదరాబాదు వెళ్ళగానే, నన్ను తన ఫ్రెండ్సందరికీ పరిచయం చేసింది. యూనివర్సిటీలో సుజాతతో కలిసి ఒకే క్లాసులో పక్క పక్క కూర్చుని పాఠాలు వినడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. సుజాత కోరుకున్నట్లే హాస్టల్లో ఇద్దరం ఒకే రూములో జాయినయ్యాం.
తను సాయంత్రాలు రాకేష్‌తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు, ఆదివారాలు వాళ్ళిద్దరూ కల్సి సిన్మాలకు వెళుతున్నప్పుడు – నన్ను కూడా వాళ్ళతో రమ్మనేవాళ్ళు. మొదట్లో రెండు మూడు సార్లు వెళ్ళాను. సుజాతతో రాకేష్ ఎంత సరదాగా మాట్లాడతాడో, నాతో కూడా అంత సరదాగా మాట్లాడేవాడు. అలా వాళ్ళతో కల్సి నేనెక్కువ సమయం గడిపిన రోజు నా మనసు బాధగా మూల్గేది.
సుజాతంటే పెరుగుతున్న ఈర్ష్య ద్వేషంగా మారసాగింది. అప్పుడప్పుడూ ద్వేషం కోపం రూపంలో బయటపడేది. సుజాతను గాయపరచడానికి మాటలను ఆయుధాలుగా ఉపయోగించేదాన్ని. నేనలా బిహేవ్ చేసినా సుజాత మాత్రం, నాతో చిన్నప్పుడు తనెలా ఉండేదో ఇప్పుడూ అలాగే వున్నట్లుండేది నాకు.
ఒకాదివారం తప్పనిసరిగా మా నాన్నగారి చిన్ననాటి స్నేహితుని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నాకూడా సుజాత తోడుగా వస్తానంది. నేనే వద్దన్నాను. నాతో సుజాత అక్కడికి వస్తే నన్నెవరూ పట్టించుకోరేమోనని. ఒకరకంగా ఆదివారం వాళ్ళింటికి వెళ్ళడం నాకూ ఇష్టంలేదు. సుజాత, రాకేష్ నేను లేకుండా బయటకు వెళతారని బెంగ! నేను వాళ్ళింటికి వెళ్ళాననేగానీ – మనసంతా సుజాత వాళ్ళ గురించే ఆలోచిస్తోంది.
నేనక్కడినుంచి వచ్చేసరికి బాగా రాత్రయింది. సుజాత పడుకుని వుంది. నిద్రపోతోందనుకుంటా. ఆ సాయంత్రం వాళ్ళెక్కడెక్కడకు వెళ్ళుంటారో, ఏమేమి చేసుంటారో ఊహించుకుని, దహించుకుపోయాను. ఈర్ష్యతో రగిలి పోయాను.ఆ రాత్రంతా కలలే. సుజాత నన్ను రూములోంచీ బయటకు గెంటేసినట్లు, నన్ను బాత్రూములో పెట్టి బయట తాళం వేసినట్లు, నేపడుకున్న మంచాన్ని హాస్టల్ బిల్డింగ్ మీంచి క్రిందకు తోసేసినట్లు…
ఉదయం లేవగానే సుజాతనడిగాను ‘ఏ సినిమా చూసేరని?’ సిన్మాకు వెళ్ళలేదని చెప్పింది. నిన్నసలు రాకేష్ రూము వైపు రాలేదట! తనకేదో అర్జంటు పని తగిలి వాళ్ళ ఊరు వెళ్ళాడట. మరో రెండు మూడు వారాలు పడుతుందట సిటీకి రావడానికి. అప్పుడు నాక్కల్గిన ఆనందం అంతా ఇంతా కాదు.
సుజాత అడిగింది ‘నీ సాయంత్రం ఎలా గడిచిందని’. అద్భుతంగా గడిచిందని చెప్పాను. నేవెళ్ళిన వాళ్ళింట్లో ఓ అందమైన అబ్బాయి ఉన్నాడని, తనో పెద్ద ఉద్యోగంలో వున్నాడని, రేపోమాపో విదేశాలకు వెళ్ళొచ్చని చెప్పాను. అతనితో నాకా సాయంత్రం పరిచయమైందనీ, చాలా సేపు ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకున్నామనీ, బహుశా అతనితోనే నాకు సంబంధం నిశ్చయం కావచ్చని కూడా. చిన్నప్పటినుంచీ సుజాత ఎదుట నాకెక్కువ ఆనందం కలిగింది ఈ రోజే! ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ కల్గింది. సుజాత ఒక్కసారిగా ఆనందంతో నన్ను వాటేసుకున్నంత పని చేసింది.
“అంటే నిన్న నువ్వు వెళ్ళింది పెళ్ళి చూపులకన్నమాట. నాకెందుకే ముందు చెప్పలేదు” స్వచ్చంగా నవ్వుతూ అడిగింది.
సుజాత నాలాగా ఫీల్కాకపోవడం నన్నెంతో డిస్సపాయింట్ చేసింది.
నేను వెళ్ళిన ఇంట్లో రేపోమాపో విదేశాలకు వెళ్ళబోయే ఓ అబ్బాయి వుండడం వరకూ వాస్తవమే.కానీ నేనతనితో పిచ్చాపాటి మాట్లాడడం గురించి, సంబంధం గురించీ నేను చెప్పినదంతా కల్పన. అవునూ… నేనెందుకతన్ని పెళ్ళి చేసుకోకూడదూ?! అతనికేం తక్కువ? హు!… అతనికేమీ తక్కువ కాదు. నాకే అన్నీ తక్కువ! నన్ను చేసుకునే ఖర్మ ఏంటి తనకు? తను కోరుకుంటే చాలా అందమైన అమ్మాయి, సుజాతలాంటి చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది. అయినా ప్రయత్నిస్తే తప్పేముంది?
కానీ ఎలా?
పరిసరాల్లో సుజాత వుంతే, నేను బాగా చలాకీగా కనిపించడానికి ప్రయత్నించసాగాను. ప్రతి విషయానికి బిగ్గరగా నవ్వుతున్నాను. మాములు కంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాను. మిగిలిన మా ఫ్రెండ్స్, నన్నో క్రొత్త మనిషిని చూస్తున్నట్లు చూసినా, సుజాత మాత్రం ఎప్పట్లాగే… ఎప్పటిలాంటి చిరునవ్వుతోనే నన్ను చూస్తోంది.
“ఆదివారం నీలో ఎంత మార్పు తెచ్చింది?” అంది సుజాత.
“ఏ ఆదివారం?”అన్నాన్నేను ఆశ్చర్యంతో.
“అదేనే పోయినాదివారం…”
“ఓ అదా!” అన్నాన్నేను బిగ్గరగా నవ్వుతూ.
“ఇంతకీ అతని పేరేమిటి?” అడిగింది సుజాత.
ఏం పేరబ్బా? గుర్తు తెచ్చుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. ఏం పేరైవుంటుంది? ఏదో ఓ అందమైన పేరు చెప్పేస్తే! అమ్మో వద్దు. తర్వాత ఏదో విధంగా సుజాతకు అతని అసలు పేరు తెలిస్తే బాగోదు. ఆలోచిస్తూ… క్రింది పెదవిని కొరుకుతూ…నేల చూపులు చూస్తున్న నన్ను చూసి,
“పేరడిగితేనే డ్రీమ్స్ లోకెళ్ళిపోతున్నావా?” అంది సుజాత కొంటెగా నవ్వుతూ. “పోన్లేవే. పేరు చెప్పకపోతే చెప్పక పోయావ్ కనీసం పెళ్ళికి ముందు పరిచయమైనా చేస్తావా?”
“నీకు పరిచయం చేయకుండా పెళ్ళి చేసుకుంటాననుకున్నావా?”ఎదురు ప్రశ్న వేశాను. ఈ ప్రశ్న నా నాలుక చివర నుండి ఊడి పడింది.
ప్రతి ఆదివారం బాగా పొద్దెక్కాక అంటే పదీ పదకొండు గంటలకు లేచే నేను, ఆ రోజు మాత్రం ఉదయం ఆరున్నరకే నిద్ర లేచాను. ప్రక్క బెడ్ మీద సుజాత ఇంకా ప్రశాంతంగా నిద్ర పోతోంది. దాని మొహంపై నవ్వు. బహుశా రాకేష్ గురించి కలగంటుందేమో!
నిద్ర పోయేప్పుడు నేనెలా వుంటానో? నా మొహమ్మీద నవ్వు వుంటుందా? ప్రశాంతత వుంటుందా?
మళ్ళీ సుజాత వైపు చూసాను. చాలా ముచ్చటేసింది నాకు. చప్పుడు చేయకుండా మెల్లగా కుర్చీని, దాని మంచం దగ్గరగా లాక్కుని దాని మొహం కేసి చూస్తూ కూర్చున్నాను. ఆశ్చర్యంగా నాలో ఎలాంటి అసూయ, ఈర్ష్య, ద్వేషం లాంటి భావాలు కల్గలేదు. వాటి స్థానే ఆప్యాయత, స్నేహం, ప్రేమ కలిగాయి.
సుజాత నిద్రలో కొంచెం కదిలింది. మెల్లిగా లేచి, చప్పుడు చేయకుండా కుర్చీని వెనక్కి జరిపేసి బాత్ రూములోకి వెళ్ళాను.
హడావిడిగా రెడీ అవుతూ వాచ్ వైపు చూశాను. తొమ్మిది కావస్తోంది. సుజాత ఇంకా నిద్రపోతోంది, అంతకు ముందులాగే ప్రశాంతంగా.