మనస్సును త్రాసుతో పోల్చటం చాలా విలక్షణమైన ఉపమానం. ‘త్రాసు’ దేశ్యపదం కాదు ‘తరాజూ’ (taraazuu) అనే పర్షియన్ పదానికి తద్భవం. ఇది తెలుగు సాహిత్యంలో కనిపించే మొట్టమొదటి అన్యదేశ్యం. బహుశా ఆ రోజుల్లో తెలుగులో వాడుతున్న పదం కావచ్చు. తూకానికి త్రాసువాడటం మన సంస్కృతిలో ఒక నూతనానుభవం. మనకు కొలతలున్నాయి గాని, తూకాలు లేవు. మహమ్మదీయుల కాలంలో అధికార భాష పర్షియన్. శ్రీనాథుడి కాలం నుంచి అన్యదేశ్యాలు విరివిగా తెలుగు కావ్యాల్లో గూడా ప్రవేశించాయి. తిక్కన సమకాలీన పరిసరాల నుంచి పోలికలు తీసుకున్నాడనటానికి ఇది చక్కని ఉదాహరణం. దీన్ని వాడిన సందర్భం:
సీ.
యదియ భూపతికి ధర్మాతిశయము
గీర్తియుఁజేయు నక్షీణసత్త్వులు ధర్మ
పరులునునైన భూసురులు నీవు
త్రాసులంబోని చిత్తంబులతోడుతఁ
బ్రజవివాదములెడఁ బక్షముడిఁగి
విని ధనవాంఛమై ధనికుల దెసవ్రాలి
తీర్పక ధర్మంబు తెరువుదప్ప
ఆ. వె
ననుగుణంపుదండ మాచరింపు
ముఱగఁబలికితేని నుండదుప్రజ డేగఁ
గనిన పులుఁగుపిండు కరణిఁజెదరు (శాంతి. 2.374)
10. గద్యపద్యరచనానిర్ణయం
చిన్నవయస్సులో నిర్వచనోత్తరరామాయణం రాసిన కవిబ్రహ్మ భారతరచన కాలానికి అందరు కవులలాగానే ‘పద్యముల గద్యములన్ రచియించెదన్ గృతుల్’ అన్నాడు. కాని పరిశీలించి చూస్తే ఇది సాభిప్రాయంగానే చేసుకున్న నిర్ణయమనిపిస్తుంది. పద్యాలకు లాగానే గద్యలకు గూడా ప్రయోజనం కల్పించినట్టు నిరూపించవచ్చు. గద్యలు ఈ కింది సందర్భాలలో తిక్కన వాడాడు.
- ఇద్దరి మధ్య సంభాషణలో ఒకరు మాట్లాడినవి పద్యాల్లో ఉంటాయి, రెండోవారు మాట్లాడినవీ పద్యాల్లో ఉంటాయి. కానీ వక్తృభేదాన్ని సూచించటానికి గాని, మాట్లాడటం అయిపోయి మరో పని మొదలయ్యేటప్పుడు గాని వచనం ఉంటుంది. ‘అనుటయు నతండు’ (ఆను. 1.15), ‘అనిన నక్కోమలి కిరాతుం జూచి’, ‘అని వెండియు, ‘అని చెప్పె’, ‘అదియునుంగాక’.
- రెండు పనులకు మధ్య వ్యవధానం ఉంటే సమయసూచన వచనంలో తెలుస్తుంది. ‘మెలంగుచుండె నట్టియెడ’, ‘సుప్రయోగంబై చెల్లెఁబదపడి’, ‘ఆ సమయంబున’.
- ఆశ్వాసాది పద్యం తరవాత, ఆశ్వాసాంత పద్యం తరవాత వచనం ఉంటుంది.
- యుద్ధపంచకంలో దీర్ఘమైన యుద్ధవర్ణన విసుగు కలిగించకుండా ఉండటానికి వచనం వాడినట్టు తెలుస్తుంది (చూ. భీష్మ. 1.267 పెద్దవచనం). ప్రత్యేకమైన వీరుల మధ్య జరిగే యుద్ధాన్ని పద్యాల్లో వర్ణిస్తాడు.
అన్నిటికన్నా ముఖ్యంగా కనిపించే ప్రయోజనం మరొకటి ఉంది. రసపోషణ ప్రధానమైన చోట పాత్రల మనఃప్రవృత్తిని బావోద్వేగాన్ని తిక్కన అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తాడు. అవి ఒక పరాకాష్ఠకు (climax) రావటానికి కొన్ని హద్దులేర్పరుచుకొని ఒక్కొక్క హద్దును సూచించటానికి ఒక వచనం ఉపయోగిస్తాడు. అంటే వచనం తరవాత భావోద్వేగం, రసపోషణ మరింత ఉద్ధృతం (intense) అవుతాయి. తిరుపతి కొండమెట్లెక్కేటప్పుడు కొన్ని మెట్ల తరవాత సేద దీర్చుకోటానికి బల్లపరుపుగా విశాలంగా ఉండే మెట్టు వస్తుంది. దాని తర్వాత వచ్చే మెట్లు ఇంకా ఎత్తుగా ఉంటాయి పైసూచించిన వచనాలు గూడా అలాంటివే. ఇటువంటి సందర్భాలు ఎక్కువగా విరాటోద్యోగపర్వాలలో కనిపిస్తాయి. సముద్రంలో ఒక పెద్ద అల వచ్చేముందు చిన్న అల పొడసూపినట్టుంటుంది వచనం. ఉదాహరణలు కొన్ని ఈ కింది విభాగాలలో చర్చిస్తాను.
10.1. ఉద్యోగపర్వం మూడో ఆశ్వాసంలో రాయబారానికి వెళ్తున్న కృష్ణునికి ద్రౌపది తన భంగపాట్లు చెప్పుకుంటుంది. ఇదంతా 100 నుంచి 119 దాకా 20 పద్యాల్లో జరుగుతుంది 100-105 లో ధర్మరాజు మాటలు తనకు కష్టం కలిగించాయని చెబుతూ అయినా ఫరవాలేదు సంధి ప్రయత్నం చెయ్యండి అంటుంది.
అని మఱియు నిట్లనియె. (106)
ఆఱడిఁ బోకయున్…. (107)
వరమునఁబుట్టితిన్…. (108)
తన ఆభిజాత్యాన్ని గురించి మాట్లాడుతుంది.
109. అట్లుంగాక
నీవు సుభద్రకంటె…. (110)
ఆసభకేకవస్త్రయగునట్టిననుం…. (111)
అరయమిఁజేసి కోడలన కప్పుడు…. (112)
ఈ పద్యాల్లో భావోద్వేగం అంతకన్నా ఎక్కువ శ్రుతిలో ఉంటుంది.
113. అని అట్లుగ్గడించి
ద్రౌపది బంధురమ్మయిన క్రొమ్ముడిఁ గ్రమ్మున విడ్చి…. (114)
ఈ పద్యంలో ఇక మాటలతో కాదని చేతల్లోకి దిగుతుంది. తన జుట్టు విప్పదీసి…
115. గోవిందుముందరం బెట్టి యిట్లనియె
ఇవి దుస్స సేనువ్రేళ్ళం, దవిలి… (116)
ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన… (117)
నెట్టన నిట్టియల్క మది నిల్పితి… (118)
119. అనుచు నెలుంగు రాలుపడ నేడ్చిన యాజ్ఞసేనిం…
సహేతుకమైన మాటలతో మొదలై నాలుగు అంచెల్లో ఏడుపు దాకా వచ్చిన ఈ ఘట్టం పోషణలో వచనాలు శిల్పభాగాలుగా కనిపిస్తాయి. ఉత్తరోత్తరప్రకర్షతో పరాకాష్ఠకు చేరిన భావావేశం చివరి మూడు పద్యాల్లో బాగా కనిపిస్తుంది.
10.2. మరొక సన్నివేశం, కర్ణపర్వం మూడో ఆశ్వాసంలో: చేతికిజిక్కిన ధర్మరాజును విడిచి కర్ణుడు దుర్యోధనుణ్ణి కాపాడటానికి వెళ్తాడు. పరాభవంతో ధర్మరాజు తిరిగి శిబిరానికి వెళ్తాడు. ఏమైందో తెలియని కృష్ణార్జునులు ధర్మరాజు క్షేమం కనుక్కోటానికి యుద్ధరంగం విడిచి అతనున్న శిబిరానికి వస్తారు. ఇదంతా కథనాత్మకవచనంలో సాగుతుంది (19, 28). కర్ణుణ్ణి వధించి వచ్చారని వాళ్ళను అభినందించి (మూడు పద్యాల్లో) తాను భయపడి యుద్ధరంగంనించి తిరిగి వచ్చానని చెప్పి, ధర్మజుడు సంతోషంతో అర్జునుణ్ణి పొగడటం మొదలుపెడతాడు.
వెండియు గాండీవి నుద్దేశించి… (32) అర్జునుణ్ణి గుక్క తిప్పుకోకుండా పొగడటం అనూహ్యంగా ఆరుపద్యాల్లో సాగింది.
పదమూఁడు వర్షముల్ పగలును రేయును… ఈ పద్యం చివర ‘నీ యట్టి యనుజు, వలనఁ దేజంబు వడసితి నలఘుచరిత’ (33) అంటాడు.
వెరవును లావు…. (34)
అరుదిది నీవు నొవ్వక మహాబలు కర్ణు వధించి …. (35)
పలికిననేమి…. (36)
అతిగర్వసమున్నతమగు…. (37)
చివరి పొగడ్త పద్యం:
ఈరసమునఁ గదిసి శరా
సారము పైఁగురియ నీవు సక్రోధుఁడవై,
పేరురమున వెస నాటిన
తోరంబగు నారసమునఁద్రుళ్ళి కెడసెనే (38)
కర్ణుడంటే తనకున్న భయాన్ని కచ్చను వెల్లడిస్తూ నువ్వు అతన్ని ఎలా చంపావు అని గుచ్చిగుచ్చి అడిగాడు.
(39) వచనం: ‘అనిన ధర్మనందనునకుఁ బురందర నందనుం డిట్లను….’. ‘తాను సంశప్తకులను, అశ్వత్థామను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పి, కర్ణుడింకా చావలేదు, నిన్ను చూడటానికి వచ్చాం’ అని చెప్పటం పదకొండు పద్యాల్లో సాగుతుంది (40-50).
(51) వచనం: ‘అమ్మనుజపతి గర్ణుండు గుశలియై యుండుట యెఱింగి, యతనిబాణంబుల నొచ్చినవాఁడగుట నలుకగదిరి యక్కిరీటితో నిట్లనియె.’ ఎంత గొప్పగా పొగిడాడో అంతకు మించిన తెగడ్త, అవమానించటం, బండ తిట్లుతిట్టటం.
అతని నిరాశ కోపంగా మారుతుంది: అనిలోఁదెరలుట దొలఁగుట… (52).
ఇక్కడో ప్రసిద్ధమైన పద్యం:
విను కర్ణునకేనోడితి
నన నేటికి నీవు నోడి తనిలజమాద్రీ
తనయులు మున్నే యోడిరి
మనతోఁగూడంగఁ గంసమర్దియు నోడెన్… (53)
ఇది చాలా ఘాటైన పద్యం.
కావున మనమిక…. (54)
కాదేని బిరుదులాడక, సాదులమై …. (55)
నిస్సహాయత నిరుత్సాహాలతో వచ్చిన కోపంతో
(56) వచనం: ‘అని కెంజాయ రంజిల్లు కన్నుల నన్నరు నాలోకించి….’
నీతెఱఁ గిట్టిదేని…. (57)
అని వధించెదఁ గర్ణు…. (58)
పంకజనాభుఁడున్ వినఁగఁబల్కిన …. (59)
వినుమప్పలుకులు సాటిగఁ, గొని…. (60)
దేవతలిచ్చిన తేరునశ్వంబులు …. (61)
చివరకు నువ్వు కుంతి కడుపున బడకుండా ఉంటే బాగుండేది అని, ఆగక…
(62) వచనం: కోపం శ్రుతి మించి (తర్వాత నాలుగు పద్యాలు),
గాండీవాన్ని దూషిస్తాడు… (63-66)
ధర్మరాజును చంపటానికి అర్జునుడు కత్తి దూస్తాడు… (67-69)
కృష్ణుడు నిరోధించి అర్జునుణ్ణి సమాధానపరుస్తాడు.