2.2. శబ్దపల్లవాలు
ఇవి క్రియాధాతువులు చివరి అవయవంగా ఉన్న నుడికారాలు. ధాతువుకు ముందున్న భాగం స్వరూపం ఒక్కొక్కప్పుడు అస్పష్టంగా ఉంటుంది, ఉదా. ‘ఆడు’ అనే ధాతువు మూడు అర్థాల్లో పరపదంగా వచ్చినవి:
- ఆడు – ‘అను, చెప్పు’ అనే అర్థంతో: ఉల్లసమాడు, కొనియాడు, చెడనాడు, తగనాడు, తెగనాడు, నోనాడు, నోరాడమి, బిరుదులాడు, మాటలాడు, ముట్టనాడు, సరసమాడు.
- ఆడు – ‘కదలు’ అనే అర్థంతో: అట్టలాడు, అల్లాడు, ఉరియాడు, కాళ్ళులాడు, చిఱ్ఱుముఱ్ఱాడు, చేతులాడక, చేయాడక, తూగాడు, తూలాడు.
- ఆడు – (ముందున్న పదం అర్థంతో కలిసే) ‘పనిచేయు’ అనే అర్థంలో: ఏట్లాడు, కాటులాడు, కొట్లాడు, చించిచెండాడు, చూఱలాడి, జల్లుపోరాడియాడి, జూదమాడు, తునుమాడు, తుఱుమాడు, తూటాడియాడి, పెనఁగాడు, పెనఁగులాడు, పోరాడు, ముద్దాడు, వసంతమాడు, వేఁటలాడు.
శబ్దపల్లవంలో వచ్చే -పడు ధాతువు చేరి ఎన్నో అమూర్తభావాలను తెలిపే క్రియలేర్పడతాయి. ఈ ధాతువు కృద్రూపం-పాటు. నేటి తెలుగులో పడు-పాటుల సంబంధం కొద్ది పదాలకే పరిమితం (non-productive):
అగపడు – అగపాటు
అచ్చెరువడు – అచ్చెరవాటు
అడచిపడు – అడిచిపాటు
అలజడిపడు – అలజడిపాటు
?ఎడఁబడు – ఎడబాటు
ఒడఁబడు – ఒడఁబాటు
?ఒల్లఁబడు – ఒల్లఁబాటు
ఏర్పడు – ఏర్పాటు
కీడ్పడు – కీడ్పాటు
కొందలపడు – కొందలపాటు
చిడిముడిపడు – చిడిముడిపాటు
తిరుగుడుపడు – తిరుగుడుపాటు
తొట్రుపడు – తొట్రుపాటు
తోడ్పడు – తోడ్పాటు
నివ్వెరపడు – నివ్వెరపాటు
మ్రానుపడు – మ్రానుపాటు
వెక్కసపడు – వెక్కసపాటు
వెనుఁబడు – వెనుఁబాటు
వెఱఁగుపడు – వెఱఁగుపాటు
వేర్పడు – వేర్పాటు
ఱిచ్చపడు – ఱిచ్చపాటు
2.2.1 సంస్కృతనామాలకు పరంగా వచ్చిన పడు-పాటులు
కష్టపడు – కష్టపాటు
దుఃఖపడు – దుఃఖపాటు
దైన్యపడు – దైన్యపాటు
భంగపడు – భంగపాటు
వేగపడు – వేగపాటు
2.3 నుడికారాలు
విడి మాటల అర్థం కంటే వాటి కలయిక వల్ల వచ్చే నుడికారం అర్థం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణలు:
ఇనుపగుండియ
ఉల్లికుట్టుమాటలు (?ఉల్లి = మనస్సు)
ఎండకన్ను, వానకన్ను ఎఱుఁగని = అసూర్యంపశ్య
(ఎండకన్ను- వానకన్నెఱుఁగని అనేది తిక్కన సృష్టి)
కన్నాకు
కన్నులపండువు
కఱివేము
కల్లజూదము/సారెలు
కుప్పలు కూరలుగా
గనపలొట్టేనుంగుపై
గుండెకాయ
చలిచీమలు
చలిపందిరి
చిందఱవందఱ
చెలియలికట్ట
తిండిపోతు
పీనుఁగుపెంటలు
పెట్టనికోట
పెడకేలు/-చెవులు/-చేత
పొలిమేర
ప్రాణగొడ్డము
మెత్తనిపులి
మేనల్లుఁడు/-బావ/-మామ/-మఱఁది
మైమఱువు = శరీరాన్ని రక్షించేది, కవచం
రక్కెసతాల్మి
2.4 ఇతర పదబంధాలు
పైవి మూడూ స్థూలంగా సమస్తపదాల కిందికి వస్తాయి. ఇవిగాక పదం కంటె పెద్దవి, వాక్యం కంటె చిన్నవిగా ఉండి, వాక్యావయవాలైన పదబంధాలున్నాయి, ఉదా.
కప్పయెలుంగుఁబాము = కప్పను నోట్లోచిక్కించుకున్న పాము
చూడ్కిసనినయంతదవ్వు
తలిరెసఁగెడునడమామిఁడి చెలువున = చిగుళ్ళు దట్టంగా ఉండి నడుస్తున్న మామడిచెట్టులాగా అందంగా
తావిఁగ్రమ్ము నరవిరిగుత్తి
తేనెపూసినకత్తివి
నీమెచ్చువారవంబుల
నీరుమేపుగలుగునెడకు
పచ్చవిలుతుననుఁగుటంపపొదిలోని బరిగోల
మొఱకుచేనున్నతియ్యపండు
వింజంబాఁకిడినకరణివవింధ్యపర్వతం = సూర్యచంద్రుల గమనాన్ని నిరోధించినట్టు
(ఆఁక + ఇడు)
3. సంస్కృతం, తెలుగు
అమూర్తభావాలకు తెలుగు మాటలు: తిక్కనగారు ఎంత విలక్షణమైన భావాలనైనా దేశ్యశబ్దాలతోనే చెప్తాడు. తెలుగు మాటలతో సాధ్యమైన అభిప్రాయాలకు సంస్కృతం ఎందుకు వాడాలన్న పట్టుదలే గాని ఈ మాటలన్నీ ఆయన కాలంలో వాడుకలో ఉండేవి అనటం హాస్యాస్పదం. ఇదే తత్వం ప్రాచీన తమిళ రచయితల్లోనూ కనిపిస్తుంది. చూడండి, ఉదా.
| అతిశయం | పెంపు | |
| అసంతృప్తి | ఆపోవక ఉనికి | |
| ఆశ్చర్యం | వెరగు | |
| ఈర్ష్య | ఈసు | |
| ఉద్ధతి | ఉబ్బు | |
| ఉపాయం | వెరవు | |
| దుఃఖం | అలమట | |
| ద్వేషం | పగ | |
| ధర్మం | పాడి, తగవు | |
| భయం | వెఱపు | |
| రాగం/ప్రేమ | ననుపు, వలపు | |
| సంకోచం | అఱ | |
| సంభ్రమం | కొందలపాటు, తొట్రుపాటు | |
| సౌలభ్యం | అనువు | |
| శౌర్యం | ఏడ్తెఱ |
4. శిల్పం, చిత్రలేఖనం
శిల్పి తన భావాలకు, భావనలకు ప్రతిరూపాలను రాతిలోనో, చెక్కలోనో, లోహంలోనో చెక్కడం శిల్పం. చిత్రకారుడు ఒక కేన్వాస్ గుడ్డ, పట్టా, కాయితం, గోడ మీద రంగులను మాధ్యమంగా కుంచెతో రూపకల్పన చెయ్యటం చిత్రలేఖనం. ఈ రెండు కళారూపాల్లోనూ, ద్రష్టభేదాన్ని దృష్టిభేదాన్ని బట్టి తేడాలుంటాయి. శిల్పాన్ని దగ్గరికి వెళ్ళి చూడాలి, చిత్రాన్ని దూరం నుంచి చూడాలి. లేకపోతే అవి అలికినట్టు ఉంటాయి. రెండూ ఒకరకంగా స్థావరకళారూపాలు (static art forms) అనే చెప్పాలి. వాటిల్లో ఉన్న చైతన్యం, జీవకళ, నిర్దిష్ట సన్నివేశానికి నిబద్ధమై ఏదో ఒక క్షణంలో నిలిచిపోయిన (freeze అయిన) స్థితిని సూచిస్తాయి. చలనచిత్రం ఫిల్ములో ఒక ఫ్రేముతో (frame) వీటిని పోల్చవచ్చు. కవిత్వంలో చేష్ట, చైతన్యం ఉంటాయి కాబట్టి శిల్పానికి చైతన్యం ఉంటే ఎలా ఉంటుందో తిక్కన కవిత్వాన్ని బట్టి ఊహించుకోవాలి. ‘ఉభయకావ్య ప్రౌఢిఁబాటించు శిల్పమునన్ బారగుఁడన్’ అంటాడు తన్ను గురించి తిక్కన. ఒక శిల్పఖండాన్ని చూసేకొద్ది శిల్పి కౌశల్యం అర్థమవుతుంది. అలానే ప్రతిపద్యాన్నీ ప్రతిపదాన్నీ మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు మనకు కొత్త అర్థాలు, కొత్త అందాలు కనిపిస్తాయి. వ్యర్థపదం ఏదీ కనిపించదు. తిక్కన రచనాశిల్పకౌశలాన్ని ప్రతిబింబించే కొన్ని ప్రక్రియలు, స్థానాలు: పలుకులపొందు, ఉపమాసౌష్ఠవం, నాటకీయశైలి, సార్థకసంబోధనలు, పాత్రల మనోవృత్తిచిత్రణ, మొదలైనవి. వీటిని ముందు ముందు వివరిస్తాను.