ఈమాట » రీ యూనియన్

Expand to right
Expand to left

రీ యూనియన్

అప్రయత్నంగా నో అతి ప్రయత్నం మీదో మళ్ళీ మనం కలుసుకుంటాం.
ఏటి మీదకు జారిన ఎర్రగన్నేరు పువ్వుల్లాంటి
అందమైన ఆ రోజుల్ని మళ్ళీ వడిసి పట్టుకోవాలని
కాలపు వడ్డు మీంచి జ్ఞాపకాల వలలని వృధాగా విసురుతాం
జీవన ప్రవాహంలో కొట్టుకుపోయిన స్నేహపు ఆనవాళ్ళు
కమిలిన పూరేకులై మన దోసిళ్లలో అక్కడక్కడ నీరసంగా మెరుస్తాయి .

ఇన్నేళ్ళ తర్వాత ఏనాడో సగం గుచ్చి వదిలేసిన
ముత్యాల దండల్ని తిరిగి కూర్చటానికి మనిద్దరం ప్రయాస పడతాం
అతకని అల్లికలు వెలిసిన వర్ణాల తో మన పెదవులపై పదాలు వెలాతెలాపోతాయి
ఆనాడు అర్ధంతరంగా ఆపేసిన గీతాలన్నీ ఇన్నాళ్ళ తర్వాత
ఆలపించటానికి మళ్ళీ ఉత్సాహంగా గొంతులు సవరిస్తాం
అద్భుతమైన రాగాల బదులు అపశ్రుతుల కీచురాళ్ళు మనల్ని అప్రతిభులని చేస్తాయి

ఒకప్పుడు ఆశలు,ఆశయాలు,కలలు,కన్నీళ్లు పంచుకుని
గాఢంగా పెనవేసుకున్న మన స్నేహలత ఇప్పుడు
గుర్తుపట్టలేని రెండు గుబురు పొదల మధ్య వడలి వ్రేలాడుతుంది
దాటలేని అగడ్తలా మన మధ్య విస్తరించిన కాలం
మన ప్రపంచాల్ని చెరో కొసనా నిర్దాక్షిణ్యంగా విసిరేస్తుంది.
ఇప్పటి మనలో అప్పటి మన ఛాయల్ని పరస్పరం వెతుక్కుంటూ
తెలియని అసంతృప్తిని అశాంతిగా మోసుకుని మనిద్దరం మౌనంగా సెలవు తీసుకుంటాం.

రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. రాజేష్ దేవభక్తుని అభిప్రాయం:

    July 5, 2011 4:59 am

    వైదేహి శశిధర్ గారు

    కవిత చాల బాగుంది. ముఖ్యంగా ఈ లైను నాకు బాగా నచ్చింది. ” ఇప్పటి మనలో అప్పటి మన ఛాయల్ని పరస్పరం వెతుక్కుంటూ
    తెలియని అసంతృప్తిని అశాంతిగా మోసుకుని మనిద్దరం మౌనంగా సెలవు తీసుకుంటాం. “

  2. lyla yerneni అభిప్రాయం:

    July 5, 2011 11:56 am

    పక్క బల్ల వద్దే వారిద్దరూ వచ్చి కూర్చున్నారు.
    ఆవిడ జర్మన్ ఉరవడి మాటలు
    అతడి ఇండియన్ అడపాదడపా మాటలు
    నే వెంటనే వాళ్ళని గుర్తించాను
    ఉంది మా జీవితాల్లో ఒక ఘట్టంలో
    కొద్దిపాటి ఓవర్లాప్
    ఉన్నాయి ఒక ట్రాన్సాక్షన్లో అందరం కలిసి సంతకాలు చేసిన కాగితాలు
    సో వాట్!
    నేనా సాయంత్రం నా చేతిలో పుస్తకం
    చదువుకుంటూ నిశ్శబ్దంగా పేజీల్లో ఎవరివో తెలియని జీవితాల్లోకి
    పయనించటమే సేఫ్ అనిపించింది
    గతించిన పదేళ్ళ నా జీవితం గురించి
    వాళ్ళు నన్ను క్రాస్ ఎక్సామిన్ చెయ్యటమూ
    నే ముద్దాయిలా దొంగ సమాధానాలివ్వటమూ
    నా పిల్లా పీచూ గురించి అక్కర్లేని డిపోసిషన్లూ
    గుర్తురాని వారి సంతానం గురించి ఇంక్వైరీ
    అందరి రోగాలూ రొష్టులూ మీద సింపథెటిక్ సమ్మరీ
    పనికట్టుకుని నేనిప్పుడు వాళ్ళను పలకరించకపోతేనేం
    బల్లకీ బల్లకీ మధ్య ఆర్టిఫిషియల్ పామ్ స్
    అంతమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వవూ
    ఫక్ ఇట్
    ఐ డోంట్ ఫీల్ లైక్ ఫేస్ బుక్
    హూ ఈస్ గోయింగ్ టు ప్రెషర్ మీ
    జూకర్‌బర్గ్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రెషర్ మీ
    సోషల్ నెట్ వర్క్ మై ఫుట్
    ఐదు నిమిషాల్లో నే స్థిమితపడ్డా
    ఐ ఆమ్ నో లాంగర్ వర్రీడ్
    ఐ గాట్ వెరీ కంఫర్టబుల్
    వైన్ టుక్ ఓవర్
    దేరీస్ నో ఏంబుష్ , నో రీహాష్,
    దేరీస్ నో గాడ్ డామ్ రీయూనియన్.

    లైలా

  3. yasasvi అభిప్రాయం:

    July 9, 2011 12:20 pm

    అమ్మా !! ఎర్నేనీ !! అసలే గురజాడ అప్పారావు గారి గిరీశం పుణ్యమా అని తెలుగు ఇంగ్లీషు కలిపిన పదాలతో తెలుగులో వాక్యమ్ స్థిరపడిపోయింది. మీరు మీ జోరులో చివరికి కవిత్వాన్ని సైతమ్ తెలుగులోనే మొదలుపెట్టినా ముగించే వేళకి పూర్తిగా ఇంగ్లీషులోకి మారిపోయేరు. ఇది అభిప్రాయమా? ఆవేశమా?? కవిత్వమా?? ఉభయభాషల సంపర్కమా??;) ఏదైనా వైదేహి ఊహించిన “రీయూనియన్ ” మాత్రం మీ సటైర్ కింద తునాతునకలైపోయింది. ఆ కవయిత్రి మృదుత్వాన్ని మీరు మీ భావమ్ తో చెల్లాచెదరు చెసేసేరే? పైగా భలే బాగా చేశారు. ఎంత బాగుందో? ఆ ఇంగ్లీషు కాకుండా మొత్తమే తెలుగులో రాయొద్దా?? మీరు మరీను.

    వైదేహి కవిత్వమ్ లో ఉపమించటం మరీ ఎక్కువైపోయింది. అద్భుతమైన రాగాలు అన్నాకా అపశృతులు చాలు కదా?? రాగం కి ప్రతిగా ‘అపశృతి” ఉండగా మళ్ళీ “కీచురాళ్ళు” ఎందుకూ అదనంగా ??కొత్తగా ఏమీ చెప్పని ఒక పదమ్ కవిత్వానికి గుదిబండలాంటిది మరి.
    అలాగే ఆ అపశృతే అప్రతిభుల్ని చేయడం కదా?? ప్రత్యేకంగా అప్రతిభుల్ని చేస్తాయి అని మళ్ళీ దాన్నేలౌడ్ గా వాచ్యం చేయడం అవసరమా? క్లుప్తత చాలా ముఖ్యమ్ కదా కవిత్వమ్ లో? వాక్యాలని అనవసరమైన అతి ఉపమానాల బరువుకి వదిలేస్తే చివరికి భావం చస్తుందే?? వైదేహి కి కొత్త పలుకు {డిక్షన్ } బహుశా అవసరం ఇంక.

    యశస్వి.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a