భావ గీతాలు, ప్రబంధ ధోరణులు
వేటూరి పాటల తొలిదశలో ప్రబంధ, భావ కవిత్వాల వాసనలు గుప్పున గుబాళిస్తాయి. “అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ” చిక్కటి భావకవిత. అలాగే “కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి” అన్నదీ. “కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి” మరో అచ్చమైన భావగీతం. “సామజవర గమనా” అన్న త్యాగరాజ కృతిలో “ఆమని కోయిల – ఇలా, నా జీవనవేణువు లూదగా” అంటూ భావ గీతికని చొప్పించేశాడు. తొలిదశలో వచ్చిన అనేక పాటల్లో ప్రబంధకవిత్వపు శ్లేషలూ యమకాలూ ప్రాసలూ శబ్దాలతో గిరికీలు సర్వసాధారణాలు. “ఆరాణి పాదాల పారాణి జిలుగులో / నీరాజ భోగాలు పాడనీ తెలుగులో” అన్నా, “నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో / రేపటి కోసం చీకటి రెప్పల తెర విప్పాలని” అంటున్నా, “కాళింది మడుగున కాళీయుని పడగల / ఆబాల గోపాల మా బాలగోపాలుని / అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ” అన్నా, శ్రద్ధంతా శబ్దాలంకారాల మీదే. చాలాకాలం తర్వాత వచ్చిన “అబ్బ నీ తియ్యని దెబ్బ” అన్న పాటలో కూడా “చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా / ముసిరిన కసికసి వయసులో ఒక ఎదనస పదనిస కలదుగా” లాటి మాటల పేర్పులు చాలానే కనిపిస్తాయి. “హంసలేఖ రాశా నీకంది వుంటది / ప్రేమలేఖ రాశా ఎద కందివుంటది” లాటి ప్రయోగాలూ ప్రాసల్నీ యతుల్నీ పాటించినవే. భావకవిత్వ ప్రభావానికి మరొక నిదర్శనం ఆయన పాటల్లో ఎన్నోసార్లు విశ్వనాథనీ ఆయన రచనల్నీ ప్రస్తావించటం. ఉదాహరణకి, ఆ మధ్య వచ్చిన గోదావరి సినిమాలో కూడ “గల్లుగల్లున సానికిన్నెర గౌతమింట గజ్జెకట్టెలే” అంటాడు. మొదల్లో ఐతే నండూరి ఎంకీ విశ్వనాథ కిన్నెరా ఆయన పాటల్లో చాలాసార్లే కనిపించివెళ్ళారు. ఇక ప్రబంధాల ప్రభావం దాదాపు అన్ని పాటల్లోనూ కనిపించేదే.
ముఖ్యంగా విజయవిలాసం లాంటి మలితరం ప్రబంధాల్నుంచి చిత్రకవిత్వాల రహస్యాలు గ్రహించాడు వేటూరి. వీటి ద్వారా అతనికి శబ్దం మీద మోజు, అధికారం వచ్చాయి.
వేటూరి రచనల్లో ప్రధానగుణం పదాలపేర్పు. ఒకదాని వెంట ఒకటి, దగ్గరదగ్గరగా వినిపించే పదాల్ని పేర్చుకుంటూ పోవటంలో అతను ఘటికుడు. కింద ఉదహరించిన అనేకమైన పాటల్లో ఈ గుణం పైకే కనిపిస్తుంది.
కొత్తరకమైన కవిత్వాన్ని రాస్తున్నామనుకున్న కవులు ఆ కవిత్వపు ప్రత్యేకతల గురించి కవిత్వం రాయటం తెలుగు సాహిత్యంలో మొదట్నుంచీ వస్తున్న ఆచారం. నన్నయ, నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, నాచన సోముడు, శ్రీనాథుడు, పెద్దన, పింగళి సూరన, రామరాజభూషణుడు, ఇరవైయవ శతాబ్దంలో భావకవులు, శ్రీశ్రీ, పఠాభి, తిలక్ , దిగంబరకవులు, స్త్రీవాదకవులు, దళితకవులు – ఇలా ఎన్నెన్నో రకాల వాళ్ళు ఈ ఆచారాన్ని పాటించారు. వేటూరికి తనేం చేస్తున్నాడో తనకు తెలుసుననటానికి ఇలాటి ఒక నిదర్శనం సిరిసిరిమువ్వ సినిమా కోసం రాసిన ఝుమ్మంది నాదం సయ్యంది పాదం అన్న పాటలో కనిపిస్తుంది –
ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవితలెద
సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా
ఇందులో తొలి మూడు పాదాలు తను రాయబోతున్న పాటల స్వరూపాన్ని నిర్వచిస్తున్నాయని చెప్పొచ్చు. అవి “చలిత లలిత పద కలిత కవితలు”. ఇక్కడ రెండు గుణాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి – ఒకటి లలితమైన పదాల వాడకం, రెండోది అలాటి పదాల్తో శబ్దవిన్యాసాలు చెయ్యటం. వేటూరి పాటలన్నిటిలోనూ ఈ రెండు గుణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.
లలిత పదాలు
తన పాటల్లో లలితపదాల్ని చాలా నియమంగా వాడాడు వేటూరి. పాట హృద్యంగా ఉండటానికి, తేలిగ్గా జీర్ణం కావటానికి లలితపదాలు పునాది అన్న విషయాన్ని గుర్తించి ఆచరించటం అతని విజయాలకి ప్రముఖ కారణం. మరీ అవసరమైతే తప్ప కఠిన పదాలు కాని అక్షరాలు కాని అతని పాటల్లో కనిపించవు. ఐతే ఈ నియమం వల్ల కలిగిన ఒక లోటు ఏమంటే భీకర పదాలు అవసరమైన సమయాల్లో కూడ వాటిమీద మనసు పెట్టలేకపోవటం. ఉదాహరణకు అదే సినిమా కోసం రాసిన రా దిగిరా అనే పాటను చూద్దాం. అందులో రెండో చరణం –
నటరాజా శతసహస్ర రవితేజా
నటగాయక వైతాళిక మునిజనభోజా
దీనావన భవ్యకళా దివ్యపదాంభోజ
చెరిసగమై రసజగమై చెలగిన నీ చెలి ప్రాణం
బలిపశువై యజ్ఞవాటి వెలిబూడిద ఐన క్షణము
సతీ వియోగము సహియించక దుర్మతియౌ దక్షుని మదమడంచగా
ఢఢమఢఢమ ఢమరుక ధ్వనుల
జమక జమక యమ గమక భయంకర
సకలలోక జర్జరిత భయంకర
వికటనటస్ఫుట విస్ఫులింగముల
విలయతాండవము సలిపిన నీవే
శిలవై ఐతే పగిలిపో శివుడే ఐతే రగిలిపో
దీన్లో చివరి ఏడు పాదాల్లోను ఏం రాయాలో తోచక గిలగిలలాడటం స్పష్టంగా కనిపిస్తుంది. రెండు పక్కపక్క పాదాల్లో “భయంకర” అనే పదం పదేపదే వాడటం, ఒక పాదంలో అర్థరహితమైన శబ్దాలేవో చెయ్యటం, ఒక పాదం అంతా ఢమఢమ తోనే సరిపుచ్చటం – బహుశ ఇంత నీరసమైన పాట వేటూరి మరొకటి రాయలేదేమో ! ఈ పాట అంతకుముందు కొన్నేళ్ళ క్రితం వచ్చిన చెల్లెలి కాపురం సినిమాలోని “చరణకింకిణులు ఘల్లుఘల్లుమన” అనే పాటకి మక్కికి మక్కి అనుసరణ. దాన్లో రెండో భాగం ఇది –
ఫాలనేత్రసంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా
పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతియై రోదించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా
ప్రమథనాథ కరపంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా
ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల
చలితదిక్తటుల చకితదిక్కరుల వికృతఘీంకృతుల
సహస్రఫణ సంజనిత ఫూత్కృతుల
ఇది అద్భుతమైంది కాకపోవచ్చు గాని పై వేటూరి పాట కన్నా ఎన్నో రెట్లు మెరుగు.