నాగలష్మేటో అంత పెద్ద షాపుల్లోన మొగమాటంగా ఒకవారకి ముడుసుకుపోయి ఇచ్చూకి, రాజేషకీ దానిపక్కన కూచోబెట్టుకోనున్నాది ‘ఈ దిక్కుమాల్ని పోష్టకాహారాలు గోబులూ ఎంత బేగొగ్గీసి రోబోకెలిపోతాన్ర సిర్డీ సాయీ?’ అన్నట్టుగ. దానికి మేడం సడనగా కొస్సిన్లేస్తే ఏటనాలో తెలిసిందికాదు గావాల. టకామన్నిలబడిపోయి చేతులు కట్టీసుకోని “అంటే వణ్ణంలోనైతె బంగాల్దుంపలమ్మ, మామూలుగ పొటాటా ఫ్రై గాని ఒక ఉల్లీ వెల్లుల్లి ముద్ద మసాలా కింద వొండెస్తామమ్మ! బ్రెడ్ సేండ్మిచ్ లోనకైతె పొటాటా సన్నంగ దవ్వలాగ తరిగీసి నూనలో వేపించీసి ఒక కెచప్ తోన, చికిన్నగిట్స్ ఇలాటోటతోన తినాలమ్మ!” అన్నాది. నీను ఎందుకేనా మంచిది, నన్నేటి కొసినీలేస్తాదో అనీసి ఇందాకే పుష్టకాహారం బొమ్మకి టికట్ట చూసొచ్చేను. ఏడువేలా రెండూతొబైతొమ్మిదాట! ఒకడు తిన్నదా, ఒకడు తాగిందా ముండామోపి పౌష్టకాహారఁవు? మేడం అక్కడికి ఆపుతాదనుకుంటె దర్మతల్లి గ్లోబులకాడే సర్వోదయా ఆష్ట్ల కట్టించీసింది మాకందరకీని. “ఏమర్రా చిల్డ్రన్ ? అన్నం సరే కానీ… ఊఁ? మీరు రోజూ తినే ఆహారంలో ఏదీ ఈ పదార్ధాల్లో ఇంకా ఏమేంఉన్నాయో ఎవరైనా చెప్తారఱ్ఱా?” అనీసెత్తుకున్నాది మల్లీని – హరికద! మేము పనమ్మా చిల్డ్రన్సఁవి ఏటేటి తింటామో మేడానికి తెల్దా? ఈవిడీ ఇంకిద్దరు మేడాలూ కెమేరాలేసుకోని మా ఇళ్ళకాడికొచ్చి పొటోల్తీస్కోనెల్నారు కారా వినాయకచవుతులపుడు ఆ పొటోవులెవలకిచ్చీనాది? విల్లాల గోడవతల మొదలుపెట్టించి వొడ్డోలవి, కలకత్తావోలవీ, మావీ పనోల సీనారేకుల కొంపలు, తడకల్లెట్రన, బెంగాలీవోల మందిర్ అన్నీని. మాకాడ గేష్టవ్వున్నాది. మాయమ్మ, కుమారోలమ్మ, నాగలష్మోలమ్మ దడికట్టుకోని మూడిల్లకీ ఒకసుట్టే బువ్వొండీసి మాకు వణ్ణాలకి పిలుత్తారు. ఆలకాడేటుంతాయి పౌష్టకాహారాములు? మాయమ్మాలెప్పుడేన ఈ చార్ట్రులు సూస్తేకదా? నాగలష్మీ ఇంకెవలికి తప్పినా నాకు తప్పిందికాదురా బహుఁవుంతుడానీసి “అంటె రోజువారి మామూలుగ చారు, ఇంక సారుగారు వాలింట్లొ ఏటైన మిగిల్న కూర్లేన తెచ్చుకోని, బువ్వొండుకోని తింటామ్మ్మ. బుదవారం గాని, శనోరం గాని ఏవైన చేపలో, నీసో గేటుకాడ బజార్లోన తెచ్చీసీ వొండుతామమ్మ…!” అన్నాది. మా సిన్నాన కూతురైతె అయ్యిందిగాని మా సిన్నానాల్తోటి నాకక్కడే వొస్తాది టకాఫోర్! ఆల మేడమోలింట్లో వంటంతా ఇదే చేస్తాది మల్లీని! ఏమి ‘మాయమ్మోలొండిన వొణ్ణాలే తింతాము మేడాలమ్మ!’ అనీసూరుకుంటే పోనేదా? మీఁవూ పోష్టకాహారాలు తింతామనీసి రూపించుతంది సత్యమంతురాలు. ఇలాటొల్తోటి అక్కడే కాల్తాది నాకు. ‘నువ్వూ ఏ మాయ చేషావె కానీ?’ అన్నట్టుగ సూస్సరికి కల్లు దించీసుకున్నాది నాయప్పచెల్లిలు!
“పాలో? మిల్క్ ఎన్ని పేకెట్లు?”
“పన్నెండు పేకట్లు మేడం!” అన్నాది కుమారీ పెద్ద దూడావులికి నాయురాల్నాగ! విల్లాలకొచ్చిన పాలపేకట్లకి సగఁవు అమిరికావోలే తాగెత్తారు. బ్రైను, జాఖరి, ఎమీ, సిల్వయా ఇలాగ ఆలకి ఏడుగురు పిల్లలు. కుమారీ పాలపేకట్లు బుట్టల్లోకి తీత్తంటే నీనెల్లి ‘ఆవుల్లతల్లిరో అతిసక్కనాంగి! పెయ్యల్లతల్లిరో ప్రెధమ సుందారి!’ అనీసి మా తాతముసిలి పాడ్న పాటలు పాడతాను ఇగటాలకి. ఇదెన్ని పాలపేకట్లు తాగుతాదో నాకాడా బితిరీలు? ‘బ్రైనోలక్కాదు పిల్లా మీ ఇంట్లోనకి ఎన్ని పేకట్లు?’ అని గసిరీసేను. “మాకా…? మాకు అరపేకట్ట తీస్తాది మాయమ్మ. మజ్జిగలకి!” అనీసి లైన్లోకొచ్చీసింది రాయపూరు పేసింజర! ఆపగాడు బేకుడూ ‘పాల పేకట్లు సారగారోలకి, మనకెందుకు? మనకి టూటీఫ్రూటి ఉంటే సాల్దో?’ అన్నట్టుగ నోలెక్కబెట్టుక్కూకున్నారు. ‘ఇంకెంచేపురా పరమాత్ముడా ఈ ఆహారాములు?’ అనుకొన్నీను పల్లకైపోతుండగ ఏనుక్కి రచ్చించిన ఇష్నుమూర్తినాగ మహిందరొచ్చీసి మేడానికి మిస్సుడు కాలిచ్చేడు. మేడం “ఏంటి మహిందర్? ఓహో అరే?! సర్లే… ఇట్సోకె! మేము ఎయిత్ ఫ్లోర్లో సారూ నేనూ ఒస్తాం కదా ష్వార్జ్, అక్కడున్నాము. నువ్విక్కడికొచ్చేసెసెయ్!” అనీసి మాకాస్తిరిగి ఏదో అనబోతుంటె బేకునాకొడుకు “ఓలమ్మ ఎంతనావు పెన్నో? బంగార పెన్నురా కొండబాబు… మేడం బంగార పెన్ను!” అనీసి మేడానికి సేతుల్లాగీసి అల్లడతల్లడ పడిపోతనాడు. రోబోకడ్డమొచ్చినందుకు అడికి మేడం చూడకుండ టెంకిజెల్లలు పీకీవోణ్ణేగాని ఆడు పాముల కొండ మీద వొడ్డోల పిల్లల్చేతిలోన తాపులుకాసి కళ్ళుతిరిగి పడిపోనకాణ్ణించి ఆడికి ఎవరూ ఏటనకుండా చూసిన పూచీ ఆలయ్య నాకే వొప్పగించేడు! ఒకూరోలం ఒక్కులపోలమనీసి ఒగ్గీసేన్నాకొడుకుని! ఆపనాకొడుకు దర్మఁవాన పోష్టకాహారాలకాణ్ణించి పెన్నులకాడికైతే ఒచ్చీసేము కాఁవా.
పెన్నులేటవి పెన్నులుకావు. కత్తుల్లాగున్నాయి, బంగారచ్చరాల పెట్టిల్లోన కూకోని వొక్కోటి కట్లతుట్టంతీసి లావున. వల్లీమేడాం అడక్కుంటా ముందే టికట్ట చూసేనుగాని అది ఎనిమిదివేలా తొమ్మిదివొందలవునో కాదొ నా మేక్స్ మీద నాకే డవుటొచ్చీసింది. నాగలష్మి పక్కకెల్లి దానికి టికట్టు చూడమనీసంటె అదొచ్చి అప్పటిదాక మంటిబొక్కడంనాగ కూకోనున్నది పాదాలమ్మలాగ నిలబడిపోయి “అచ్చి ఎనిమిదివేలు కాదు. ఎనపైవేలా తొమ్మిదివందల తొంబయ్య! పదులస్తానము నందు ఎన్ని సున్నాలున్నాయొ చూసేవా…?” అనీసి నా ఇజ్జత్ తీస్సింది మాయప్పచెల్లెల. అద్దాల బాక్సులవతల నీలం సూటేసుకొని నిలబడ్డావోడీతోటి మేడాం ఏదో ఇంగ్లీష్ లోనన్నాది ఆ పెన్నులు సూపించి. ఆడూ మేడం ఏదో పెన్నులన్నిటికీ చూపించుకోని ఇంగ్లీష్లోన నవ్వీసుకుంతనారు. నీను మేడం యెనకాల్నుండి కుమారీకి మండమీద గిల్లి ఆలేటనుకుంట్నారో చెప్మనీసి సైగలు చేస్తంటే అది ‘ఉష్! ఉష్!’ అనీసి గసిరీసింది. అవి స్పెషల పెన్నులంట! జర్మనీ నుండి రప్పించుతారంట. అమిరికా అద్జచ్చుడు అలాటోలు సంతకాలు పెడ్డాలకీ ఈ పెన్నులే బెత్తాయింతారంట. మేడం ఇలాగ పెన్నుల నెక్చిరీలకి దిగిపోతంటె మహిందర మేడానికెతుక్కోని నోపటకొచ్చీసేడు – టికట్లన్నీ అయిపోనావంట, పండగెల్లిన పాసినాడు ముక్క తెచ్చీనాడు గూబెదవ! గబగబా అడావిడిగా షాపులోన సందులు సందులెల్లి మేడం పరిగెట్నట్టుగు నడుస్తుంటె ఆవిడెనకాల మహిందర, ఆడెనకాల్నీనూ, నాయెనకాల కుమారి, నాగలష్మి గుంట్నాకొళ్ళందరు లైనుగా ఎలబారిపోతుంటె అద్దిర దద్దా! అవా!! అక్కడున్నాయి దీనెమ్మా పంచెవొన్నెల పౌష్టకాహారాములు!! కూర్లబజార, పాల బజార, దేశదేశాలివి పళ్ళు, పిక్కలు, నూనలు, బిస్కట్లు, రస్కులు, చాకనేట్లు, ఉప్పులు, పప్పులు, దాన్యాలు, ఐసులు, సేపలు, మాంసాలు, భచ్యాలు ఆ చార్ట్రు నాకొడుకు బొమ్మల్లోన పౌష్టకాహారాఁవులన్నీ ఇవా ఇక్కడే వున్నాయి!
ఆయాహారాలు సూస్కోనీ సూపునేనట్టిగె టపటప్మనుకోని మెట్లు దిగిపోనాది మేడం!! మాకందరికి దిగనిచ్చీదాక ఎండలోన మొకానికి చెయ్యడ్డం పెట్టుకోని. బండీవోడికాడ ఒక్కోలకి ఒకొక్కటి పాలైసులు తీయింతూనె ‘త్వరగా రావాలి మహిందర్!’ అని కేకలేస్సింది. గుంట్నాకొల్లందరు అవి తినీసి రొబోలకెల్తామనుకుంట్నారు గావాలని, ఐస్క్రీములన్ని కారు బైటే తిని, చేతులు మూతులు కాయితాల్తోటి తుడుసుకున్నాక సెప్పీనాది సావుకబురు చల్లగాన. ‘టిక్కట్లైపోయ్యంటఱ్ఱా పిల్లలూ! ఇంకెప్పుడైనా చూడొచ్చులే రోబో, సరేనా?’ అనీసి. “శ్రీనివాసాలో ఉంటాయి మేడం డెఫినీటుగుంటాయి…” అన్నీనంటె కుమారీ ఇరగబడిపోయింది నామీద “మీ సారాలింట్లో పని ఎవలకిచ్చెస్తావు పిల్డా? అయిదున్నరకల్ల రమ్మనీసన్నారు…” అని. సెడపడానికి సేటపెయ్య! గౌలిదొడ్డి కాడికొచ్చీవరుకూ కిక్కురుకక్కురు మనకుంటా కూకున్నారు పన్నాకొళ్ళందరూ మహిందరగాణ్ణాగే. టికట్లైపోతే పాపము మేడాలేటి చేస్తాది?
సెడ్డుముందర్నిలబెట్టి పొద్దుట తెచ్చిన బిస్కట్లు, టూటీఫ్రూటి ఒక్కోలకొకొక్కటి ఇచ్చీసి నిలబడ్దాది మేడం, ఏ సిచ్చేస్తారో ఏసీయండఱ్ఱా యన్నట్టుగ – వోచీలకి సూస్కోనీ, మాదుక్కు సూస్కోనీ పాపఁవు! రోబో ఎలాగా నేదు. సారాలింటికాడ ఐదున్నరకల్ల ఉండకపోతే అమోగ్ బాబాల్చేత తిట్లు కాయాల. మేడం ఇంటికెలిపోబోయీముందు చిన్నదేనా లెక్చిరింగిచ్చీసిగాని వెల్లదు. మీఁవు సెడ్డు బయటరుగుమీద కూకోని పుల్లల్తోటి ఫ్రూటీలు పీల్చుకుంటంటే ఆవిడి సోనియాగాందీలాగ చేతులు కట్టీసుకోని “ఏంటఱ్ఱా సౌండ్లేదు? మూవీకి ఇంకోసారెల్దాంగా, సరేనా?! సీయెమ్మార్ బాగున్నాదా?? జేవో ష్వార్జ్ గురించి ఏంటనుకుంట్నారో చెప్తారా ఎవరేనా?” అనీసి గెద్దలాగ సూదికళ్ళేసుకోని నాదుక్కు, నాగలష్మి దుక్కు, కుమారీ దుక్కే సూస్తంది మేడాలు. ఆవిడికి ఏది ముట్టితే అదే నెక్చర! “అలాంటి మాల్ ఇదివరకెప్పుడైనా చూసేరా మీరెవరైనా? చేతులెత్తండీ ఎవరు చూసేరో?”
ఫ్రూటీలు పీల్చుకుంట్నాము ఒక్కలం చెయ్యెత్తకుండాని. “చూసేరా మరి? ఈ రోజు అక్కడ ఏం నేర్చుకున్నారు? ప్రతివొక్కరు ఏదైనా ఒక్కొత్త విషయం! ఏచ్చెప్పండి…?! ఎనీథింగ్?”
నాగలష్మి ఫ్రూటీ సగంలోనే పక్కనెట్టీసి దులుపుకోని, చేతులుకట్టీసుకుని నిలబడిపోయింది, విద్యార్ద! ఇదింకా బూర్జ ఐస్కూలనీసి ఈవిడొక యెడ్మేష్ట్రనీసి ఇస్తిరాకులోని ఈనగర్రలాగ నిటారుగ నిలబడిపోయి “అంటె మనకు పుస్తకములు, పెన్నులు, సూష్మదర్శిని, బూగోళము, జ్వెల్లరీలు, బట్టలు, పౌష్టికాహారము ఇలాంటివన్ని ఒక్కసోట అముర్చుకొనుటకు… స్వార్జి…” అనీసి సిగ్గుపడిపోయి కిసకిసమని సణిగీసింది. బేకుడు డబల ఫ్రూటీ ఏస్కుంటు “అన్నింటికంట గ్లోబు, మైక్రాష్కోపు బాగున్నాయండి మేడంగారండి!” అన్నాడు ఆడొంతు ఏదోకటి బిగరకపోతే మరేదా మప్పితమా అనీసి. కుమారీ ఇంకెల్లడానికన్నట్టుగ లెగిసిపోయి “మేడంగారమ్మ! మా ఇంట్లోవోలందరిది యేడాది జీతము ఆ ఒక్క పెన్నుకే ఒస్తాది మేడం?!” అన్నాది ఇప్పటికీ నమ్మలేనట్టుగ. “ఊఁ ఇంకా…?” అన్నాది మేడం, ‘ఇంకా పైకొసాకి ఆన్సర చెప్పినోలకేనమ్మా డబల వెరీగుడ్’ అన్నట్టుగ మొకం పెట్టుకోని. క్లబ్బౌసు ముందర ఇసకా బుగ్గీ ఆకులు దుమ్ములెగుస్తన్నాయి గాలికి. కూలోలు గబగబా చిమింటు కట్టలు స్లాపులకిందకి లాక్కుంతనారు. చెయ్యిమీద టపామనీసి వొర్షం చినుకు పడ్డా దులిపీసుకున్నాది మేడం.
“అవును కుమారీ! గుడ్ పోయింట్! అక్కడ ఒక పెన్ను మీదో, నెక్లెస్ మీదో స్పెండ్ చేసేది…. ఊఁ… దెన్…?”
కుమారీ వానొచ్చీదుక్కు మబ్బుకి చూసి గమ్ముగైపోయి ఏటీ మాటాడకుంటానే బ్రైనోలింటికెలిపోతందిగాని దాని మొఖం అలాగ మబ్బుగైపోటము నీను ఈనాటికి సూపునేదు. గుంట్నాకొళ్ళు మేడం అన్నదానికి ఏటనాలో తెలీనట్టుగ ఖాళీ ఫ్రూటీడొక్కుల్లోవే చివార బొట్లు పుల్లలు పీల్చుకుంతనారు. స్వార్జింగులకెల్లి నీనేటి ఎత్తిరాసుకొచ్చీనాను కొత్త పోయింట? నీను సెవంతలున్నప్పుడు పెన్ను కొనమని ఏడిసినందుకు మా తాత నాకు సింతరువ్వతోటి బూర్జవరుకు ఎంటబెట్టి బాదీనాడు ముసిలోడు. ఈ సారగార్లెవరు? ఈ మేడాలెవరు? ఈ బ్రైనోలెవరు అమిరికానుండి ఇక్కడ విల్లాలకొచ్చి పౌష్టికాహారఁవు కుమారీ చేత నాగలష్మిం చేత వొండించుకోని తింతనారు? ఈ సారాల డబల కటింగులేటనీసి ఆలకి తొంబైవేలెట్టి పెన్ను కొంటాలకి జీతాలిస్తన్నారు పెద్దసారగారు? నాగలస్షిం టెంత పేసైపోతె ఆ పెద్దసారగారోలకాడికి ఎలిపోవస్తాదా జీతగత్తికింద?
మేడమాల ఇన్నోవ గేట్లోకెలిపోతంది బుగ్గిరేపుకోని. ఇచ్చుగాడు రాజేష రాటకర్రలెట్టి యుద్ధాలకి దిగిపోయేరు కికారపునాకొళ్ళు. ఆపగాడు బేకునాకొడుకు క్లబ్బౌసు కాడ ఇసక్కుప్పలెక్కిపొయి ఇసక జల్లీసుకుంతనారు. కుమారీ వోలమ్మ బ్రైనుబాబు స్ట్రాలర బండీ తెచ్చీసి డూటి ఎక్కమనీసి నిలబడ్డాది. మా సారాల డ్రైవరొత్తనాడు నాకు ఇస్తిరీలకి బట్టల్సంచీలివ్వడాలకి. నాగలష్మీ పుస్తకఁవు, పెన్ను తీసుకోని గట్టిగా సిరీష చెయ్యొట్టీసుకోని ఆల మేడం వాలింటికెల్తంది. కుమారీ దుక్కు కటికి పుల్లలు, బెందముక్కలు ఇసుర్తుంటే నామీదికి జట్టీలకొస్తాదనుకున్నాను ఎనక్కి సూణ్ణన్న సూళ్ళేదు. మేడం కారు టర్నింగయిపోతుంటే నీను కుమారీ నాగలష్మాలెనకాల మేడమ్మ లాగే గొంతుకెట్టుకోని “ఏదైనా వొక వేడి వొస్తువూ… బాస్పీబవనమూ…!” అనీసెక్కిరింస్తంటె నాకూతుళ్ళు ఒక్కద్దాయీ నాదుక్కు సూసిందికాదు, నవ్విందికాదు.
(Inspiration: Toni Cade Bambara The Lesson)