ఏదైనా ఒక వేడి వస్తువు

మేడమాల కారు ఇన్నోవ! ఇన్నోవాకి టాటా సూమోకి టకాఫోర్లాగుంటాది! మేడాం ఫ్రంట్ సీట్లో కూసోని సెల్లో ఎవలకో అవతలోడికి కొసినీలేస్తంది – “మీరు సైటు దగ్గరకొచ్చేసేసెయ్యండి. నేనూ ప్రవీన్ డైరెక్ట్‌గా వచ్చేసేస్తాం. ఓకేనా?” అనీసి. సిరీషా, కుమారీ, నాగలష్మీ మజ్జిసీట్లోన కూకోని ఇచ్చుగాడికి ఒళ్ళో కూకోబెట్టుకున్నారు. నీనూ, ఆపగాడు, బేకుడు, రాజేష ఎనకాల కూకోని కొత్తసీట్లు వోసన్లు చూస్తనాము. ‘రోబోకెల్తనాఁవు … రోబో, రోబో!’ అనీసి ఆలమ్మాలకి కేకలెస్తంది సిరీషా. మహిందర సిరీషాకి డోరు కరక్టగా యెయ్యలేదనీసి తిడతన్నాడు. ఆడు తోవకడాకీ ఆ ఒక్కమాట తప్ప ఇంకెవల్తోటీ ఏటీ అన్లేదు. మేడం ఆడికి మాటాడించబోతే “అట్లేంలా… మాది నల్గొండా మెడేం!” అనీసి ఆడిమానాడు డ్రైవింగులోన కామాప్ అయిపోయేడు. ఆపగాడు బేకుడూ ఏసీ బొక్కల్లోపట మొహాలెట్టీసి ‘ఉహ్ హ్వా! ఉహ్ హ్వా!!’ అనీసి సల్లగా సూయింగం వోసన ముక్కులెగబీల్సుకుంతనారు. నాగలస్మోలు ఏసీ చల్లగ మొకాలక్కొడతంటె పళ్ళికిలించుకోని రోడ్డుమీద కార్లకి లారీలకి ఎప్పుడూ చూణ్ణట్టుగ చూస్తనారు. సీయెమ్మార్ ఎప్పుడొస్తాదానీసి మీఁవు కాసుక్కూకోనుంటే మేడం ‘ఉఁఘం..’ అని గొంతు సవిరించిసుకోని “ఏది నాగలక్ష్మీ? కిందటి క్లాస్‌లో లెసన్ ఏంటి చెప్పుకున్నాం చెప్పూ…?” అన్నాది. నాగలష్మీ రుమాల మూతికడ్డం పెట్టీసుకోని సిగ్గుపడిపోయి “ఏదైనా ఒక యేడి విస్తువమ్మ!” అనీసింది ఉడతనాగ.

“యేడివొస్తువేంటే..? ఏదైనా ఒక వేడి వస్తువు… ఊఁ చెప్పూ? చదివేవా అసలు?”

నాగలష్మీకి మఱడాం ఐస్కూల్లోన టెంతక్లాసు సైన్సొక్కటే ఏడు మార్కుల్లోన పోయింది. సైన్సు కనక కట్టీసి పేసైపోయిందంటే జీవితములో గొప్పదాయివైపోతాదనీసి మేడం దానికి ఎలాగైనాసరే టెంతక్లాస పేస్ చేయించుతాననీసి డీచ్‌చాలంజీ కింద తీస్సుకున్నాది.

“అదేనమ్మ! యేడి వొస్తువమ్మ… ఏదైన ఒక యేడి వొస్తువును… వేడి వొస్తువును…”

“ఊఁ వేడి వొస్తువును..?”

“ఒక డిగ్రీ వేడిగాని చలువగాని పరచినప్పుడమ్మ… దానికి ఉష్టం…” అనీసి అది మెక్కుతుంటె నీను రోబ్బోనాగ గొంతుకు పెట్టుకోని ‘యేడికి సలవా సలవకి వేడీ’ అంటె మేడం నాకు గుడ్లెర్రగా చూస్సి నా నోరుమూయించీసి, దంతోటి మాత్రం కూలింగాన “ఉష్టం కాదు. ఉష్ణోగ్రత!” అన్నాది. ఆ ముక్కందుకోని మా సరస్పతీదేవి “ఆ ఉష్ణోగ్రతకే బాస్పీబవన గుప్తోష్ణమూ అంటారమ్మ!” అనీసింది ‘అమ్మయ్య ఒడ్డెక్కిపోనాన్రా మందపిల్లి శనీసురుడా!’ అనీసి పంజాబిడ్రస్స తోని మొకం తుడిస్సుకుని. మేడం ఓవరబిర్జీకాడ టర్నింగు తిరుగుతంటె తనలోన తనే అనుకుంటనట్టుగ ‘చూసేవా చదివితే ఒస్తుందీ!’ అన్నాది మెడకాయలు యెనక్కి తిప్పీసి. నాగలష్మి ఆవిడిమీద జాలితల్చినట్టుగ “సదువుతున్నానమ్మ! అంటెమ్మ… మా మేడం వాల్ల చెల్లిగారాలు అమిరికానుండొచ్చేరుగదమ్మ? వాల్ల బాబుకి ఆడించడాలు… ఇంకా బట్లవ్వన్ని ఉన్నాయనిస్సి…”అని నసుగుతుండీసరికె దేవుడి దర్మఁవ్వాన్ని రోబో వాల్ పోష్టర్లు జిగజిగమనుకోని సీయెమ్మారొచ్చీసింది. సిర్డీసాయున్నాడు! బాబా అన్నీ సైలంటగె ఆలకింతాడు!

మేడం మహిందరకి పార్కింగులకెలిపోమని చెప్పీసి టిక్కట్లకి డబ్బులిచ్చీసింది. మాకు రొబోలోన కూల్ డ్రింకుల కాడికి తీస్కెల్తాదనుకుంటే సీయెమ్మార మెట్లన్నీ యెక్కించి కరంట దువ్వారం లోనకి ఒక్కోల్ని దాటించీసి, అద్దాల లిఫ్టునోనకి అందరికీ సద్దీసింది. మేము ఏడుగురిఁవి, మేడంగారు లిఫ్ట్‌లోన సద్దుకుంటె సెక్రూరిటీవోడు తలుపడ్డం పట్టుకోని సూస్తనాడు. ఒక సారగారు మేడంగారు హిందీవోలు, ఆల్లోపటకొస్తారేటో అనీసి. ఆ మేడానికి మా వాలకాలు చూసి నోపట చోటున్నాని రాకుంట సైడుకెలిపోయేరు. లిఫ్ట్‌లోన సెక్రూరిటీ అంకులు మాదుక్కు అనుమానంగా సూస్తనాడుగాని మేడం ఉన్నాదికాబట్టి కిక్కురు కక్కురుమనకుంట ఎన్నో లెంబరనీసి మేడానికడిగేడు. మేడాం ఆడికేటీ జవాబు చెప్పకుంట రెండు నొక్కీసింది. అద్దాల గేలాం నూతులెల్లి తాబేల్లకి పైకినాగుతున్నట్టుగ లిఫ్టు మీదకి లెగిసిపోతంటె ఆపగాడు బేకుడు సిరీషా ఇచ్చుగాడు రాజేస పన్నాకొళ్ళందరు నోలెల్లబెట్టుకోని కిందకి సూస్తనారు. ఒక్కొక్కంతస్తు మీదకెల్తంటె కిందన సారగార్లు మేడాలు ఆల పిల్లలందరు బట్టలు, బొమ్మలు, సామాన్ల బేగీలట్టుకోని మజ్జినోన రంగురంగుల నీల వాటరు లైటుసెట్టింగులెల్లి ఎగజిమ్ముతుంటేని. ఇచ్చుగాడు, రాజేష మొకాలు సేతులు అద్దాలకి నొక్కీసుకోని “ఓలమ్మ వోటర సెట్టింగులఱ్ఱా? వోల..?!” అనీసి ఐరాన పడిపోతుంటె మేడాం లిఫ్టుబైటికొచ్చీసి ఆలకి బయిటికి నాగీసి, దువ్వారం వోపెన్ పట్టుకున్నాది మీమందరఁవు దిగినివరుకు. ఇంకిలాగ దిగేమో లేదొ మల్లీ సుట్టుతిరిగిపోయి మిషనీ మెట్లమీదకి నడమన్నాది. నల్లట మిషనీ మెట్లమీద అక్కడున్నోలందరు సారగారు మేడాల్లాటోలే చేతుల్నిండ చంకల్లోన బేగీలు బేగీలేసుకోని కిందకీ మీదకీ దిగిపోతన్నారు. కుమారీ సిరీషా చెయ్యొగ్గీకుంట గెట్టిగా పట్టుకోని నాగలష్మీ చెవ్వులోన ‘ఇవి మిషినీ స్టెప్సండివే! మనం నిలబడుంటె ఆటంతటవ్వె మీదికెలిపోతాయి. మన్మదుడూలో సూళ్ళేదా నాగార్జునా సోనాలీ బింద్రే బ్రమ్మానందం…?’ అంటంది.

ఉన్నోలందరూసెందుకు, అంత పెద్ద బిల్డింగు అన్నీసి మడత కటింగులు, అన్ని సోయింగులున్నది నాజన్మలోన్నీనే సూల్లేదు! మీదకి మెట్లెలిపోతుంటే కిందకి గాజులు గాజుల కప్పులికి స్టీలు గోడలకి ముచ్చి రిబ్బన్లు రంగురిబ్బన్లు బుంగలు కట్టించీసి. మిసనమెట్ల మీదన పడిపోయి సచ్చిపోతాననీసి ఇచ్చునాకొడుకు రాజేషగాడు బయపడి ఏడుప్మొకాలెట్టీసుకుంటె మేడం వోల్చెయ్యి గెట్టిగా పట్టీసుకోని ‘పరవాలేదఱ్ఱా! నేనున్నాను కదా! ఇట్సా వోకె..’ అంటందో లేదో దుబ్మని గచ్చుమీదకి దింపీసింది మిషనమెట్లు. అక్కడ బిల్డింగంతా కలిపీసి ఒకటే మెటీర, ఏకసైజునోన ఇంద్రబవనంలాగ ఒకటే పేద్ద షాపున్నాది. దన్లోన తల్లితోడు- పన్నాకొడుకులు సెక్రూరిటీ నాకొళ్ళే ఒకెయ్యిమందైనా ఉంతారు! కుమారీ ఆ వైబోగంచూసి నిబ్బరించుకోనేక “అబ్బ! అచ్చఁవు అమిరికానాగున్నాది మెడేం!” అనీసి మాయందరికీ అక్కడే ఒగ్గీసి నోపటకెలిపోబోయింది. సెక్రూరిటీవోడు ‘ఎక్కడికొచ్చెత్తావె?’ అన్నట్టుగా హిందీలోన సూస్తనాడు కాబట్టి తగ్గిందిగాని. మేడంగారు దాని జబ్బొట్టుకోని ఆపీసి నాగలషానికి పిల్సి ఆ దువ్వారం మీద పెద్ద పెద్ద అచ్చరాలు ఏటున్నాయో చదవమన్నాది. అది ఒక్కొక్కచ్చరం కడుపులోనా జిగజిగేల్మనీసి పదేసి చూపులైట్లెనా ఉంటాయి. అయినాసరే నాగలష్మి చీకట్లోన తడుంకుంటనట్టుగ గాబరగాబరగా ఒక్కొక్కచ్చరం తడుఁవుకున్నాది – J – O – S – C – H – W – A – R – T – Z అనీసి. “యెస్ ! జేవో ష్వార్జ్ . ఆంటే ఏంటో తెల్సునా?” అనడిగీ మల్లీ ఆవిడే “ఇదొక పెద్ద షాపింగ్ సిటీయఱ్ఱా! అదుగో చూసేర? బట్టలు, బొమ్మలు, గ్రోసరీస్, పళ్ళు కూరలు … ఇక్కడ దొరకని వస్తువు లేదూ!” అంటంటె ఆపనాకొడుకు “సిప్సులు, టూటిఫ్రూటిలు, వోటర గన్స, సైకిల్లు, షూషులు, గిఫ్స్ …” అనీసి ఆడి కడుపులోనున్నవన్నీ వల్లించుతున్నాడు. “గిఫ్స్ కాదరా గిఫ్ట్స్. అంటే భర్తడేకి బాక్సుల్లోన కట్టిసి ఇస్తారు కదమ్మ ఒక టోయస్ గాని, ఒక బుక్స్, జ్వెల్లరీ, క్రాకరీ, నావల్టీస్ వెరైటీ ఐటంస్” అనీసి బ్రైను, జాఖరీ వోలకాడ విన్న బితిరీలన్నీ వల్లించెస్తంది కుమారి. దానికి రెండు కళ్ళు సాంటంనేదు, లోపటకెల్దుఁవంటే సెక్రూరిటీనాకొడుకు గేటుకడ్దాలొచ్చెత్తనాడు గాని. మేడం ఆల్తోటి ‘యే బచ్చెఁ హమార బచ్చేఁ వోతాహై…’ అనీసి ఆతలకంటే పెద్దిందీలోన గసిరెస్తే ఆడు “ఠీక్ హై మేడేం! అచ్చీ బాత్ హై!” అనీసి మాకు నోపటికొగ్గీసేడు. హిందీవోలకాడెప్పుడు ఆలకంటే పెద్దిందీ పేల్తే సాన; నోపటకొగ్గెత్తారు! స్వార్జింగేటి ఆల బాబుగార సొమ్మ? ఆడమ్మా మొగుళ్ళాగ ఆడికి ముందు నీను, నా యెనకాల కుమారి, దానెనకాల పన్నాకొళ్ళందరు – ఇచ్చుగాడు, రాజేష మేడం చేతులు పట్టుకోని స్వార్జింగు నోపటకొచ్చీసేఁవు. ముందు లోపటకెల్లగానే ఆడోల జ్వెల్లరీలున్నాయి బంగార కొట్లన్నీటికి ఇక్కడే బుకింగునాగ. దన్నోన బంగారాల ముందు మావూరు సావుకారమ్మల బంగారాలు కొబ్బరమిటాయికి రావు. అక్కడ కుర్చీల్లోన కూకోని మేడాలు చెవులికీ మెళ్ళకీ రవ్వ దుద్దులు, నక్లీసులు బెత్తాయించుకుంతనారు. కుమారీకి అక్కడ్నించి ఊడ్రాడానికి ఇంకేడు జల్మలైన కావాల గాని, ఆపనాకొడుకు పల్లికిలించుకోనొచ్చి రహస్యంగ ‘ఓర్రా! రండర్ర సూడండా’ నీసి వేల్తో సూపిస్తనాడు. గాజులద్దాల డిపారమింటు ఏక మొత్తాన గాజుల్దే ఉన్నాది. దన్నిండ ఆడోలవీ మొగోలవీ గోసీలొక్కటే వున్నాయి. అంత పెద్ద డిపారమెంట్నోన గోసీలే ఏక మెటేర! సారగార్లు మేడాలు గోసీలు ఎలాగ తొడుక్కోవాలో అమిరికావోల బొమ్మలకి గోచీలు, బాడీలు తొడిగీసిన బొమ్మలున్నాయి. నాగలష్మీ అటుదుక్కు చూసి తల్తిప్పీసుకుని ‘చీ బేకార్నాకొడకా!’ అన్నటుగ ఆపగాడికి మొట్టికాయేసీసి ఇటీపు లాగీసింది.

మేడం జ్వెల్లరీలు, బట్టలు, బొమ్మలు అవన్నీ ఒగ్గీసి గ్లోబులు, మేపులు, పుస్తకాలకాడికెల్తనాది. స్వొర్గానికెల్లినా సవితిపోరు తప్పనేదు! రోబోకాడ చార్ట్రులూ గ్లోబులుంతాయంటె సిటీకి లెగదీసేవోలమా అసల? అక్కడ అంకిత్ బాబు, అమోఘ్ బాబు అంతీసి పిల్లలు ఇద్దరున్నారు. ఆల మమ్మీగారు, డాడీగారు ఆలకి ఒళ్ళో కూకోబెట్టుకోని గ్లోబులు తిప్పించీసి, గొట్టం మిషన్లోకి సూడమంతనారు. ఆలు కుటుంబరమంతా మమ్మల్ని చూసి గాబరా పడి లెగిసిపోబోయి, మేడానికి చూసి నిబ్బరించుకోని అటుదుక్కు తిరిగిపోయేరు. బేకుడు కాలు మెక్కుకోని దన్సుట్టు ప్రదచ్చనాలు సేస్కోని “అబ్బ! ఆ మిషన్లెల్లి ఆకాసంలోకి చూస్తె చుక్కలన్ని క్లీ…రుగుంటాయా? క్లీ…రుక్కనిపింస్తాయ..?” అంటంటె ఆపగాడు, కుమారీ, సిరిషా, రాజేష గుంట్నాకొళ్ళందరు గొట్టం మిషన చుట్టు నిలబడిపోయేరు. గ్లోబులమ్మీ ఆడదాయీ, సెక్రూరిటీ వోడూ ఎవరూ ఏటీ ముట్టీసుకోకుండ అక్కడెనకాలే వొచ్చి నిలబడిపోయేరు, నవ్వుమొఖాలెట్టిసుకోని. వల్లీ మేడం ఆ మిషన గొట్టం నిమానుగా కిందికీ మీదికీ కిందికీ మీదికీ ఆడించి “చుక్కల్లోకి కాదఱ్ఱా! అది వేరు! ఇది మైక్రోస్కోప్! దీన్లోకి చూస్తే …. ఒక బొట్టు రక్తంలో, ఒక బొట్టు నీళ్ళలో కొన్ని వేల కోట్ల సూక్ష్మక్రిములుంటాయనుకున్నామా? అవన్నీ చీమలంతేసి చూడొచ్చఱ్ఱా!” అనీసి లెక్చరెత్తీసుకున్నాది మేడమ! “డాక్ట్రాఫీసులా ఎనకాలుంట్టాది కదండి మేడం?” అన్నాడు బేకుడు. ఆడికి తెల్లార్లెగిస్తే ఎదో ఒకుష్టఁవో రోగఁవో ఉంటాది కాబట్టి పనోలందరికి డాక్ట్రకింద ఫీలింగైపోయి. వల్లీమేడం మైక్రాష్కాప్‌లోన ఒంటికన్ను బిగించీసి చూస్కోనే లెక్కుంట ఈ మన ప్రపంచకం చుట్టూర నీట్లోన, గాల్లోన, మన సరీరములోన మట్టీ మశానంలోనా కొన్ని వ్రేలాది క్రోటానుక్రోట్లు సూష్మాక్రిములూ, జీవాలూ ఎలాగ దేవులాడుతుంతాయో, ఆటికి ఈ గొట్టాలెల్లి ఎలాగ చూసియ్యొచ్చునో, అవి ఒక్కో జీవము చీమ కన్నా వెయ్యిరెట్లు సూష్మాతిసూష్మంగుండీ కూడ మనం గనక ఒకేల పొరపాట్న లెట్రనకెల్లి సేతులు కడుక్కోకుంటా వొచ్చెస్తె ఎలాగ దొడ్లొకెల్లి మన రక్తాలంట ఎక్కిపోయి మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి అంటువ్యాదుల కింద కాపరాలెట్టెస్తాయో అనీసి పాఠం మొదలెట్టీసింది. రోబోకనీసి రాడాలేటి? టెంతక్లాస ఎజ్జాంసకి డబల సోయింగులేటి?! మయిందర్నాకొడుకు టికట్లకనీసెల్లినోడు ఐపునేడు నల్గొండా ఎలిపోనాడేటో?! ఆపనాకొడుక్కి ఎంత మెంటలైతే మటుక్కి ఇక్కడికి తెస్తాడానీసి నీను ఆడి జబ్బ గిల్లదానికెల్తంటె మేడం నా జబ్బే వొట్టీసుకోని “దీని ఖరీదు చూసేవ కొండబాబూ? ఎంతిది…? చదువు?” అన్నాది. దానిమీద టికట్ట చూసి బేజారైపోయి ‘పద్దెనిమిదీ వందల తొంబయ్ మేడం!’ అన్నాను. ఆవిడి నాదుక్కు ‘ఇద్దీ గుట్టా తెలీదేమట్ర బాల్ కే బచ్చానాకొడ’ కన్నట్టుగు నవ్వీసి,

“వందలు కాదు! ఎయిటీన్ తౌజండ్ ! పద్దెనిమిది వేలు! మీలో ఎవరైనా డాక్టర్ చదవాలంటే గనక ఇది చాలా అవసరం! ఊఁ…?” అంటనాది. అంకిత్ బాబు, అమోగ్ బాబోల్లాగున్నార ఆలమ్మా డాడి గ్లోబొకటి, మైక్రాష్కాప్ ఒకటి బెత్తాయీంచుకెల్తనారు! కుమారీ ఉన్నదాయి ఉన్నట్టుండకుంట “పద్దెనిమిది వేలంటె ఆర్నెల్ల షేలరీ మేడం!” అన్నాది, ‘ఎన్ని మాసాల జీతాలు కూడబెటిద్దునా, ఆ గొట్టాంల కూకున్న జీవాలికి మేడ కట్టిద్దునా?’ యనీసి ఊర్జితమంతురాలు. మా అయ్య మొదాట ఈ ఊరొచ్చీరాగాన అన్నమాటలు గేపకమొచ్చేయి. పజ్జెనిమిది వేలు గనక ఉన్నాయంటె ఈఊల్లోన మానాటోలు కుటంబరానికి నలుగురికి ఆర్నెల్లు గ్రాసమనీసి. వేసాకాలం వొచ్చిందంటె మాదుక్కు ఆవులు, గీదలు, కుక్కలు, పందుల్నాగ కళ్ళక్కనిపించే జీవాలకే టికానా లేదు! వల్లీమేడంగారు ఎంతెర్రిబాగుల్దాయి కాకపోతె ఆర్నెల్ల జీతండబ్బులెట్టి కంటికి కనిపించని సూష్మక్రిములికి సూన్నానికి గొట్టం కొనిపించుకుంతాది?

రాజేష గాడు ఉన్నట్టుండి “మేడంగారండి? మేడంగారండి?! సూడు సూడు… పుష్టకాహారం…” అనరుస్తనాడు, మేడం చెయ్యిపట్టుకోని ఇవతలకి లాగీసి. ఆడికీ, ఇచ్చుగాడికీ మదీనాగాడికీ ఎప్పుడూ తిండిమీదే ఉంటాది. మేడం చెప్పిన పాఠాలన్నిట్లోకి పౌష్టికాహారం ఒక్కటే ఆలకి గుర్తుంటాది వాపిరిగొట్నాకొళ్ళికి! అక్కడ గ్లోబుల పక్కన షెల్ఫీలోన పెద్ద బొమ్మపెట్టిలోన అచ్చంగా మేడం సూపెట్టిన పౌష్టికాహారం చార్ట్రులాగే ఉన్నాది బొమ్మ. రంగురంగుల కొండనాగుండి దన్లోన ఒక్కొక్క తలుపూ తీస్తే ఒకొక్కటీ చేపలు, చికిని, పాలు, గ్రుడ్లు, అరటిపల్లు, యాపిల్సు అంకిత్ బాబోలు తినీటట్టుగ వెన్నలు, బ్రెడ్సులు అన్నీని. మేడం ఒకొక్క మెట్టుకి మీట నొక్కుతుంటె ఒకొక్క బొమ్మలగుత్తి బయిటికొచ్చీసి మల్లి నోపటకెలిపొతంది. అవి చేసిన వడ్రంగోడెవుడోగాని చూడ్డానికి అచ్చం నిజం ఆహారంనాగే ఉన్నాయి. రాజేష గాడు ఇంకుగ్గబట్టుకోనేక “మేడాంగారమ్మ? ఇవి నిజింవా బొమ్మవా?” అనుకోని నాకొడుకు పౌష్టికాహారము తినీడాలకొచ్చెత్తనాడు. ఈడికెవలు బొట్టిట్టి పిల్సేర?

“ఇవి నిజంవి కాదర్రా! మీకు ఆరోజు సండే క్లాసులో చెప్పేనుకదా? రోజూ ఏ ఏ ఆహారం సమపాళ్ళుగా ఎంతెంత తినాలో ఇది సులభంగా గుర్తుంచుకోడానికి! పౌష్టికాహారం! ఓకే?!” అన్నాది మేడాలు. బేకుగాడికి అనుమానఁవొచ్చీసి “ఇందల వణ్ణం లేదేటండి మేడంగారమ్మ? మీఁవు రోజూ వొణ్ణమొక్కటె తింటాము!” అన్నాడు ఆడు పౌష్టికావాహోరము ఎక్కడ తింట్లేదా అనీసి ఇక్కడ సీయెమ్మార్ల సారోలందరు డబల వఱ్ఱీ ఐపోతనట్టుగ! ఆడికొచ్చిన కటింగే నాకూ వొచ్చింది – ఆ బొమ్మలకొండకి ఎన్నిసుట్లు బటన్స నొక్కించి ఎన్నలమారాలు తీసినా బ్రెడ్డులు జాంసులు గ్రుడ్లు చికినీలున్నాయగాని వణ్ణం లేదు! కుమారీ ఆడిదుక్కు జాలిగా చూసి “మా బ్రైన్ బాబు, జాఖరీ బాబాలు రోజూ ఇవ్వే తింతారు. వణ్ణాలు తిన్రు!” అన్నాది. దానికి అమిరికావోల పౌష్టికాహారాలన్ని ఇంత గుంటప్పుణ్ణించే తెలిసిపోయినట్టుగ. “అన్నం లేకపొయినా ఓకేనేరా! బ్రెడ్ , పొటాటో, చపాతీ ఇవన్నీ పిండిపదార్ధాలేగా! ఏంటే… నాగలక్ష్మీ?” అన్నాది మేడం ఈ పౌష్టికాహారఁవొట్టికెల్లి దాని టెంతక్లాసల కలిపియ్యాలని.