చిట్ట చివరిది

“ఎంత కష్టపడ్డాను ఆ ఉత్తరం రాయడానికి? అరిగిపోయిన పదాలు వాడకుండా, మూస భావాలు లేకుండా రాయడం అంత తేలిగ్గా సాధ్యపడలేదు. ఎవరెవరు రాసిన ప్రేమలేఖలో చదివాను ఇంతకుముందు ఎవరూ రాసినట్టు అది ఉండకూడదని. గుర్తుందా నీకు ఒక నెలరోజులు కనపడకుండా పోయాను? ఆ నెలంతా క్లాసులూ, తిండీ తిప్పలూ కూడా మాని అదే నేను చేసిన పని. నా జీవితంలో ఒకే ఒక్క రచన చేస్తే అది ఎలా ఉండాలనుకుంటానో అంతకంటే గొప్పగా ఉండాలని తపించాను. ఆ ఉత్తరం చదివివాక ఎవరయినా సరే గుండె కరిగి ప్రేమించక తప్పదన్న నమ్మకం కుదిరాకే నీకు ఇచ్చాను. ఎందుకని చదవలేదు?”

“తెలియదు. చదివితే ఏం జవాబివ్వాలో నిర్ణయించుకోలేకపోవడం వల్లనేమో! నాకంటే ఉత్తరమే నీకెక్కువలా ఉందన్న కోపం కూడా ఉండేదేమో!”

“అదేమిటి? ఇద్దరమే కూచుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. రాత్రి పూట ఫ్రండ్స్ అంతా కలిసి సెంటర్ దాకా నడుచుకుంటూ పోయి బజ్జీలు కొనుక్కుని తినేవాళ్ళం. నీకు కారంగా అనిపించింది నాకిచ్చి నా చేతిలోది లాక్కునేదానివి. సినిమాకి వెళితే నా పక్కనే కూచునేదానివి. గుర్తుందా ఒకసారి వానలో ముద్దముద్దగా తడిసి వస్తుంటే “రిం ఝిం గిరె సావన్” పాట పాడుతూనే ఉన్నావు దారంతా? నేను అడగ్గానే ఏ పాటయినా పాడేదానివి!”

“మరి నువ్వొక్కడివే వోపిగ్గా వినేవాడివి దొరికింది. నీకు ‘పదహారేళ్ళకూ’ పాట బాగా ఇష్టం,కదూ!”

“అవును. ఒకసారి నువ్వెక్కడికో రమ్మన్నా కాదని భారతికి సాయం చేస్తూ కూర్చున్నానని వారం రోజులు అలిగి నాతో మాట్లాడలేదు.”

“నువ్వు మాత్రం అలగలేదా నీకు చెప్పకుండా స్వాతి ముత్యం సినిమాకి మేమంతా వెళ్ళామని? ఒకసారి వానలో ఒక కాకా హోటల్లో చిక్కుకుని టీల మీద టీలు తాగుతూ కూచున్నాము.” ఆమె ఏమీ మర్చిపోలేదు.

“అవును, చెరి ఆరు టీలు. అక్కడ పనిచేసే కుర్రాడిని చూచి దిగులు పడి పోయావు చదువుకోకుండా పనిచేస్తున్నాడని. అలాంటి వాళ్ళకోసం ఏదన్నా చేయాలని ఆ తర్వాత తరచూ అనేదానివి.”

“అప్పుడు నీ జేబులో డబ్బులు లేక నేనే కట్టవలసివచ్చింది అది గుర్తు లేదా? అంతా నిన్నో మొన్నో జరిగినట్టుగా ఉంది.”

“ఆ రోజుల్లో మనం కలిసి గడిపిన కొన్ని క్షణాలు అద్భుతంగా అనిపించేవి. కరెంటు పోయి వెన్నెల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడో, డాబామీద కూచున్నప్పుడు కొబ్బరాకులూ, నీ ముంగురులు గాలికి ఊగినప్పుడో, వాన పడుతున్నప్పుడొకసారి జారిపడబోయి నా చేతిని పట్టుకున్నప్పుడో ఆ క్షణాన్ని జీవితాంతం భద్రంగా గుర్తు పెట్టుకోవాలి అనుకునేవాణ్ణి. తర్వాత తర్వాత అట్లా అనుకోవడం మాత్రమే గుర్తుండేది. ఎంత ప్రయత్నించినా ఆ అనుభూతి మాత్రం గుర్తు వచ్చేది కాదు.” ఆగి అన్నాడు “మనిద్దరి మధ్యా ఉన్నది ప్రేమే అనుకున్నాను.”

“అవన్నీ చిన్నపిల్లల చేష్టలు. ఆ వయసులో అట్లాగే అనిపిస్తుంది. అనిపించకపోతేనే ఆశ్చర్యపడాలి”

“అప్పటికయితే అది నిజమేనని గట్టిగా నమ్ముతాము కదా! నీ ఆచూకీ దొరక్క తిరిగి మామూలు మనిషిని కావడానికి చాలా రోజులు పట్టింది.”

“అవునా?”

“నీకేం అనిపించలేదా? ఇంతకీ ఉత్తరం ఏం చేశావు?”

“ఏమో గుర్తు లేదు. ఏం రాశావేమిటి అందులో?”

“చెప్తే నవ్వుతావు.”

“అంత నవ్వొచ్చేవి ఏం రాశావు?”

“ఛ ఛ! ఉత్తరం చాలా సీరియస్. చెప్పాగా ఎంత శ్రమపడి రాశానో! అయితే ఏం రాశానో ఇప్పుడేం గుర్తు లేదు. గుర్తుంది అప్పుడు పడ్డ కష్టమే. ఎక్కడెక్కడి పుస్తకాలో చదవడం, నిఘంటువులు ముందేసుకుని వెతకడం, రాసినవి బాలేదని చించివేయడం. అదే గుర్తు. అయినా చదవకపోతే పోయావు, దాచి అయినా పెట్టలేదా?”

“ఏం తీసుకెళ్ళి ఏ పత్రికకో పంపుతావా ఏమిటి? బాధగా ఉందా నేను చదవలేదని?”

“అది ఇంకెవరూ చదవడానికి కాదు. నీకోసమే రాసింది. చదివినా, పోగొట్టుకున్నా అది నీదే!”

“అయితే రాయడం మానేయడం ఎందుకు? నిజంగా నీకు మంచి టాలెంట్ ఉంది. రాస్తూ ఉంటే ఈ పాటికి ఎంత పేరు వచ్చి ఉండేదో!”

“ముందేవో భ్రమలు ఉండేవి. మాట శక్తివంతమయిందనీ, నా రచనలు ఏవో మార్పు సాధించగలవనీ నమ్మేవాణ్ణి. నేను అంత కష్టపడి రాసింది ఒక్క వ్యక్తి మనసునే కదిలించకపోతే ఇక రాసీ ప్రయోజనమేమిటనిపించింది. అయినా అంత అద్భుతంగా రాశాక ఇక మరేదీ రాయలేననిపించింది. రాయవలసిందీ, నేను రాయగలిగిందీ ఏమీ మిగల్లేదు.”

పనిపిల్ల వచ్చి ప్లేట్లు పట్టుకుపోయింది.

“నాలుగేళ్ళ క్రితం నుంచీ ఉన్నట్టుండి కీళ్ళ నొప్పులు రావడం మొదలయ్యింది. పుస్తకం కూడా పట్టుకుని ఎత్తలేనంత బలహీనమయ్యాయి చేతులు. వేణూయే వాళ్ళ వూర్నుంచి ఈ పిల్లను తీసుకొచ్చి పనికి పెట్టారు. ఇప్పుడు కాస్త నయంలే!”

“నాకు బీపీ. మన జబ్బుల చిట్టాలు విప్పుకోవడమెందుకులే ఇప్పుడు!” నవ్వాడు. కాలం మారుతుంది. మనుషులూ మారతారు. తనూ, ఆమే, అందరూ.

“ఇక వెళతాను.” అంటూ పైకి లేచాడు. ఆమెతోటే వీలయినంత ఎక్కువసేపు గడపాలాన్న తపన ఉండేది. ఆ ఉద్వేగమేదీ లేదిప్పుడు.

“ఇల్లు చూదువుగాని రా!” అంటూ ఇల్లంతా తిప్పి చూపించింది వివరాలు చెప్తూ. “బావుంది” చెప్పాడు. ఆమె హాయిగానే జీవిస్తూంది. తనలాగే. కోలమొహం, బొద్దుమీసాల వేణు ఫొటోలోంచి నవ్వుతున్నాడు. అక్కడ గుండ్రటి తన మొహం ఉన్నా పెద్ద తేడా ఉండదేమో! ఆమె బదులు సుమ ఉన్నా.

“నేను డ్రాప్ చేస్తాను మీ హోటల్ దగ్గర. ఏ హోటల్లో ఉంటున్నావు?”

“వద్దొద్దు నీకు అనవసరంగా శ్రమ ఎందుకు! రోడ్డెక్కితే బోలెడు ఆటోలు.” ఆమె అభ్యంతరం చెపుతూ పక్కన నడుస్తుండగానే బయటికి నడిచాడు. గేటుదాకా వచ్చాక ఆగిపోయి అంది. “డాంకే షేన్!”

“ఏమిటీ?” వెనక్కి తిరిగి అడిగాడు.

“డాంకే షేన్! జర్మన్ భాషలో థేంక్స్‌లే! తిట్టాననుకున్నావా?” దూరంగా ఉన్న వీధిదీపం వెలుగులో ఆమె నవ్వు మెరిసింది. “ఏదో ఇంగ్లీష్ సినిమాలో పాట మొదట్లో వస్తుందిలే!”

“థేంక్స్ ఎందుకు?”

“ఆ రోజులకీ, ఆ జ్ఞాపకాలకీ, నీ ఉత్తరానికీ!”

“చదవలేదన్నావుగా? చదివావా?”

అదే నవ్వుమొహంతో తల చిన్నగా అడ్డంగా ఊపుతూ అంది “నీకు నామీద కంటే ఉత్తరం మీదే శ్రద్ధ ఎక్కువ!”

అతనూ నవ్వి “సరే! బై!” అని వెనక్కి తిరిగాడు. ఆమె వెనకనుంచి “బై” అని చెప్పి గేటు వేసుకుంటున్న చప్పుడు.

నడుస్తుంటే చలి కొద్దిగా పెరిగినట్లనిపించింది. వెచ్చబడేందుకు జేబుల్లో చేతులు పెట్టుకుంటే మడతలు పెట్టిన కాగితం తగిలింది. తీసి చూస్తే నెలరోజుల క్రితం భారతి ఇచ్చిన ఆమె అడ్రస్. ఉండ చుట్టి విసిరేస్తే అది గాలికి కొట్టుకుపోయింది. రోడ్డెక్కి ఆటో కోసం అటూ ఇటూ చూశాడు. టీ కొట్టు ముందు ఆపిన మోటర్ సైకిల్‌పై ఆనుకుని కాలేజ్ స్టూడెంట్స్‌లా ఉన్న అబ్బాయీ, అమ్మాయీ నవ్వుకుంటూ, ఒకర్నొకరు తోసుకుంటూ కనబడితే ఒక క్షణం వాళ్ళనే చూస్తూ నిలబడిపోయాడు.


చంద్ర కన్నెగంటి

రచయిత చంద్ర కన్నెగంటి గురించి:

సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న చంద్ర కన్నెగంటి రచించిన కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.

 ...