అర్థంకాని కవిత్వం

మరికొన్ని కవితలుంటాయి. అవి చివరికంటూ చదివినా పూర్తిగా అర్థం కావు. బొత్తిగా అర్థం కాకుండానూ ఉండవు. స్పష్టాస్పష్టమైన భావాలేవో మనసులో కదులుతాయి. కవిత చదవగానే, చిన్నదో పెద్దదో ఒక విద్యుత్ ఘాతం లాంటిది తగులుతుంది. ఆ కవితని మరల మరల చదువుకుంటాం. చదివే కొద్దీ రకరకాల ఆలోచనలు రేగుతాయి. ఇలాంటి కవితలని చదివిన ప్రతిసారీ అదొక కొత్త ప్రయాణమే అవుతుంది! అలాంటి కవితలకి ఒక ఉదాహరణ రేవతీదేవి అనే కవయిత్రి వ్రాసిన ‘ఈ రాత్రి’ కవిత.

“ఈ రాత్రి గడిస్తే
నిద్ర మాత్రలక్కూడా లొంగని
ఈ రాత్రి గడిస్తే
మనిషితో రాజీపడలేక పోయినందుకు
నా వీపుకింద అంపశయ్యలా పరుచుకున్న
ఈ రాత్రి గడిస్తే
దైవంతో రాజీపడలేక పోయినందుకు
నా నరాలలో ఈత ముళ్ళ నెత్తురై ప్రవహిస్తున్న
ఈ రాత్రి గడిస్తే
నిజాయితీ మొహాన
వెలుతురు దుప్పటి కప్పి మరోపగలు
యెప్పుడో మరో రాత్రి మరోపగలు
వెలుతురు దొరక్క
నిజాయితీ నగ్నంగా స్నిగ్ధంగా ఉండిపొతే
ఆ రాత్రి గడవకుండా నిలిచిపోతే
నేనే గతించి గడిచిపోతాను నిజాయితీగా”

ఈ కవిత చదివిన వెంటనే వెన్నులో చిన్నపాటి జలదరింపైనా కలగకపోతే, దాన్ని పక్కన గిరాటెయ్యడమే ఉత్తమం. మళ్ళీ చదివి ప్రయోజనం ఉండకపోవచ్చు. మొదటిసారి చదివినప్పుడు యీ కవిత అర్థం కాదు, కచ్చితంగా. ఆ మాటకొస్తే, ఎన్నిమార్లు చదివినా పూర్తిగా అర్థమవుతుందని చెప్పలేము. ఇది ఏభైశాతం కవి వ్రాసినది, మరొక ఏభైశాతం పాఠకుడు పూరించుకోవలసినది. అయితే, అలా పూరించుకొనేటప్పుడు, యీ వ్యాసం మొదట పేర్కొన్న గోమెజ్ దవీలా మాటని గుర్తు పెట్టుకోవాలి. కవి భాషని మనం అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి తప్ప పూర్తిగా మన భాషలోకి దాన్ని తర్జుమా చేసేసుకో కూడదు. కవి భాష ఏమిటో మనకి తెలిసేదెలా? కొంత కవితలోనే మనకి దొరుకుతుంది. ఆ కవి యితర కవితలలో మరికొంత దొరుకుతుంది. ఈ కవిత గురించి చాలా కాలం క్రితం ఈమాట పత్రికలో కొడవళ్ళ హనుమంతరావుగారు ఒక వ్యాసంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రచ్చబండ అనే గ్రూపులో దీని గురించి చాలానే చర్చ జరిగింది. అందులో యీ కవితకి నాకు తోచిన అర్థాన్ని నేను కూడా చెప్పాను. అయితే నేను చెప్పిన అర్థంతో సహా ఎవ్వరి అర్థమూ నాకు పూర్తిగా సంతృప్తినివ్వలేదు. కొన్ని యేళ్ళ తర్వాత యీ మధ్య మళ్ళీ యీ కవితని చదివాను. ఈ సారి గోమెజ్ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని చదివాను. ఇంతకుముందు చెప్పుకున్న అర్థాలన్నీ పాఠకులు తమ భాషలోకి తర్జుమా చేసుకున్నవని అనిపించింది. ఇప్పుడు నాకు తోచిన అర్థం కూడా కవి ఉద్దేశించినదే అని చెప్పలేను. కాని కవితని మరింత దగ్గరగా చూడగలిగానని నా నమ్మకం.

కవిత చదివిన వెంటనే స్థూలంగా అర్థమయ్యే విషయం – ఒక వ్యక్తి పడుతున్న తీవ్రమైన వేదన యీ కవితలో ఉంది. మనిషితోనూ దైవంతోనూ రాజీ పడలేక పోవడం వలన ఏర్పడిన పరిస్థితి యిది. అయితే యీ రాజీ పడలేక పోవడం దేనివలన అన్నది స్ఫష్టంగా లేదు. దీని గురించి, ఇంతకు ముందు చెప్పిన చర్చలలో రకరకాల ఊహలు చేశాము. అవన్నీ పాఠకుల ఊహలే తప్పిస్తే కవయిత్రి చెప్పినది కాదు. పాఠకుల ఊహ అన్నది, సాధారణంగా, కవితలో వ్యక్తమయిన దానిని మనసులో రూపుకట్టడానికి మాత్రమే ఉపయోగించాలి తప్పిస్తే, అందులో లేని దాని కోసం కాదు. కవి భాషని అర్థం చేసుకోడానికీ, సొంత భాషలోకి అనువదించుకోడానికీ ఉన్న తేడా యిదే. ఈ కవితని మరింత లోతుగా తెలుసుకోవాలంటే మరికొంత నిశితంగా పరిశీలించాలి. కవయిత్రి వర్ణిస్తున్న యీ వేదనంతా జరుగుతున్న సమయం ‘రాత్రి’. దీనికి కవయిత్రి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే ‘వీపుకింద అంపశయ్యలా పరుచుకున్నదీ’, ‘నరాలలో ఈతముళ్ళ నెత్తురై ప్రవహిస్తున్నది’ ఈ రాత్రే. కవిత శీర్షిక కూడా ‘ఈ రాత్రి’. ‘రాత్రి’కి ఎందుకంత ప్రత్యేకత? ఇంతటి వేదన అనుభవించేది నిజంగా రాత్రి సమయమే అయి ఉండాలి, లేదా, వేదన అనుభవిస్తున్న సమయాన్నంతటినీ ఏదో కారణం వలన రాత్రిగా పోలుస్తూ ఉండి ఉండాలి. ఇందులో ఏదై ఉండవచ్చు? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మళ్ళీ కవితని చదవాలి, చివరికంటూ. ‘నిజాయితీ మొహాన వెలుతురు దుప్పటి కప్పి మరోపగలు’ – ఈ రాత్రి గడిస్తే వచ్చేది ఇది! వెలుతురు సాధారణంగా జ్ఞానానికి ప్రతీక. దాన్ని యీ కవయిత్రి యిక్కడ వ్యత్యస్తం చేసేశారు. ఈ వెలుతురు, నిజాయితీని కప్పేసే దుప్పటి! అలాంటి వెలుతురునిచ్చే మరో పగలు, రాత్రి గడిస్తే వచ్చేది. అంటే ప్రతి పగలు అలాంటిదే అన్నమాట. పగలు నిజాయితీని కప్పేస్తోంది. అంటే మోసానికి తెర తీస్తోంది. రాత్రి నిజాయితీని బట్ట బయలు చేస్తోంది. ఆ నిజాయితీయే మనిషితోనూ, దేవునితోనూ కూడా రాజీపడకుండా చేస్తోంది. ఆ రాజీపడలేనితనమే జీవితాన్ని దుర్భరం చేస్తోంది. అలా మరో పగలు, మరో రాత్రి. ఆఖరికి ఎప్పుడైనా నిజాయితీని కప్పడానికి వెలుతురు దుప్పటి దొరక్కపోతే, నిజాయితీ నగ్నంగా, స్నిగ్ధంగా ఉండిపోతుంది. అప్పుడా రాత్రి గడవకుండా నిలిచిపోతుంది. అప్పుడేమవుతుంది? రాజీపడలేక సతమతమవుతున్న ఆ వ్యక్తి నిజాయితీగా గతించిపోతుంది (పోతాడు). ఈ కవయిత్రి కవితలన్నీ శిలాలోలిత అనే పేర సంకలనంగా వచ్చాయి. అందులోని కవితలని చదివితే, ఈ కవయిత్రికి నిజాయితీ పట్ల ఉన్న అమితమైన నిబద్ధత, అది లేని లోకంపైన కోపం అసహనం, మనకి స్పష్టంగా గోచరిస్తాయి. ఈ కవితలోనూ ఉన్నది అదే. మనం ప్రపంచంతో సాహచర్యం చేసేది పగటిపూటనే కదా. ఈ కవితలోని ‘నేను’ (బహుశా కవయిత్రే) బాహ్యప్రపంచంలో (పగటిపూట) నిజాయితీగా బ్రతకలేకపోతోంది. కాని తన అంతరంగానికి (రాత్రిపూట) తానేమిటో తెలుసు. బాహ్య అంతర్ ప్రపంచాలకి ప్రతీక పగలు రాత్రి. రాజీ పడుతున్నది బాహ్యప్రపంచంలోని మనుషులకీ, విధికే. అయినా అది తెలుస్తున్నది నిజాయితీ నగ్నంగా దర్శనమిచ్చే అంతరంగానికి. అందుకే అంతరంగం అతలాకుతలమవుతోంది. ఆ యుద్ధంలో అంతరంగం గెలిస్తే ఏమవుతుంది? నిజాయితీ నగ్నంగా స్నిగ్ధంగా ఉండిపోతుంది. బాహ్యప్రపంచానికి ‘నేను’ దూరమైపోతుంది. గతించి, గడిచిపోతుంది.

ఒక చిన్న కవిత మీద ప్రతి పాఠకుడూ ఇంతటి పరిశీలన చెయ్యాలా అంటే, అక్కరలేకపోవచ్చు. ముందు చెప్పినట్టుగా, యీ కవిత చదివిన వెంటనే వెన్నులో చిన్నపాటి జలదరింపైనా కలిగినవాళ్ళకే ఇంత ప్రయాస పడవలసిన అగత్యం ఏర్పడుతుంది. లేకపోతే అవసరం లేదు.