ప్రాచీన కవిత్వం చాలావరకు కథాశ్రయం. అంటే కథని, అందులోని పాత్రలని ఆలంబనగా చేసుకున్న కవిత్వమది. కవి భావాలు నేరుగా మనకి ఎక్కడా కనిపించవు. పాఠకునికి పాత్రలతోనే సంబంధం కాని నేరుగా కవితో సంబంధముండదు. ఉదాహరణకి మనుచరిత్రలో అటజనికాంచె భూమిసురుడు… అన్న పద్యంలో కవి హిమాలయాలని వర్ణిస్తున్నాడు. అయితే ఆ హిమాలయాలని చూస్తున్నది కవి కాదు, ప్రవరుడన్న పాత్ర. ఎప్పుడూ నగరాన్నే విడిచిపెట్టి వెళ్ళని ప్రవరుడు మొదటిసారి హిమాలయాలని దర్శించినప్పుడు, అతని కన్నులకి ఆ వాతావరణం ఎలా కనిపించిందో అది మనకి చూపెడుతున్నాడు కవి. అప్పటిదాకా కావ్యాన్ని చదువుకొంటూ వస్తున్న పాఠకునికి ప్రవర పాత్ర చక్కగానే పరిచితమై ఉంటుంది. అంచేత ఆ పాత్ర దృష్టితో చేసిన ఆ వర్ణనతో పాఠకుడి మనసు లగ్నమవ్వడం పెద్ద కష్టమైన పని కాదు. పాత్రలలో లీనమై, ఆయా పాత్రల అనుభవాల ద్వారానే పాఠకులు కవిత్వానుభూతిని పొందుతారన్న మాట. ఇక ఆధునికకవిత్వానికి వస్తే, అది నూటికి తొంభై వంతులు ఆత్మాశ్రయం. ఇక్కడ ఆత్మాశ్రయమంటే నా ఉద్దేశ్యం తన గుఱించి చెప్పుకున్న కవిత్వమని కాదు. తన దృష్టితో చెప్పిన కవిత్వమని. భావకవిత్వం నాటినుండీ కూడా కవిత్వంలో కనిపించేది నేరుగా కవి హృదయస్పందనే. “నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు” అన్నప్పుడా మాటలు కృష్ణశాస్త్రి అంతరంగంలో మసలుతున్న భావాలకి అక్షరరూపాలు. “పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి” అన్న మాటలు శ్రీశ్రీలోని ఆవేశానికి ప్రతిధ్వనులు. “నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలు” అన్నది తిలక్ మనసులోని అనుభూతిని ఆవిష్కరించే పదచిత్రం. ఇక్కడ కవికి పాత్రల ఆలంబన లేదు. నేరుగా పాఠకునితో కవి మాట్లాడుతున్నాడు. లేదా తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. ప్రాచీనాధునిక కవిత్వాల మధ్యనున్న అతి ముఖ్యమైన తేడా యిది.
కవిత్వాన్ని అర్థం చేసుకోవడంలో యీ వ్యత్యాసం చాలా ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది. ఎలా అంటే, కథాకావ్యాలని అర్థం చేసుకోవాలంటే, కథని అర్థం చేసుకొని అందులోని పాత్రల స్వరూప స్వభావాలు ఆకళించుకొన్నట్లయితే సరిపోతుంది. పైగా వీటిలో చాలావరకూ ఒక రకమయిన ‘సాధారణీకరణ’ జరుగుతుంది. అంటే మనుషులందరికీ సామాన్యంగా ఉండే అనుభూతులు, కలిగే అనుభవాలు, ఎదురయ్యే సమస్యలు ఇందులో చిత్రితమవుతాయి. వీటినే నవరసాలుగా, వివిధ స్థాయీభావాలుగా అలంకారికులు వింగడించారు. అందువల్ల పాఠకులకి వాటిని తమదిగా చేసుకోడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆత్మాశ్రయమైన కవిత్వ విషయంలో యీ వెసులుబాటు లేదు. ఇందులో ఉండేది పూర్తిగా కవి వ్యక్తిగతం. వస్తువు సామాజికమైనదే అయినా, కవిత్వంలో ప్రతిఫలించేది కవి తాలూకు వ్యక్తిగత ప్రతిస్పందనే. అంచేత దాన్ని అర్థం చేసుకోవాలంటే కవిని అర్థం చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకి “మనవాళ్ళందరూ వట్టి వెధవాయలోయ్” అని నాటకంలో గిరీశమన్నప్పుడు ఆ మాటలని మనం ఎలా అర్థం చేసుకుంటాం? గిరీశం పాత్రస్వభావాన్ని బట్టి, అవి అతను కొట్టే డప్పాలలో భాగంగానే తీసుకుంటాం. లేదు నిజంగా గురజాడకి మనమంటే అలాంటి చులకన భావమే ఉంది అనే వాళ్ళూ ఉన్నారు కాని అది ఆధునికంగా వచ్చిన విమర్శ ధోరణి తప్పిస్తే, న్యాయంగా అలా అనుకోడానికి వీల్లేదు, అనుకోవలసిన అవసరమూ లేదు. అదే ఒక ఆధునిక కవి తన కవితలో ఆ మాట అన్నాడనుకోండి. అప్పుడు అతనే ఉద్దేశ్యంలో అన్నాడు? వ్యంగ్యానికి అన్నాడా? సూటిగానే అన్నాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. కేవలం ఒక కవిత పరిధిలో ఆ మాటల contextని అర్థం చేసుకోవడం, గిరీశం మాటలని అర్థం చేసుకోవడం కంటే కష్టమే అవుతుంది. ఆ కవితని కొంత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కవి గురించిన అవగాహన కూడా కొంత అవసరమవుతుంది. పైగా, యీ ఆత్మాశ్రయకవిత్వంలో వ్యక్తపరిచే అనుభూతులు, అనుభవాలు వైయక్తికమైనవి, ఆ కవికి మాత్రమే సొంతమైనవి. వీటిలో ఎలాంటి సాధారణీకరణా జరగదు. అంచేత మనుషుల అంతరంగాలలో ఎంతటి వైవిధ్యముంటుందో, యీ కవితల్లో కూడా అంతటి వైవిధ్యముంటుంది. కాబట్టి యిల్లాంటి కవితలని అర్థం చేసుకోడానికి ఏవో కొన్ని సామాన్య సూత్రాలని తయారుచెయ్యడం అసంభవం. ప్రతి కవితాస్వాదనా ఒక సాహసయాత్రే అవుతుంది పాఠకునికి. అందులో ఒక గమ్యం చేరగలరన్న హామీ కూడా ఎవరూ ఇవ్వలేరు. ప్రయాణమే ముఖ్యం కాని గమ్యం కాదు. దానిలో ఉత్సాహమున్న వాళ్ళే అందుకు సిద్ధపడాలి. అయితే యీ ప్రయాణం సరిగా సాగడానికి కొన్ని చిట్కాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.
మొట్టమొదటగా, ప్రయాణాన్ని ఎప్పుడు ఆపెయ్యాలో తెలియడం. మన కంటబడిన ప్రతి కవితా మనకి అర్థమైపోవాలని, మనసుకి హత్తుకోవాలని అనుకోడం అత్యాశ. కవిత్వాన్ని చదవడం గురించి బోర్హెస్ (Jorge Luis Borges) ఒక చక్కని పోలిక చెపుతాడు:
“The taste of the apple (states Berkeley) lies in the contact of the fruit with the palate, not in the fruit itself; in a similar way (I would say) poetry lies in the meeting of the poem and reader, not in the lines of symbols printed on the pages of a book.”
ఏపిల్ రుచి ఏపిల్ లో ఉండదు, తినేవాడి నాలుకపైనే ఉంటుంది. అదే ఏపిల్ ఒకో మనిషికి ఒకో రకమైన రుచినిస్తుంది. అలాగే కవిత్వమన్నది కవితా పంక్తులలో ఉండదు. పాఠకుని ప్రతిస్పందనలో ఉంటుంది. ఒకే కవిత ఒకో పాఠకునికి ఒకో రకమైన అనుభూతిని మిగులుస్తుంది. కొంత మందికి మావిడిపండు రుచి కాదు కదా వాసన కూడ పడదు. మరి కొందరు దాన్ని ఎంతో ప్రీతిగా తింటారు. అలాగే ఒక కవిత అర్థమవ్వాలంటే, పాఠకునికి ముందు ఆ కవిత మీద ఒక రకమైన అభిరుచి ఏర్పడాలి. అర్థమే అవ్వకుండా అభిరుచి ఏర్పడే అవకాశం ఉందా? అంటే, కచ్చితంగా ఉంది. కవిత చదవగానే, స్పష్టాస్పష్టమైన చిత్రాలేవో మనసులో కదలాడి, ఆ కవితని మరింత లోతుగా చదవాలనే ఉత్సుకత కలగవచ్చు. లేదా ఆ కవి పూర్వకవితలు మీకు నచ్చి, యీ కవిత వెంటనే అర్థమవ్వకపోయినా దాన్ని మరల చదివి అర్థం చేసుకోవాలన్న ఉత్సాహం ఉండవచ్చు. అసలు ఎలాంటి కవిత్వాన్నయినా అర్థం చేసుకొని ఆస్వాదించాలనే కోరిక మీకు బలంగా ఉండవచ్చు. ఇలా, కవిత అర్థం కాకపోయినా దానిమీద అభిరుచి ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. అయితే, ఇవేవీ మీకు వర్తించక మీకా కవితని మళ్ళా చదవాలన్న కోరిక కలగకపోతే, వెంటనే దాన్ని పక్కకు నెట్టెయ్యాలి. మీ ప్రయాణాన్ని ఆపెయ్యాలి.
రుచి-అభిరుచి పోలికనే మరికొంత కొనసాగిద్దాం. పాలో కాఫీనో తాగే ముందు తియ్యని మిఠాయి తింటే, ఆ పాలు చప్పగా ఉండడం చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఒక బలమైన రుచి నాలుకకి పట్టేసింది. ఆ రుచి ఇతర రుచులని మరుగు పరిచేస్తోంది. ఇది కవిత్వానికి కూడా వర్తిస్తుంది. మీకు ఒక రకమైన కవిత్వమ్మీద విపరీతమైన అభిమానం ఉందనుకోండి, అప్పుడు ఇతర కవిత్వాలు అంతగా రుచించక పోవచ్చు. అలాగే కవిత్వమంటే ఇదీ అని ఒక నిర్దిష్టమైన అభిప్రాయం బలంగా నాటుకుంటే, ఆ చట్రానికి లోబడని కవిత్వం రుచించదు. అంచేత ఒక కవిత అర్థం కానప్పుడో నచ్చనప్పుడో, ఇలాంటి బలమైన అభిరుచి దానికి కారణమేమో పాఠకుడు ఆలోచించుకోవాలి. అలాంటి అభిరుచి ఉండడంలో తప్పులేదు. కాని అలాంటప్పుడు అన్ని రకాల కవితలు తనకి రుచించకపోవచ్చునన్న స్పృహ పాఠకునికి ఉండాలి. తన అభిరుచిని పక్కకుపెట్టి, కవితని చదవగలగడం చేతనయితే చెయ్యవచ్చు. అది చేతనవ్వని పక్షంలో ఆ కవితని పక్కనపెట్టెయ్యడమే ఉత్తమం.
ఇలాగే మరొక విధంగా కూడా జరగవచ్చు. ఉసిరికాయ తినగానే తాగిన మామూలు నీళ్ళు కూడా తియ్యగా ఉంటాయి కదా. అలాగే కొన్నిసార్లు ఒక కవితని ఆస్వాదించాలంటే, ఆ కవితా వస్తువుకి సంబంధించిన నేపథ్యంతో పరిచయము, అనుభవము పాఠకునికి అవసరమవుతుంది. ఇది ముఖ్యంగా ఉద్యమకవితలకి వర్తిస్తుంది. ఉదాహరణకి ఓల్గా రాసిన యీ కవితని తీసుకుంటే:
గృహలక్ష్మి
రుబ్బుడు పొత్రంలా
తల తిరుగుతూనే ఉన్నా
ఆలోచనల పప్పు మెదగదు
ఇంగువ వాసనలో మునిగి తేలే ముక్కు
ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతుంది
చేతుల చీపురు కట్టలు ఎడతెరపి లేకుండా
శూన్యంలో దేవుతూనే ఉంటాయి
కలల అలల తుంపరులు
హృదయపు పెనంపై
చుయ్యిమంటూనే ఉంటాయి
రోకటి బండ కింద
పచ్చడి, పచ్చడవుతూనే వుంటాయి
నడుం బండకేసి బాదినా
కాటుక కంటినీట జాడించినా
మనసుల మురికి వదలనే వదలదు
ఆసులో కండెలా నిత్యం కదుల్తూనే
చలనం ఎరుగని కాళ్ళు
పిల్లర్లలా ఉన్న చోటనే పాతుకుపోతాయి
అలుగ్గుడ్డల పీతిబట్టల పరిమళంలో పునీతమవుతున్నా
జీవితం ఎందుకో ఎప్పుడూ
కాటు వాసన వేస్తుంటుంది
ఈ కవితలో అస్పష్టత ఏమాత్రము లేదు. అయినా యిది బహుశా మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఈ కాలం ఆడవాళ్ళకి కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు, అది వేరే విషయం. కవితలోని కాటువాసన మనసుకి తగిలినప్పుడే యీ కవిత అర్థమైనట్టు. అది జరగాలంటే అలాంటి జీవితానుభవం కావాలి. కవితా రూపం కాని అందులోని శిల్పం కాని పాఠకునికి ఆ అనుభూతిని అందించడానికి ప్రత్యేకంగా సాయపడవు. ఇలాంటి కవితల నాణ్యత గురించి చర్చించే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంతకుముందు చెప్పినట్టు, ఇవి ఒక రకంగా చూస్తే జానపద కవిత్వం వంటివి. ఇవి వ్రాసే కవులకి కవితారూపం మీద, రచనాశిల్పం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు. చదివే పాఠకులకి కూడ ఉండదు. వీటికి మార్గకవిత్వపు సూత్రాలను అన్వయించి విమర్శించాలనుకోడం సమంజసం కాదు.