మన్నాడే దిల్‌హీ తో హై సినిమాలో రోషన్ స్వరరచనలో పాడిన శాస్త్రీయ ఫక్కీ గీతం చాలా ప్రజాదరణ పొందింది. సితార్ విద్వాంసుడు రవిశంకర్ అనురాధా చిత్రానికి కట్టిన ఈ బాణీ కూడా భైరవి శాస్త్రీయతకు అద్దం పడుతుంది. తమిళంలో విశ్వనాథన్, రామమూర్తి ద్వయం స్వరపరిచిన ఈ యుగళ గీతం కూడా భైరవి రాగమే.
హిందీ సినిమాల్లాగే తెలుగు సినిమాపాటల్లోకూడా భైరవి రాగం ఎన్నోసార్లు వాడుకలోకి వచ్చింది. శాస్త్రీయసంగీతం ఎప్పటికీ పాతబడదు. మౌనంగానే ఎదగమనీ అనే ఇటీవలి పాటకు కూడా భైరవి రాగమే ఆధారం. అయితే ఈ రాగాన్ని పాత సంగీతదర్శకులు చేపట్టిన తీరే వేరు. ఉదాహరణకు సుసర్ల దక్షిణామూర్తి సంసారం చిత్రానికి చేసిన పాట వినండి. అలాగే ఆదినారాయణరావు అనార్కలీ కోసం స్వరపరిచిన యుగళ గీతం కూడా. వీటన్నిటికీ ముందే ఘంటసాల చేసిన కీలుగుర్రం పాట జనాదరణ పొందింది.
చాలాకాలం క్రితం మానాన్న కుటుంబరావుగారు వినడానికి హాజరైన ఒక బొంబాయి సంగీత సమావేశంలో ఎవరో గాయకుడు తనదే చివరి కచేరీ అన్న అపోహతో భైరవి పాడి లేచాడట. అతని తరవాత వచ్చిన పాటగాడికి ఏం చెయ్యాలో పాలుపోక భీంపలాస్ పాడితే అది రక్తికట్టిందట. ఈ రెండు రాగాల విచిత్రమైన కాంబినేషన్ బంగారుపాపలోని ఈ పాటలో వినిపిస్తుంది. దేవులపల్లి రచన ఈ పాటకు నిజమైన హైలైట్. సంగీతదర్శకుడు అద్దేపల్లి రామారావు మొదటి ఆలాపనకూ, చరణాలకూ భీంపలాస్ వాడి, పల్లవికి భైరవి ఉపయోగించారు.
ఎస్. రాజేశ్వరరావు భైరవిలో ఆర్. బాలసరస్వతితో కలిసి పాడిన ఈ పాటకు స్వరరచన ఆయనదే. బాలసరస్వతి శ్రుతి బాగా తక్కువ కనక ఆయన హెచ్చుశ్రుతిలోనే పాడవలసివచ్చింది. ఆ తరవాత ఈ రాగంలో ఆయన ఎన్నో మంచిపాటలు చేశారు. ఏమిటో ఈ మాయ (భావయుక్తం), అనురాగాలు దూరములాయెనా (విరహం), ఏమని పాడెదనో (విషాదం) (శ్రీశ్రీ రచనేకాక, చిట్టిబాబు వీణకూడా దీని ప్రత్యేకత), నడిరేయి ఏ జామునో (భక్తిరసం, చిట్టిబాబు వీణ) మొదలైనవన్నీ ఆయన ప్రతిభకు మచ్చుతునకలే.
– ఘంటసాల సంగీతంలో సుశీల పాడిన కనులు తెరచినా అనే పాటకూడా భైరవే.
– హిందూస్తానీపద్ధతిలో మన నఠభైరవి మేళకర్తను పోలిన జంగ్లా భైరవి అనే రాగాన్ని ఠుమ్రీలకు ఉపయోగిస్తారు. బడేగులాంఅలీఖాన్ పాడిన ఈ పాట ప్రసిద్ధమైనది.
– ఈ శైలిలో తలత్ మహ్మూద్ పాడిన ఒక మంచి పాట ఉంది.
– ఖయ్యాం సంగీతరచనలో బేగం అఖ్తర్ పాడిన ఈ భైరవి గజల్ చాలా బాగుంటుంది.
– బడేగులామలీ తమ్ముడు బర్కత్ అలీకూడా ఉన్నతస్థాయి ఠుమ్రీ గాయకుడు. ఆయన ఎక్కువగా అన్నగారి పక్కన హార్మోనియం వాయించేవాడు. ఆయన పాడిన ప్రసిద్ధమైన బాజూబంద్ ఖుల్‌ఖుల్ జాయే అనే ఠుమ్రీ చాలా బావుంటుంది.
భైరవి రాగం గురించిన చర్చ సినిమాపాటలతో ముగించడం ఇష్టంలేకనే నేను కొన్ని ప్రశస్తమైన హిందూస్తానీ రచనలు ఇక్కడ ఉదహరించాను. ఈ రాగం పాడని ఉద్దండులు (అమీర్‌ఖాన్ వగైరాలు) చాలా తక్కువమందే ఉంటారు. అందుకని ఈ సంగీతాన్ని ఎడతెగకుండా వింటూనే ఉండవచ్చు. సంగీతంతో తగినంత పరిచయం లేనివారు రాగమంటే ఏమిటని అడుగుతూఉంటారు. పైన చెప్పిన ఉదాహరణలన్నీ విన్నాక మీకు మొత్తంమీద బావుందనిపిస్తే అందుకు కారణం రాగంలోని సంగీతపరమైన భావమే. దానికి సాహిత్యంతో ఎక్కువ ప్రమేయం ఉండదు.
