గానభారతి

ఆ మఱునాఁడె నిల్చె నెల, ఆగె ఋతుస్రవణంబు, యానముల్
గోముగఁ గొంచెమయ్యెఁ, బలుగొంచెపుఁగౌఁను క్రమక్రమంబుగా
లేమినిఁ బాయఁజొచ్చె, లవలీదళపాండురమయ్యె గండముల్,
కామవరప్రసాదమనఁగన్ సమకూడిన గర్భమందునన్.

కనులను వత్తివైచుకొని కాంచితి నిత్యము వానిపత్త్ర మే
క్షణమున వచ్చునో యనుచుఁ, గాని సమస్త మెడారిభూమిలోఁ
జినుకులకై నిరీక్షణము సేయుట యయ్యెను, మూఁడుమాసముల్
చనియెను గాని పత్త్రముల జాడలు లేవిక నేమి సేయుదున్?

చనెనో ఘోరరణంబున,
మనెనో మఱియొకమగువకు మనసిచ్చి యటన్,
వినెనో కొండెంబులు, మఱి
కనెనో నాపైఁ గినుకను కాకున్న యిటుల్.

తలలో నాల్కవలెం, బూ
సలలో దారంబుమాడ్కి సరసుండై నన్
వలపించిన చెలువుం డా
వల నొక పత్త్రంబునైన వ్రాయక యున్నే!

అని చింతించుచు శోకవహ్ని ఘన దావాగ్నింబలె న్మానసం
బును దగ్ధంబొనరింపఁగాఁ, దనువు గ్రీష్మోత్తప్త సంమ్లానగు
ల్మినిచందంబున నీరసింప, ముఖ మామీలజ్జలేజంబు చా
డ్పున త్యక్తప్రమదప్రభాకలితమై పోలంగ నేనుండఁగన్.

ఒకనాఁడు హఠాత్తుగ నా
కొక పత్త్రము వచ్చె, దాని నురుసంభ్రమకౌ
తుకసంయుతచేతంబునఁ
జకచకఁ దత్క్షణమ విప్పి చదువఁగ సాగన్.

కూలితి నేలకుం బిడుగు కూల్చిన పర్వతకూటమట్లు,వా
తూలనిపాతితాయతమధుద్రుమమట్లుగ, నట్లు నేలకుం
గూలఁగ నాదుగర్భమునఁ గూరెడు భ్రూణముగూడ నేలకుం
గూలిపడెం గభిల్లుమని, కుల్యలు గట్ట నసృక్ప్రవాహముల్.

ఆతఁడు యుద్ధమందు హతుఁ డయ్యెనటంచు వచించె లేఖ, లో
నాతని చిహ్నమై పడిన యర్భకుఁడున్ గతియించె, నింక దుః
ఖాతిశయంబె నా శరణ మయ్యెను, తత్స్మరణంబు దోఁచు నా
చేతమునందు నెప్డపుడు చేరుదు నీ సుమకుంజవాటికిన్.

ఈ కుంజమె నా సుఖదుః
ఖాకృతులకు సాక్షి, దీని నరయఁగ వత్తున్
ఏకాంతంబుగ మఱిమఱి,
నా కరుణాత్మకకథయిది, నళినజకులజా!”

అని యా సుందరి స్వీయఘోరచరితాఖ్యానంబు గావింపఁగన్
విని డెందంబు ద్రవింప, సారకరుణాన్వీతుండనై పల్కితిన్,
“వినుమింతీ! భవదీయదుఃఖపటలీవిశ్రాంతిమార్గంబు నే
వినిపింతున్ వలనైనయంతవఱకున్ విజ్ఞాన మున్నంతగన్.

చక్కనిరూపము న్మిగుల చక్కని తేజము, పల్కుపల్కునం
జక్కెరలీను కంఠరుతి, సామ్యమెఱుంగని హావభావముల్
చక్కగఁ గూడె నీ కిల నసాధ్యము లే దెది గాన నింకఁ బైఁ
జిక్కిన జీవితంబును రచింపుము సత్కళ కంకితంబుగన్.

కమ్మని నీకంఠంబునఁ
గిమ్మనకుండన్ వసించు గీతాకృతితో
బమ్మవెలందుక కావునఁ
గొమ్మా గాంధర్వవిద్య కోవిద వగుచున్.

ఆవిధి నుత్తమంబయిన యాశయమున్ మది నెంచి, దానికై
జీవిత మర్పణం బొనరఁ జేసినఁ జేకురు శాంతి, యన్యమౌ
జీవనసౌఖ్యము ల్వెతలుఁ జెందును నంగము లౌచు దానికిం
గావున నిట్టి మార్గమును గైకొనఁజెల్లును నీకుఁ గోమలీ!”

అనుచున్ నాకుం దోచిన
యనునయవాక్యంబు లేవొ యట నే నంటిన్
కనెనో లేదో వానిం
గనకాంగి సమంజసముగఁ గానఁగనైతిన్.

ఆవలఁ గాలచక్రమున హాయనముల్ గతియించె నెన్నొ, నే
నో విమలప్రభాతమున నోపికతోఁ దిలకించుచుండఁగా
“టీవి”ని గంటి నాసుదతి స్టేటుగవర్నరు గారవించె కీ
ర్త్యావహ”గానభారతి” సమాఖ్య యొసంగి యటన్న దృశ్యమున్.


రచయిత తిరుమల కృష్ణదేశికాచార్యులు గురించి:

డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు ప్రముఖ కవి, పద్యనాటక కర్త. ఆధునిక సాహిత్యంలో పద్యరచనతో పాటు అనేక అరుదైన ఛందోరీతులను ప్రయోగించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. వీరు రచించిన హనుమప్ప నాయకుడు – రాయలసీమ ప్రాంతానికి చెందిన చారిత్రక వీరుని ఇతివృత్తంగా 1986లో రాసిన పద్యకావ్యం. మహాశిల్పి జక్కన చరిత్రము, శిల్పకళా వైభవాన్ని, జక్కన జీవితాన్ని వర్ణిస్తూ సాగిన పద్యకావ్యం.ఇతర రచనల్లో ‘ఋతుసంహారము’ (కాళిదాసు రచనకు అనువాదం), ‘గానభారతి’, ‘పూర్వప్రయోగచంద్రిక’ ముఖ్యమైనవి. సాహిత్యంలో నిష్ణాతులైన వీరు పద్యరచనలో నూతనవృత్తాలను (వసంత కోకిల, నయాగరా, మనోరమా మొదలైనవి) సృష్టించి ఛందోవైవిధ్యాన్ని ప్రదర్శించారు.

 ...