గానభారతి

చూతముఁ జూచుచుఁ, గుసుమవ్రాతము సిగలో దూర్చుచు,
వల్లరులందున నూఁగుచుఁ, బల్లవముల మెయిఁ జేర్చుచు,
కుముదంబుల యందంబులు ప్రమదంబునఁ గొనియాడుచు,
శాదంబుల మృదుతలముల మోదంబునఁ దిరుగాడుచు,
కొలనుల నొరయుచుఁ దిరిగెడి వలిగాలికిఁ బులకించుచు,
భ్రమరంబుల విరికన్నెలు దమిఁ గూడుటఁ దిలకించుచు,
శ్వేతగరుత్తుల పదగతు లాతురతం గమనించుచు,
సురుచిరమగు నీ తోఁటను చరియించుచుఁ గట్టెదుటన్.

నేనిపుడున్న కుంజమును నిర్మలపాండురరమ్యమల్లికా
సూనసువాసితంబయిన సుందరహర్మ్యముఁ గాంచి యందులో
సూనశరాస్త్రసన్నిభుని సుందరవక్త్రుని దీర్ఘబాహునిన్
మానవతీవశంకరుని మానిసి నొక్కని గంటి వింతగన్.

ఆతని గాంచినంత హృదయాబ్జము ఝల్లనె, సోగకన్నులన్
బ్రాతిగఁ గల్వలే విరిసె, వక్త్రము దాల్చెను నూత్నరక్తిమన్,
వాతవిచాలితంబయిన వల్లరిభంగి చలించు మేన సం
జాతము లయ్యెఁ బుల్కలును, సాంద్రనిదాఘపృషంతిసంతతుల్.

ఆతఁడు నన్నుఁ గాంచగనె యాతనివక్త్రము సైత ముబ్బె సం
ధ్యాతతరాగపూర్ణసుషమాంచితమై, చలియించెనోష్ఠముల్,
నూతనకాంతివెల్లువలు నూల్కొనెఁ గన్గొనలందు, లోని రా
గాతిశయంబు పైకుబికి కంపమునందఁగసాగె దేహమున్.

మాటలు లేవు; లోన నొకమాటును బాటిల లేదు వానిపై
నాటిన ప్రేమ మర్హమొ, యనర్హమొ యన్న వితర్కబుద్ధి, వే
ర్పాటును దాళలేక ప్రసభంబున నాతనిచెంత కేఁగి బల్
గాటముగాఁ గవుంగిటను గప్పితి వానినిఁ దత్క్షణంబునన్.

అట్లు కౌఁగిట నుద్భవంబైన మాదు
ప్రణయబంధంబు మూఁడుపుష్పంబు లాఱు
ఫలములుగఁ బరివృద్ధమై వెలయసాగె;
ప్రత్యహంబును నది బలపడఁగసాగె.

హరిచందనామోదభరితంబులై వీచు
         మలయానిలంబులు మలయుచుండ,
సహకారములఁ జేరి సవరించి గొంతుకల్
         పరభృతంబులు పాట పాడుచుండ,
సౌగంధికోత్పలసౌరభంబులు సోఁకి
         చిత్తంబు మత్తిల్లఁ జేయుచుండ,
రాకేందుచంద్రికల్ లోకంబు సర్వంబు
         శృంగారకలితంబు సేయుచుండ,
మల్లికామాధవీలతావేల్లితంబు,
విధుశిలామయవేదికావిలసితంబు,
నైన నీ పుష్పకుంజంబునందు మేము
దేలితిమి సారశృంగారకేళులందు.

ఈ రీతిగ మేముండఁగ
జారెను మాసములు కొన్ని క్షణములరీతిన్,
వేరేదియుఁ జింతింపక
ఆరుచిరాంగునె తలఁచితి ననిశము నేనున్.

అంతట నొక్కనాఁడు కఠినాశనిసన్నిభమైన వార్త న
న్నెంతయొ ఖిన్నురాలి నొనరించె, హఠాత్తుగ మత్ప్రియుండు ఖం
డాంతరమందు నాహవమునందునఁ బోర నియుక్తుఁడయ్యె, లో
నింతయు జంకు లేక యతఁ డేఁగెను యుద్ధమునందుఁ బోరఁగన్.

కొలఁదియెఱుంగనట్టి పెనుకుందున గద్గదఖిన్నకంఠినై
సలుపఁగ వీడుకో లతఁడు సాంత్వనముల్ వచియించె నిట్లు, “నా
వలపులరాణి! నిన్ను నెడఁబాసి మనంగలనే? నియోగ మీ
పొలుపున వచ్చెఁదప్ప దిఁకఁ బోవక, ఐ నను నాలకింపుమా!

ఆలంబున జయలక్ష్మీ
లాలితుఁడ నయి మఱల నిను లాలింతు సఖీ!
బేలతనంబున వనరుట
లేలా నీ కివ్విధమున నేణీనేత్రీ!

మఱతునె నీదుకూరుములు? మంజులమాధవమాసవేళలం
బరిణతచంద్రికాన్వితవిభావరులందున ఫుల్లమల్లికా
పరిమళపూర్ణకుంజములఁ బాటిలినట్టి మనోజ్ఞబంధముల్?
తరళవిలోచనా! వినుము దప్పక వత్తును నిన్నుఁ జేరఁగన్.”

అని నను గాఢాలింగన
మునఁ బెనవైచి యతఁడు రణమునకుం జనియెన్
మునుకొని యప్పటినుండియు
ఘనమగు కడగండ్లు నన్నుఁ గాఱించె కవీ!