మూడు లాంతర్లు – 5

8.

ఇప్పుడు వీస్తున్న గాలి అని నాలుగేళ్ళ కిందట sify.comలో వరుసగా వచ్చింది. చాలా మంది సృజనకారుల గురించి రేఖామాత్రమైన వ్యాఖ్యల్లాగ. ఈ రచయితల్లో రకరకాల ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నవాళ్ళు, చాల భిన్నమైన నేపధ్యాల్నుండి వచ్చినవాళ్ళూ ఉన్నారు. ఆ చిత్రాలు చదివితే సృజనతో వాళ్ళది అవినాభావ సంబంధమని బోధపడుతుంది.

ద్విధా భజ్యేయమప్యేవమ్ న నమేయమ్ తు కస్యచిత్|
ఏషా మే సహజో దోష: స్వభావో దురతిక్రమః ||

వాల్మీకి రామాయణం లోనిది ఈ శ్లోకం – నేను రెండు ముక్కలైపోయినా సరే గాని ఎంతమాత్రం వంగను సుమా! ఇది నాకు సహజంగా వచ్చిన దోషం. స్వభావాన్ని కాదని బతకడం ఎవరి తరం? అని దీని భావం. దేశ దేశాల్లోని సృజనకారుల చరిత్రలు చదివితే వాళ్ళ స్వభావమే ఈ తీరు అని తోస్తుంది. ఆబ్రహం మాస్లో (Abraham Maslow) అని మనస్తత్వ శాస్త్రజ్ఞుడు. మనుషుల ప్రవర్తనల వెనుక చోదక శక్తుల్ని గురించి పరిశోధించి ఆయన A Theory of Human Motivation అని ప్రతిపాదించినది సృజనశీలి స్వభావాన్ని విశదం చేసే ప్రయత్నం చేస్తుంది. మనుషులందరికీ అవసరాలు (Needs) అనేకం ఉన్నాయనీ, ఇవి ఒక క్రమానుసారం తీర్చుకోవటం అనివార్యమనీ ఆయన ప్రతిపాదించేడు. ముందు ప్రాధమికం, జాంతవమైన అవసరాలు – గాలి, నీళ్ళు, తిండి, నిద్ర ఇలాంటివి; ఇవి తీరేక ఆరోగ్యం, భద్రత; ఆపైన కుటుంబం, సంఘం, స్నేహాలు, సంబంధాలు; ఆపైన పరువు, ప్రతిష్ట, ఇతరుల నుండి మన్నన, గౌరవం; అవి తీరేక అప్పుడు తమకు సహజంగా అబ్బిన ప్రతిభా పాటవాల్ని అభ్యాసం చేసి వెలికితెచ్చుకోవలసిన అవసరం – ఇలాగ. ఈ చివరిదాన్ని ఆయన Self-actualization Needs అని ప్రతిపాదించేరు. ఇవి ముఖ్యంగా సృజనశీలతకు సంబంధించిన అవసరాలు. మనిషి ఏమేం కావటానికి అతని సహజమైన స్వభావంలో అవకాశం ఉందో అతను అవన్నీ అయ్యే తీరాలి (”What a man can be, he must be. It is a tendency to become actualized in what he is potentially. …the desire to become more and more of what one is, to become everything one is capable of becoming.”) భేతాళ కధల్లో ‘ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పకుండా మౌనం వహించావో, నీ తల వెయ్యి చెక్కలవుతుంది’ అని శపించినట్లుగా ఉంటుంది సృజనశీలికి మాస్లో హెచ్చరిక: నీకున్న పాటవాన్నంతట్నీ నీ వ్యక్తిత్వంలో వ్యక్తీకరించుకోకుండా దాచిపెట్టుకుంటే జీవితాంతం దుఃఖపడతావు (”If you deliberately set out to be less than you are capable, you’ll be unhappy for the rest of your life.”); తనతో తాను సమాధానం పడాలంటే మనిషి గాయకుడైతే పాడేతీరాలి, కవైతే కవిత్వం కట్టే తీరాలి (”A musician must make music, an artist must write, if he is to be ultimately at peace with himself. What a man can be, he must be.”) “బుద్ధిగా, హాయిగా రాసుకో!” అని నారాయణ రావుగారు; “రాస్తేనే మంచిదివై! రాసేస్తే గాని లోపలేముందో తెలీదు కదవై! రాసేస్తేనే కదా – It comes out. That is healthy!” అని త్రిపుర.

మాస్లో అవసరాల పట్టికలోని అనుక్రమం (hierarchy of needs) సృజనల్లో రాజీ, ‘జూటా’ ఎలా ప్రవేశిస్తాయో సూచిస్తుంది. ముందుగా దిగువనున్న అవసరాలు తీర్చుకొనే తీరాలి. లేదంటే పై అవసరాలు జ్ఞప్తికి రావు అని ఆయన సిద్ధాంతం. ఈ అవసరాల్లో ఆకలి, భద్రత, స్నేహం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ సృజన కంటే ముందున్నాయి. సర్వ సాధారణంగా ముందు అవన్నీ పూర్తిగా, సంతృప్తిగా తీరిన తరువాతే సృజన అవసరం ముందుకొస్తుందని ఆయన అనేకమందిని పరిశీలించి చేసిన నిర్ధారణ. అయితే కొద్దిమందిలో మాత్రం వాళ్ళ స్వభావాలు ఈ నియమాన్ని అతిక్రమించడం ఉంది. ఉదాహరణకు కొద్దిమంది మనుషులకి ప్రేమ, అభిమానం కంటే కీర్తి, ప్రతిష్ట (respect of others, achievement, self-esteem) ఎక్కువ ముఖ్యం. అలాగే ఇంకొద్దిమందిలో సృజనశీలత ప్రబలంగా ఉండి, మిగిలిన అవసరాలని ధిక్కరించి ప్రస్ఫుటమౌతుందని ఆయనే చెప్పుకున్నారు. మర్యాద సృజనకు ఎందుకు అడ్డం వస్తుందో మాస్లో సిద్ధాంతంలో కొంత వరకు గోచరమౌతుంది. జీవిక కోసం, సంపాదన కోసం తమ కాల్పనిక శక్తిని అసంతృప్తికరంగానే అయినా రక రకాల వ్యాపారాలకోసం వినియోగించిన కవులు, కళాకారులూ ఎందరో ఉన్నారు. జీవిక కోసం కాకపోయినా, తమ భద్రతకు, ఉనికికి, హక్కులకు, గౌరవానికే మౌలికంగా ప్రమాదం ఉన్న సమాజాల్లో సృజనను, కళను తమ భద్రతనూ గౌరవాన్నీ పరిరక్షించుకోవటం కోసం వినియోగించే ప్రయత్నాలే సాహిత్యంలో ఉత్పన్నమయ్యే ఉద్యమ ధోరణులు. ఆలాగే, జీవిక కోసమూ, హక్కుల కోసమూ కాకపోయినా సరే సాహితీ వ్యాసంగాన్ని, కళను తమ పరువు, ప్రతిష్ట, వీటికి సమీప అవసరాలైన సామరస్యం, అభిమానం, స్నేహ పురస్సరమైన మర్యాదలకు (belongingness needs) నిబద్ధంగానే నిర్వహించుకోవటం కూడా ఆయా స్వభావాల్లో ఈ అవసరాల ప్రాధాన్యతను సూచిస్తుంది. మన ప్రవర్తనలో, మనస్తత్వంలో ఇవి సహజమైన స్వభావాలే గాని, నికార్సైన, సంతృప్తికరమైన సృజనకు – అంటే self-actualization అని మాస్లో నొక్కిచెప్పిన లక్ష్యానికి ఇవన్నీ ఏదో ఒక మేరకు అడ్డంకులు. సృజనశీలత తీవ్రమైన స్వభావంగా ఉన్నవాళ్ళలో సృజన ఈ అనుక్రమాన్ని ధిక్కరించి – అంటే సంపాదన, మర్యాద, ప్రతిష్ట, సామరస్యం, సుహృద్భావం మొదలైన అవసరాలన్నిట్నీ కాదనుకొని – మొట్టమొదటి అవసరంగా ఆవిష్కృతమౌతున్నాది. ఇలాంటివాళ్ళ వెర్రిని eccentricity అన్నారు. దీనిమీద చదువుకుంటే ఎంతో ఉపయోగకరమైన పరిశోధనలున్నాయి.

ఆధునిక సమాజాల్లోన ప్రాధమిక అవసరాలు – కనీసం తిండి, బట్ట లాంటివి, దాదాపుగా అందరికీ తీరుతున్నాయి. కాని, సాంఘిక అసమానతలు ఇదివరకటిలాగే, అంతకంటె తీవ్రంగా ఉన్నాయి. వివక్షకు, పీడనకు గురయ్యే వర్గాల్లోన సృజనశీలురైన వాళ్ళందరికీ సహజంగానే ఈ అవసరాలు తీరటంలేదన్న స్పృహ, వేదన ఉండితీరుతాయి. ఆ కష్టం ఏమిటో అనుభవించనివాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ. అంటే – బాధపడితే గాని బోధపడదు. గాంధీజీ స్వయంగా వివక్షకు, అవమానానికీ గురయినందుకే ఆయనకు పౌరుషం వచ్చిందని అంటారు. స్వయంగా పేదలై, ఆడవాళ్ళై, దళితులై, వికలాంగులై, దుర్బలులై ఆ కష్టం, అవమానం ఏమిటో అనుభవిస్తే అప్పుడది అంతరంగంలో ప్రజ్వరిల్లుతూ ఆ మనిషి స్వభావాన్ని నిర్దేశిస్తుంది. ఇలాంటి మనుషులు సృజనశీలురైతే, వాళ్ళ సృజనకు రెండురకాల స్వభావాలుండే అవకాశం ఉంది. ఒకటి – వాళ్ళు వస్తుతః బలమైన సృజనకారులు కానట్లయితే వాళ్ళ అభివ్యక్తిలో సృజన కంటె సాంఘిక అవసరానిది, వేదనదే పైచేయి అవుతుంది. అయినప్పటికీ ఆ వేదనను, అవసరాన్నీ స్వయంగా తామే అనుభవించి ఉన్నారు కాబట్టి వాళ్ళ సృజన ‘మా నిషాద!’ వాక్యం లాగ సత్యం గాను, విశ్వసనీయం గానూ ఉంటుంది. ఇంతకు మించి, ఆ మనుషులే స్వయంగా బలమైన సృజనకారులు కూడా అయితే అప్పుడూ వాళ్ళ జీవితానుభవమూ, సృజనానుభవమూ రెండింటికి రెండూ ప్రబలమైనవే కాబట్టి, రెండిట్లో ఏ ఒక్కటీ ‘జూటా’ కావు కాబట్టీ వాళ్ళ సృజనలు విశేషంగా అలరిస్తాయి. బాధపడితే గాని బోఢపడదు అన్నదాన్ని గురించి నారాయణరావు గారు చెప్పింది ఏమంటే – ఇంకొకరి కష్టసుఖాల్ని, వాళ్ళ అనుభవాల్ని అన్నింటినీ స్వయంగా అనుభవించడం మనలో ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. కాని బోధపడేటట్టు చెప్పడానికి వ్యాసాల కంటే, ప్రవచనాల కంటే, మనస్తత్వం, సాంఘిక శాస్త్రం వంటి శాస్త్రాల కంటే కూడా కాల్పనిక సృజనే ఎక్కువ శక్తివంతమైనది అని. ఈ మాట నిజమేననిపిస్తుంది. ఎందుకంటే కాల్పనిక సృజన, కళారూపాలు సాధించగలిగింది అంతరంగాల నడుమ ఔద్వేగిక సమన్వయం. మిగిలినవన్నీ సాధించేది ప్రధమంగా బౌద్ధిక సమన్వయం. దానికి అనుభవాల్ని అనువదించడానికీ, ప్రవర్తనను ప్రభావితం చెయ్యటానికీ ఉద్వేగానికున్నంత శక్తి ఉండదు.

మొదట చెప్పిన అయిదు అవసరాలు – శారీరకావసరాలు, భద్రత, ప్రేమాభిమానాలు, ప్రతిష్ట, సృజనశీలత – కాకుండా ఇంకొకటి తాత్విక జిజ్ఞాసను (transcendental need) చేర్చి ఈ ఆరు అవసరాలూ మనుషుల ప్రవర్తనల్ను నడిపించే చోదక శక్తులని మాస్లో నిర్ధారించేరు. వీటిలో చివరిది సృజనశీలత కంటె కూడా పైది. చిత్రంగా మన ప్రాచీన లాక్షణికులు, సృజనకారులలో కొందరు సృజనకు, తాత్విక జిజ్ఞాసకూ ఉన్న సంబంధాన్ని ఇలాగే అర్ధం చేసుకున్నారు. ‘సాహిత్యమ్ రసానందమ్ బ్రహ్మానంద సహోదరమ్‘ వంటి వాక్యాల్లోన, సారస్వత సృజన అనుభవం యోగి అనుభవానికి సబ్రహ్మచారి అనీ, యోగుల అనుభవమైన నిర్వికల్ప సమాధికి సమీపమైన లౌకికానుభవమనీ పాతకాలం వాళ్ళు వందలాది మంది నొక్కిచెప్పిన మాటల్లోన ఇది విశదమౌతుంది. ఇటీవలి కాలంలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారిదీ ఈ దృక్పధమే. వేమన కవి అవునా కాదా అన్న ప్రశ్నను చర్చిస్తూ ఆయన ‘వేమన కవి కంటె ప్రబలంగా యోగి. యోగి కవి కంటె పైమెట్టు మీది వాడు. ఆయన్ని క్రిందికి లాగి కవి అని ప్రకటించాలని ఎందుకు ఆరాటపడతారు?’ అని ఎదురు ప్రశ్న వేస్తారు. మాస్లో అనుక్రమంలో మర్యాద సృజనకు ఎలాగైతే అడ్డం పడుతోందో, అలాగే సృజన తాత్విక జిజ్ఞాసకూ అడ్డం వస్తోంది. చలంగారు ముందు మర్యాదను ఛీత్కరించుకొని సృజనను ఆశ్రయించి, ఆ పైన సృజననూ తిరస్కరించి తత్వాన్ని ఆశ్రయించేరు – మాస్లో మెట్ల నిచ్చెనను ఒక్కో మెట్టే ఎక్కుతున్నట్లుగా! త్రిపుర వెదుకులాట చలంగారు చివరి మజిలీ అనుకున్న చోటనే మొదలయ్యి, ఏ గమ్యం మార్గం లేకుండానే చప్పున ముగిసి మౌన వ్యాఖ్యగా చల్లారిపోయింది. అది సృజనను తిరస్కరించటం లేదు. తృష్ణను, చాపల్యాన్ని, కపటాన్ని, మర్యాదనూ తిరస్కరించటం లేదు.

సృజన అనుభవాన్ని పరిశోధిస్తున్న ఆధునికులు చిక్సెన్ట్‌మిహాయీ మిహాయీ (Csikszentmihalyi Mihaly)వంటి వాళ్ళ నిర్ధారణలు, స్వయంగా సృజనకారులైన పాశ్చాత్యులు చెప్పుకుంటున్నవీ పట్టిచూస్తే చిత్రంగా ఉంటాయి. వాటిని చలంగారు, నారాయణాచార్యులుగారు, త్రిపుర ఇలాంటి సృజనకారులందరి అవగాహనల్తో పోల్చి పరామర్శించవచ్చు.

(ఇంకా ఉంది)


రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ ‘ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, ‘బర్సాత్‌ మే బిల్లి’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...