వెంటనే ఫోనందుకుని, టాక్సీని పంపమని చెప్పడానికి నెంబర్ డయల్ చేయసాగాడు. కాని అంతలోనే ఓ క్షణం ఆగాడు. “ఇలా చేయడం వల్ల నాకు ఎయిడ్స్ సోకే ప్రమాదం లేదు కదా?” అని ప్రశ్నించుకున్నాడు. హైతీ టాక్సీ డ్రైవర్నుంచి కాదు. అతను ఎన్నో ప్రకటనలు చూసాడు, దినపత్రికలలో చదివాడు – కేవలం స్పర్శ వలన ఎయిడ్స్ సోకదని అతనికి తెలుసు. కాకపోతే అతని బెంగంతా రక్తం తీయడానికి ఉపయోగించే సూదుల గురించే. నిధులు లేకపోవడం వలన ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి కేటాయింపులు బాగా తగ్గించేసింది, కొన్ని ఆసుపత్రులలో దాదాపు సగానికి పైగా గదులను మూసేసారు.
“ఆసుపత్రి వాళ్ళు సిరంజిని మళ్ళీ మళ్ళీ వాడితే నా పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు నా చేతికి గుచ్చేముందుగా సిరంజిని స్టెరిలైజ్ చేయడం చాలా ముఖ్యమని నర్స్‌కి తెలిసుండాలి. కానీ ఆసుపత్రిలో నర్స్ కూడా మా పక్కింటావిడలానే తిక్కదైతే? ఒక వేళ వాళ్ళు డిస్పోజబుల్ సిరంజి వాడినా, నాకు ‘లీజనేర్స్ వ్యాధి’ రాదనే భరోసా అయితే లేదుగా? విజ్ఞానం అభివృద్ధి పుణ్యమా అని, క్రిస్మస్ నుంచి ఈ కొత్త రోగం వల్ల మాంట్రియల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.”
అతను ఫోన్ పెట్టేసాడు.
“ఆవిడ చాలా మంచిది, నిజం చెప్పింది” అంటూ కొత్త సంవత్సరం వచ్చిన రోజు ఓ షాపింగ్ మాల్‌లో ఎదురైన ఓ చిన్న సంఘటనని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు తన భార్య కోసం ఎదురుచూస్తుండగా, ఓ చిన్నపిల్ల దాదాపు అరవై ఏళ్ళున్న ఓ ముసలావిడని ‘సెలవు రోజున ఒంటరిగా షాపింగ్ మాల్‌లో ఎందుకు కూర్చున్నారు?’ అని ఆడగడం అతనికి వినిపించింది.
“ఎందుకంటే, నేను పెద్దదాన్ని! మా లాంటి పెద్దవాళ్ళ బుర్రలు అత్యంత సృజనాత్మకంగా ఉంటాయి. మాకు మేమే ఎప్పటికప్పుడు సమస్యలని, శతృవులని సృష్టించుకుంటూంటాం” అందా ముసలావిడ.
“ఆవిడ చెప్పినది నిజం!” అనుకుంటూ అతను తన చేతి గడియారం కేసి చూసుకున్నాడు. “ఇంత ఆరోగ్యంగా ఉండే నేను – తథాస్తు – ఎవరికో మంచి చేయడం కోసం ఉన్నట్టుండి చావును పిలిచి తెచ్చుకోడమేనేమో ఇది! మంచికి పోయి క్రిస్మస్ కల్లానో, ఈస్టర్ వచ్చేలోపో నేనే చచ్చిపోనూ వచ్చు!”
తలూపుతూ అతను చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకున్నాడు. అతని చేయి వణుకుతోంది. కప్పుని మళ్ళీ గట్టు మీద పెట్టేసాడు.
“నేను సాయం చేయాలి.” పైకే అనుకున్నాడతను. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రక్తదానం చేసాను. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కెనడియన్ హార్ట్ అసోసియేషన్‌కి ఇరవై డాలర్లు, కెనడియన్ మెంటల్ హెల్త్ సొసైటీకి ఇరవై డాలర్లు, ఆర్థరైటిస్ సొసైటీకి పది డాలర్లు విరాళంగా ఇస్తునే ఉన్నాను. ఇవి కాకుండా పదనాలుగు డాలర్ల నలభై మూడు సెంట్లు ప్రతీ వారం ప్రొవిన్షియల్ హెల్త్ ప్లాన్ కోసం కడుతున్నాను. మరి అలాంటప్పుడు – అత్యవసర పరిస్థితుల కోసం ఒక్క పైంట్ ఓ-పాజిటివ్ రక్తాన్ని కూడా నిలువ ఉంచుకోలేని బుద్ధిహీనుల అసమర్థత నా తప్పా? పైగా ఈ మంచుతుఫానులో రోడ్లమీద తిరిగి ఇలా ప్రమాదాలు తెచ్చుకునే వాళ్ళకోసం, ఇంట్లో కూర్చుని ఓ గొప్ప సినిమాని చూడకుండా నేనెందుకెళ్ళాలి?”
ఈ ఆలోచనల జడిలో అతను కొంత చాక్లెట్ డ్రింక్‌ని చేతిమీద ఒంపుకున్నాడు. వాటిని తుడుచుకుంటూ, “హాస్పిటల్‌లో ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తం కోసం ఎదురుచూస్తున్న వారు కూడా నాలానే మహాత్ముడైన గాంధీ గురించిన సినిమా చూద్దామనే, ఆయన జీవితంనుంచి స్ఫూర్తి తెచ్చుకుందామనే అనుకున్నారేమో, కాకపోతే హఠాత్తుగా వాళ్ళింటికి నిప్పంటుకుని ఉండచ్చు; లేదా హాస్పిటల్‌లో పరీక్ష చేసినప్పుడు నిలవ ఉన్న ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తం చెడిపోయిందని తెలిసిందేమో.” అని అనుకున్నాడు.
తన నుదురు మరోసారి రుద్దుకున్నాడు. తలనొప్పి ఎక్కువైపోతోంది. బయట ఈదురుగాలి మరింత ఎక్కువయింది. భార్య మరోసారి గుర్తొచ్చింది. ఆమె ప్రతీ రోజు రాత్రి పదకొండు గంటల కల్లా నిద్రబోతుంది. వార్తలు వినదు. ప్రతీ చలికాలంలోను తన కార్‌ని గరాజ్‌లో భద్రంగా పెడుతుంది. ఆమె కంటే ముందు రోజు పొద్దున్నే నిద్ర లేచి, ఆ చలిలో బయటికెళ్ళి కారు మీద మంచు గీకి, వేడి చేసుకుని ఆఫీసుకెళ్ళాల్సింది తనే అయినా కూడా.
“వాళ్ళ నాజూకుదనం చూసి మోసపోవద్దు” అన్నాడు వాళ్ళ నాన్న అతనితో ఒకసారి. “డాక్టర్ల గదిలో వేచివున్న ఆడవాళ్ళ సంఖ్య కంటే సమాధులలో ఉన్న మగవారి సంఖ్య రెండింతలు ఉంటుంది”
“ఆయనకేం తెలుసని అలా తిట్టడానికి? ఆయన ముగ్గురు భార్యలని సమాధి చేసాడు. పుట్టిన పిల్లల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. తన ఎనభై ఎనిమిదో ఏట గుర్రపు స్వారిలో మజా చేస్తూ, కాలు జారిపడి చనిపోయాడు. ఒకసారి తను “నాన్నా, నీ జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి, నీకేమీ పట్టినట్లు లేదా?” అని తండ్రిని అడిగితే, “నువ్వు చాలా విషయాలకి బెంగపడతావురా” అన్నాడాయన. అతనికది నిజమేననిపించింది. “నా తోటివాళ్ళలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంది తాజా గణాంకాలని గమనిస్తే, క్విబెక్‌లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎనభై శాతం మంది మగాళ్ళేనని తెలుస్తుంది.” అని అనుకున్నాడు.
బయట మేపుల్ చెట్టు కొమ్మలు మరింత గట్టిగా విరిగిపోయేంతగా ఊగుతున్నాయి.
“ఆ ప్రకటన బహుశా ఏ ఆత్మహత్య కేసుకో సంబంధించినదై ఉంటుంది. ఎక్కువమంది చలికాలం అయిపోయే ముందు రోజుల్లో మణికట్లు కోసుకుంటారట. ఎందుకు కోసుకోరూ? అయిదునెల్లపాటు ఈ చలినీ, ఈ పొడుగు రాత్రులనీ, ముసురు బట్టిపోయిన ఆకాశాన్ని చూసి చూసీ, చివరికి మదర్ థెరెసా అయినా సహనం పోయి కిటికీలోంచి దూకేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిరుద్యోగం, హింస, పస్తులు, తీవ్రవాదుల దాడులు, ఆర్ధిక మాంద్యం, ఆమ్ల వర్షాలు, సామూహిక హత్యాకాండ, స్టార్‌వార్స్ రక్షణ వ్యవస్థ, ఇలాంటివన్నీ పక్కన పెట్టినా ఈ చలి బాధ తప్పదు. అయితే మన ప్రియమైన వైద్య వ్యవస్థ మాత్రం – ఇంత నిరాశతో చద్దామని చూసేవారికి ఓ పైంట్ రక్తం ఎక్కిస్తే వారి జీవితం ఆనందమయం అవుతుందని భావిస్తోంది. అయ్యోరామ! వారు రక్షిద్దామని ప్రయత్నిస్తున్న వ్యక్తి బతికి బయటపడ్డాక, నన్నెందుకు బతికించారంటూ వారిని తిట్టుకోకుండా ఉంటాడా? వాళ్ళకి ఆ మాత్రం వివేకం లేదా? ఈ సారి చేయి కోసుకోడానికి ప్రయత్నించినప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాడని గ్రహించరెందుకు? కానీ పాపం మన వైద్యులు మాత్రం రోగి బాధపడుతుంటే చూడలేరు. తాము తీసుకుంటున్న ఘనమైన జీతాలకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తారు లేదంటే తమ సొంత ప్రతిష్టని పెంచుకోవాలని చూస్తారు. ఇలాంటి అపరబ్రహ్మలకి తోడుదొంగగా నేను ఉండాలా?” అనుకున్నాడు.
హఠాత్తుగా అతని కళ్ళ ముందు ఊగిసలాడుతున్న బోడి చెట్టు కొమ్మలు – ఎక్కడో ఆఫ్రికాలోనో లేదా గాంధీ ఉపఖండంలోనో తీసిన ఓ డాక్యుమెంటరీలో, ఎముకల గూడులా ఉన్న చిన్న పిల్లాడిని అతనికి గుర్తు చేసాయి. గాంధీ గురించి ఆలోచించాడు. గత ఎనిమిది నిముషాలుగా తన ధోరణి పట్ల తనకే చిరాకు కలిగింది. గబగబా బాత్‌రూంకి పరిగెత్తాడు. రెండు ఆస్ప్రిన్ బిళ్ళలు మింగాడు. తనపై తనకి కాస్త గర్వం కలిగింది. ఫోన్ అందుకుని టాక్సీ కోసం ఫోన్ చేసాడు.
తన చిరునామా చెబుతుండగా, తను రక్తదానం చేయడానికి పనికిరాననే సంగతి అతనికి స్ఫురించింది.
అతను చివరిసారిగా రక్తదానం చేసి ఇరవై ఏళ్ళయింది. కానీ ఆ సందర్భంలో రక్తం తీసుకోడానికి ముందుగా నర్స్ అతడిని ఎన్నో ప్రశ్నలు అడగడం అతనికి గుర్తుంది. ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న గత ఇరవై నాలుగు గంటలలో అతనేమయినా తలనొప్పికి గానీ వేరే రకమైన మందులు గానీ వాడారా అని! ఈ ప్రశ్న ఎందుకడిగిందా అని అతను ఆలోచించాడు. అంతలో అతనికి జవాబు దొరికింది – ‘రక్తదానం చేసేవారు రక్తం ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటల ముందుగా ఎటువంటి మందులు గానీ ఉపయోగిస్తే, అటువంటి వారి రక్తం రోగికి పనికిరాదు.’
కోపంతో ఫోన్ పెట్టేసాడు. “నేనో మందమతిని, ఈ సంగతి ముందే ఎందుకు గుర్తు చేసుకోలేదు?” అనుకుంటూ తనని తాను తిట్టుకున్నాడు.
కాసేపయ్యాక: “ఈ ప్రకటన విన్న వాళ్ళలో ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం ఉన్నది నేనొక్కడినే అయ్యుండనేమో.”
నుదురు చిట్లించి, తన పరిచయస్తులలో ఎవరికైనా ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం ఉందేమో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు. ఎవరి పేరయినా తడితే, వెంటనే సెయింట్ ల్యూక్ ఆసుపత్రికి వెళ్ళమని చెబుదామనుకున్నాడు. కానీ ఎవరూ గుర్తు రాలేదు. అతను ఆశ కోల్పోలేదు.
“ఈ ప్రకటన విన్నది నేనొక్కడినే అయ్యుండను. మాంట్రియల్లో కనీసం పది శాతం ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం వున్నవాళ్ళయితే వారి సంఖ్య దాదాపుగా రెండు లక్షలుంటుంది. వాళ్ళలో కనీసం ఒక్క శాతం మంది రేడియో ప్రకటన విన్నా, రెండువేల మంది దాతలు దొరికినట్లే.”
కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.
తదుపరి సన్నివేశం – గాంధీ గారి అంత్యక్రియల దృశ్యం నడుస్తుండగా అతను తన సహోద్యోగి బాబ్‌ని తలచుకున్నాడు. వెంటనే ఓ కపటమైన నవ్వొకటి అతని పెదాలపై వెలిసింది. తను పోగొట్టుకున్న అయిదు డాలర్లను రాబట్టుకునే మార్గం – ఊహూ, అంతకంటే ఇంకా ఎక్కువే, దానికి రెట్టింపు పొందే ఉపాయం అతనికి తట్టింది. సోమవారం ఆఫీసుకి వెళ్ళగానే బాబ్‌తో పందెం వేస్తాడు. “బాబ్, ఓ ప్రశ్న అడుగుతాను. నువ్వు మూడు సార్లు ప్రయత్నించి సరైన జవాబు చెబితే నీకు పది డాలర్లు ఇస్తా. ప్రశ్న ఏంటంటే : పది నిముషాలలో తేలికగా, సంతృప్తికరంగా ఓ పౌండ్ బరువు తగ్గడం ఎలా?” అని అడుగుతాడు. ఈ ప్రశ్నకి జవాబు తెలియని బాబ్ నోరెళ్ళబెడతాడు. అప్పుడు అతను బాబ్‌ని వెక్కిరిస్తూ, “ఓరి దద్దమ్మా, ఓ పైంట్ రక్తం దానం చేస్తే సరి” అని అంటాడు.
ఫ్రెంచ్ మూలం – లె అద్మిరాచుర్ దె గాందీ. రచయిత: పాన్ బూయూకాస్. ఈ అనువాదానికి పాల్ కర్టిస్ డా (Paul Curtis Daw) ఆంగ్లసేత “Gandhi’s admirer” ఆధారం.
