కాంచి యమకంలో ఒకే పదం వెంట వెంటనే వస్తుంది. కానీ మొదటి పదంలో ఒకటి కానీ రెండు కానీ అక్షరాలు రెండోసారి వచ్చిన పదంలో త్యజించబడతాయి. ఉదాహరణకి ఈ సంస్కృత శ్లోకం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.
యమే యమే చంద్రవతినాం ద్రవతినాం
వ్యక్త వ్యక్త సరజనినాం రజనినాం
ఫూలే ఫూలే సంభ్రమరే భ్రమరే వా
రామ రామ విస్మయతే వా స్మయతే వా
చంద్రవతినాం లో చం విసర్జించబడి వేంటనే ద్రవతినాం అని వచ్చింది. సంభ్రమరే లో సం వదిలేసి భ్రమరే అని వస్తుంది. ఇదే పద్ధతి మిగతా పాదాల్లోనూ ఉంది. ఇటువంటి ప్రయోగాన్నే కాంచి యమకం అంటారు. పైన సంధాష్ట యమకానికి ఉదాహరణగా చెప్పుకున్న ‘లాలి లాలియని’ కృతిలో ఈ కాంచి యమకం వుంది. పల్లవిలో ‘వనమాలి మాలిమి’ ప్రయోగమూ, చరణాల్లో ‘మహానుభావ భావమున’, ‘నిష్కామ కామ’, ‘మాయాదారి దారి’, ‘త్యాగరాజ రాజ’ వంటి విరుపులు ఈ కాంచి యమకానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఆమ్రేడిత యమకం, చతుర్వ్యవస్థ యమకం, మాల యమకం వంటివి కూడా ఉన్నాయి. ఏదో ఒక కృతిలో, ఒక చరణంలో ఈ యమక ప్రయోగాలు కనిపిస్తాయి. మిగతా యమకాలతో పోలిస్తే వీటి ఉపయోగం త్యాగరాజు కృతుల్లో అంత ఎక్కువగా కనిపించలేదు.
షష్ఠ్యంతములు
విభిన్న శబ్దాలంకారాలే కాకుండా విభక్తి ప్రత్యయాలు కూడా త్యాగరాజు వాడిన ముద్రల్లో కనిపిస్తాయి. ఉదాహరణకి:
త్యాగరాజో విరాజతే – (ప్రథమా విభక్తి)
త్యాగరాజం భజరే – (ద్వితీయా విభక్తి)
త్యాగరాజం భజేహం – (ద్వితీయా విభక్తి)
త్యాగరాజేణ సమ్రక్షితోహం – (తృతీయా విభక్తి)
త్యాగరాజాయ నమస్తే – (చతుర్థీ విభక్తి)
త్యాగరాజాదన్యం – (పంచమీ విభక్తి)
శ్రీ త్యాగరాజస్య భక్తో – (షష్టీ విభక్తి)
పైన చెప్పిన సంస్కృత విభక్తులే కాకుండా తెలుగు విభక్తీ ప్రత్యయాలు కూడా త్యాగరాజు కృతుల్లో వున్నాయి. ముఖ్యంగా షష్ట్యంతాలనుపయోగించి కొన్ని కృతులు కూడా స్వరపరిచాడు. విభక్తీ ప్రత్యయాల్లో షష్టీ విభక్తికి చాలా ప్రాముఖ్యతుంది. షష్టీ విభక్తి ప్రత్యయాన్ని వాడే పద్ధతిని షష్ట్యంతాలంటారు. తెలుగులో యొక్క, కి(న్), కు(న్), లో(న్), లోపల(న్) లను షష్ఠీ విభక్తి ప్రత్యయాలని వ్యవహరిస్తారు. ఈ షష్ట్యంతాలను కావ్యాల్లో విరివిగా వాడారు. కావ్యం మొదలు పెట్టేటప్పుడు ప్రార్థనా పద్యాలకీ, కృతికర్త పరిచయానికీ, కృతిభర్త వివరాలకీ, కవి ప్రశస్తికీ కావ్యాలు రాసిన ప్రతీ కవీ ఈ షష్ట్యంతాలు ఉపయోగించారు. షష్ఠీవిభక్తి ప్రత్యయాలలో ఎక్కువగా కి,కు ల ప్రయోగంతో చాలా పద్యాలు అల్లారు. ఈ షష్ట్యంతాలతోనే కావ్యారంభం ఉంటుంది. ఈ పద్ధతిలోనే త్యాగరాజూ కొన్ని కృతులు రచించాడు. ఉదాహరణకి నౌకా చరిత్రంలో రాసిన అతి ప్రసిద్ధమైన ‘గంధము పుయ్యరుగా‘ కృతి ఈ కోవకు చెందినదే!
పల్లవి:
అనుపల్లవి:
చరణం:
కలకలమని ముఖ కళ కని సొక్కుచు
పలుకులనమృతములొలికెడు స్వామికి |గ|
చరణం:
మాలిమితో గోపాల బాలులతో-
నాల మేపిన విశాల నయనునికి |గ|
చరణం:
నారీ మణులకు వారము యౌవన
వారకమొసగెడు వారిజాక్షునికి |గ|
అలాగే చాలా సంగీత కచేరీల్లో చివరగా పాడే మంగళం కూడా ఈ షష్ట్యంత ప్రయోగ రీతిలోనే ఉంటుంది. చాలా ప్రసిద్ధి చెందిన ఈ త్యాగరాజ కృతి మంగళమే దీనికి పెద్ద ఉదాహరణ.
పల్లవి:
చరణం:
చరణం:
చరణం:
చరణం:
చరణం:
చరణం:
పరిశీలనగా చూస్తే శబ్దాలంకారాలు లేకుండా త్యాగరాజు కృతుల్లేవు. అనుప్రాసలయితే చెప్పనవసరం లేదు. దాదాపు అన్ని కృతుల్లోనూ అవి కనిపిస్తాయి. త్యాగరాజు ఆశువుగా కృతులు కట్టి పాడాడని అంటారు. ఇది ఎంతవరకూ నిజమో నిర్ధారణగా చెప్పలేం కానీ ఈ కృతుల్లన్నింటిలో శబ్దాలంకారాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఆశువుగా శబ్దాలంకారాలు వాడాలంటే భాషా పరిజ్ఞానం చాలా కావాలి. పాట స్వరపరిచేటప్పుడు రాగ, తాళాలమీదే ఏ సంగీతకారునికయినా ధ్యాసుండడం సహజం. కానీ భాష మీద పట్టు చూపిస్తూ వివిధ వ్యాకరణ అంశాలనీ వాటిలో చొప్పించడం అంత సులభంకాదు. అందుకే మనకి ఎంతో మంది వాగ్గేయకారులున్నా వారి సంగీతానికే ప్రాధాన్యత ఇస్తారు కానీ, భాషాజ్ఞానానికీ, శబ్ద సౌందర్యానికీ కాదు. త్యాగరాజు కృతులు చూస్తూంటే అలా అనిపించదు. ఎంతో సరళంగా పదిమందికీ అర్థమయ్యేలా, సంగీతాన్ని మామూలు మనుషులకి చేరువగా తీసుకెళ్ళాడు. అదీ ఆయన కర్ణాటక సంగీతానికి చేసిన ఎనలేని సేవా, మహోపకారమూనూ! అదే ఈ నాటికీ చాలామంది సంగీత కారులకి భిక్ష పెడుతోంది.
ఉపయుక్త గ్రంధసూచి
- అలంకార మకరందః: రాజశేఖర సుధీ. తెలుగు పరిష్కరణ: శ్రీమాన్ మరిగంటి శ్రీ రంగాచార్య. A.P Govt. Oriental Manuscripts, Library & Research Institute, Hyderabad. 1985.
- అలంకార చంద్రోదయం: ఇమ్మనేని శరభలింగం నాయిడు. పర్యవేక్షణ: చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రులు. Bhairava Printed Press, MasulipaTnam. 1906.
- షష్ఠ్యంతములు – జెజ్జాల కృష్ణ మోహన రావు.
- Samgita Sampradaya priyadarSini: Subba Rama Dikshitar, Ettiyapuram, 1904 (Reprinted in 1960 by Madras Music Academy).
- The Great Composers Vol I & II – P.Samba Murthy, Madras.
- త్యాగరాజ కీర్తనలు: మంచాళ జగన్నాధ రావు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ. 1969-1975.
- గాన కళాబోధిని: ఎన్.సి.పార్థసారధి. Madras Music Academy. బాలసరస్వతి బుక్ డిపో., మద్రాసు. 1965.