త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు

త్యాగరాజు స్వరపరిచిన దాదాపు ప్రతీ కృతిలోనూ ఈ అనుప్రాసలు కనిపిస్తాయి. పరిశీలనగా చూస్తే ఏ కృతిలో నయినా కొన్ని అక్షరాలు పదే పదే పునరావృతమవుతాయి. ఒక పదాన్ని వాడిన తరువాత అందులో వున్న కొన్ని అక్షరాలు కలిగిన వేరొక పదాన్ని వాడడం వల్ల పాటకి లయబద్ధమైన శబ్ద సౌందర్యం చేకూరింది. ఈ రీతినే అన్ని త్యాగరాజు కృతులూ రచింపబడ్డాయి. ఉదాహరణకి పంతువరాళి రాగంలో ‘అప్ప రామ భక్తి‘ కృతి పల్లవిలో ‘ప్ప, రా, మ’ అక్షరాలున్న పదాలున్నాయి. అనుపల్లవిలో ‘ప్ప, ట, న’ అక్షర పద ప్రయోగం కనిపిస్తుంది.

పల్లవి:
అప్ప రామ భక్తియెంతో గొప్పరా మా |యప్ప|
అనుపల్లవి:
త్రిప్పటలను తీర్చి కంటి రెప్ప వలెను కాచునా మా |యప్ప|
చరణం:
లక్ష్మి దేవి వలచునా లక్ష్మణుండు కొలుచునా
సూక్ష్మ బుద్ధి గల భరతుడు జూచి జూచి సొలసునా మా |యప్ప|
చరణం:
శబరి యెంగిలిచ్చునా చంద్ర ధరుడు మెచ్చునా
అబల స్వయంప్రభకు దైవమచల పదవినిచ్చునా మా |యప్ప|
చరణం:
కపి వారిధి దాటునా కలికి రోట కట్టునా
అపరాధి త్యాగరాజుకానందము హెచ్చునా మా |యప్ప|

అర్థభేదం వున్న పదాలు ఒక దాని తరువాత ఒకటి ప్రయోగించబడితే దాన్ని ఛేకానుప్రాసాలంకారం అంటారు. రాగ వర్ధిని రాగంలో ‘మనసా మన సామర్థ్యమేమి ఓ’ అన్న కృతి పల్లవిలో ఛేకానుప్రాసాలంకారం కనిపిస్తుంది. మనసా అన్న పదంలో ‘సా’ ని విడగొట్టి వెంట వెంటనే ‘మనసా మన సామర్థ్యమేమి?’ అని వాడడంలో శబ్ద సౌందర్యం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే, అర్థభేదం లేక తాత్పర్య భేదం వచ్చేలా పదాల్ని వెంటవెంటనే ప్రయోగించడాన్ని లాటాను ప్రాసాలంకారం అంటారు. వరాళి రాగంలో ‘కన కన రుచిరా‘ కృతిలో లాటాను ప్రాసాలంకారం కనిపిస్తుంది.

పల్లవి:
కన కన రుచిరా కనక వసన నిన్ను |కన|
అనుపల్లవి:
దిన దినము మనసున చనువున నిన్ను |కన|

పల్లవిలో ‘కన కన రుచిర’ అని వాడడం వల్ల గడిచిన కొద్దీ మరింత రుచిరా అన్న భావం కలుగుతుంది. అలాగే అనుపల్లవుల్లో ‘దిన దినమున మనసున’ అన్న ప్రయోగం కూడా అదే రకమైన ధ్వనిని వినిపిస్తుంది.

హరి కాంభోజి రాగంలో ‘ఒక మాట ఒక బాణము’ కృతిలో ఆది ప్రాస కనిపిస్తుంది.

పల్లవి:
ఒక మాట ఒక బాణము ఒక పత్నీ వ్రతుడే మనసా
అనుపల్లవి:
ఒక చిత్తము గలవాడే ఒక నాడును మరవకవే

ఇందులో ఒక అన్న పదాన్ని పల్లవీ, అనుపల్లవిలో వేర్వేరు పదాలతో కలపడం వల్ల తాత్పర్యం మారింది. ఇవే కాకుండా చాలా కృతుల్లో అనుప్రాసా ప్రయోగాలున్నాయి. ఈ అనుప్రాసల వల్ల సాహిత్యానికి అర్థపరంగానూ, సంగీతానికి శబ్ద పరంగానూ కొత్త అందాలొస్తాయి. పంతువరాళి రాగంలో స్వర పరిచిన ‘సుందరతర దేహం’ కృతిలో అంత్య ప్రాసా, ద్వితీయాక్షర ప్రాసా రెండూ ఉన్నాయి.

పల్లవి:
సుందరతర దేహం వందేహం రామం
అనుపల్లవి:
కుందరదనమాప్త కుముద శశాంకం
కందర్ప శత కోటి కాంతిమతి నిష్కళంకం
చరణం:
పతిత జన పావనం పరిపాలిత భువనం
శ్రుతి నికర సదనం శుభ కర వదనం
యతి వర జీవనం ఇభ రాజ పాలనం
దితిజ మద దమనం దీన జనావనం
చరణం:
నవ దూర్వ దళ నీలం నందితామర జాలం
అవనత సుర పాలం అద్భుత లీలం
భవ భయ హరణ కాలం భక్త జన వత్సలం
శివమద్వైతమమలం శ్రీమత్కనకాభ చేలం
చరణం:
ఆగమ సంచారం అఖిల లోకాధారం
వాగధిప కుమారం వర వీర వీరం
రాగాది సంహారం రాఘవముదారం
త్యాగరాజ హృత్సంచారం కారుణ్య పారావారం

ఈ కృతిలో పల్లవీ, అనుపల్లవిల్లో మం, కం లతోనూ, చరణాలూ మూడింట్లో నం, లం, రం వంటి అక్షర ప్రయోగాల్లో అంత్య ప్రాస కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, చాలా కృతుల్లో ఈ ఆది, అంత్య అనుప్రాసలున్నాయి. ఈ రెండూ ఉన్నా లేకపోయినా, ద్వితీయాక్షర ప్రాస మాత్రం దాదాపు అన్ని కృతుల్లోనూ ఉంది. త్యాగరాజుకి సంస్కృత, తెలుగు భాషల్లో ప్రావీణ్యముంది. ప్రహ్లాద విజయం, నౌకా చరిత్రం వంటి గేయనాటికల్లో కంద పద్యాలూ, సీస పద్యాలూ, తేటగీతిలూ చక్కగా వుపయోగించాడు.

యమకం

వచ్చిన అక్షరాలు అదే క్రమంలో వెను వేంటనే రావడాన్ని యమకం అంటారు. అలాగే ఒకే పదాన్ని వేర్వేరు అర్థాలు స్ఫురించేలా పద్యంలో కానీ, గేయంలోకానీ వాడే విధానాన్నీ యమకమని అర్థం చెబుతారు. భరతుడు రచించిన నాట్య శాస్త్రంలో “శబ్దాభ్యాసతు యమకం పాదాతిషు వికల్పితం” అని అంటాడు. అంటే ఒక పదం పాదం మారితే అర్థం మారుతుందని సూక్షంగా దీని తాత్పర్యం.

ఈ యమకాల్లో చాలా రకాలున్నాయి. అవి – పాదాంత యమకం,కాంచియ యమకం, సముద్గ యమకం, విక్రాంత యమకం, చక్రవల యమకం, సంధష్ట యమకం, పాదాది యమకం, ఆమ్రేడిత యమకం, చతుర్వ్యవస్థ యమకం, మాలా యమకం. వర్గీకరణ కోసం వివిధ యమకాలూ చెప్పబడ్డాయి కానీ, వీటికన్నింటికీ మూల సూత్రం ఒకటే! ఒకే పదాన్ని ఒకే అర్థంతో వేర్వేరు సందర్భాల్లో వాడడాన్ని శుద్ధ యమకం అంటారు. దీనికి వ్యతిరేకంగా ఒకే పదాన్ని వేర్వేరు అర్థాల్లో వాడడాన్ని భిన్న యమకం అని వ్యవహిరిస్తారు. ఇవన్నీ పైన చెప్పినట్లుగా వర్గీకరణకే కానీ రెంటినీ యమకమే అనడం కద్దు.

పైన చెప్పినట్లుగా త్యాగరాజు కృతుల్లో అనుప్రాసలే కాదు వివిధ యమకాలూ కనిపిస్తాయి. కొన్ని కృతుల్లో అయితే అనుప్రాసలూ, యమకాలూ రెండూ ఉన్నాయి. పాట అనేది శబ్దానికి సంబంధిచినది కాబట్టి చెప్పే భావమయినా, కవిత్వమయినా ఈ శబ్దాలంకారాలు పాటించి రచిస్తే వినసొంపుగా ఉంటుంది. త్యాగరాజు ఈ చిన్న సూత్రాన్ని చాలా చక్కగా ఉపయోగించాడు. అసావేరి రాగంలో స్వరపరిచిన ‘లేకనా నిన్ను జుట్టుకొన్నారు’ అన్న కృతిలో సుఖము అన్న పదాన్ని ఒక్కో బంధాన్నసరించీ వాడడం కనిపిస్తుంది. ఈ కృతిలో శుద్ధ యమక ప్రయోగం వుంది.

పల్లవి:
లేకనా నిన్ను జుట్టుకొన్నారు
ఏక హృదయులై నిత్యానందము
అనుపల్లవి:
శ్రీకర కరుణా సాగర నిరుపమ
చిన్మయాశ్రిత చింతామణి నీయెడ
చరణం:
సౌందర్యములలో సుఖము సీతమ్మకు
సౌమిత్రికి కనుల జాడల సుఖము
చరణం:
సుందర ముఖమున సుఖము భరతునికి
సు-జ్ఞాన రూపమున సుఖము రిపుఘ్నునికి
చరణం:
చరణ యుగమునందు సుఖమాంజనేయునికి
వర గుణ త్యాగరాజ వరదానందము