భాషల ఋతువు
బలానికి పాలు
జేబులో బలపాలు
అలవాటైన బాల్యపు రోజుల్లో
అ - అనే అక్షరమే
అమ్మలా లాలించింది.
నూనూగు మీసాల తొలియౌవనంలో
తేనెలూరే కలల తీయని మత్తులో
అందమైన హిందీపాట
అందీఅందని ప్రేయసిలా ఊరించింది.
బ్రతుకు పోరాటంలో బయల్దేరినప్పుడు
అపరిచితమైన దూర తీరాలు చేరినప్పుడు
ఆప్త మిత్రునిలా ఆంగ్లభాష
భుజం మీద చెయ్యివేసి నడిపించింది.
ఇన్నాళ్ళు గడిచాక ఇప్పుడు
నేను కూడా మా అమ్మాయి పాఠాలు చదివి
స్పానిష్ నేర్వగలనేమోనన్న ఆశ
నడివయసు సంక్షోభం నుంచి దాటించే
నావలా కనిపించింది.
అలౌకిక ఆనందంలా
ఎప్పటికైనా అందుకోమని
సుదూర ఆకాశంలో సంస్కృతం
జీవితాంతం మెరుస్తూనే ఉంటుంది.
రవి వీరెల్లి అభిప్రాయం:
March 2, 2011 7:59 pm
రవిశంకర్ గారు,
చాలా బావుంది. ఇంత క్లుప్తంగా ఒక పెద్ద చక్కని కథనే చెప్పారు.
ఓ పదేళ్ళ తర్వాత తెలుగు కూడా సుదూర ఆకాశంలో ఉండి అందుకోమంటుందేమో!
రవి వీరెల్లి
అచంగ అభిప్రాయం:
March 4, 2011 8:24 am
సాంఘిక జీవనములో, అదీ నేటి ప్రపంచములో ఇతరభాషల సాయం అత్యవసరమే…… తెలుగువారందరమూ ఒక్కవిషయం ఆలోచిద్దాం. శబ్దములో శ్రావ్యతా, రూపములో ఆధునికతా ఉన్నా ఎందుకు మనకి ఈ పర భాషల మోజు? సమకాలీన రచయితల రచనలలో మరీ ముఖ్యంగా కవితలలో కూడా ఆంగ్లపదాల విరివి నన్ను బాధించింది.
అదృష్టవశాత్తూ చాలా పెద్ద విషయాన్ని మూడుముక్కల్లో చెప్పారు.
Madhu Mahesh అభిప్రాయం:
March 4, 2011 5:18 pm
చాల బాగా, ప్రతి ఒక్కరి మనస్సులను తాకేల వ్రాసారు.
sesha kumar kv అభిప్రాయం:
March 7, 2011 4:12 am
నిజమైన సాహిత్యాభిమాని అన్ని భాషలనూ అభిమానిస్తాడు.ఏ భాషనూ ద్వేషించడు. ఆధునిక కాలంలో ఇది అత్యవసరం.దృక్ప్ఠథం విశాలం కావడానికి దోహదం చేస్తుంది.అయితే మాతృభాషను కించ పరచుకో రాదు. అనవసరంగా ఆంగ్ల పదాలు చొప్పిస్తూ వ్రాస్తే ఇక ‘తెలుగు’ అని చెప్పుకోవడానికి ఏమి మిగులుతుంది అనే విషయాన్ని రచయితలు ఆలోచించు కోవాలి.
Seetha Kumari అభిప్రాయం:
March 7, 2011 7:08 am
చాలా మంచి కవిత….ఎంతో నచ్చింది..
kiran babu అభిప్రాయం:
March 9, 2011 1:15 pm
చాలా బాగుందీ కవిత.
Srinivas Vuruputuri అభిప్రాయం:
March 12, 2011 12:34 am
సరళంగా ఉంది.బావుంది కూడా.
పలచగా కూడా ఉందేమో…
“బలానికి పాలు/జేబులో బలపాలు”? హార్లిక్స్ ప్రకటన గుర్తుకువస్తున్నది.
“ఎన్ని విస్ఫోటనాలెదురైనా సరే ఇక దీన్ని తలకెత్తుకోక తప్పదు” అన్నంత తప్పనిసరితనంలో పుట్టలేదనుకుంటా ఈ కవిత.
Sowmya అభిప్రాయం:
April 13, 2011 2:59 pm
“బలానికి పాలు
జేబులో బలపాలు”
- :)) పైన శ్రీనివాస్ గారు అన్నట్లు, నాకూ ప్రకటనలాగానే అనిపించింది.
ఆనంద్ కుమారస్వామి వంటి వారు రాస్తే, ఈ కవితే దీర్ఘ కవిత ఔతుందేమో! (ఆయనకి అన్ని భాషలు వచ్చునట మరి!!)