2.
సృజనల్ని గురించి మూడు చిక్కు ప్రశ్నలున్నాయి. సాహిత్య వివేచన (Literary Criticism) అనేదాన్నుండి వీటికి సంతృప్తికరమైన జవాబులు దొరికినట్టనిపించదు. అంచేత వీటిని తెలివి తేటలుగా చర్చించే పుస్తకాల కోసం, మనుషుల కోసం వెదుక్కుంటుంటాను. బిపిన్ ఇందుర్ఖ్య (Bipin Indurkhya) Cognitive Scienceని చదువుకుని, బోధిస్తుంటారు. ఆయన సాంగత్యం వలన నాకు Cognitive Science పరిచయమయ్యింది.
సారస్వత కళకు ఉండే తర్కం, దాని పనిముట్లు వేరని, అవి లోకవ్యవహారం కోసం, శాస్త్ర విజ్ఞానం (Science) కోసం వాడే తర్కం కంటె, పనిముట్ల కంటె భిన్నమైనవనీ అనుకున్నాను గాని ‘ఎంచేత?’ అని నన్ను నేనే ప్రశ్నించుకునీ సంతృప్తికరంగా జవాబు చెప్పుకోలేకపోయేవాణ్ణి. ఎందుకంటే, సృజన లోకంలోనే కదా జరుగుతున్నాది. మరి సృజనని గురించిన వివేచనకు వేరే తర్కం, వేరే పనిముట్లు ఎందుకు కావాలి? ఈ ప్రశ్నకు Cognitive Science సమాధానం చెప్పగలుగుతుంది. ఇలాగని నమ్మే నేను బిపిన్‌ని ఈ మూడు ప్రశ్నల్నీ అడుగుతూ, చదువుతూ వస్తున్నాను. ఇలాగే అనుకుంటున్నవాళ్ళు అప్పుడే పదేళ్ళ బట్టీ ఉన్నారట. వీళ్ళు ఈ తరహా వివేచనకు Cognitive Poetics అని నామకరణం కూడా చేసేరు. ఇదంతా నాకు ఈ మధ్యనే తెలిసింది. ఈ పద్ధతుల వెలుతుర్లో ఈ మూడు ప్రశ్నల్నీ తరచి చూడవచ్చు. దీనికి బిపిన్ ఒక సహ రచయిత వంటివాడు. ఆయన ఆలోచనల్ని, సలహాల్ని ఆయన అనుమతితోనే ఇందులో వాడుకుంటున్నాను. ఇంకా త్రిపుర, నారాయణరావు గారు చెప్పినవి, అనేకమంది రాసుకున్నవి సంగతులు కూడా ఎత్తి రాస్తున్నాను. ఈ మూడు ప్రశ్నల్ని గురించి నేను ఎక్కువగా బిపిన్‌తో, త్రిపురతో, వెల్చేరు నారాయణరావు గారితో మాట్లాడుతూ వచ్చేను. ఈ చర్చల నుండి నాకు అవగతమయ్యింది ఏంటంటే వీళ్ళు ముగ్గురు చాల వేరు వేరు తోవల్లోనైనా ఈ మూడు ప్రశ్నలతో ఒకేలాగ సమాధానపడుతున్నారు.
ఆ మూడు ప్రశ్నల్లో మొదటిది: మనం ఏదైనా కాల్పనిక సాహిత్యాన్ని, అంటే కధ, కవిత వంటిదాన్ని చదివేటప్పుడు, ఆ కధను, కవితను ఎలా చదువుతున్నాము, ఎలా స్ఫురణకు తెచ్చుకుంటున్నాము, అర్ధం చేసుకుని ఆస్వాదిస్తున్నాము? చదవటం పూర్తయిన తరవాత ఎలా, అంటే ఏ ప్రాతిపదికన ‘అబ్బ, ఇది నాకు చాలా నచ్చింద’నో, ‘ఛీ కాదూ భళా కాద’నో, ‘ఇదా? ఇదీ ఒక కవితేనా? ఇదో కధా?!’ అనో నిర్ధారించుకుంటున్నాము? అంటే, పాఠకుడి స్ఫురణ, అనుశీలన, నిర్ధారణ ఎలా జరుగున్నాయి? దీనికే అనుబంధం వంటి ప్రశ్న, పాఠకుడు తన అభిరుచితో ఏకీభవించని అభిరుచుల్ని సహించగలిగే వందనాన్ని సాధించుకోవటానికి ప్రజాస్వామ్యం, సామరస్యం వంటి లౌకిక మర్యాదలు కాక, సారస్వత సమ్మతమైన మర్యాద ఒకటి ఉందా?
రెండవది: ఒక సారస్వత సమాజం మొత్తంగా సృజనలను ఎలా అంచనా వేస్తున్నాది? ఇందుగ్గాను కనీసం కొన్ని మార్గదర్శక సూత్రాలు, అంటే Norms ఏమైనా ఉంటాయా? ‘అవును ఉన్నాయి, ఇవిగో!’ అని ఏ పుస్తకమైనా, ఎవరైనా చెప్పిన జవాబులేవీ సంతృప్తికరంగా అనిపించవు. తెలుగులో ఇలాంటి రచనలు, అంటే విమర్శ అని చెప్పేవాటిలో మెరుగైనవి కూడా, నాకైతే చాలా వరకు సంతృప్తికరంగా ఉండవు. ఎందుకా? అనుకుని, ‘అవి సృజన ప్రక్రియకు అనువైన తర్కాన్నీ, పనిముట్లనూ కాక సాంఘిక వివేచన, సమ్యగ్దృష్టి, పాండిత్యం వంటి వేరే అవసరాలకు తగిన తర్కాన్నీ, పనిముట్లనే సృజన రంగానికీ వినియోగించడం వలన’ అని సమాధానపడ్డాను. ఇంగ్లిష్ విమర్శ ఇంతకంటె సూక్ష్మంగా, అంటే insightfulగా ఉంటుంది. ఒక కవితను, కధను తీసుకుని అవి ‘పని’ చేసే పద్ధతిని, అంటే వాటి inner mechanicsని వివేకంతో విప్పిచెప్పే పద్ధతి ఇంగ్లిష్‌లో ఉంది. ఇందుకు ఒక కారణం ఏమయ్యుంటుందంటే ఆంగ్లంలో మంచి సృజనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విమర్శ కూడా అందుకు సమ ఉజ్జీగా ఉందని. అలాంటి రచనలైనా సృజనల్నీ, వాటి సూక్ష్మాలని, సొబగుల్ని రకరకాలుగా ఎత్తిచూపిస్తాయే తప్ప, ఇప్పటి వరకు అనుకున్న ఈ రెండు ప్రశ్నల్ని లేవనెత్తవు, లేదా సమంజసమైనవి అనిపించే జవాబులు చెప్పవు. బిపిన్, నారాయణరావు, త్రిపుర – ఈ ముగ్గురూ నాతో చెప్పింది ఏమంటే – అలాంటి norms తప్పకుండా ఉంటాయి. విశాలమైన మైదానాల్లో ఎత్తుగా కనిపించే కొండల్ని పోల్చుకున్నట్టు మేలైన సృజనల్ని, కళా రూపాల్నీ ఒక సమాజం మొత్తంగా పోల్చి చూసుకోవచ్చు. వాళ్ళు ముగ్గురు చాలా వేరే తోవల్లోన ఇదే నిర్ణయానికి వచ్చేరనీ తెలుస్తుంది. అయితే వాళ్ళు ముగ్గురూ ఇంతకు మించి ఇదమిద్ధమని దీన్ని విడమరిచి చెప్పడానికి విముఖంగానే ఉన్నారు. వాళ్ళు ఏమన్నదీ ఆ సంగతులు వివరంగానే చెప్తాను ముందుకి.
ఇక్కడ సాహితీరంగంతో సహా అన్ని రంగాల్లోనూ చర్చకు ఉండే పరిమితుల్ని గురించి కొంత చెప్పుకోవాలి. మన పూర్వీకులెవరో ‘తర్కం కుక్కల కాట్లాట!’ అని కొట్టిపారీసేరు. సుప్రసిద్ధ భౌతిక శాస్త్రజ్ఞుడు డేవిడ్ బామ్ (David Bohm) చర్చను గురించి, వివేచనలో ఆలోచనకు ఉన్న పరిమితుల్ని గురించీ చాలా వివరించి చెప్పేడు. సత్యాన్వేషణకు చాల అనువైనది, తర్కబద్ధమైనదీ అని చెప్పుకొనే వైజ్ఞానిక చర్చ కూడా వాస్తవానికి వ్యక్తిగతమైన లాభాపేక్ష వలన, కీర్తి కాంక్ష వలన, సిద్ధాంతం పట్ల సంకుచితమైన నిబద్ధత వలన వికలమైపోతుందని, సృజన గొంతు నొక్కేస్తుందనీ చెప్పుకున్నాడు. చర్చ కంటె సంభాషణ మెరుగైనదని నమ్మి ఆయన ‘On Dialogue’ అని ఒక ప్రామాణికమైన గ్రంధాన్నే ప్రచురించేడు. ఈ ప్రశ్నలు, ముఖ్యంగా రెండవ ప్రశ్న, చర్చతో తీరేది కాదని నేను చాన్నాళ్ళాయీ నమ్ముతూ ఉన్నాను.
మరి మూడో ప్రశ్న: సృజన జరిగే సందర్భాల్లో కవి ఎందుకు, ఎలా రాస్తున్నాడు? అంతరాంతరాల్లో నున్నదాన్ని కాయితం మీదికి వెల్లడించి, దిద్ది ప్రచురించే ప్రక్రియల్లో సృజనకారుని చోదక శక్తి ఏమిటి, అతని మన:స్థితి ఏమిటి, ఈ ప్రక్రియలో ఆలోచన, భాష పోషించే పాత్రలేమిటి? ఎదుట పాఠకుడు, సంపాదకుడు అని ఇలా ఇతరులెవరూ ఇంకా లేని సందర్భాల్లో కవి ఎవర్ని సంతృప్తి పరిచేలాగ తన సృజనను పూర్తి చేస్తున్నాడు? అది పూర్తయ్యిందని ఎలా ఒక నిర్ధారణకు వస్తున్నాడు, అంతే తృప్తి పడుతున్నాడు? ఈ మూడో ప్రశ్నకు లోతైన జవాబు చెప్పగలిగేది కవి మాత్రమే. చాలా మంది కవులు, కళాకారులు ఈ ప్రశ్నని గురించి తమ సంగతులు చెప్పుకున్నవి ఉన్నాయి. ఇవన్నీ ప్రోది చేసుకుంటే కొంత తెలిసినట్లుంది గాని చివరికి ఈ ప్రశ్నకి కూడా సమగ్రమైన జవాబంటూ దొరకదు.
Cogntive Scienceను, Cogntive Poeticsను పురస్కరించుకొని ఈ ప్రశ్నలు మూడింటికీ సమాధానాల్ని వెదికే సాహసం చేస్తున్నాము. నిజానికి ఇలాంటి ప్రశ్నలు భాషంత పాతవయ్యుంటాయి. వీటిని మళ్ళీ కొత్తగా తరచి చూసుకుంటే కనీసం ఏవేవి సరైన జవాబులు కావో అదైనా అవగతమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఇవి జటిలమైన ప్రశ్నలు, స్థిరమైన జవాబుల్లేనివి కాబట్టి, వీటికి ఎవరెవరొచ్చి ఏమేం సమాధానాలు చెప్పినా అవన్నీ ఒప్పే అని పూర్తిగా నిరాశ పడవలసి ఉండదు. ఈ విషయంలో బిపిన్ చెప్పేది ఏమంటే రక రకాల అభిప్రాయాలకు అవకాశం ఉంది కాని, ప్రతీ అడ్డమైన అభిప్రాయానికీ తావు లేదు. (Diverse points of view are possible, but not every point of view is admissible.)
(ఇంకా ఉంది)
(మొదటి భాగంలో విషయం జాన్ నిమ్స్ (John Frederick Nims) రచన Western Wind: An Introduction to Poetry లోని సంగతులకు అనువాదం వంటిది.)