కమాండో: డా. నిసి షామల్ నొవెల్లా

నెల్సన్ దగ్గరి చుట్టాలెవరూ? – నిసి.

“ఎవరూ లేరు.”

“లేరా! ఎంత సుఖజీవి!” అంది నిసి. చుర్రున చూశాడు లాజ్లో.

“నేనదేమంటే -అదెలా సాధ్యం? అని” నిసి కాలు మీద కాలు వేసుకుని ప్రాడా షూ ఊగిస్తూ అడిగింది.

“తలిదండ్రులు, భార్య చనిపోయారు. ఇంతకు ముందు భార్యతో పిల్లల్లేరు. ఇప్పుడు ఒక న్యూరో సర్జన్ – కొలంబియాలో పని చేస్తుంది- ఆమెతో ప్రణయం నడుపుతున్నాడు. ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టీ ఆమెకు ఇన్‌ఫార్మ్ చెయ్యక్కర్లా. అయినా, ఎంతమంది ఒంటరి జీవితం గడపరు? అదేం ఈ సిటీలో కొత్తా! ఏమిటి?” – లాజ్లో.

“ఒకే. ఇది క్రైమ్ ఐనా, ఈ మరణం సాల్వ్ చెయ్యటం అంత కష్టం కాదు.” – నిసి.

“ఇంకా మిస్టరీలు చదువుతున్నావా?”

“యా, యా, ష్యూర్! అగాథా క్రిస్టీ, పీ.డీ. జేమ్స్ , డొరొథీ సేయర్స్, కోనన్ డాయల్, ఊంబర్టో ఎకో, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్ , నోరా రాబ్స్, డేన్ బ్రౌన్ – ఇంకా ఎందరో. అంటే గుర్తుకొచ్చింది, పెట్రిసియా కార్న్‌వెల్ ‘పోస్ట్ మార్టమ్’ చదివావా? ఒకే సంవత్సరంలో నాలుగు బుక్ ఎవార్డులు వచ్చినయ్. ఇన్ని మిస్టరీలు చదివి, ఏమిటి లాస్లో! అంత సాధించలేని మిస్టరీ ఏముంది పెద్ద!” అంది నిసి.

“నిజంగా సాల్వ్ చెయ్యగలవా?” ఇద్దరూ ఒక్కసారే అరిచారు.

“నెల్సన్ చనిపోయాడు. చుట్టాల్లేరు. విషయం ఇంకా తేలిక. ఇప్పుడు ఏ ప్రశ్నలు వేసుకోటం ముఖ్యం? పోలీసులు వస్తే వాళ్ళకు కావలసినది ఏమిటి? వాళ్ళ పద్ధతి ప్రకారం ఈ ఏరియా అంతా సీల్ చేసి పేపర్లో స్టేట్మెంట్లిచ్చి మీ అందరినీ రకరకాల ప్రశ్నలు వేసి వేధించి…, నెలలు సంవత్సరాలు పట్టనూవచ్చు. ఈ లోపల మీ ప్రాక్టిసులు రూయిన్ అవనూ వచ్చు. కాని మీకు కావాల్సింది అదికాదు. డాక్టర్ల్లుగా మీక్కావాల్సింది ఏమిటి? ఇతని మరణం అంటువ్యాధా? దీనివల్ల ఇతర్లకు జబ్బు రావచ్చా? కాకుంటే ఇతనిని ఎవరైనా చంపి ఉంటే, మరెవర్నయినా అతగాడు చంపుతాడా? అనీ, ఆ మరెవరో మీరు కాకూడదనీనూ.

క్రైం బ్రాంచ్ ఛీఫ్ మనకు బాగా తెలిసినవాడే కదా. విషయం చెప్పి, 48 -72 గంటల వ్యవధి అడుగు. వాళ్ళ ప్లెయిన్ క్లోత్స్ టీమ్ వచ్చి శవాన్ని ఫొటోలు తీసుకోటమూ, ఎవిడెన్స్ కలక్ట్ చేసుకోటమూ చెయ్యమను. ఆటాప్సీ ఈ హాస్పిటల్లోనే చెయ్యనీ. ఇచ్చిన గడువు లోపల నేను హంతకుడెవరో చెప్పలేకపోతే, ఆ తర్వాత కథ వాళ్ళిష్టమైనట్లు నడిపించవచ్చు.”

“నిసి, ఈ షరతులకు క్రైం బ్రాంచ్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు?”

“ఎందుకా? ఇది చాలా ప్రఖ్యాతి గల వాళ్ళు వచ్చే హాస్పిటల్. సిటీకి మంచి రెవెన్యూ, పేరు ప్రతిష్ఠలూ తెస్తుంది. అలాటిచోట సాధారణంగా పోలీస్ అడ్డు పుల్లలు వెయ్యరు. పైగా హాస్పిటల్. ఎలా ఒప్పించవచ్చంటే ఇది యూనివర్సిటీ హాస్పిటల్ కాబట్టి – ఇది ఎక్స్‌పెరిమెంటల్ జాయింట్ స్టడీగా చూపవచ్చు. ఎక్స్‌పెరిమెంటల్ డిటెక్షన్. ఖర్చు తగ్గించి, ఎఫిషియన్సీ పెంచటం. పేషెంట్ ఫ్రెండ్లీ. ఫొరెన్సిక్ డిపార్ట్‌మెంట్, పొలీస్ ఫోర్స్ జాయింట్ స్టడీగా పబ్లిష్ చెయ్యొచ్చు. లెజిటిమేట్ రీజనే గదా. ఒప్పుకుంటారు!

ఆ ఒప్పించటం ప్రెసిడెంట్‌కు, లీగల్ టీమ్‌కు వదలండి. పొలీస్ వాళ్ళ సంభాషణలను లాయర్లను రికార్డ్ చెయ్యమనండి. వాళ్ళు ఒప్పుకోకపోతే – అందువల్ల వచ్చే ఏ నష్టానికీ వాళ్ళే జవాబుదారీ అనీ, హాస్పిటల్, డాక్టర్ల ప్రాక్టీసు కాని, ఇతర పేషెంట్లకు కాని ఏమైనా హాని జరిగితే -అది అప్పుడు వాళ్ళ తప్పు కావచ్చని. పుట్ ప్రెషర్ ఆన్ దెమ్. ప్రెసిడెంట్ నుంచి నాకు ఈ హాస్పిటల్లో ఎవరి ఆఫీసు కంప్యూటరైనా వెదకటానికి, ఏ రికార్డులైనా చెక్ చెయ్యటానికి, ఎవరినైనా ఇంటర్యులు చెయ్యటానికి, రిటెన్ పర్మిషన్ తీసుకొ లాజ్! నేను నీ ఆఫీసు నుండి వర్క్ చేస్తా. ఒక డోనట్, కాఫీ పంపించు. నువ్వు పక్క ఆఫీసులో పని చేసుకో. పద, నీ ఆఫీసుకు.” – అంది. వాడి పోయి ఉన్న లాజ్లో బేకస్ ముఖంలోకి చూస్తూ. “లాజ్! ఏమిటోయ్, చావు హాస్పిటల్లో రోజూ చూసే వ్యవహారమేగా. పేషెంట్ చస్తే ఒకటీ, డాక్టరు చస్తే మరొకటీనా? పేషెంట్లు మరణించవచ్చు కానీ, డాక్టరు చస్తే ఇంత భయమెందుకోయ్?”

లాజ్లో గదిలొకి వెళ్ళాక అద్దంలో, అర్మానీ సూట్లో ఉన్న తన ప్రతిబింబం చూసుకుంది. కొద్దిగా జెస్సికా ఫ్లెచర్ లానే ఉన్నాను. ఈ పాటి కేస్ సాల్వ్ చెయ్యలేకపోటమేమిటి? ఎవరైనా వింటే నవ్వుతారు, అనుకుంది నిసి. తర్వాత – “ద సడెన్ డెత్ ఆఫ్ పూర్ డాక్టర్ నెల్సన్” అని వర్డ్ ప్రాసెసర్లో ఒక ఫైల్ తెరిచి నోట్స్ రాయటం మొదలెట్టింది.

– నెల్సన్ ఎలా చనిపోయాడో అవసరమా?
– ఎప్పుడు చనిపొయాడో అవసరమా?
– హు కేర్స్ ?:-)
– ఎవరు చంపారో! రియల్లీ! డు ఐ కేర్? :-):-) అవసరమే.
– ఎవరు? అతనికి తెలిసిన వాళ్ళేనా.
– అతని మీద ఒళ్ళు మండిన స్టాఫ్? హాస్పిటల్‌కి వచ్చి వెళ్ళేవాళ్ళు?
– ఎందుకు శవం అక్కడే, రేడియేషన్ డిపార్ట్‌మెంట్ లోనే వదిలారు? అక్కడికి యాక్సెస్ ఎవరెవరికుంది?

ఇలా ప్రశ్నలు వేసుకుంటూ, వాటికి పాజిబుల్ సమాధానాలు చెప్పుకుంటూ, నోట్స్ రాసుకుంది.

కొంచెం సేపటికి ఆమె బల్ల మీదకు సెక్రెటరీ ఎన్వలప్ తెచ్చి పెట్టింది. హాస్పిటల్ ప్రెసిడెంట్ ఆమెకు ఆ హాస్పిటల్లో ఉన్న అన్ని కంప్యూటర్ల మీద అన్ని రకాల సమాచారం వెదకటానికీ, ఏ డిపార్ట్‌మెంట్ కైనా వెళ్ళగలగటానికీ, ఎవరినైనా కలుసుకోటానికీ, వారిని ప్రశ్నించటానికీ , ఇలా 48గంటల పాటు ప్రత్యేక పర్మిషన్ ఇస్తున్నట్లు ఉత్తరం అందులో. ఆ లోపలే మళ్ళీ ప్రెసిడెంట్ ఎక్స్‌టెన్షన్ ఇస్తే తప్ప ఆ పర్మిషన్ ఆ పైన పని చెయ్యదు అని కూడా.

నిసి సంతోషంతో, తెలివున్న ప్రెసిడెంట్ అనుకుని, కంప్యూటర్ మీద డాక్టర్ నెల్సన్ కేలెండర్ తెరిచి ఆయన అపాయింట్మెంట్లు ఆ వారం లోవీ, తర్వాత కొంచెం ముందుకీ కొంచెం వెనక్కీ వెడుతూ, మధ్యలో తన ఫైల్లో కొన్ని పేర్లు రాస్కుంటూ పని సాగించింది. అతని కాన్ఫరెన్సుల కేలెండర్లు తనిఖీ చేసింది. అతని సెక్రెటరీ కేలెండర్‌నీ, అతని స్కెడ్యూళ్ళనీ కొన్ని సార్లు రెండూ ఒకే సారి స్క్రీను మీదికి తెచ్చీ, కొన్ని సార్లు ప్రింట్ చేసుకునీ చూసింది. ఇద్దరూ రాసుకున్న చిన్న నోట్సులు కూడా శ్రద్ధగా చూసింది. తర్వాత ఒకరిద్దరి ఇతర డాక్టర్ల అపాయింట్మెంట్ పుస్తకాలు కూడా. ఆమెను కొన్ని పేర్లు, కొన్ని విషయాలు ఆకర్షించాయి. కొన్ని తారీఖులు, ఇతర నంబర్లు నోట్ చేసుకుంది. ఆ తర్వాత దీక్షగా నెల్సన్ చేసిన కొన్ని ఆపరేటివ్ రిపోర్ట్స్, తర్వాత వారికి సంబంధించిన ఇతర రిపోర్ట్‌లు చూసింది, తను కూర్చున్న చోటి నుండి కదలకుండా. గంటలు గడిచి పోతున్నయ్.

కొంచెం సేపటికి, డెస్క్ మీదకు ఇంకో రిపోర్ట్ తెచ్చిపెట్టింది సెక్రెటరీ. దానిలో – క్రైం బ్రేంచ్, హాస్పిటల్, ఇతర స్వతంత్ర వ్యక్తులు కలిసి చేస్తున్న ఒక నూతన పరిశోధన. దానిలో పాల్గొంటున్న వ్యక్తులు, పరిశోధనా కాలము, దాని ఆశయములు, ఇలా చక్కగా విశదీకరించబడిన రెండు కాగితాలు. అందులో నిసి షామల్ పేరు ఆ స్టడీని ప్రతిపాదించిన వ్యక్తిగా, లీడ్ ఇన్వెస్టిగేటర్గా ఉంది.

నిసి నవ్వుకుంది. భలే చకచకా రాసారు. ఇంకెవరు. లాజ్లోనే. ఎన్ని వందల ప్రోటొకాల్స్ రాసి ఉంటాడు? ఎక్స్‌పర్ట్. స్టడీ డిజైన్ చెయ్యటం లోనూ, గ్రాంట్లు తెప్పించటం లోనూ. కాని ఏ కేన్సర్ కైనా క్యూర్ లాజ్లో కనిపెట్టగలడా? ఐ డౌట్ ఇట్ – అనుకుంటూ మళ్ళీ తన పని కొనసాగించింది. మెల్లిగా ఆమె ఆలొచనల్లో ఒక స్పష్టత వస్తున్నట్లనిపించింది. దాదాపు నెల్సన్ చావుకు కారణం, ఎవరో, ఏమిటో, ఎందుకో తెలిసినట్లుగా అనిపించసాగింది. కొన్ని డిపార్ట్‌మెంట్ల లోకి వర్చువల్ గా వెళ్ళి ఏవేవో టిష్యూ ఇమేజెస్, రిపోర్ట్‌లు, హాస్పిటల్ న్యూస్ లెటర్లు, కల్చరల్ & సైంటిఫిక్ ఇవెంట్లు, ఇ-ఫొటోలు, విడియోలు – ఇలా, మళ్ళీ చూసింది.

కొంచెం సేపటికి ఏమి జరిగి ఉండవచ్చునో – అన్న ఆమె ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి. తర్వాత పథకమేమిటి?