ఛందస్సే యయె నీదు కోవెల

4. ఆచార్యులవారు కందపద్యాలను మలచడములో నేర్పరి అని చేరాశతమానం చదివితే స్ఫురిస్తుంది-

ఎందాక పద్యముండునొ
అందాకను శతక ముండు నంటివి కాదా
ఎందాక కవిత ఉండునొ
అందాకను పద్యముండునందును చేరా!

(వచన కవిత కవిత ఐతే అది పద్యమే అనే సున్నితమైన వ్యంగ్యము ఉన్నది ఇందులో)

రారా, కారా, బూరా,
సీరా, బేరా, తిరా, వసీరా, నారా,
కోరా, తారా, కేరా –
ఈ రాంతులతోటి వేగుటెట్లా చేరా!

(ఇందులోని రాంతులు ఎవరో గుర్తుపట్టగలరా మీరు?)

చిన్నన్న ద్విపద కెరుగును
పెద్దన్న ఎరుంగు పద్యవిద్యకు చేరా
తిక్కన్న రస మెరుంగును
చెల్లిన ఇచ్చోటి ప్రాస శ్రీశ్రీ ఎరుగున్

(ఇది శ్రీశ్రీ పైన పేరడీ)

5. వీరు వచన కవితలను కూడ చక్కగా వ్రాయగలరు. వీరు గోదా వచస్సుధ అని ఆండాళ్ తిరుప్పావై తెలుగులోకి అనువదించారు. అందులోనుండి ఒక వచనపద్యాన్ని ‘భావగణ’యుక్తముగా ఇక్కడ మీకు సమర్పిస్తున్నాను –

‘ఓ యమ్మ చిన్నారి చిలుకా! ఇంకా నిద్రపోతూనే ఉన్నావా?’
‘ఎందుకమ్మా! అంత చిరచిరలాడుతూ పిలుస్తారు! వస్తూనే ఉన్నాను గదా!’
‘నీ మాటకారితనం తెలుసులేవే’
‘అవునులెండమ్మా! మీ మాటెందుకు కాదనటం! నేను మాటకారినేలెండి!’
‘నీవింకేదో పనిలో ఉన్నట్టున్నావూ’
‘అది సరేగాని, అందరూ వచ్చినట్టేనా?’
‘అనుమానమెందుకు? వచ్చి లెక్కపెట్టి చూసుకో. కువలయాపీడమన్న ఏన్గును చంపినవాడు, శత్రుసంహారకుడయినవాని,
ఆశ్చర్యగుణాల, చేష్టల వాని గురించి
నోరారా పాటలు పాడుకొందాము.
ఇకనయినా మాటలు చాలించి తొందరగా రా!’

ముగింపు

తాను వ్రాసిన ముత్యాలసరాల ముచ్చట్లను ఆప్యాయముగా కోవెల సంపత్కుమారులకు అంకితము చేస్తూ చేకూరి రామారావుగారు ఇలా అంటారు –

“అతడు ఛందోమార్గ పథికుడు
అతుల ప్రతిభాసంపదధికుడు
ప్రౌఢకవితారచనశీలుడు
పరమ సౌహృదుడు”

వీరిని గురించి వీరి పరమ మిత్రులు చెప్పినదానికన్న నేనేమి చెప్పగలను?

ఛందోనందనమందుఁ బూచితివిగా సద్గంధపుష్పమ్ముగా
ఛందాకాశమునందుఁ దోచితివిగా సత్కాంతినక్షత్రమై
ఛందోవారిధియందు దాగితివిగా సద్రత్నసందోహమై
ఛందస్సే యయె నీదు కోవెలగ నో సంపత్కుమారా సుధీ


గ్రంథసూచి

  1. తెలుగు ఛందోవికాసము – కోవెల సంపత్కుమారాచార్య – కులపతి సమితి, వరంగల్, 1962.
  2. లక్షణసారసంగ్రహము – పరిష్కరణము, పీఠిక – కోవెల సంపత్కుమారాచార్య, రచయిత – కూచిమంచి తిమ్మన – తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1971.
  3. సుకవిమనోరంజనము – పరిష్కరణము, పీఠిక – కోవెల సంపత్కుమారాచార్య, రచయిత – కూచిమంచి వేంకటరాయడు – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1976.
  4. ఛందఃపదకోశము – సంగ్రాహకుడు – కోవెల సంపత్కుమారాచార్య, పరిష్కర్త – దువ్వూరి వేంకటరమణశాస్త్రి – తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1977.
  5. వచన పద్యం – లక్షణ చర్చ – చేకూరి రామారావు, కోవెల సంపత్కుమారాచార్య – నాగార్జున ప్రింటర్స్, హైదరాబాదు, 1978.
  6. సాహితీ సంపద – సం. కోవెల సుప్రసన్నాచార్య, షష్టిపూర్తి అభినందన సమితి, వరంగల్లు, 1993.
  7. తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు – కోవెల సంపత్కుమారాచార్య, అభినవ ప్రచురణలు, వరంగల్లు, 1993.
  8. ఛందోభూమికలు – కోవెల సంపత్కుమారాచార్య – అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2003.
  9. చింతయంతి – కోవెల సంపత్కుమారాచార్య, అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2003.
  10. అపర్ణ – కోవెల సంపత్కుమారాచార్య, అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2004.
  11. చేరాకు ఒక శతమానం – కోవెల సంపత్కుమారాచార్య, అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2003.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి:

జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.

 ...