పిల్లలు కూడా ఏమీ ఆనందంగా లేరు. ఈ రోజు నాన్న మొదటిసారి వ్యాను తెచ్చారు, ఊరంతా తిరుగుదామనుకుంటే, ఊరికెనే తిడుతున్నారు. ఇంకెప్పుడు నాన్న వ్యాన్ ఎక్కకూడదు. ముగ్గురు కళ్ళలో నీళ్ళతో ఉన్నారు. ఈ సారి సంజయ్‌కి దెబ్బలు పడ్డాయి, తన చెప్పులతో సీట్ పాడు చేసినందుకు. నిజానికి పొద్దున్న అందరికంటే సంజయే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాడు, ఇప్పుడు అందరికంటే ముభావంగా ఉన్నాడు. ఓ పెద్ద ఎయిర్‌కండిషన్డ్ హోటల్ ముందు కుందన్ వ్యాన్ ఆపేసరికి అందరూ కంగారు పడ్డారు. పొద్దున్నుంచి జరుగుతున్న లోటుని ఇక్కడ తీర్చేయాలనుకున్నాడు కుందన్. పిల్లలు హోటల్ లోపలి అలంకరణంతా అబ్బురంగా చూస్తున్నారు, కుంతి మాములుగా ఉండడానికి, ఇటువంటి ప్రదేశాలకి రావడం కొత్తేమీ కాదన్నట్లు ఉండడానికి ప్రయత్నిస్తోంది. కుందన్ కూడా ఇటువంటి హోటల్స్ తనకి కొత్తేమీ కానట్టు, రోజూ వచ్చిపోతూంటాననట్లు ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ స్పష్టంగా తెలిసిపోతోంది అతనిక్కడి రావడం అదే మొదటిసారని. చుట్టుపక్కల టేబుల్స్ వద్ద బాగా హడావుడిగా ఉంది. కొంతమంది గట్టిగా పకపకా నవ్వుతుంటే, మరి కొంతమంది లోగొంతుతో మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ముగ్గురు తమలో తాము గుసగుసలాడుకుంటూ చుట్టూ తేరిపార చూస్తున్నారు.
మెనూ కార్డ్ చూస్తూనే కుందన్ గాభరా పడ్డాడు. మెనూలో రేట్లు అతను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇంకో సమస్య ఏంటంటే మెనూ కార్డ్‌లో ఉన్న ఐటమ్స్ ఏమిటో అతనికి తెలియడం లేదు. ఆ పేర్లు కూడా వినలేదతను. టై ధరించిన వెయిటర్ ఆర్డర్ కోసం వీళ్ళ టేబుల్ దగ్గరే నిలుచుని ఉన్నాడు. ‘మాకు కొంత టైం కావాలి’ అంటూ అతన్ని పంపేసాడు కుందన్. కుంతివైపు వంగి “ఇక్కడ అన్నీ బాగా రేటెక్కువగా ఉన్నాయి. ఏం చేద్దాం?” అడిగాడు గుసగుసగా. “కాస్త రేటు తక్కువగా ఉన్న రొట్టెలు, కూర ఆర్డర్ చేయండి. పంచుకుని తిందాం” అని కుంతి సలహా ఇచ్చింది. కాసేపయ్యాక, ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ఉన్న వాటిల్లోకెల్లా ధర తక్కువున్న రొట్టెలు, కూర నసుగుతూ ఆర్డర్ ఇచ్చి, కాస్త ఊపిరి పీల్చుకున్నాడు కుందన్. వెయిటర్ టేబుల్ మీద చెంచాలు, పోర్క్స్ వంటివి సర్దివెళ్ళాడు. వాటితో ఎలా తినాలో పిల్లలకి అర్థం కాలేదు. వాటిని పరీక్షగా చూస్తున్నారు చేత్తో పట్టుకుని.
ఆ రోజు మొదటిసారి కుందన్ భార్యాపిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయాడు. నిజానికి, కుందన్ కూడా ఆ వాతావరణంలో ఇమడలేక పోతున్నాడు. ‘అబ్బా, ఈ రోజు బాగా వేడిగా ఉంది’ అంటూ మాటిమాటికి చెమట తుడుచుకుంటున్నాడు. కాసేపయ్యాక, ఆర్డర్ చేసిన పదార్ధాలు వచ్చాయి. అందరూ ఎలాగొలా భోజనమైందనిపించారు. మెల్లిగా, నిశ్శబ్దంగా. ఇప్పటికీ వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళలానే ఉన్నారు. భోజనం పూర్తయ్యాక, వెయిటర్ ఫింగర్ బౌల్స్ తెచ్చి వాళ్ళముందుంచాడు. ఏం చేయాలో వాళ్ళకి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. గోరు వెచ్చని నీళ్ళలో తేలుతున్న నిమ్మకాయ ముక్క! అందరూ కుందన్‌కేసి చూసారు. అతను కూడా సందిగ్ధంలో ఉన్నాడు వాటితో ఏం చేయాలో తెలియక! సంజయ్ ఓ క్షణం ఆలోచించి, ఆ నీళ్ళలో నిమ్మకాయని పిండుకుని గటుక్కున తాగేసాడు. గప్పూ, పింకీ కూడా అలాగే చేయబోతుంటే, పక్క టేబుల్ దగ్గరున్న వెయిటర్ అది చూసి ఆ నీళ్ళు తాగడానికి కాదని, చెయ్యి కడుక్కోడానికని చెప్పాడు. కుందన్ ముఖం ఒక్కసారిగా నల్లబడింది. తనకన్నా తక్కువ స్థాయి వాడు తన స్థాయి ఏమిటో చెప్పడం! నడిరోడ్డు మీద తనని నగ్నంగా నిలబెట్టినంత అవమానంగా భావించాడు. తల పైకెత్తకుండానే చేతులు కడుక్కుంటూ బిల్ తెచ్చివ్వమన్నాడు.
తిని బయటకు వచ్చేసరికి అందరి మూడ్ మళ్ళీ పాడయిపోయింది. గప్పూ వెక్కిళ్ళు పెడుతున్నాడు. ఐస్‌క్రీం కొనివ్వమని అడిగితే నాన్న కొనలేదని గప్పూ ఏడుస్తుంటే కుందన్ ఆలస్యం చేయకుండా ఒక్క లెంపకాయ ఇచ్చాడు. “ఇలాంటి ఖరీదైన హోటల్‌కి తీసుకురావడం ఎందుకు? బోలెడు డబ్బులు పెట్టి అర్థాకలిలో తిరిగి వెళ్ళడం ఎందుకు?” అంటూ కుంతి ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది. కోపం పట్టలేకపోయాడు కుందన్. “ఇదంతా నా సంతోషం కోసం చేస్తున్నానా? మీ కోసమే కదా? మిమ్మల్ని బయట తిప్పుదామనే కదా సేఠ్‌జీని బతిమాలుకుంది? మీరేమో ఇట్లా…” అంటూ అరిచాడు.
“మాకేం తెలుసు, మీరు బండి తీసుకొచ్చి ‘ఇలా’ తిప్పుతారని తెలిస్తే, మేమసలు రాకపోదుం. చూడండి, పిల్లల ముఖాలు ఎలా మాడిపోయాయో” అంది కుంతి. గప్పూ ముందుకు వచ్చి అమ్మ వడిలో దూరాడు. “ఐస్‌క్రీం కొనుంటే ఏం పోయుండేది?” అంటూ కుంతీ గప్పూని ఓదార్చసాగింది.
“ఆ, కొంటా! దాని రేటెంతో చూసావా? మిగతా పదార్ధాల ఖరీదెంతో తెలుసా? బయటకి వచ్చాక అడిగుంటే, ఎక్కడో అక్కడ కొనిచ్చేవాడిని కదా? ఎప్పడూ ఐస్‌క్రీం మొహమే ఎరగనివాడిలా ఆ ఏడుపేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారూ?” అన్నాడు కుందన్.
“ఆ, అనుకుంటారు. ఓ గొప్ప షావుకారు జాలిపడి తన డ్రైవర్ పిల్లల్ని ఊరంతా తిప్పుతున్నాడని. ఎవరైనా బాబ్డ్ హెయిర్ ఆడవాళ్ళని, టిప్‌టాప్ పిల్లల్ని వెంటేసుకు తిరగాలనే కోరికే ఉంటే మీ సేఠ్‌జీనే అడగాల్సింది వ్యాన్‌తో పాటు ఆయన పెళ్ళాం బిడ్డల్ని కూడా ఇవ్వమని. మా వెంబడి ఎందుకు పడ్డం? ఒప్పుకున్నాం, మేము బైతులమే. మాకు ఈ కార్లూ వద్దూ, ఈ తిరుగుళ్ళూ వద్దు. తిప్పింది చాలు. ఇక మమ్మల్ని ఇంటి దగ్గర దింపండి. అదే పదివేలు” అంది కుంతి, ఇక కోపం పట్టలేక. మాటామాటా పెరిగింది, నువ్వంటే నువ్వు నుంచి చెయ్యెత్తే దాక వెళ్ళింది. వాళ్ళని ఇంటి దగ్గరే దింపేయడమే ఉత్తమమని కుందన్‌కి అనిపించింది. వ్యాన్‌ని సేఠ్‌జీకి అప్పగించేసి ఎక్కడైనా కూర్చుని ఒంటరిగా తాగితే బాగుంటుందనిపించింది. టైం ఇంకా మూడే అయింది, బండిని రాత్రి ఏడు-ఎనిమిది గంటల మధ్య ఇవ్వమని సేఠ్‌జీ చెప్పాడు.
షాపు దగ్గర సేఠ్‌జీ కుందన్‌ని చూసి ఆశ్చర్యపడ్డాడు. “ఏం? ఇంత తొందరగా వచ్చేసావు? పిల్లల్ని బాగా తిప్పావా?” అని అడిగాడు. కుందన్ జవాబు చెప్పేలోపే ఆయనకేదో గుర్తొచ్చింది. “ఒక పని చెయ్. మా ఇంటికి వెళ్ళు. మేడం గారి చెల్లెళ్ళు వచ్చారు, పిల్లలతో సహా. అందరికీ వాళ్ళ కార్లు సరిపోవు. నువ్వు వ్యాన్ తీసుకెళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెడదామంటే అక్కడికి తీసుకెళ్ళు. అందరిని బయట తిప్పి తీసుకురా. నేనిప్పుడే ఫోన్ చేసి చెబుతాను. సరేనా” అన్నాడు. కుందన్ మళ్ళీ డ్రైవర్‌గా మారిపోయాడు. ‘యస్ సార్’ అని మాత్రం అని బయటకి వచ్చేసాడు. ఇప్పటికీ కుందన్ ఇంకా మామూలు మనిషి కాలేదు. ‘ఎక్కడైనా కూర్చుని హాయిగా ఓ చుక్కేసుకుందామనుకుంటే మళ్ళీ డ్యూటీ. మళ్ళీ ఊరంతా తిరగాలి. బండి తీసుకుని సాయంత్రమే వచ్చుంటే బాగుండేది’ అనుకున్నాడు కుందన్.
సేఠ్‌జీ ఇంటికి వెళ్ళి చూస్తే ఎవరూ తయారై లేరు. డ్రైవర్ వచ్చాడనే కబురు లోపలికి పంపి, వ్యాన్‌లో కూర్చున్నాడు కుందన్. సిగరెట్లు తాగుతూ ఎదురుచూడసాగాడు. కనీసం ఓ గంట గడిచాక గానీ అందరూ కిందకి రాలేదు. ముగ్గురు ఆడవాళ్ళు, ఒకాయన, చాలామంది పిల్లలు. బహుశా ఏడెనిమిది మంది. ఒక పెద్ద అమ్మాయి. వ్యాను దిగి అందరికి నమస్కారం చేసాడు కుందన్. ఎవరూ బదులివ్వలేదు. మేడమ్ ఎస్టీమ్ స్వయంగా నడపడానికి సిద్ధమైంది. ఆమె చెల్లెళ్ళు, పెద్ద అమ్మాయి, ఒకరిద్దరు పెద్ద పిల్లలు ఎస్టీమ్ ఎక్కారు. మిగతా వాళ్ళందరూ వ్యాన్ వైపు నడిచారు. తలుపులని దబదబా బాదేస్తూ తెరిచారు, పిల్లలందరూ వెనుక డోర్ తెరచి అక్కడే కూర్చోడానికి గొడవ పడుతున్నారు. కుందన్ తన సీట్లోంచి దిగి బయటకి వచ్చాడు. పిల్లలందరూ పొందికలేని బట్టల్లో ఉన్నారు. ఒకరి నిక్కర్ జారిపోతుంటే, మరొకరి టీషర్ట్ బైటికి వేలాడుతోంది. పిల్లలందరూ వెనుక కూర్చోడానికి గొడవ పడుతున్నారు. చివరికి వాళ్ళతో పాటు వచ్చిన ఆయన కొంతమంది ఇప్పుడు వెనుక కూర్చుంటే మరికొందరు వచ్చేటప్పుడు కూర్చొనేట్టు వాళ్ళకెలాగొలా నచ్చజెప్పి కూర్చోబెట్టాడు.
కుందన్ ఓ పక్కగా నిలుచుని ఇదంతా చూస్తున్నాడు. హఠాత్తుగా కుందన్ దృష్టి వ్యాన్ లోపల పడింది. పిల్లలందరూ మురికి చెప్పులతో ఎక్కి లోపలి సీట్లన్ని పాడుచేసేసారు. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇంతలో, ‘డ్రైవర్, పోనీ’ అనే ఆదేశం వినబడింది. మౌనంగా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. మొదటగా హాంగింగ్ గార్డెన్‌కి పోనివ్వమని చెప్పారు. ఇందాక పిల్లలకి సర్దిచెప్పిన ఆయన వచ్చి కుందన్ పక్క సీట్లో కూర్చున్నాడు. పిల్లలు అప్పటికే గొడవ గొడవ చేస్తున్నారు. ఎస్టీమ్ వెనకాలే బండి కదిలి కొంచెం ముందుకు వెళ్ళగానే, “డ్రైవర్, స్టీరియో ఆన్ చేయ్” అంటూ ఓ కుర్రాడు కరుగ్గా ఆజ్ఞాపించాడు. కుందన్ తల వెనక్కి తిప్పి చూసాడు, ఆ ఆర్డరేసిన కుర్రాడు దాదాపు గప్పూ వయసే ఉంటాడు. పొద్దున్న గప్పూ అన్న మాటలు గుర్తొచ్చాయి. ‘నాన్నా, స్టీరియో పెట్టవా?’ అంటూ ఎంత మర్యాదగా అడిగాడు! ఇంతలో ఆ కుర్రాడు “డ్రైవర్, వినబడలేదా? స్టీరియో ఆన్ చెయ్” అంటూ అరిచాడు. కుందన్ ఏం మాట్లాడకుండా స్టీరియో ఆన్ చేసాడు. పిల్లలందరు పెద్దగా అరుపులూ, కేకలూ. కనుచివర్ల నుంచి తన పక్కన కూర్చున్న ఆయన కేసి చూసాడు కుందన్. ఆయనకీ అరుపులేమీ పట్టినట్లు లేవు. హాంగింగ్ గార్డెన్ చేరేలోపు పిల్లల అరుపులూ, అసభ్యంగా ఒకరినొకరు తిట్లూ – వినలేక కుందన్ చెవులు తూట్లు పడ్డాయి. ఆ పిల్లలందరినీ అక్కడికక్కడే వీపు చిట్లగొట్టాలని కుందన్‌కి మనసు పీకింది. ఎలాగోలా తనని తాను అదుపు చేసుకున్నాడు. కొంచెం కూడా మర్యాద లేదు. అమ్మా నాన్నా వీళ్ళకేమీ నేర్పించడం లేదేమో. పిల్లల్ని ఇంత గారాబంగా ఎలా పెంచుతారో? అని అనుకున్నాడు.
హాంగింగ్ గార్డెన్ చేరగానే, పిల్లలు గబగబా బయటకి దూకి పరిగెత్తారు. మేడం, వాళ్ళ అతిధులు మెల్లగా పిల్లల వెనుకగా నడిచారు. కుందన్ మూడ్ మళ్ళీ పాడయిపోయింది. హఠాత్తుగా కుందన్‌కి గుర్తొచ్చింది మధ్యలోని సీట్‌ని పిల్లలు చాలా మురికి చేసేసారని. ఓ గుడ్డ తడిపి మురికిని రుద్ది తుడుస్తుంటే అతనికి గుర్తొచ్చింది – తన పిల్లలు ఆ సీట్లో దాదాపు మూడు గంటల పాటు కూర్చున్నా, ఒక చిన్న మరక కూడా పడలేదని. సంజయ్ సీట్‌పైన చెప్పులని ఆనిస్తేనే తను అరిచాడు. సీట్‌ని తుడుస్తుంటే – ఎందుకీ అనవసరపు శ్రమ, ఆ పిల్లలు మళ్ళీ ఎలానూ పాడుచేస్తారని అనుకున్నాడు.
అందరూ హాంగింగ్ గార్డెన్ నుంచి బయటకి వచ్చే సమయానికి ఓ కుర్రాడి డ్రెస్ పూర్తిగా మురికై పోయింది, మోకాళ్ళు గీరుకుపోయాయి. ‘ఎక్కడో పడిపోయుంటాడు’ అనుకున్నాడు కుందన్. ఇందాక తన పక్కన కూర్చున్న ఆయన ఆ కుర్రాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మాటిమాటికి తెగ బుజ్జగిస్తున్నాడు. కార్లన్నీ రెస్టారంట్ వైపుకి బయలుదేరాయి. ఆ తర్వాత అక్కడ్నించి చౌపాటీకి. ఈ సారి వ్యాన్‌లో పెద్ద అమ్మాయి ఎక్కింది. చాలా విచిత్రమైన డ్రెస్; మోకాళ్ళ దాక వచ్చే టీషర్ట్! మాసిపోయి, చిరిగిపోయున్న జీన్స్ పాంట్! కాళ్ళకి బాత్‌రూం చెప్పులు! ఆ అమ్మాయి మాటిమాటికి కళ్ళు చికిలిస్తూ చూయింగ్ గమ్ నములుతోంది. బబుల్గమ్ అంటే కుందన్‌కి అసహ్యం. ముఖ్యంగా పిల్లలు బబుల్గమ్‌ని కచాపచా నములుతూ చేసే చప్పుడంటే మరీ చిరాకు. పైగా ఇప్పుడు ఆ పిల్ల ఆ బబుల్గమ్ కార్లో అంటిస్తుందేమోనన్న భయం ఒకటి.
కుందన్ భయం నిజమైంది. చౌపాటీలో దిగేటప్పుడు ఆ అమ్మాయి నోట్లో చూయింగ్ గమ్ లేదు. అందరు ముందుకు వెళ్ళగానే, కుందన్ చటుకున్న మధ్య సీట్లోకి తొంగి చూసాడు. చూయింగ్ గమ్ వ్యాన్ తలుపు ఫోమ్‌కి అతికించబడి ఉంది. కుందన్ ముఖం వివర్ణమైంది. ఓ ఇటుకరాయితో ఆ పిల్ల తలమీద ఒక్కటిద్దామనుకున్నాడు. ‘ఈ పిల్లల కంటే నా పిల్లలు ఎన్నో రెట్లు నయం. నేనెంత ఫాల్తూగాణ్ణి, అనవసరంగా పొద్దున్నుంచి వాళ్ళకి మర్యాద తెలియదంటూ తిట్టాను’ అనుకున్నాడు. తన మీద తనకే సిగ్గేసింది కుందన్‌కి. మౌనంగా వచ్చి తన సీట్లో కూర్చుని అద్దం కిందకి దించుకున్నాడు. ఒక్కసారిగా ఉదాసీనంగా అయిపోయాడు. ఆ ప్రపంచం గురించి ఎంత భ్రమలో ఉన్నాడో పూర్తిగా తెలిసొచ్చింది.
అప్పుడే నిశ్చయించుకున్నాడు కుందన్ – ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకు బోల్డన్ని చిరుతిళ్ళు, బొమ్మలు కొనుక్కొని తీసుకువెళ్ళాలని!
[హిందీ మూలం: సూరజ్ ప్రకాశ్ కథ ఫర్క్. వారి ఇతర కథలన్నీ వారి వెబ్‌సైట్‌లో ఉన్నాయి.]
