విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార

విశ్వనాథను, గురజాడను గూర్చి విమర్శ చేసిన సందర్భాలలో నాటిక, నవలా ప్రక్రియల పరామర్శ చేశారు సంపత్కుమార. సర్వసాధారణంగా నవలకు, నాటకానికి మధ్యగల సామ్యభేధాలను సంపత్కుమార విశదీకరించారు.

– “మౌలికంగానూ, స్వాభావికంగానూ, ప్రయోజనపరంగానూ ఇవి విభిన్న ప్రక్రియలు. ఒకటి శ్రవ్యము, రెండవది దృశ్యము. నవల కథన ప్రధానమైనది. నాటకము సంభాషణ ప్రధానమైనది.”

– “నవలలో సంభాషణలుండవచ్చును గానీ నాటకంలో కవి కథనం ఉండదు. నవలలో నాటకీయతకు స్థానం ఉండవచ్చును గాని, నాటకంలో నవలా లక్షణానికి చోటు లేదు.”

– “ఇతివృత్తము, పరిమితి నవల, నాటకాలను పూర్తిగా వేరు చేస్తాయి.”

– “నవలకు, కావ్యానికి రూపంలో తప్ప వేరొక భేదం లేదు.”

– “నాటకంలో తప్పనిసరైన స్థల, కాల, ఇతివృత్త, ఐక్య సంపుటి నవలా ప్రక్రియలో అంత నియతమైనది కాదు.”

ఇలా ఈ ప్రక్రియల సామాన్య లక్షణాలు పునశ్చరణ చేశారు సంపత్కుమార. నవలకు, కావ్యానికి రూపంలో తప్ప వేరొక భేదం లేదన్నది స్థూలదృష్టితో అంగీకరించవలసిందే కానీ, సూక్ష్మదృష్టికి నిలిచే ప్రమాణము కాదు. నాటకం రచన, ప్రదర్శనల కాలం నాటి ప్రేక్షకుల మనోభావాల కనుకూలంగా ఉండాలన్న అభిప్రాయం కూడా చర్చించదగినది. నాటకంలో నావలీకత ఉండకూడదని గురజాడ కన్యాశుల్కాన్ని లక్ష్యం చేసుకుని సంపత్కుమార అన్నారు. గురజాడ సాధించదలిచిన నూతన సంవిధానం పట్ల సానుభూతిని, సహమతిని కలిగి వుంటే సంపత్కుమార సత్యసన్నిహితమైన తన విమర్శనాంశాన్ని ఇంకొక రీతిగా ప్రకటించగలిగి ఉండేవారు.

నాటకంలో పద్యరచన అవసరమా? కాదా? అనే అంశానికి సంబంధించి సంపత్కుమారకు పూర్వం ఆసక్తికరమైన చర్చలు, విమర్శలు జరిగాయి. విమర్శకుడుగా సంపత్కుమార ఈ విషయంలో చక్కటి సూచనలు చేశారు. పద్య కావ్యాలలోని పద్య ప్రయోగ రీతికీ, నాటకంలోని ప్రయోగ రీతికీ గల భేదాన్ని వారు క్లుప్తంగా సూచించారు. సంవాదరూపమైన వచనానికి మించి భావవ్యక్తీకరణ చేయవలసిన అవసరమున్నప్పుడు మాత్రమే పద్యం యొక్క అవసరం నాటకంలో కలుగుతుంది. అది కూడా ప్రధానపాత్రల విషయంలోనే అనుకూలంగా ఉంటుందన్నారు సంపత్కుమార. సంస్కృత నాటకాలలో పూర్వరంగంలోనే కాక ప్రవేశిక-విష్కంభకాదుల లోను, క్వాచిత్కంగా అంకంలోనూ కూడా అప్రధాన పాత్రలు సైతం అరుదుగానైనా శ్లోకపఠనం చేయటం పరిపాటి. నాటకకారుడు తన పద్యరచనా శక్తిని వ్యక్తం చేయడానికి కాక, పాత్రగత శీలప్రవృత్తులకు అనుగుణమైన రీతిలో ఔచిత్యబంధురంగా పద్యరచన చేయాలన్న ఆయన సూచన మేల్తరమైనది.

సంపత్కుమార సంస్కృతాంధ్రాంగ్ల హిందీ భాషలలో విశేషమైన పాండిత్యం గలవారు. ఆ కారణంగా తగిన సందర్భాల్లో ఆయన సముచితమైన తులనాత్మక విమర్శకు తలపడేవారు. రామాయణ కల్పవృక్షం ఆయన ప్రధాన కర్మక్షేత్రం. ఆ కారణంగా కల్పవృక్షాన్ని వాల్మీకి రామాయణంతోనూ, కంబరామాయణంతోనూ, రామచరితమానసంతోనూ, తెలుగులోని ఇతర రామాయణాలతోనూ తులనాత్మకంగా అధ్యయనం చేసి తగుపాటి విమర్శ చేశారు. ఆ విమర్శలో తేలిన అంశాలివి;

– “వాల్మీకంలో ఉన్న తార్కికబుద్ధి ఇతర రామాయణాలలో పూర్తిగా లోపించిందనే చెప్పవచ్చు.”

– “కంబరామాయణంలో విశిష్టాద్వైత నిబంధనంతో పాటు వర్ణనా ప్రాచుర్యం కనిపిస్తుంది.”

– “రామ పరబ్రహ్మత్వాన్ని స్థాపించడం లక్ష్యంగా తులసీదాసు రామచరితమానసాన్ని రాశాడు. ఇది శంకర, రామానుజ మతాలకు మధ్యేమార్గంగా సాగిన రచన.”

– “విశ్వనాథ అద్వైత సిద్ధాంత ప్రవచనం కోసం రామాయణ కల్పవృక్షాన్ని రాశాడు.”

ఇలా సాగిన పరిశీలన ఫలితంగా సంపత్కుమార విశ్వనాథ రామాయణ కల్పవృక్షం సర్వపూర్వ రామాయణాతిశాయిగా ఉందనే నిర్ణయానికి వచ్చారు. భారతీయ భాషలలోని రామాయణాలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన విమర్శకులు సమర్ధించిన పక్షంలో ఈ నిర్ణయం ఇంకా రాణకు వస్తుంది.

అయితే, తెలుగు సాహిత్య విమర్శలో తులనాత్మక శాఖకు ప్రారంభకుడు సంపత్కుమార అని నిర్ణయానికి వచ్చేముందు మరికొంత పూర్వాపర విషయ సమాకలనం అవసర మనిపించక మానదు. కన్యాశుల్కం తొలి-మలి కూర్పుల విమర్శనం తులనాత్మక విమర్శ కాబోదు. తొలి రచన అసమగ్రమైనది. గురజాడ దానిని బుద్ధిపూర్వకంగా వదులుకున్నాడు. రచయిత వదిలిపెట్టిన రచనను విమర్శించడం యుక్తిసహం కాదు. గురజాడ విషయంలో సంపత్కుమారకు, నాకు షష్ఠాష్టకం. ‘కన్యాశుల్కం – మరోవైపు’ అనే పుస్తకంలో లొసుగులు నిర్ణయించడంలో సంపత్కుమార చూపిన ఉపపత్తులు తిరుగులేనివి – అన్న విమర్శకమిత్రుని అభిప్రాయంతో నేను స్పష్టంగా విభేదిస్తున్నాను. సంపత్కుమార ఆక్షేపణలకు, విలోమవిమర్శకు, ‘కన్యాశుల్కం – 17వ శతాబ్ద ఆధునిక భారతీయ నాటకము’ లన్న నా పుస్తకంలో తగిన పరిష్కారాలు చూపించడానికి ప్రయత్నించాను. విశ్వనాథ కారణంగా మేమిద్దరమూ ఏకమయ్యాము. గురజాడ కారణంగా మేమిద్దరమూ విడిపోలేదు. మరింత సన్నిహితులమయాము. ఇందుకు నాకు వారి పట్ల గల అత్యంత విధేయతే గాక ఆయన ఆదర-సంస్కారాలు కూడా కారణమని భావిస్తున్నాను.

వివిధ విమర్శ రీతుల అధ్యయనంతో పాటు తనకు ముందున్న నూటముప్ఫైనాలుగు సంవత్సరాల తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను, అందులోనూ తొలి-మలి తరాల విమర్శ ధోరణులను మదింపు చేయడానికి సంపత్కుమార కృషిచేశారు. వీరేశలింగాన్ని తెలుగు విమర్శకు మొదటి కొండగుర్తుగా అంగీకరిస్తూ, అంతకుముందు విమర్శ రూపంలో కనిపించే అంశాలను కూడా సంపత్కుమార పరిగణన లోనికి తీసుకున్నారు. ఐదుతరాల తెలుగు సాహిత్య విమర్శకులలో పూర్వతరాల కన్నా ఉత్తరోత్తరతరాలు సంకీర్ణంగాను, సంక్లిష్టంగాను ఉండడం కూడా ఒక సహజమైన అంశంగా సంపత్కుమార తలచారు. అధ్యయన విధానాలనేవి ఆయా దేశాల సంస్కృతుల, భాషారీతుల వంటి వాటిని బట్టి భిన్నంగా ఉంటాయనే సంపత్కుమార అభిప్రాయానికి ‘ఆయా విమర్శకుల దృష్టికోణాన్ని బట్టి కూడా’ అని జతచేయవలసి ఉంటుంది. తొలితరం విమర్శకులు పాశ్చాత్య విమర్శ ప్రమాణాలనే అనుసరించారని సంపత్కుమార తెలిపారు.

ఆధునిక విమర్శకు పాశ్చాత్య సాహిత్య విమర్శ సూత్రాలు ప్రమాణాలని భావించిన పక్షంలో కందుకూరి విమర్శ ఆధునికకాలంలో వచ్చిన విమర్శనమే కానీ ఆధునిక విమర్శ మాత్రం కాదు. దక్షిణామూర్తి, వెన్నేటి రామచంద్రరావు, బుఱ్ఱా శేషగిరిరావు, కట్టమంచి రామలింగారెడ్డి వంటి వారు పాశ్చాత్య విమర్శ ధోరణి ననుసరించిన వర్గానికి; కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, వింజమూరి రంగాచార్యులు, పనప్పాకం సుబ్రహ్మణ్య అయ్యరు వంటి వారు దేశీయ విమర్శ ధోరణి ననుసరించిన వర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆధునిక విమర్శకులుగా సంపత్కుమార సోపపత్తికంగా నిరూపణ చేశారు. “శాస్త్రిగారి కాలం నాటికే మన ప్రాచీన కావ్యాల్లోని వర్ణనా విధానం, అలంకార విధానం ఆంగ్లేయవిమర్శ విధాన ప్రభావం ద్వారా అప్రతిష్ట పాలయింది” – అన్న వాక్యం సంపత్కుమార దేశీయమైన విమర్శమార్గం పట్ల మొగ్గు చూపించినట్లు స్పష్టం చేస్తుంది.