సంస్కృత పాఠశాలలోను, కళాశాలలోను అధ్యయనం కొనసాగించిన కారణంగా సంపత్కుమారకు ఛందోవ్యాకరణాలంకారాది శాస్త్రవిషయాల పట్ల సదభిరుచి, సమ్యదవగాహన, సమీచీనమైన దర్శనము, సృజనాత్మకమైన విమర్శా వ్యాపారము పెంపొందాయి. ఆ కారణంగా సంపత్కుమారపై సాంప్రదాయ విమర్శకుడనే బలమైన ముద్ర పడింది. తెలుగు సాహిత్య విమర్శలో సాంప్రదాయిక రీతిని గూర్చి 1981నాటికి తన పరిశోధన పూర్తి చేసినా, అప్పటికి సుమారు ముప్ఫై సంవత్సరాల ముందునుండి సంప్రదాయ రీతిని గూర్చి సంపత్కుమార తన విమర్శలో రాస్తూనే ఉన్నారు. కావ్యాన్ని ఎలా చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాన్ని ఆయన సాంప్రదాయ మార్గాన్ననుసరించి విశదం చేశారు. కవి ఉద్దేశించిన భావం స్పష్టంగా దర్శింపబడనప్పుడు పదాలు అర్థమయ్యేవే వాడబడినా కూడా ఆ భావం స్పష్టంగా వ్యక్తం కాదు. అప్పుడే అది అర్థం కాకుండా పోతుంది. కవి ప్రౌఢ శబ్దాలను, మారుమూల శబ్దాలను వాడడం వల్ల కలిగే క్లేశం ఇంతకంటే చాలా స్వల్పమైనదని ఆయన వివరించారు. అంటే కావ్యాన్ని అర్థం చేసుకోలేక పోవడంలో శబ్దం వల్ల కలిగే క్లేశం కంటే అభివ్యక్తి వైకల్యం వలన, అస్పష్ట భావప్రతీతి వలన కలిగే క్లేశం ఎక్కువని వారు స్పష్టం చేశారు. పాఠకుడికి తాను చదివే రచన పట్ల సానుభూతి, సహమతి ఉన్నప్పుడే కవి ప్రతిపాదించిన అంశాలను పూర్తిగా ఋజుమార్గంలో తెలుసుకోగలడని, కవి పట్ల విముఖత గల పాఠకుడు ఆ కవిని అర్థం చేసుకోలేడని సంపత్కుమార స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సంప్రదాయ రీతికి చెందిన శిల్పము, రసము, కావ్యానందము అనే క్రమవికాస దశలతో కూడిన సాహిత్యవిమర్శగా సంపత్కుమార గుర్తించారు. పాత్రల చిత్తవృత్తులు, గమనాలు, చర్యలు – ప్రతిచర్యలు, మానసిక సంఘర్షణలు మొదలైన వాటిననన్నింటినీ ప్రాచీనకవులు రసాభిముఖంగానే తీర్చిదిద్దడం లక్ష్యంగా ఎంచేవారని, భారతీయ కావ్యశాస్త్రంలో రసానికుండే ప్రాముఖ్యం పాత్రచిత్రణకు లేదని, పాత్రచిత్రణకు ప్రాధాన్యం కల్పించడం పూర్తిగా ఆధునికమైన పాశ్చాత్య విమర్శ ప్రభావంతో మొదలయిందని సంపత్కుమార పలు సందర్భాలలో వివరించారు.
ప్రాచీన కావ్యవిమర్శ విధానంలో రసానికి గల ప్రాధాన్యం కవి జీవితానికి, సమకాలీన పరిస్థితులకు లేదని; ఇతివృత్తము, భావనాశక్తి, కవితాశక్తి వంటివి రసమార్గాన్ని నిర్దేశించేవిగా ఉంటాయని సంపత్కుమార విశదం చేశారు. దేశీయమైన భావనలో కథకంటే కథానిర్వహణే ప్రాధాన్యమని సంపత్కుమార అనడంలో కథానిర్వహణమంటే రసపోషణమేనన్న అభిప్రాయం గర్భితంగా ఉంది. కావ్యంలో కనబడే శతాంశాలలో తొంభైపాళ్ళు కవి ప్రతిభతోనే ఉంటాయని, కథకంటే రసము వేయిరెట్లు గొప్పదని కుంతకుడు మొదలైన ప్రాచీనాలంకారికుల మార్గాన్ననుసరించి విశ్వనాథ ఒక సిద్ధాంతవాక్యంగా చెప్పిన అభిప్రాయాన్నే సంపత్కుమార పునఃప్రపంచనం చేసినట్లుగా ఆయన విమర్శ సాక్ష్యమిస్తుంది. తెలుగులో పాశ్చాత్య విమర్శ సంప్రదాయాన్ని అనుసరించిన విమర్శకులు భావ, చిత్త వృత్తులకు సంబంధించిన వివేచన చేయలేదని, తొలితరం విమర్శకులలో ఒకరైన దక్షిణామూర్తిగారి విమర్శరీతిని సమీక్షిస్తూ సంపత్కుమార తెలిపారు. ‘పాశ్చాత్యరీతిలో భావస్థాయి వరకే తప్ప రసస్థాయికి చెందిన భావన లేదు,’ అంటూ సంపత్కుమార స్పష్టంగా చెప్పిన మాట కొంత విమర్శ సాపేక్షమయినది. ఒక విధమైన విమర్శ పరిభాషకు కట్టుబడి ఉన్నప్పుడు స్థూలంగా ఇటువంటి అభిప్రాయం కలగడం సహజమే. పరిభాషను పక్కకు పెట్టి కేవలం విషయ వివేచనకు పూనుకుంటే గానీ దీనిని ఇదమిత్థమని నిర్ణయించడం సాధ్యం కాదు. రసానుభవానికి కావ్యసమగ్రదర్శనం ప్రధానమని, భారతీయ విచారణలో రసం ప్రధానంగా మానసిక వ్యాపారంగా ప్రతిపాదితమయిందని స్పష్టం చేయడంలో సంపత్కుమార తన అలంకారశాస్త్ర పరిజ్ఞానాన్నంతటీనీ నవ్యసాంప్రదాయ రీతిలో ప్రదర్శించారు. రాజశేఖరుడు చెప్పిన భావయిత్రి, కారయిత్రి అనే పరిభాషకు బదులుగా కొందరు ఆధునికులు భావనాశక్తి, రచనాశక్తి అనే పరిభాషను ఉపయోగించడంలో వారికి గల దేశీయ సంప్రదాయాభిజ్ఞత అభివ్యక్తమవుతుందని గుర్తించారు. కేవలం భావాలు, రసాలు, కథ వంటివే కాకుండా రచనారీతిని వ్యక్తీకరించే భాష, ఛందోవ్యాకరణాంశాలు కూడా సాహిత్య కావ్యవిమర్శలో భాగాలుగానే గుర్తించవలసి ఉంటుంది – అని సంపత్కుమార స్పష్టం చేశారు. అలంకార శాస్త్రంలో ప్రస్తావనకు వచ్చిన సంఘటన, పాకము, మార్గము వంటి విశేషాంశాలను, ఆ అంశాలకు రసంతో గల సంబంధాన్ని సంప్రదాయరీతిలో అవగాహన చేసుకొని తన విమర్శకు పాదులు కట్టుకున్న వ్యుత్పన్నుడు సంపత్కుమార.

కోవెల సంపత్కుమారాచార్యుని
సాహితీ ప్రస్థానం
ఒక కవి ఒక ప్రత్యేక మార్గానికి కట్టుబడి ఉన్నాడని విమర్శించడం సహేతుకం కాదు. అన్ని సన్నివేశాలలోనూ సరళమైన శైలిని గానీ, కఠినమైన శైలిని గానీ ఉపయోగించడానికి కవికి వీలుకాదు. కవి ప్రయోగించే ప్రతి అక్షరమూ, పదమూ అసమాస, మధ్యమ సమాస, దీర్ఘ సమాసాదులతో కూడిన సంఘటనము. ఆ సంఘటనను అనుసరించిన గుణ వృత్తి రీతిపాకాదులు రసానుగుణంగానే ఉంటాయి – అని గుర్తించి విమర్శకు పూనుకోడం సంపత్కుమార అలంకార శాస్త్ర పరిచయాన్ని తెలియజేస్తుంది. ఈ భూమికతోనే కావ్యంలో కథ ఉపలక్షణంగా ఉంటుందని, కావ్యం రసస్ఫురకంగా ఉంటుందని ఆయన నిర్ణయించారు. రామాయణంలోని రసాన్ని గూర్చి ఆనందవర్ధన, కుంతకాది అలంకారికులు కొనసాగించిన చర్చ సంపత్కుమార క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రామాయణంలో ప్రధానరసం శాంతరసమనే అలంకారిక మతాన్ననుసరించి విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలోని శిల్పాన్ని నిర్వహించారని; అలోకసామాన్య ప్రతిభ గల కవి మాత్రమే కథా పరమార్థాన్ని ముందుగా నిర్ణయించుకొని, ఆ విషయాన్ని రసోపస్కారకంగా నిర్ణయించగల వ్యూహరచన చేయగలడని సంపత్కుమార భావించారు. విమర్శ రసస్థాయి ననుసరించి, వస్తుస్థాయి ననుసరించి ఏ విధంగా ఉండాలో విశ్వనాథ విమర్శ మార్గాన్ననుసరించి సంపత్కుమార విశదీకరించారు. కేవలం ప్రాచీనాలంకార శాస్త్రమర్యాద ననుసరించి రస ప్రస్థాన మహాభిగమనం చేయడంతో తృప్తి పడని సంపత్కుమార ఈ విషయంలో ఆధునిక కవులు, కావ్యతత్వజ్ఞులు నూత్న శేముషీవైభవంతో చేసిన ప్రతిపాదనలను, అనుసరించిన మార్గాలను, స్థాపించిన సిద్ధాంతాలను గ్రహిస్తూ తన విమర్శ రీతికి ఒక సమగ్రతను, సంపూర్ణతను సంతరించుకోడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చారు.
సాహిత్యవిమర్శకు శబ్దశాస్త్ర పరిచయం తప్పనిసరిగా ఉండాలి. అది అరగొరగా ఉండకూడదు. నికషమైన పాండిత్యమై ఉండాలి. ప్రాచ్యకళాశాల విద్యార్థిగా సంస్కృత వ్యాకరణ శాస్త్రాధ్యయనం కొనసాగిస్తూనే సంపత్కుమార అవసరమైన మేరకు తన విమర్శలో శబ్దశాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రకటించుకున్నారు. స్థాలీపులాకన్యాయంగా ఒకటి, రెండు సందర్భాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.
- రామాయణంలో రాముడు లక్ష్మణునుద్దేశించి ‘అకృతదారః” అని పలకడంలోని ఔచిత్యాన్ని తన వ్యాకరణ పాండిత్యంతో సంపత్కుమార చేసిన విమర్శ.
- ‘రమ్’ అన్న ధాతువు నుంచి సుబంతం పుంలింగరూపంలో నిష్పన్నమయితే ‘రామ’ అనీ, స్త్రీలింగరూపంలో నిష్పన్నమయితే ‘రామా’ అని, ఒకే వెలుగు ద్విధా పరిణతమయినట్లు ఒకే మూలధాతువు ఈ రూపద్వయంగా పరిణతమయింది. ఒకటి పురుషరూపం, ఒకటి గరితరూపం. అందుకనే తత్త్వతః మూలతః అభేదం – అంటూ ‘రామ’ శబ్దప్రయోగంలోని విశేషాంశవివరణ. (సంస్కృత పదాలను ప్రకృతి ప్రత్యయ విభాగం చేసి మూలధాతువును, దాని అర్థాన్ని గ్రహించగల శబ్దశాస్త్ర పరిచయం గల వారు మాత్రమే ఈ విధమైన విమర్శ చేయగలరు.)
- విశ్వనాథ తన కిన్నెరసాని పాటలలోని మొదటి చరణాన్ని ‘ఓహో! కిన్నెరసానీ!’ అని ప్రారంభిస్తూ ‘జవరాలా’ అని ముగిస్తారు. కవి ఊహ ననుసరించి కిన్నెర యౌవనవతి యైన స్త్రీ. భౌతికంగా చూసినప్పుడు అది ఉరవడిగా ప్రవహించే ఒక వాగు. సంపత్కుమార ఇక్కడ ‘జవరాలా’ అనే ప్రయోగానికి యౌవ్వనవతి అనే సామాన్యార్థంతో పాటు ‘వేగరి యైన స్త్రీ’ అని విశెషార్థ కల్పన చేయదలిచారు. చిన్నయసూరి వ్యాకరణం ఇందుకు ఒప్పదు. ‘జవ’ అనే తత్సమపదం మీద ‘ఆలు’ అనే తెలుగుపదం చేర్చినప్పుడు ‘జవరాలు’ అనే రూపం ఏర్పడదని భావించిన చిన్నయసూరి, “జవ్వని శబ్దంబునకు జవాదేశంబగు” – అని ఒక ఆదేశకల్పన చేసి ‘జవరాలు’ అనే రూపాన్ని సాధించారు. ఈ రూపానికి ‘యౌవ్వనవతి’ అనే అర్థం వస్తుంది గానీ ‘వేగరి యైన స్త్రీ’ అనే అర్థం రాదు. తనకు ఇష్టమైన అర్థాన్ని సాధించడం కోసం సంపత్కుమార చిన్నయసూరిని పక్కకు నెట్టారు. ‘జవ’ అనేది ఆదేశంగా వచ్చినది కాక స్వతంత్రపదంగా భావించితే ‘జవ’ శబ్దానికి వేగమనీ అర్థం ఉన్నది. ‘ము’ వర్ణ విరహితంగా ‘జవ’ శబ్దం అర్థంలోని కొంత భేదంతో తెలుగు వ్యవహారంలో ఉన్నది కాబట్టి ‘జవరాలు’ అని కావచ్చు. దీనికి ఇప్పుడు ‘వేగరి యైన స్త్రీ’ అనే అర్థం చెప్పవచ్చు” – అంటూ ఒక వివరణ ఇచ్చారు.
ఇక్కడ సంపత్కుమార వ్యాకరణ మౌఢ్యాన్ని వదలి వ్యావహారిక చైతన్యంలోకి మళ్ళినట్లయింది. విమర్శలో ఇటువంటి తెగువను చూపించిన సంపత్కుమార ‘తా బట్టిన కుందేటికి మూడే కాళ్ళు’ అన్న పద్ధతికి చెందినవారు కాదు. తన భ్రమప్రమాదాలను గానీ, దోషాలను గానీ ఎదుటివారు ఎత్తి చూపించినప్పుడు సమచిత్తంతో ఆ విమర్శను స్వీకరించి తమను తాము సంస్కరించుకునే సౌమనస్యం వారి సొత్తు. ‘త్రినయన – త్రిణయన’ అనే రెండు రూపాల వివరణలోనూ, ‘అన్యోన్య’ ప్రయోగసాధుత్వ నిర్ణయంలోనూ సంపత్కుమార ప్రమాదపడినట్లు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఎత్తి చూపించారు. అప్పుడు సంపత్కుమార “కొన్ని విషయాల చర్చలో, విచారణలో అసమగ్రతకూ, పొరపాట్లకూ అవకాశం తప్పలేదు” – అంటూ తన పొరపాటును అంగీకరించారు.