“దింపు పేరు చెప్పి మీ బాబుకి బానే టోకరా వేస్తావ్! ” ముక్కలు పంచుతూ అన్నాన్నేను.
“ఏం చెయ్యమంటావు చెప్పు. మా ఆవిడకి మల్లెపూలు కొనాలన్నా మా నాన్నముందు మోకరిల్లాలి. అందుకే ఈ చావంతా.”
“మీ ఆవిడికా? మండపేట మహలక్ష్మికా?” భద్రంగాడి వెటకారం విని గుర్రుగా చూసాడు సూరిబాబు.
ఇలా సాగుతుంది మా పారాయణ ప్రహసనం. నేను మాత్రం శనాది వారాలొక్కటే వస్తాను. మిగతా రోజులు వస్తే మా ఆవిడ చంపుతుంది. పైగా పేరూరు వరకూ పదిమైళ్ళు సైకిలు తొక్కుకుంటూ వెళ్ళెచ్చోసరికి ఓపికుండదు. శనివారం నేనెప్పుడూ స్కూలుకెళ్ళిన పాపాన పోలేదు. ఒంటి పూట బడికి నేను పూర్తిగా సెలవు తీసుకుంటాను.
“మీ బాబు భలే వాడురా! మీ అందర్నీ బానే కంట్రోల్ చేస్తాడు.” విస్సు ముక్కేస్తూ అన్నాడు.
“కంట్రోలా పాడా! ఇంట్లో ఎవ్వరికీ ఆయనంటే భయం తప్ప ప్రేమా, వల్లకాడూ లేదు. మా అమ్మక్కూడా ఆయనంటే విసుగే! అసలెవరితోనయినా సవ్యంగా ప్రేమతో మాట్లాడి చస్తేనా? అంతెందుకు మొన్న మా రెండో వాడు బంతి పోగొట్టుకుంటే ఓ నాలిగిచ్చుకున్నాడట. వాడారాత్రి వాళ్ళమ్మని తాతెప్పుడు చస్తాడని అడిగాడని మా ఆవిడ చెప్పింది. వాడే కాదు. మా ఇంట్లో అందరూ మూకుమ్మడిగా కోరుకునేదొక్కటే – ఆయన చావు.” ఎంతో మామూలుగా సూరిబాబన్న మాటలకి పేకాటలో మునిగిన అందరమూ తలెత్తి వాడికేసి చూసాం.
“తప్పురా! ఎంతయినా తండ్రి. మిమ్మలందర్నీ పోషిస్తున్నాడు కదా?” భద్రం గాడు కసురుకున్నాడు. మేమందరమూ వాడికి వత్తాసు పలికాం.
“మీరూ ఇలాంటి పరిస్థితుల్లో వుంటే ఇంతకంటే ఘోరంగా ఉంటారు.మీకు తెలీదంతే!” అంటూ మిడిల్ డ్రాప్ సంకేతంగా ముక్కలు పడేసాడు. ఇహ రెట్టించడం ఎందుకని మేమెవరమూ ఇహ పొడిగించలేదు. ఆటలో మునిగిపోయాం.
సూరిబాబు మాటలు విని బాధ కలిగింది. ఈ మాటలు వింటే పేరప్పగారి రియాక్షనెలా వుంటుందాన్న ఆలోచనొచ్చింది. మనుషులు విచిత్రంగా ఉంటారు. ఒక్క మనిషికి ఎదురు చెప్పలేక యావత్తు కుటుంబమూ అంతగా ద్వేషిస్తున్నారంటే ఆశ్చర్యం కలిగింది. మనిషయినా, జంతువయినా కట్టడి భరించలేదు; దానికి బంధాలూ, అనుబంధాలూ మినహాయింపు కాదు.
అందరమూ ఆటలో మునిగుండగా కారు షెడ్డు తలుపు ఎవరో గట్టిగా కొట్టారు. మా కొండ గుర్తులకి అతీతంగా కొడుతూంటే మెల్లగా షెడ్డు డోరు పైకెత్తి చూసాను. ఆయాస పడుతూ మా పెద్దాడు కనిపించాడు.
“నాన్నా! బామ్మ పడిపోయింది. అమ్మ నిన్ను అర్జంటుగా రమ్మనమని చెప్పింది.” మావాడు కంగారుగా అన్నాడు. చేతిలో ఉన్న ముక్కలక్కడే పడేసి ఇంటి ముఖం పెట్టాను.
మా అమ్మకి చిన్న హార్టెటాకొచ్చింది. వారం రోజులు ఆసుపత్రిలో ఉంచాల్సొచ్చింది. మా చుట్టుపక్కల ఊళ్ళకి డాక్టర్రాఘవేంద్రదే పెద్దాసుపత్రి.
“మీరు వీలయితే కాకినాడ తీసుకెళ్ళాల్సుంటుంది. ఆపరేషన్చెయ్యల్సిన అవసరంవుంది. నేనూ చెయ్యగలను కానీ నా దగ్గర సరైన ఎక్విప్మెంటు లేదు.” అమ్మ కాస్త మంచిగా కోలుకున్నాక ఆవిణ్ణి డిశ్చార్జి చేస్తూ ఆయన చెప్పిన మాట. ఖర్చెంతవుతుందని అడిగాను. ముప్పైవేలు పైనవుతుందని చెప్పాడు డాక్టర్. అంత సొమ్ము నా దగ్గర్లేదు. పొలం అమ్మకానికి పెట్టాను.
ఓ వారం తరువాత ఎవరూ ఊహించని ఓ సంఘటన జరిగింది. పేరప్పగారికి సీరియస్ అయ్యి ఆసుపత్రిలో చేర్చారని పేరూరు స్కూల్లో ఉండగా కబురొచ్చింది. మధ్యాన్నం రెండు గంటలు ముందుగా పర్మిషన్ తీసుకొని బయల్దేరాను. రాఘవేంద్ర గారి ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. అక్కడ కెళ్ళేసరికి సూరిబాబు పెద్దన్నయ్య కనిపించాడు. పేరప్పగారికి మైల్డుగా హార్టెటాకొచ్చిందనీ చెప్పాడు. అక్కడ ఆయనా, పేరప్పగారి భార్యా తప్ప వారి కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదు. ఆ రూములో పేరప్పగారు బెడ్డు మీదున్నాడు. ముఖానికి ఆక్సిజన్ పంపే మాస్కు పెట్టారు. పక్కనే ఉన్న పెద్దావిణ్ణి పలకరించాను. ఎంతైనా పెళ్ళాం కదా? కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
సూరిబాబేడని కనుక్కుంటే ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు. అక్కడనుండి సరాసరి పేరప్పగారింటికెళ్ళాను. వెళ్ళేసరికి ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. చిత్రం ఏమిటంటే ఎవరి ముఖాల్లోనూ కూసంత విచారం లేదు. అందరూ జోకులేసుకుంటూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నన్ను చూసి ఆశ్చర్యపోతూ సూరిబాబు బయటకొచ్చాడు. వాళ్ళింటికి చాలా అరుదుగా వెళతాను. అందుకనే కాబోసు కళ్ళల్లో అంత ఆశ్చర్యం చూపించాడు.
“మీ నాన్నగారికి హార్టెటాకొచ్చిందని రావుడు చెప్పాడ్రా? ఇప్పుడే ఆసుపత్రికెళ్ళొస్తున్నాను” అని చెప్పాను. క్రితం రాత్రి భోజనాలయ్యాక తండ్రి పడిపోయాడనీ, వేంటనే డాక్టర్ రాఘవేంద్రకి కబురు పెడితే, వచ్చి చూసి ఆసుపత్రిలో చేర్చమన్నాడనీ చెప్పాడు.
“హార్టెటాకనే చెప్పాడు డాక్టర్! సీరియస్ అని బంధువులందరికీ కబురంపించాను. మహా అయితే రెండ్రోజులు.” అని ఎంతో క్యాజువల్గా అంటూ తదుపరి కార్యక్రమాల గురించి చెప్పాడు. ఎందుకో అది మాత్రం తట్టుకోలేకపోయాను. మనిషింకా బ్రతికే ఉన్నాడు. రేపటి కార్యక్రమానికి అందరూ ఏర్పాట్లు చేసేసుకుంటున్నారన్న మాట. కుటుంబ పెద్దపై ద్వేషానికి పరాకాష్ట అక్కడే కనిపించింది నాకు. ఆసుపత్రి దగ్గరుండాల్సిన కొడుకులూ, కోడళ్ళూ హాయిగా ఇంట్లో ఆనందిస్తున్నారు. రేపు తెరుచుకోబోయే ఇనప్పెట్టి వేడుకకి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకో అక్కడ ఉండాలనిపించక వచ్చేసాను.
ఇంటికొచ్చే సరికి మా బావమరిదీ పెళ్ళాం పిల్లలొచ్చున్నారు. వేంవరంలో పెళ్ళి కొచ్చి ఇలా చూడ్డానికొచ్చారని మా ఆవిడ చెప్పింది. పేరప్పగారి కబురు చెప్పాను.
అనుకున్నట్టే ఓ రెండ్రోజుల తరువాత పేరప్ప గారు పోయారు. సూరిబాబుతో స్నేహం వల్ల శవాన్ని ఇంటికి తీసుకొచ్చే వరకూ కూడా ఉన్నాను. ఆ మొత్తం కుటుంబంలో ఆడాళ్ళు ఏడవాలి కాబట్టి ఏడ్చారన్నట్లనిపించింది. పేరప్ప గారి భార్యని వేరే గదిలోకి తీసుకెళ్ళారు. శవం ఇంటికి రాగానే కొడుకులందరూ చేసిన మొట్ట మొదటి పని పేరప్పగారి మొలతాడుకున్న తాళాల గుత్తి తెంపడం. కొడుకులపై నమ్మకమో లేక ఆస్తిపై మమకారమో తెలీదు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా పేరప్ప తాళాలగుత్తి వదల్లేదు. పేరప్పగారి పిసినారితనమో ఏమిటో తెలీదు. వీళ్ళెంత ఆశిస్తున్నారో ఆయనంత గట్టిగా పట్టుకున్నాడు ఆ తాళాల్ని.
ఇనప్పెట్టి తెరిచి కొడుకులందరూ హతాశులయ్యారు. అందులో కొన్ని బ్యాంకు పాసు బుక్కులు తప్ప చిల్లి గవ్వ లేదు. కొడుకులందరూ నోట్ల కట్టలుంటాయేమో ననుకున్నారు. తీరా చూస్తే అందులో ఏవీ లేవు. తండ్రి పోయాడన్న బాధ కంటే అందులో ఏమీ లేదన్న కోపంతో విలవిల్లాడి పోయారందరూ. పైకి వెళ్ళగక్కలేకపోయినా లోపల పేరప్పగారి దండకం చదువుతున్నారని గమనించాను. దహన కార్యక్రమాలయ్యాక ఇంటికొచ్చేసాను. పేరప్ప గారు పోయారని తెలియగానే వూరందరికీ ఒకటే చర్చ. అది ఆయన మొలతాడుకి వేలాడే తాళాల గుత్తి గురించి. మొత్తానికది కొడుకుల చేతికొచ్చిందని అందరూ నవ్వుకున్నారు; ముఖ్యంగా ముష్టివాళ్ళు.
ఏదయితేనేం పేరప్పగారు బ్రతికున్నంత కాలమూ ఆస్తి సంపాదించాడేమో కానీ ఎవరి ప్రేమా సంపాదించలేదు; కనీసం కన్నవాళ్ళ కన్నీళ్ళు కూడా దక్కించుకోలేకపోయాడు. రెండ్రోజులు పోయాక మా ఆవిణ్ణీ వెళ్ళి పలకరించి రమ్మన్మని చెప్పాను. మా బావమరిది కుటుంబం రావడంతో ఆ మర్నాడు స్కూలుకి సెలవు చీటీ పంపించాను. పిల్లలందరూ సినిమా కెళదామంటే మొత్తం అందరం కలిసి ప్రేమ నగర్ సినిమాకెళ్ళాం. ఇంటర్వెల్లులో మా ముందు వరసలో పేరప్పగారి కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోయింది మా ఆవిడ. నాకు విషయం తెలుసు కాబట్టి అంతగా ఆశ్చర్యపోలేదు. ఇది చాలా చిన్న విషయమనిపించింది. ఎందుకంటే తండ్రి పోయిన రోజు రాత్రి చతుర్ముఖ పారాయణంలో సూరిబాబూ పాల్గొన్నాడు కనుక.
ఒక మనిషి మరణం అయిన వారికెవరికీ ఏమీ కాలేదన్న ప్రశ్న కంటే పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది?
నాకు పేరూరు నుండి అల్లవరం బదిలీ చేసారు. వెళ్ళడం నాకిష్టం లేదు. గతంలో రెండు మూడు సార్లు డెప్యుటేషన్ మీద వెళ్ళాను. ఆ స్కూలుకి సరైన సౌకర్యాలు లేక శిధిలావస్థలో ఉందని ఎవరో చెప్పగా విన్నాను. రెండేళ్ళ క్రితమొచ్చిన తుఫానుకి గోడలన్నీ కూలిపోయాయని మా తోటి టీచర్లు అనుకోడం తెలుసు. పేరూరు వదలకుండా ఉండడానికి చాలా పట్టుబట్టాను. మా వూరి ఎమ్మెల్యే చేత చెప్పిద్దామనీ ప్రయత్నించాను. కుదర్లేదు. వెళ్ళి తీరాలన్నారు. ముందు వెళ్ళి జాయినయ్యి ఏదో సాకు చూపించి మరలా వేరే వూరికి ట్రాన్స్‌ఫర్ అడగచ్చు కదాని మా హెడ్మాస్టరు సలహా పడేసాడు. ముందలాగే అంటారు. తీరా వెళ్ళాక మరలా బదిలీ చేయించుకోవాలంటే నానా యాతనా పడాలి. అందుకని నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను. అంతగా కావల్సివస్తే ఆర్నెల్లు ఆరోగ్యం బావోలేదని శలవు పెట్టేసి మిగిలిన రెండెకరాలూ వ్యవసాయం చేసుకుంటాననీ చెప్పాను. ఈలోగా మా అమ్మకి ఆపరేషన్ అయ్యాక వెళతాననీ అప్పటివరకూ రెణ్ణెల్లు శలవడిగాను. మొత్తానికది గ్రాంటయ్యింది. కాకినాడ వెళ్ళే ముందు డాక్టర్ రాఘవేంద్రని కలుద్దామని వెళ్ళాను. ఖర్చుకి వెనుకాడకుండా అమ్మకి తొందర్లో ఆపరేషన్ చెయ్యడమే మంచిదని చెప్పాడు.
“పుట్టిన అందరమూ పోయే వాళ్ళమే! కానీ పోయే ముందు జీవితం అతి తక్కువ కష్టంగా ఉండాలి. ముఖ్యంగా పోయేవాళ్ళకి. పాపం పేరప్ప గారి పరిస్థితే చూడు. చచ్చేటంత ఆస్తున్నా ఫలితం లేకపోయింది. ఆయన్నీ కాకినాడ తీసుకెళితే కోలుకునేవాడేమో? కళ్ళముందే పోయాడు. ఏం చేస్తాం?”