పెండ్లి కల

ఆయన కాళ్ళను కడిగిరి
మా యమ్మ యొసంగు నీట మా నాయనగా
రాయనకు బటువు పెట్టిరి,
భూయః ప్రీతిగను ధారవోసిరి నన్నున్‌

బిడియము తేర జీలకర బెల్లము పెట్టితి స్వామి మాడునన్‌
బిడియము త్రోసి స్వామియును పెట్టెను నాదగు మాడుపైన, తా
నెడపక మంత్రపూతముగ నిచ్చిన సన్నని దర్భత్రాడు నా
నడుముకు గట్టె స్వామి తన నా ప్రణయమ్ముల నొక్క కట్టడిన్‌

చిరునవ్వుల్‌ కలబోయుచున్‌ గురువు లాశీ రక్షతల్‌ జల్లుగా
కురియన్‌, మంగళవాద్యముల్‌ మొరయ నాకున్‌ పుస్తెలన్‌ గట్టె సుం
దర బాహుండగు స్వామి నా కనులలోనన్‌ గన్నులన్‌ గల్పుచున్‌
పెరిమన్‌ నా మెడమీద చిత్రగతులన్‌ వ్రేళుల్‌ చలింపన్‌, సఖీ!

ఇల జన్మమ్ము లవెన్నియేని యగు గానీ, జన్మజన్మానికిన్‌
లలనా! తానె శరణ్యుడైన హరి లీలామూర్తి తా నాదు కా
ళుల జేపట్టుక మట్టెలం దొడిగె వ్రేళుల్‌ కందిపోవంగ, న
వ్వులతో నొవ్వుల దీర్చు స్వామి చిలికింపుల్‌ చూపు లెంతందమో!

తొలిసిగ్గుల్‌ వెనుకాడ నొండొరులపై దోసిళ్ళతో నెత్తిపై
తలబ్రాల్‌ పోసెడివేళ స్వామిదగు నుత్సాహమ్ము చూడన్‌ దగున్‌
చెలి! నన్నింతయు గెల్వనీకయ పోసెన్‌ పళ్ళెమే యెత్తి మై
బులకింతల్‌ గిలిగింతలున్‌ చికిలి చూపుల్‌ ప్రాలు నొక్కుమ్మడిన్‌

అమ్మా నాన్నలు ప్రేముడిన్‌ పలువిధాలైనట్టి పుష్పమ్ములున్‌
రెమ్మల్‌ మర్వము మధ్యలో తులసి కన్పింపంగ కొంగ్రొత్త యం
దమ్ముల్‌ జిమ్మగ కట్టినట్టి పువుదండల్‌ జానుపర్యంతముల్‌
తమ్ముండీయగ వేసికొంటిమట నాతండేను, నేనాతడున్‌

మురజోద్వేజిత శంఖనాదములు మార్‌మ్రోవంగ, నల్దిక్కులున్‌
దరువుల్‌ వేయగ, మంగళాయతన సౌందర్యమ్ము రెట్టింప శ్రీ
హరి జీవాభయదానశస్తమగు శ్రీహస్తమ్ము సారించి నా
కరముంగైకొనె, దివ్యజీవన తరంగమ్ముల్‌ మెయింగ్రమ్మగన్‌

ఆ పయిన్‌ మా పురోహితు డగ్ని వ్రేల్చి
ఒక్కటొకటిగ మాతోడ హోమములను
స్థాలిపాకము మొదలైన సర్వవిధుల
మెలమి చేయించె శ్రేయస్సమీహితములు

వణకెడు మోడ్పు చేతులుగ జ్వాలలు విచ్చెడు నగ్నిదేవు మ
న్నన్ మెయి జూచు మాధవుడు నా చెయి తోడుగ జేసికొంచు నిం
పొనయగ లాజగింజలను హోమము చేసెను మంత్రయుక్తి, ప
ల్చని పొగ కన్నులందెరుపు చారికలందము దిద్ది తీర్చగన్‌

కొంగు కొంగును ముడి వేసికొనెడు వేళ
స్వామి చూచిన చూపులో ప్రణయ జలధి
కడలు ద్రొక్కిన, దడుగున నడుగు వేసి
కొంచు మేమగ్నికి ప్రదక్షిణించినాము

క్రీడా సంసారుని గను
ప్రోడలు పరిహాస జల్ప ముగ్ధలు మాతో
నేడడుగులు వేయించిరి
తోడుగ, సనెకల్లు పెట్టి త్రొక్కించిరటన్‌

ఆత్మ చారుత కోరుకొన్నట్టి ప్రియుని
యందు సౌభాగ్య ఫలవంతమైన గౌరి
వెలుగుమలూరు మొగమ్ముతో చిలిపి నవ్వు
చెలగ ముద్దాడె కౌగిట జేర్చి నన్ను

చెవిపోగుల్‌ కదలాడగా, వెలుగుపూల్‌ చిందాడగా జూచు మా
ధవు డాత్మాదృతి నా కరమ్ము తనహస్తమ్మందు జోడించి, క్రొం
జవులూరంగ నెవేవియో గుసగుసల్‌ సాగించుచుండంగ, నో
ఉవిదా! సిగ్గులమొగ్గనైతి, మనసేదో యేదొ యైపోయెనే

కలపమ్ముంగొని, నామెయిన్నలది, వీక్షామాలి పూమాలికల్‌
తలపై మేన నలంకృతుల్‌ నెరపి గోదానాథు డుద్యద్ద్విపో
జ్జ్వలసౌవర్ణమనోజ్ఞపీఠి గొలువై సంపూర్ణుడాతండు వె
ల్గుల దారిన్‌ గొనిపోయెనే, నదిని తా లోగొన్న వార్థింబలెన్‌


కోవెల సంపత్కుమార

రచయిత కోవెల సంపత్కుమార గురించి:

కోవెల సంపత్కుమారాచార్య కవి, రచయిత. తన పదమూడవ యేటనే సోదరుని కుమారుడు కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించారు. 1950 ప్రాంతంలో విశ్వనాథ సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. వ్యాకరణ, ఛందోగ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను, నాటికలను ఎన్నో వ్రాశారు. ‘మరుగునపడిన మన పండితులు’ పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశారు. అనేక పురస్కారాలను అందుకున్నారు.

 ...