తిలక్ “అభ్యుదయకవితా విహాయసంలోకి ఎగరలేక” పోవటం నిజం కాదు. నిజమైన కవితా తత్వానికి వ్యతిరేకమైన కృత్రిమ వర్గీకరణకు ఆయన వ్యతిరేకం. గానుగెద్దులాగా సిద్ధాంతం చుట్టూ నిరంతరం ప్రదక్షిణం చేయడం, అభ్యుదయవాదం పేర అరువు తెచ్చుకున్న భావాలు ఎవరి మెప్పుకోసమో ఏకరువు పెట్టడం యెడల తిలక్ కు ఏహ్యభావం ఉండటం నిజం. హైదరాబాదు నగరాన్ని “ఫ్యూడల్ రహస్యాల్ని దాచుకున్న పుండ్రేక్షు కోదండం”గా వర్ణిస్తున్నారు కాబట్టి ఫ్యూడల్ శృంగారానికి అనుగుణమైన సాంప్రదాయాలకు తగిన విధంగా ‘నగరం మీద ప్రేమగీతం’లో కనబడే వక్షోజాలు, జఘనోరు సౌందర్యాన్ని చారిత్రక దృక్పధంతో అర్ధంచేసుకుని తప్పుపట్టని రారా ‘అమృతం కురిసినరాత్రి’లో దేవలోకానికి మాత్రమే పరిమితమైన అప్సరాంగనల గురించి తిలక్ వ్రాసిన “వారు పృధు వక్షోజ నితంబ భారలై / యౌవన ధనుస్సుల్లా వంగి పోతున్నారు” అనే అద్భుతమైన కవితా సౌందర్యం కలిగిన పంక్తులను అర్ధం చేసికొనడంలో ప్రబంధ వర్ణనలలో ఉన్న సాంప్రదాయిక ఔచిత్యాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? తిలక్‌ను ఒక చవకబారు సెక్స్ అబ్సెషన్ కలిగిన వ్యక్తిగా అర్ధం వచ్చేట్లుగా ఎందుకు వక్రీకరించారు? జీవితంలో అతి ముఖ్యమైన పార్శ్వాలలో ఒకటైన శృంగారంతో కూడిన ప్రేమను ఉదాత్తంగా వ్యక్తీకరిస్తే తప్పేమిటి?
‘విరహోత్కంఠిత’ లో తిలక్ వ్రాసిన ‘సవ్వడయితే చాలు ప్రభూ రివ్వున స్మరశరం హృదయాన్ని దూసుకుపోతుంది‘ అని, ‘అవధరించవెందుకు పరిపక్వమైన నా యవ్వన విన్నపాన్ని / నవధరించవెందుకు అసకృదతిశయోక్తిశీలమైన నా తనూకావ్యాన్ని‘, ‘కందళించే ఈ వలపు ప్రభూ గాఢాశ్లేష దోహదం లేక క్రమవికాసితోద్భాసితం కానే కాదు‘ అని వ్రాస్తే రారా ఒక కసిలో వ్యాఖ్యానం వ్రాస్తారు: “భావ కవిత్వపు రూపకాలంకారాల పల్చని తెరల చాటున నా యవ్వనాన్ని స్వీకరింపమని,నా తనువును అనుభవింపమని ప్రబంధ సాంప్రదాయపు శారీరక కామార్తి గజ్జెలు కట్టుకుని చిందులు తొక్కుతుంది.” ఇది సమంజసమా? సాహిత్యవిమర్శలో “శారీరక కామార్తి” తో గజ్జెలు కట్టించి చిందులు తొక్కించవలసిన అవసరం ఉన్నదా? దీనికి ఔచిత్యం ఉన్నదా? ఈ వ్యాఖ్య ఔన్నత్యం కలిగి ఉందా? తిలక్ వ్రాసిన దానిలో లేని కామప్రకోపం ఈ వ్యాఖ్యలో ఉన్నదేమో అనిపిస్తుంది. ప్రేమ వ్యక్తీకరణ ఉదాత్తంగా జరిగిందా లేదా అన్నది మాత్రమే ఆలోచించవలసిన విషయం. అసలు దాని ఊసే కవిత్వంలో ఎత్తుకోకూడదనటం ఆత్మవంచన అవుతుంది.
ఇక్కడ రారా విస్మరించిన విషయం, తిలక్ అష్టవిధ నాయికలలో ఒకరైన విరహోత్కంఠిత మీద కవిత వ్రాస్తున్నారని. విరహోత్కంఠిత ఊహాలోకపు ప్రబంధనాయిక. ఆమెకు తగిన భావాలను,తగిన భాషను వాడటంలో ఔచిత్యం ఉంది. ఇది మనం ప్రస్తుతం జీవిస్తున్న సంఘానికి ఏ మాత్రం వర్తించే విషయం కాదు. టేబుల్ కాళ్ళను పూర్తిగా కవర్ చేస్తూ బట్టను కప్పకపోతే అభ్యంతరంగా భావించడాన్ని విక్టోరియన్ ప్రూడరీ గా చెప్పుకుంటారు. అలా ఉంది రారా విమర్శ. జీవితంలో ప్రేమ బలీయమైన పార్శ్వం. కాకపోతే అది తప్పనిసరిగా హుందాగా మాత్రమే వ్యక్తీకరింపబడాలి. ‘పరువానికి వస్తున్న నా వయస్సులో/చటుక్కున పరిమళపు తుపానులని రేపి‘ అని ప్రారంభ యవ్వనోధృతిని హుందాగా వ్యక్తీకరించిన తిలక్ కవిత్వానికా చవకబారు కామార్తిని అంటకట్టడం?
తపాలా బంట్రోతు అనే ఖండికలో “అమ్మాయీ !పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్ళెరంలో బెట్టి ప్రాణనాధుని కందించాలనే నీ ఆశ నా కర్ధమయింది” అనడంలో “ఆమె పడుచుదనాన్ని పడకటింట్లో చేరవేయాలనే తహతహ మాత్రమే కనిపిస్తుంది” రారాకు. ఇది సబబా? ‘భద్రంగా దాచి’ ‘ప్రాణనాధుడు’ అనడంలో ఆమె ఉన్నతమైన సౌశీల్యం ద్యోతకమవడం లేదూ? గౌరవించదగిన,కరుణతో చూడదగిన ప్రేమ, అమాయకత్వం కనిపించటం లేదూ? ఆర్కే నారాయణ్ పోస్ట్‌మన్ తానప్ప ఉత్తరాలు పంచుతూ, అందరికీ ప్రేమపాత్రుడుగా, దగ్గరి బంధువుగా, చతురోక్తిగా అంటున్నట్లు మాత్రమే నాకు తోస్తుంది. ఇలా అనడంలో నాకెక్కడా ఈ వ్యాఖ్య ధ్వనింపజేసే సెక్సిస్ట్ అబ్సెషన్ ఉన్నట్లు అనిపించదు. మరి ఈ “మానసిక జాడ్యం” ఎక్కడది? ఊహా జనితమైన అభ్యంతరాలను, మూలంలో లేని జుగుప్సాకరమైన ఏహ్యతను వెలికితీయాలనే పట్టుదల ఎక్కడినించి వచ్చింది?
అద్వితీయం అనే ఖండిక గురించి రారా అంటారు: “‘నేను నీ స్త్రీత్వమున కాహుతినై ‘ అనడమూ ‘నా బ్రతుకు పచ్చని గట్ల నీవు మిన్నాగువై చుట్టుకునీ ‘ఓ సురతాణి !నీ క్రతుహోమగుండమున నా జీవితమునే వ్రేల్చి’ అనడము ఏ విపరీతమైన మనస్తత్వము నుండి ఉద్భవించిన అభిప్రాయాలో తెలియడం లేదు. వీటికి మూలం ఫ్రాయిడ్ సిధ్ధాంతమా, డి.హెచ్.లారెన్స్ వాదమా? వామాచారుల తంత్ర శాస్త్రమా? లేక అన్నీ కలిపి అపక్వంగా తిన్న ఫలితంగా ఏర్పడిన అజీర్ణ వ్యాధా?” విస్మరించవీలులేని ఒక బలీయమైన సత్యాన్ని గౌరవప్రదంగా, ఆకర్షణీయంగా చెప్పటం అనుకోవాలిగానీ “మానసిక అజీర్ణవ్యాధిగా” చూడటం రారా సాహితీవిమర్శ స్థాయిని దిగజార్చే రీతిలో ఉంది. వాస్తవానికి, స్త్రీ,పురుష సంబంధమైన ఉదాత్త ప్రేమబంధానికి పునాది కామం అని అంగీకరించకపోవటం సత్యాన్ని తిరస్కరించటడం అవుతుంది. కామంగా ప్రారంభమై ప్రేమగా పరిణతి చెందుతుంది. ఈ ఎదుగుదల సహజమైనదీ, ఔన్నత్యంతో కూడుకున్నది. కాకపోతే ఈ మిశ్రమానుభూతిని ఉదాత్తంగా ప్రస్తావించి ఆవిష్కరించాలి. చవకబారు రీతిలో, చవకబారు భాషలో కాదు. తిలక్ గొప్ప ఔచితిని,ఔన్నత్యాన్ని పాటించారు, చూపించారు.
రారా మరలా అనకుండా ఉండలేకపోతున్నారు: “తిలక్ లో ఎన్ని అనభ్యుదయభావాలున్నా అన్నీ అపురూపమైన కవితా సౌరభం సంతరించుకుని పాఠకులను సమ్మోహనం చేయడం అతని ప్రత్యేకత. ఆ శక్తి అపారమైన అతని భావుకత్వం నుండి ఉద్భవించిందే. భావుకత్వమే తిలక్ బలం. ఆ బలం తోనే అతను ‘కవితాసతినొసటి నిత్యరసగంగాధర తిలకం’ కాగలిగినాడు… ఏ సూత్రాలకూ కట్టుబడని అతని మానసిక అరాజకత్వం కూడా అతనికొక అలంకారం కావటం అతనికే చెల్లింది. అన్ని మనస్తత్వాలవాళ్ళకు ఆహ్లాదం ఇచ్చి, అందరి మన్ననలూ పొందింది.” ఇది సామాన్యమైన ప్రశంస కాదు.ఇంత మెచ్చుకుంటూ కూడా అరాజకత్వం అనకుండా ఉండలేకపోయారు. ఏ సిద్ధాంతాలకూ తాను కట్టుబడనని తిలక్ మొదటే చెప్పుకున్నారు. ఏ సూత్రాలకు కట్టుబడక పోవటాన్ని అరాజకత్వం అని నిందించటం సహేతుకం కాదు. ఏ సిద్ధాంత నిరంకుశత్వానికి తలవంచని, బందీ కాని స్వతంత్రనిరతిగా ఆయన రీతిని ఎందుకు భావించకూడదు?
“కల ఎప్పుడూ మనిషికి బలం/ మిధ్యా జీవన రధ్యలలో/ స్వప్నం ఒక సుందర తనుమధ్య.” కల అంటే కలలు, ఆశలు, ఆశయాలు, అంతిమంగా చేరవలసిన గమ్యాలు. వాటిని పిచ్చాసుపత్రికి పరిసరప్రదేశాలుగా, నివాస స్థలాలుగా భాష్యం చెప్పటం కరుణతో కూడిన అభ్యుదయ భావన కాదు. ఇలా అనడం అసహనం, ఉక్రోషం అవుతుంది కాని సాహిత్య విమర్శ అనిపించుకోదు. కవిమీద ప్రేమ పూర్వక పక్షపాతవైఖరి ఉండాల్సిన అవసరం లేదు: కానీ అతను ఏం చెబుతున్నాడో అర్ధం చేసుకోవటానికి తెలివితేటలు, స్పందించే హృదయంతో పాటు ఒక మేరకు సానుభూతి ఉండాలి. ఈ సమీక్షలో ఆ సానుభూతి పూర్తిగా మృగ్యం. రారా నమ్మిన గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని, తత్సంబంధమైన పిలక సిద్ధాంతాలను కరదీపికలుగా తిలక్ నమ్మకపోయినంత మాత్రాన సమ్యక్‌దృష్టి గోల్పోయి అసహనం పెంచుకోవటం వివేకం కాదు, విమర్శ కాదు. సాహిత్య సత్యదర్శనం తనకొక్కడికే అయినట్లు అంత నమ్మకమేమిటి? అన్నీ సిద్ధాంతాలు అర్ధసత్యాలే. లేకపోతే ఇన్ని సిద్ధాంతాలు, ఇందరు తత్వవేత్తలు, ఇన్ని తాత్విక చింతనలు ఉండటం ఎలా సాధ్యమవుతుంది? రారా కాక మరెవరైనా “కలలను, కల్లలను నమ్మే స్థితికి దిగజారినాడు” అని తిలక్‌ని అన్నారా? రారా అంత విపరీతంగా తిలక్‌ను మెచ్చుకోవటం, ఇంత అధ్వాన్నంగా విమర్శించటం (దాదాపు నిందించటం) – ఈ రెంటికీ సమన్వయం సాధించలేకపోయారు.
“చలజ్జీవన దైనందిన కోలాహల పాంసుప రాగంలో / తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు”; ఆఖరుకు నెహ్రూ మీద వ్రాసిన ఈ పంక్తులు కూడా రారా గారి కసికరవాలానికి బలికాక తప్పలేదు. ఈ పంక్తులలోని సౌందర్యం, ఔచిత్యం, భావ సౌకుమార్యం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. నెహ్రూ గారి అభిమానులని మరీను. రోజుకు పద్దెనిమిదిగంటలు కోకొల్లలుగా ఉన్న దేశసమస్యల పరిష్కారమార్గాల మీద దృష్టినంతా కేంద్రీకరించి, శారీరకంగా, మానసికంగా అలసిపోయి తన సహజ స్వభావసిద్ధమైన సత్యసౌందర్యాల భూమిక నాధారం చేసుకుని తన మనస్సులో ఒక శాంతి ధామాన్ని సృజించుకుని మరుసటిరొజు కావలసిన శక్తిని సంతరించుకుంటున్నారని దీని అర్ధం. దీనికి ఒక పెడర్ధం తీశారు రారా. ప్రతి వ్యక్తికీ రెండు జీవితాలుంటవి. ఒకటి తన ప్రవృత్తికి తగినట్లు మానసిక లేదా భావ ప్రపంచంలో బ్రతకటం. రెండవది తాను వృత్తిరీత్యా భౌతిక ప్రపంచంలో తన విధులను తాను చిత్తశుధ్ధితో నిర్వహిస్తూ బ్రతకటం. ధర్మవ్యాధుడికధ మనకు తెలిసినదే. ఈ రెండు జీవితాలకూ తేడా ఉండవచ్చు. అప్పుడు “తనలో తానొక ఏకాంత సౌందర్యాన్ని రచించుకున్న స్వాప్నికుడు” అని సందర్భోచితంగా ఎవరి గురించయినా అంటే ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదనుకుంటాను.
ఆంగ్లసాహిత్యంలో, మనకున్నన్ని సిద్ధాంతవివాదాల రాధ్ధాంతాలు ఉన్నట్లు కనబడదు. ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నట్లుగా కనిపించదు. రాజకీయాలకు సంబంధించి ఆయన ఎంత సాంప్రదాయవాదైనా షేక్స్పియర్ ప్రధానంగా భావవాద రచయిత అని, రూసో నుండి గొప్ప రచయితలందరూ భావ వాద రచయితలేనని మిడిల్టన్ మరే లాంటి ప్రఖ్యాత విమర్శకుడి అభిప్రాయం. భావకవిత్వంలో ప్రసిద్ధులుగా పేరెన్నికగన్న వర్డ్స్‌వర్త్,కీట్స్,షెల్లీ లను ఏనాడూ ఎవరూ తక్కువగా చూడలేదు. ఎవరిమానాన వారు వారివారి ధోరణులలో వ్రాసుకుపోయారు. ఇమేజిస్ట్-వోర్టిసిస్ట్ సంప్రదాయంలో ఇజ్రాపౌండ్ లాంటివాళ్ళు వ్రాసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవటం కోసం యుద్ధాన్ని స్వాగతిస్తూ రూపర్ట్ బ్రూక్ లాంటి వారు కవిత్వం వ్రాశారు. యుద్ధాన్ని, దాని భీభత్సాన్ని నిరసిస్తూ సజూన్, వోవెన్, రోజెంబర్గ్ కవిత్వాలు వ్రాసారు.యుద్ధానంతర నైరాశ్యాన్ని టి.ఎస్.ఇలియట్ కవిత్వీకరించారు. ఆడెన్ (ఆ తర్వాత మార్క్సిస్ట్ ప్రభావం నుండి తప్పుకున్నారు), స్పెండర్, మెక్నీస్, సెసిల్ డే లెవిస్ లాంటి వాళ్ళు మార్క్సిస్ట్ భావనలతో సామాన్య మానవుని గురించి, అతని సమస్యలను గురించి కవితలు వ్రాశారు. గతకాలము మేలు వచ్చు కాలం కంటెన్ లాంటి ధోరణిలో జాన్ బెట్జ్మన్ నాస్టాల్జిక్ అనుభూతులతో, ఫ్రాయిడియన్ మనస్తత్వ పరిశోధనల ఆధారంగా రాయ్ ఫుల్లర్ కవితలు వ్రాశారు. డిలాన్ థామస్ ఉండనే ఉన్నాడు: అసలు కవితకు అర్ధం ఉండవలసిన అవసరం లేదన్నాడు. మాటల పొందిక ద్వారా సాధింపబడిన లయను, శబ్దసారూప్యతవల్ల ఉద్భవించే రిథంను ఒక సమ్మోహన శక్తిగా ఉపయోగించుకుని పదచిత్రాలద్వారా ఆనందానుభూతి కలిగించటమే కవిత్వం చేసే పని అన్నాడు. ఇదంతా చెప్పటానికి కారణం, ఇదే కవిత్వం, వేరొకటి కవిత్వం కాదు అని మనం వాదులాడుకున్నట్లు వారెప్పుడూ ఇంతగా గొడవపడినట్లు కనిపించక, ఒకరియెడల ఒకరు ఎక్కువ సహనంతో వ్యవహరించారేమో ననిపించడం. మనకు భిన్నంగా వ్రాసేవారిని ఒక ఉద్యమంగా వీరావేశంతో ఖండించటం ఒకమేరకు నిందించటం కూడా మనకు కాస్త ఎక్కువేమో అని కూడా అనిపిస్తుంది.
రారా గారంటే నాకు గౌరవం, ఇష్టం. ద్వంద్వ ప్రమాణాలు లేని వ్యక్తి. నిజాయితీ కలిగిన వ్యక్తి. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి. కట్టుబడి కష్టబడ్డ వ్యక్తి. అయినా వెనుక చూపు లేని వ్యక్తి. ఆర్ధిక ఇబ్బందులతో, అనారోగ్యంతో బాధపడిన వ్యక్తి. అననుకూల పరిస్థితులకు కూడా తలవంచని ధీరత్వం కల వ్యక్తి. చెక్కుచెదరని గాంభీర్యం కల వ్యక్తి. అయితే ఆయన పట్ల నాకున్న గౌరవం కానీ, అభిమానం కానీ ఆయన సమీక్షను నిష్పక్షపాతంగా విమర్శించటానికి ఏమాత్రం అడ్డు రాకూడదు. ఏది ఏమైనా ఆఖరికి వచ్చేసరికి సాహిత్యానికి సంబంధించి, ముఖ్యంగా కవిత్వానికి సంబంధించి సిద్ధాంతాలన్నీ ప్రక్కకు తప్పుకుంటవి. ‘ది టేస్ట్ ఆఫ్ పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్’ అన్న సూక్తి నిలుస్తుంది. నిలవవలసిన, నిలవగలిగిన కవిత్వం నిలుస్తుంది. ప్రజలనాల్కల మీద నడయాడుతూనే ఉంటుంది. తెలుగులో వచనకవిత్వానికి సంబంధించినంతవరకూ నా అభిప్రాయంలో ఆ కీర్తి తిలక్ గారికే దక్కుతుంది.
