“అభ్యుదయకవిత్వం ఉత్తేజం ద్వారా క్రియాశీల పర్యవసాయి. లేక కార్యోత్సాహ పర్యవసాయి.” – కవిత్వం ఈ పాత్ర నిర్వహించాలంటే ఎలా వ్రాయబడాలి? నినాదాలు వల్లించటం ద్వారానా? కరపత్రస్థాయికి దిగటం ద్వారానా? ఉత్తేజంలో ఆనందం, ఆకర్షణ (అందం) అంతర్లీనంగా ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఆహారం ఆరోగ్యం కోసం, బలంకోసం. సందేహం లేదు. కానీ అది చక్కగా తినాలంటే రుచి, శుచి ఉండాలి కదా! అలాంటివే కవిత్వంలో అందం, ఆనందం.
“పెను నిద్దుర వదిలించేదీ
మునుముందుకు సాగించేదీ
పరిపూర్ణత బ్రదుకిచ్చేదీ”
శ్రీశ్రీ కవిత్వం ఏం చెయ్యాలో చెప్పటం బావుంది. బావుందంటే ఒకటి దీనిలో సత్యముందని: రెండవది, ఇది అందంగా చెప్పటం జరిగిందని. అందుమూలాన ఆనందం కలిగిందని, అంచేతనే ఇది ఆకట్టుకుంటుందని. సరే, ఉత్తేజం కూడ ఇది ఇస్తుందనీ. కానీ వారిదే:
“రాబందుల రెక్కల చప్పుడు / పొగగొట్టపు భూంకార ధ్వని
అరణ్యమున హరీంద్ర గర్జన / పయోధర ప్రచండ ఘోషం
ఖద్గమృగోదగ్ర విరావం / ఝంఝానిల షడ్జధ్వానం
కావాలోయ్ నవకవనానికి.”
సింబాలిజం బాగానే ఉందనుకుందాం.కానీ ప్రజల ఊసే లేదేమిటి దీంట్లో? రారా ఈ చరణంలో ఇది గమనించకపోవటం ఏమిటి? ఇది గొప్ప అభ్యుదయ కవితని కోట్ చేశారు కూడా. దీంట్లో అస్పష్టత లేదా? ఇవన్నీ విప్లవాలకు సంకేతాలా? లేక ఎవరికి వ్యతిరేకంగా పోరాడటం జరుగుతుందో వారికి సంకేతాలా? లేకపోతే పోరాడే శక్తులకు సంకేతాలా? ఏ రకంగా పొసగటంలేదే? కొద్దిగా వాగాడంబరత ఉన్నట్లు కూడా అనిపించటం లేదూ?
“శ్రీరంగం నారాయణబాబు, శిష్ట్లా, రోణంకి, పఠాభి మొదలైన వాళ్ళందరూ అన్నివేళలో అభ్యుదయకవులు కారు.” – వాళ్ళందరూ అభ్యుదయకవులు కాని సమయాల వాళ్ళెటువంటి కవులు మరి? వారేవర్గానికి చెందుతారో రారా చెప్పలేదు. ఇలా అన్నారు కాబట్టి ఒక ప్రశ్న మనసులో మెదులుతుంది. తిలక్ మాత్రం అభ్యుదయ కవిగా వ్రాసిన సందర్భాలు లేవా, కనీసం ఒకటి కూడా? ఏదో స్వీపింగ్ స్టేట్మెంట్స్ చేయటం, వారి నొకరకంగా చూడటం, ఈయననొక రకంగా చూడటం ఎందుకు?
“భావకవిత్వం ఆధునిక జీవితానికి విషతుల్యమనీ, మనిషికి ప్రోత్సాహమిచ్చేబదులు ప్రాణశక్తిని హరించేదనీ తెలిసిపోయింది.” – ఇంతటి అబ్సొల్యూట్ సిధ్ధాంతాన్ని చేయటానికి ఎంతటి తిరుగులేని దాఖలాలు ఉండాలి! ఎంతటి పకడ్బందీ వాదనతో ఈ దాఖలాల ఆధారంగా ఆ సిధ్ధాంతాన్ని నిలబెట్టాలి! అదేం జరగలేదు. కనుక దీనిని వక్రభాష్యంగా పరిగణించవలసి ఉంది. కవిత్వంలోని భావుకతను మెచ్చుకుంటూ మాట్లాడారు కాబట్టి ఇక్కడ భావం అంటే అనుభూతి. ఈ అనుభూతిని వ్యక్తీకరించేది భావ కవిత్వం. అదెప్పుడూ విషతుల్యమేనని అంత నిర్ద్వంద్వంగా సిద్ధాంతీకరించటం ఏ తాత్విక మూలాలను ఆధారం చేసుకుని? తోటిమానవుల సమస్యలకు అది స్పందనగా ఉండదనే నిశ్చితాభిప్రాయానికి రావటం ఏ సిద్ధాంత ప్రాతిపదికన? నాకు తెలిసినంతవరకూ ఇది తిలక్‌ను ఏ కాలం చెల్లిన సిద్ధాంతాలకో, బూజు పట్టిన పదజాలంతోనో కట్టిపడేయాలనే వ్యర్ధప్రయత్నం. ఆయన అసలు సిసలైన కవి. అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి అని చిత్తశుద్ధితో నమ్మిన కవి. కవిత్వం చైతన్య పరిధిని విస్తరింపజేయాలని నమ్మిన వ్యక్తి. ఆయన అనుభూతులన్నీ ఆరోగ్య వర్ధకాలే. ఏవీ విషకారకాలు కావు.
“అభ్యుదయకవులను అలా వదిలేసినా ఆధునిక కవులందరికీ ఈ నాడు వచన గేయ చందస్సు మీద పెరిగిన అనురక్తి కూడా, భావకవిత్వంలోని లాలిత్య గుణం (లిరిసిజం) మీద తిరుగుబాటుగానే కనబడుతుంది… కనుక ఈ నాటి కవిత్వానికి లలితమైన శయ్య వర్జ్యమయ్యింది.” – అటు భావకవులూ కాక, ఇటు అభ్యుదయకవులూ కాక ఆధునిక కవులంటున్నారే రారా! వారు ఏ వర్గం కిందకి వస్తారు? ఇక్కడ వర్గీకరణ అవసరం లేదా? వర్గీకరణ ఆయనకు ఇష్టం కదా? కవిత్వం హృదయసంబంధి: లాలిత్యం హృదయాహ్లాదకరమైనది. దానిమీద తిరుగుబాటు దేనికి? లాలిత్యంలో దుర్మార్గపు దోపిడీగుణం ఏమైనా అంతర్లీనంగా ఉందా? “ఆధునిక కవుల అనుభూతిలో భావుకత్వం (అనుభూతి సౌకుమార్యం) ఎంత వున్నా ఆ అనుభూతిలో తాత్వికవేదనా భారం, తాత్విక ఆలోచనా భారం ప్రముఖ స్థానం వహిస్తున్నాయి.” – ఇదేమిటి కొత్తవిషయం? అంటే కవిత తాత్వికచింతనకు మాధ్యమంగా ఉండాలని రారా సిద్ధాంతీకరిస్తున్నారా?
“వచన గేయపు శైలి లలితమైన (లిరికల్)ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని, గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుందని స్పష్టంగా అర్ధమవుతుంది. అందువల్లనే నేడు వచనగేయం ఇంత వ్యాప్తిలోకి వచ్చింది”, “వచన గేయపు శైలి లలితమైన (లిరికల్) ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని.” – ఇంత అనాలోచితంగా, నిర్లక్ష్యంగా సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నట్లు సాహసమెలా చేశారో రారా! వచనకవిత్వపు శైలి లలితమైన ఇతివృత్తాలకు చాలా గొప్పగా, ఉచితంగా ఉంటుందని తిలక్ తిరుగులేని విధంగా నిరూపించారు కదా? ఇది జగమెరిగిన సత్యం, రారా కూడా ఒప్పుకున్న సత్యం. ఆయనే ఈ సమీక్షలోనే ముందుముందు చెప్పబోతున్నారు, “తిలక్ లో ఎన్ని అనభ్యుదయభావాలున్నా అన్నీ అపురూపమైన కవితా సౌరభం సంతరించుకుని పాఠకులను సమ్మోహనం చేయటం అతని ప్రత్యేకత.”అని. అపురూపమైన కవితా సౌరభం లిరిసిజమే కదా? పాఠకులను సమ్మోహనం చేయటం ఈ లిరిసిజం లాలిత్యం వల్లనే కదా? ఈ పని సాధించింది వచనకవిత్వం ద్వారానే కదా. వచన కవిత ఐన గీతాంజలి ఆంగ్లానువాదంలో టాగోర్ ఎంతటి మనోహరమైన లిరిసిజాన్ని సాధించారు!
“వచనగేయ రూపాన్ని ఆదరించటమే భావకవిత్వం మీద తిరుగుబాటు” అన్నారు రారా. ఈ వాక్యంలో ఆయన చెప్పింది సత్యమైతే తిలక్ కూడా భావకవిత్వం మీద తిరుగుబాటు చేసినట్లుగానే అంగీకరించవలసి వస్తుంది కదా. కారణం తిలక్ కూడా వచన కవిత్వాన్ని ఆదరించి తన కవిత్వీకరణ మాధ్యమంగా దానిని స్వీకరించారు. మరి ఈ అంగీకారావశ్యకత రారాకి రుచించలేదా? “దుఃఖితులపట్లా,బాధితులపట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట ఎవరూ కాదనరు. కానీ ఆ కరుణ అభ్యుదయస్పందనగా కనిపించదు.” – రారా ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించలేదు.తిలక్ కవి చేయవలసిన పని చేశారు. అపార కరుణానుభూతిని ఆర్ద్రంగా ఆవిష్కరించారు. దీనిలో అంతర్లీనంగా ఆయన పర్స్పెక్టివ్ ఉంది. ప్రచార కవిలా సందేశపు ఢంకా మ్రోగించలేదు.
సందేశాలనివ్వటం, తాత్వికసిద్ధాంతాలు ప్రవచించటం కవి చేయకూడని పనులు. రసాత్మకంగా తానావిష్కరించిన కవిత తన పని తాను చేసుకుపోతుంది. పాఠకుడి అంతరంగాన్ని వశపరచుకుంటుంది. మనిషిలో సహజంగా ఉన్న కరుణను బహుముఖంగా పెంచి పోషించి విస్తరింపజేస్తుంది. కరుణ ఒక మహోన్నత మానవీయతకు అస్తిత్వాన్ని చేకూర్చే జీవశక్తి. కరుణ లోంచి ప్రేమ ఉద్భవిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా శౌర్యమవుతుంది. సర్వజనావళికి శుభం చేకూర్చేందుకు అవసరమైతే త్యాగమవుతుంది. సర్వమతాలు, ధర్మాలు, యోగాలు, తాత్విక సిద్ధాంతాలు, సర్వ లలిత కళలు అంతిమంగా సాధించవలసినది పరిపూర్ణమైన కరుణామూర్తిగా అయ్యే పరిణామప్రక్రియను వేగిర పరచటం.
“తిలక్ కరుణ భావకవుల వేదనా ప్రియత్వాన్ని పోలివుంది” అనటం డెలిబరేట్ డిస్టార్షన్ అని తిలక్ కవిత్వాన్ని జాగ్రత్తగా చదివినవారి కెవరికైనా స్ఫురిస్తుంది. భావకవుల వేదనా ప్రియత్వంలో అనుభూతి సాంద్రత ఎక్కడుంది? అది ఒకరకంగా కృత్రిమమైనది. ఏ మాత్రం లోతులేనిది. అదొక ఫాషన్గా కనపడుతుంది. తిలక్ కరుణ ఎంత బలవత్తరమైన భావన! ఎంత కదిలించి కలవరపెట్టే శక్తి కలది1 ఈ రెంటికీ పోలిక ఎక్కడ ఉంది? రారా ఉదహరించిన కెవీయార్ చరణంలో తిలక్ కరుణరసావిష్కరణాన్ని నిరసించటానికి తర్కబద్ధమైన హేతువేమీ లేదు, ఉత్తేజపరచే లక్షణమూ లేదు. అది కవితనా? తిలక్ తత్వానికి సంబంధించని, తర్కం కాకుండా తర్కంలా కనిపించే అసంగతమైన విషయం ఈ చరణంలో ఉంది. పైగా ఇది ఉత్తేజ పరచేదిగా ఉన్నదని రారా భావించారని అనుకోవాలా?
చిన్నారికి చిన్న మాట అనే ఖండికలో జీవితం సంగీతం పెట్టె అని, జీవితం నవనీతపు పాత్ర అని, జీవితం దేవతల దరస్మితం అని తిలక్ చెప్పటాన్ని రారా తీవ్రంగా తప్పు పట్టారు. అలా లలితంగా చెప్పకుండా బ్రతుకు భారమంతా చూపించాలా? జీవితం వర్గపోరాటాల రుధిరధారావాహిక అని చెప్పాలా? “చిన్నారికి చిన్న మాట” అనటంలోనే ఒక ధ్వని ఉంది: కొండంత విషయాన్ని చిన్నారులకు గోరంతవిషయంలా చెప్పటం జరుగుతుందని. ఇలా చెప్పటంలో ఔచిత్యం ఉంది.
“మైనస్ ఇంటూ ప్లస్ ” అనే ఖండిక మీద రారా వ్యాఖ్య చూడండి: “‘క్రౌర్యం మీద అభిరక్తి అజ్ఞాతంగా మనిషి పశువుతో సమానం’ అనటం ఫ్రాయిడ్ సిద్ధాంతానికి దగ్గరలో ఉండవచ్చు కానీ, అభ్యుదయ దృక్పధానికి అనేక ఆమడల దూరంలో ఉంది.” పోనీ జీవితాన్ని ప్రగతి శీలక వర్గపోరాటంగా భావించే తాత్విక చింతనలోని దోపిడీ చేసే వర్గానికి చెందిన వాండ్ల మనస్తత్వాన్ని ఈ పంక్తులు ప్రతిబింబిస్తాయనుకోవచ్చుగా. ఇది సత్యమైన విషయం మాత్రం కాదా? ఇది సత్యం కాకపోతే ఇక జీవితంలో పోరాటం ఎవరికి వ్యతిరేకంగా?
“అందుకే మానవుడు మానవుడిగా, దేవుడిగా రూపొందే ఈ ప్రయాణం
అనంత దీర్ఘం, పునః పునర్వ్యర్ధం బహుయుగవిస్తీర్ణం”
తిలక్ ఈ పంక్తులు సర్వ మానవాళి పరిణామం గురించి, మానవుడు మానవుడిగా, దేవుడిగా పరిణామం చెందటం బహుయుగ విస్తీర్ణం అని చెబుతున్నాయి కానీ అసంభవం అనలేదే? ఇది పునఃపునర్వ్యర్ధం గాకపోతే స్టాలిన్ రష్యాలో లక్షలాదిమంది హత్యలకు గురిగావటం, చైనా టియానన్మైన్ స్క్వేర్ లో వేనవేల విద్యార్ధులు ప్రాధమిక మానవ హక్కుల కోసం పోరాడటం కూడా కాదు. కేవలం నినదిస్తున్నప్పుడు విప్లవ ప్రభుత్వ కిరాతసైనికుల తుపాకుల తూటాలకు నేలకొరిగిపోవటం ‘క్రౌర్యం మీద అభిరక్తి’ ఫలితానికి నిలువెత్తు నిదర్శనం కాక మరేమిటి? చిన్నా చితకా యుద్ధాలు, స్వాతంత్ర్యపోరాటాల అణచివేతలు, ప్రపంచ సంగ్రామాలకు వరదలై పారిన రక్తపుటేరులకు తిలక్ చెప్పిన పంక్తులు అద్దం పట్టడం లేదా? ఇది అబద్ధమా? ఇది ఆయన పరాజయ తత్వమా? కరుణామూర్తిగా మానవుడు పరిణామం చెందటానికి యుగాలు పడతాయే అని బాధ పడటం ఉంది ఈ పంక్తులలో. విప్లవాలలో నమ్మకాలు ఎప్పుడో పోయాయి. పరిణామం మీదనే ఆశలు.
“నాకు తల్లివి, నెచ్చెలివి, చెలివి నన్ను కౌగలించుకున్న పెద్దపులివి.” – ఈ మాటలు అనడం స్త్రీని కించపరచడం ఎలా అవుతుంది? తల్లి, చెల్లి, నెచ్చెలి అనడం గౌరవంతో కూడుకొనిన ప్రేమను ప్రకటించటం. పెద్దపులి అందానికి శక్తికి సంకేతం. ఈ లక్షణాలను స్తీకి ఆపాదించటంలో తప్పేమిటి? ఆమెను తక్కువ చేసి మాట్లాడటం ఎలా అవుతుంది? ప్రవహ్లిక అంటే పజిల్ అని. ఆమె మనస్సు ఒక పట్టాన అంతుపట్టేది కాదనీ, ఆమెను అర్ధం చేసుకోవలంటే తల్లి, చెల్లి, భార్య ప్రేమలలోని ఔన్నత్యాన్ని, త్యాగశీలతను ఆకళింపు చేసుకోవాలని దీని సూచితార్ధం.