ఆ తరవాత తిలక్ రకరకాల పద్యాలు రాశాడు. అంతర్జాతీయ సమస్యలూ, యుద్ధాల కష్టాలూ, పేదవాళ్ళ బాధలూ, ప్రేమికుల అనుభవాలూ, మధ్యతరగతి మనుష్యుల అనుభవాలూ, తుఫాన్లూ, కాటకాలూ అతన్ని రకరకాలుగా అలజడి పెట్టాయి. అతని మాటలు ఎటు వెళ్ళాలో తెలియక, ఐనా అతను అంతర్గతంగా భావిస్తున్న ప్రపంచాన్ని వదులుకోలేక, దారితప్పుతున్న కవిత్వాన్ని దారిలో పెట్టడానికి, మళ్ళా బావుండదనుకుని ఆ దారిలోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తూంటాయి. అప్పుడప్పుడు ధైర్యం పుంజుకుని, తన కవితా విశ్వాసాన్ని ఒక తీవ్రమైన ఉపన్యాసంలాగా, ఒక పదునైన వాగ్దానంలాగా చురుక్కుమని ప్రకటిస్తాడు. అలాంటి పద్యం 1955లో రాసిన కవివాక్కు.
1955 నించీ తిలక్ మళ్ళీ కవిగా పుంజుకోవడం మొదలు పెట్టాడు.
వివేకం లేని ఆవేశం విపత్కరమౌతుంది
సంయమం లేని సౌఖ్యం విషాదకారణ మౌతుంది
సమ్యక్ సమ్మేళనం లేని తౌర్యత్రికం కఠోరమౌతుంది
కరుణ లేని కవివాక్కు సంకుచిత మౌతుంది !
ఇందులో ఆఖరి పంక్తిలో చెప్పిన కరుణ తిలక్ కవిత్వానికి ప్రాణభూతమైన అంశం. అందుకే అతని మాటలు మనస్సుల్లో సహజంగా ఉండి, అవతలి వాళ్ళ సంతోషాన్నీ, బాధనీ మనదిగా అనుభవించగల ఒక సహజమైన శక్తిని ఉద్దీపింపజేస్తాయి.
నేను బాధపడుతున్నానంటే ఏడుపు, అవతలి వాళ్ళు బాధపడుతున్నారంటే జాలి.
జాలిని కన్నీళ్ళుగా మార్చకుండా, ఆర్ద్రమైన కవిత్వంగా మార్చడం కవిగా తిలక్ మాటలకున్న శక్తి. పంక్తి పంక్తికీ ఎంత బరువు కావాలో ఎక్కడ తేలిగ్గా ఉండాలో, ఏ మాటని ఏ మాటతో కలిపితే అతను అంతకు ముందు చెప్పిన తౌర్యత్రికం (musical ensemble) మనని భౌతికస్థాయి నించి దాని పైమెట్టుకి తీసుకెళుతుందో తిలక్ పట్టుకున్నాడు. అతనివల్ల తెలుగు భాష కొత్త ప్రాణం పోసుకుంది. ఆర్తగీతం అనే ఆయన 1956లో రాసిన పద్యం అలాంటిది. అందులో నా దేశాన్ని గూర్చి పాడలేను అని కఠినంగా మొదలయ్యే పద్యం –
నీ కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిళాత్త
శయ్యాసజ్జితమ్ము వలదు,
రసప్లావితము వలదు
చిత్ర శిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను, తత్వసూత్ర
వాదోక్తి చలింపను
సుందర వధూ కదుష్ణ పరిరంభముల రసింపను
గత చారిత్రక యశఃకలాపమ్ము వివరింపకు, బహుళ
వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు
ఇంక నన్ను విసిగింపకు
ఈ చరణాలు ఒక్కటొక్కటిగా మనకి అలవాటైన మొద్దుబారిన అందాల పొరలని నిర్దాక్షిణ్యంగా వొలిచేస్తాయి. ఏ తొడుగులూ, ఏ కప్పులూ లేని నిరాచ్ఛాద్యమైన మనస్సు తరవాత రాబోయే చరణాలలో ఉన్న బాధనీ, వేదననీ శారీరకంగా తెలుసుకోవడానికి సిద్ధపడుతుంది. కష్టాలు ఊహలు కావు. ఊహలు మనస్సు పడేవి, కష్టాలు శరీరానికి నాటుకునేవి. ఆ తరవాతి పద్యం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది, మన చర్మంలోకి వెళుతుంది. మనల్ని క్షోభ పెడుతుంది, హింస పెడుతుంది. ఈ పద్యం లోని ఆర్తి మన ఆర్తి అవుతుంది. అది మన నిస్సహాయతని బలంగా మారుస్తుంది.
ఈ పద్యం చదివినప్పుడల్లా ఈ మాటల్లోంచి తప్పించుకోలేను, కళ్ళముందు కనిపించే ఈ బొమ్మల్లోంచి బైట పడలేను అన్నంత భయం కలుగుతుంది. ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.
తిలక్ ప్రపంచంలో సరదా కోసం రాసిన పద్యాలు – తపాలా బంట్రోతు మీద రాసిన పద్యంలో ఈ పంక్తులు తపాలానీ, బంట్రోతునీ దాటి, అతని మనస్సులోకీ విశాలమైన సముద్రంలాంటి ప్రపంచంలోకీ మనల్ని తీసుకు వెళతాయి.
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు
అందరికీ నచ్చి, అందానికి మారుపేరై అతడి పుస్తకానికి పేరై నిలబడ్డ కవిత అమృతం కురిసిన రాత్రి. జీవితం పట్ల అతనికున్న ఇష్టానికీ, జీవితంలో అతనికున్న గాఢమైన నమ్మకానికీ, బతుకు అందమైనది, బతకడమే సౌందర్యం అనే అతని సిద్ధాంతానికీ ఈ పద్యం కన్నా స్ఫుటమైన ఉదాహరణ మరొకటి లేదు. అమరత్వమంటే చచ్చిపోకుండా ఉండటం కాదు, అమరత్వమంటే బతికున్న క్షణాలు గాఢంగా బతకడం అని ఈ పద్యం పొడుగూతా మాట మాటా అలాంటి ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించి పెడుతుంది. కాంక్షా మధుర కాశ్మీరాంబరం, హసన్మందార మాల ఈ పద్య ప్రపంచాన్ని కొత్త చప్పుళ్ళతో ఆవిష్కరిస్తాయి. ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపర్చుకున్నవాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు అనే పంక్తులు, ఆ పద్యంలోనే చివర అలవాటునీ అస్వతంత్రతనీ కావిలించుకున్నారు, అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు అనే పంక్తుల్ని హాయిగా విశాలంగా ఎదుర్కొంటాయి. పద్యనిర్మాణంలో మాటల కూర్పులో తెలుగులో ఉన్న గొప్ప పద్యాల్లో ఇదొకటి.
సరదాగా రాసినా, బాధగా రాసినా, ఉత్సాహంగా రాసినా, ఊరికినే రాసినా తెలుగు మాటలకి తిలక్ అప్పటికి అవసరమైన కొత్త ప్రాణం పోశాడు. రాజకీయాల అలజడిలో, సిద్ధాంతాల ఘర్షణలో కవిత్వానికున్న ప్రాణశక్తి బలహీనమై పోతున్న రోజులలో వాటినన్నీ తట్టుకుని, తిలక్ కవిత్వం కోసం ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడప్పుడు కార్టూను కవిత్వం, కేలండర్ కవిత్వం, అంతగా అవగాహన లేని రాజకీయ కవిత్వం తిలక్ రాయకపోలేదు. కానీ అవి కావు తిలక్‌ని మనకి గుర్తుండేలా చేసేవి. అవి అతని గాఢమైన కవితా వ్యక్తిత్వంలోంచి వచ్చినవీ కావు.
తిలక్ తన కవితా సామర్థ్యం పరమోచ్చదశలో ఉండగా అకస్మాత్తుగా చచ్చిపోయాడు. 1966 జులైలో అతను పోయేడని టెలిఫోన్ కబురు తెలిసేసరికి నేను నమ్మలేకపోయేను. ఏంచెయాలో తెలియక అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామమోహనరావు గారికి ఫోన్ చేసి చెప్పాను. కాని అదే ఆంధ్రజ్యోతిలో అతని మరణవార్త చదివిన తరవాతగాని అతను నిజంగా పోయాడన్న సంగతి నాకు మనస్సుకి పట్టలేదు.
కవిత్వాన్ని వదిలేసి, కవిత్వం పేరుతో ఉపన్యాసాలూ, వచనకవిత్వం పేరుతో చాతకాని వచనమూ విశృంఖలంగా వస్తున్న ఈ రోజుల్లో ఏది కవిత్వమో ఏది కాదో తెలుసుకోగల శక్తి నశించిపోయి, ప్రచారం చేసుకోగల వాళ్ళకి బహుమానాలు, కాకా పట్టగలవాళ్ళకి కనకాభిషేకాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో తిలక్‌ని మనం మరొక్కసారి జాగ్రత్తగా అతని పదవిన్యాసం కోసం, అతని పద్యనిర్మాణం కోసం, అతని ఊహగాఢత్వం కోసం, అతని ప్రపంచవైశాల్యం కోసం చదవడం అవసరం.