మారుపేర్ల మాయువు
మాయువు అంటే పైత్యం.
పెట్టిన పేరు వదిలిపెట్టి మారుపేరు ఎందుకు వాడుతారు? ఇక్కడ వాడుతారు అనడానికి బదులు వాడుతాము? అనడం సబబు. చారులు, చోరులు, మాఫియా మనుషులు, మోసగాళ్ళూ మారుపేర్లు వాడుకోవటం మామూలు, అవసరం కూడాను.
కాని, రచయితలు మారుపేర్లు ఎందుకు వాడుతారు? ఆరా తీస్తే రకరకాల కారణాలు కనపడతాయి.
అమ్మా నాన్నలు పెట్టిన పేరు పలకలేనిది గాను, ఎబ్బెట్టుగానూ ఉన్నదనిపించడం, ఒక కారణం. పోతే, అప్పారావు, నారాయణరావు, రామారావు, సుబ్బారావు, వెంకటేశ్వరరావు లాంటి పేర్లు చాలా సాధారణమైన పేర్లు. మాకాలంలో తెలుగునాట ఈ పేర్లలో ఒకటైనా ప్రతి ఇంట్లోనూ మామూలే! ఇప్పటి రోజులు వేరనుకోండి. మా స్నేహితుడొకడు బంగాలీ సినిమాల వ్యామోహంలో పడి, వాడి కూతురికి నిర్జన సైకతే అని నామకరణం చేసాడు. ఇది కాస్త విపరీతమే!
ఆల్లెన్ స్టువర్ట్ కోనిగ్స్‌బర్గ్ పలకటం కష్టమై కాబోలు, ఆ పేరు వుడీ ఆల్లెన్ గా (Woody Allen) మారింది. సినిమాల వాడిగాను, రచయితగానూ ఆ పేరే సార్థకమయ్యింది. అంతకన్నా మంచి ఉదాహరణ, జోజెఫ్ తియదోర్ నలీజ్ కోన్రాడ్ కార్జెనియోవిస్కి పలకడమేకాదు, స్పెల్లింగ్ చెప్పడం కూడా కష్టమే. ఆయన జోసెఫ్ కాన్రాడ్ గా (Joseph Conrad) ప్రసిద్ధి చెందాడు. అలాగే మోలియర్, వోల్తేర్, విర్గిల్ వగైరా! తెలుగులో పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ గా ప్రఖ్యాతకవిగా గణుతికెక్కడం కారణం కావచ్చు; చాలామందికి మారుపేరు చివర శ్రీ తగిలించుకోవడం ప్రబలిందనుకుంటాను. ఉషశ్రీ, మంజుశ్రీ, విజయశ్రీ, ఇంకా ఇంకా! అయితే కొంతమంది తమ అసలు పేరు రాసుకొని, బ్రాకెట్లలో కలంపేరు రాసుకోవడం కూడా పరిపాటయ్యింది.
ఒక గొప్ప కవిగారి పేరు, మీపేరూ అనుకోకండా ఒకటే అయితే ప్రమాదమే! శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రపంచప్రసిద్ధి పొందితే, శ్రీభాష్యం శ్రీనివాసులు, ఏదైనా అడపా తడపా రాసి ఏ పత్రికకన్నా శ్రీశ్రీ అన్న పేరుతో పంపిస్తే, మందలించని సంపాదకుడు ఒక్కడూ ఉండడనుకుంటాను. అప్పుడు ఆయన శ్రీభాశ్రీ అనో మరేదో మారుపేరు పెట్టుకోవాలి, అసలు మారుపేరు ఎందుకు పెట్టుకోవాలీ అన్న ప్రశ్న తట్టకపోతే! చెట్టు ఇస్మయిల్ తానూ వేరు సుమా అని చెప్పడానికి కాబోలు, ఏలూరు ఇస్మయిల్ స్మయిల్ గా మారాడు!
చిన్నప్పుడు శ్రీశ్రీ మైకంలో పడి నేనూ ‘వేవే’ అని కథలూ కాకరకాయలు రాసిపారేద్దామన్న విపరీతమైన ఉబలాటం ఉండేది. ఆ కోరికకి పురిట్లోనే సంధి కొట్టింది, మాతెలుగు మేష్టారి దయవల్ల. మిత్రుడు వేమూరి వేంకటేశ్వరరావుకి అటువంటి పైత్యపు లక్షణాలు ఏవీ లేకపోబట్టే మంచి రచయిత అయి కూర్చున్నాడు!
చాలాకాలం క్రిందట పాశ్చాత్య దేశాల్లో స్త్రీ రచయితలని ప్రచురణ సంస్థలు ప్రోత్సహించేవి కావు. అందుకని మేరీ యాన్ ఎవాన్స్ (Mary Ann Evans) జార్జ్ ఎలియట్ గా రచనలు చేసింది. బ్రాన్‌టీ అక్కచెళ్ళెళ్ళు (Bronte sisters) ముగ్గురూ ఎల్లిస్ బెల్, కర్రెర్ బెల్, యాక్టన్ బెల్ అన్న మారుపేర్లతో రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రమాదం లేదనుకుంటాను. ఇప్పుడు, తెలుగునాట మగ రచయితలు ఆడవారి పేర్లతో రాసి ప్రచురించుకోవడం పెరిగిందని ఒక పాత్రికేయుడు చెప్పంగా విన్నాను.
ఈరోజుల్లో పాశ్చాత్య దేశాల్లో పత్రికా సంపాదకులు మారుపేరుల్లో వచ్చే రచనలుగాని, ఉత్తరాలుగానీ సహించరు. ఒకవేళ వివాదాస్పదమైన రచనైతే, మారుపేరుతో ప్రచురించినా, అసలు పేరు ఎడ్రసూ వగైరా పత్రికకి చెప్పితీరాలి. ఎందుకంటే, మనం రాసింది మనమే రుజువు చేసుకోలేకపోతే, ఆ తరువాత కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది.
మారుపేరులతో రాయడానికి మరో కారణం: తన విద్యా పరిథిలో లేని విషయంపై రాసేటప్పుడు ఒక్కొక్క సారి మారుపేరు వాడుకోవడం స్వతహాగా మామూలే - కానీ, అసలు పేరు ప్రచురణ కర్తకి తెలియాలి. మరింకో కారణం: పరిచయం ఉన్న వ్యక్తి పై వివాదానికి దారితీసే వ్యాసమో, ఉత్తరమో రాయవలసి రావచ్చు. ఆ వ్యక్తికి అసలు పేరు తెలియకూడదని ఆశించడం సహజం. ఇక్కడ కూడా పత్రికల వారికి అసలు గుట్టు చెప్పకపోతే ప్రచురణ సాధ్యం కాదు. అలాగే, సాధారణంగా ఒక ప్రఖ్యాత పత్రికకి రాస్తున్నామనుకోండి. మరొక పోటీ పత్రికకి డబ్బులకోసం రాయడానికి మనసు పుట్టచ్చు. అప్పుడు మరోపేరుతో రాయడం తప్పుకాదు. అప్పుడు కూడా, ఆ పోటీ పత్రికకి అసలు రంగు చెప్పుకోవడం, లేదా ఆ పత్రికకి ఆ మారుపేరే సార్థకనామంగా వాడుకోవడం ఇక్కడ పరిపాటే. మరింకో ఇంకో కారణం: ఒక ప్రఖ్యాత కవి ఉన్నారనుకోండి. లైంగిక పరమైన సాహిత్యానికి మంచి గిరాకీ ఉంది. ఆ రచనలకి డబ్బులు బాగా గిడతాయి. అందుకని, ఆ కవి అటువంటి సాహిత్యం మరోపేరుతో రాయడం సంభవించవచ్చు. ఇందులో తప్పేమీలేదనుకుంటాను.
ఇంటర్నెట్లో పత్రికలు ముమ్మరంగా రావడంతో, రచనా వ్యాసంగం పెరిగింది. తెలుగులో కూడా రచయితలు పెరిగారు. అంతకన్నా ముఖ్యంగా, మా స్వానుభవంలో చూస్తున్నాం; ఉత్తరాలు, వ్యాఖ్యలూ రాసే వారి సంఖ్య బాగా పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో బ్లాగుల సాహిత్యం పెరిగిన తరువాత రకరకాల మారుపేర్లు ప్రబలంగా కనిపిస్తున్నాయి. నేను పైన చెప్పిన ఏ కారణాలూ ఈ మారుపేర్లతో (పోనీ కలం పేర్లు అని అందాం!) రాసేవారికి పట్టవేమో అన్న అనుమానం వస్తున్నది. ముఖ్యంగా ఒక వ్యక్తి రాసిన కథనో, కవితనో, వ్యాసాన్నో నిర్హేతుకంగా తూలనాడటానికి ఈ పేర్లు పుట్టగొడుగుల్లా పుడుతూ ఉన్నాయి. ఇది గర్హించవలసిన విషయం.
ఆ మారుపేర్లు కూడా క్షణాక్షణికంగా మారడం చూస్తున్నాం. కొత్తపేట కిషన్, చిలకల పూడి చిన్నమ్మ, కొప్పాక కోటిగాడు లాంటి పేర్లతో ఉత్తరాలు రాయడం కూడా చూస్తున్నాము. ఇది తప్పని అనటల్లేదు. పిల్లలమర్రి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలుసా (తెలుగు సాహిత్యం గ్రూపు) నడిచిన రోజుల్లో చాలా మంది కలంపేర్లతో పోస్టులు పంపేవాళ్ళు. ఐతే అది కేవలం సరదాకి, ఒక ఆట! అప్పట్లో వ్యక్తిగత దూషణలు వచ్చిన గుర్తులేదు.
వ్యక్తిగత దూషణలు, విషయానికి సంబంధించని ప్రసక్తులూ లేనంతవరకూ ఈమాటలో మారుపేర్లతో ప్రచురించడానికి మాకు ఏమీ అభ్యంతరంలేదు. అంతమాత్రాన ఈ మారుపేర్ల వ్యాసంగాన్ని మేము ప్రోత్సహిస్తున్నామని అనుకోవద్దు. ఈ మాట సాహితీ పత్రిక. సాహిత్యంలో వివాదాలు ఉంటాయి. ఉండాలి. విమర్శ ఉండాలి. ఆ వివాదాలు, విమర్శలూ నాగరికంగా ఉన్నంత కాలం ‘ఎవరీ రచయిత?’ అని ఆరా తీయటం మా పద్ధతి కాదు. ఒకవేళ ఆ రచయిత ఎవరో మాకు తెలిసినా, ఆ విషయం మా రహస్యం మాత్రమే! అసలు పేరు బట్టబయలు చేసి రభస చేయవలసిన అవసరం కనపడదు.
ఈ ఇంటర్నెట్ యుగంలో, ఎవరు పెట్టిన పేరు పక్కనపెట్టి మారు పేరుతో రాస్తున్నారో చట్టప్రకారంగా తెలుసుకోవడం అవసరమయితే, అది అసాధ్యం కాదని మీకూ తెలుసనుకుంటాను.
Sowmya అభిప్రాయం:
September 1, 2010 8:01 am
:-) బాగుంది!
మరో కారణం:
“నేను వేరు, నా రచన వేరు. నా రచనలు తప్పిస్తే నాకు వ్యక్తిత్వం లేదు అని ఊహించుకోకండి” అని చెప్పేందుకు ;)
[ఇలా అన్నానని అసలు పేరు కాదనుకునేరు!! నా అసలు పేరు సౌమ్యే నండోయ్!]
subbarao అభిప్రాయం:
September 3, 2010 1:05 am
చాలా మంచి ఒపినియన్.
Dr Tatiraju Venugopal అభిప్రాయం:
September 4, 2010 10:51 am
‘శ్రీరంగం శ్రీనివాసరావు’ అనే పెద్ద కొండని చిన్న అద్దంలో చూపించడమే ‘శ్రీశ్రీ’ అంటే- అని రచన పత్రికలో అన్నాను. అలా అలరించిన పేర్లే వపా ,కొకు, పాప, సినారె, చాసో, భకారా, భరాగో లాంటివి. మరో రకం- గోరా శాస్త్రి, ద్వానా శాస్త్రి, కవన శర్మ వగైరా. ఇక భాగవతుల శంకర శాస్త్రి, కిళాంబి నరసింహాచార్యులు, సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే అసలు పేర్ల కంటే కలం పేర్లే బాగా వర్ధిల్లాయి. సినిమా హిట్టయితే కొత్త ఇంటి పేర్లు వస్తాయి, సిరివెన్నెల, అల్లరి- వంటివి. బిరుదులు వస్తే ఇక అసలు పేర్లతో పనే లేదు, కవి సామ్రాట్, నట సామ్రాట్, నట రత్న అటువంటివి. విష్ణువుకి వేయి నామాలు కదా, మనుషులు ముచ్చటగా మరో పేరు పెట్టుకొని ఆనందిస్తే –పోనీ లెండి.
-డా. తాతిరాజు వేణుగోపాల్
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
September 11, 2010 11:37 pm
బావుంది. ఈ మాయువు మాయరోగం ఇంటర్నెట్ వచ్చాకనే పెరిగింది. రచయితలు మారుపేర్లతో రాయడం వల్ల ఎవరికీ ఇబ్బందీ లేదు; ఒరిగేదీ లేదు. అసలు గొడవంతా మొదలయ్యేది పాఠకుల పేర్లతో వచ్చే వ్యాఖ్యలవల్లే! ఇదే ప్రస్తుత రచ్చకి మూలకారణం. గతంలో పత్రికల్లో కథలూ, కాకరకాయలపైన ఉత్తరాలు రాసినా, సంపాదకుల వారు యధాశక్తి నొక్కేసేవారు. ఆహా ఓహోలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.
గట్టిగా ఎవరైనా దబాయిస్తే, స్థలాభావం అన్న సాకెలాగూ వుంది. ఇంటర్నెట్ లో అటువంటివి లేవు. ఇలా రచన రాగానే, అలా వ్యాఖ్యరాసిపడేయచ్చు. ఈ సౌకర్యం ఇటు రచయితలకీ, పాఠకులకీ మంచిదే! చదివిన తరువాత రచనపై కలిగిన స్పందన క్షణంలో వడ్డించేయచ్చు. పొగడ్తయితే సదరు రచయితల ఛాతీల వైశాల్యం కాస్త పెరగచ్చు. ధన్యవాదాలూ, నెనర్లూ, కృత్జ్ఞతలూ వంటివి వినమ్రంగా చెబుతూ పొగడ్తలనేవి మాకు అంతగా పట్టవన్న బిల్డప్పూ ఇవ్వచ్చు.
అదే విమర్శయితే మౌనముద్ర ఎలాగూ వుంది. ఇహ పాఠకులంటారా? మందలూ, మావాళ్ళూ, మా కులంవాళ్ళూ, మా వూరి వాళ్ళూ అన్న గోలెలాగూ ఏడ్చింది. నిజాయితీగా రాసే కామెంట్లు ఒకటీ అరా వుంటున్నాయి. మిగతా అంతా బాకాల రొదా లేదంటే దూషణ దండకం. కాబట్టి మారుపేర్లతో వచ్చే వ్యాఖ్యల వల్ల ఒనగూరిందేమీ లేదు. కాకపోతే మన స్నేహితుడో, తెలుసున్న వాడో ఏదయినా రాస్తే, ఆ రచన బానే వుందన్న మొహమాటపు వ్యాఖ్య ఎదురు పడినప్పుడు చెప్పినా, పరోక్షంగా వారిని వుతికి ఆరేయడానికి ఈ మారుపేర్ల మాయువు చక్కగా ఉపయోగ పడుతుంది. నాకు బాగా పరిచయమున్న ఒకాయన వున్నాడు. నా రచనలపై పైకి వ్యాఖ్యానించడం ఇష్ట లేక చక్కగా మారుపేర్లతో వ్యాఖ్యలు రాస్తూ తెగ సంబరపడిపోతాడు. అతగాడే రాస్తున్నాడని నాకు తెలుసు. అయినా ఎదురుపడినప్పుడు స్నేహబంధమూ, ఎంత మధురమూ అని గొంతెత్తి పాడుకుంటూ గడిపేస్తాం. ఏం చేస్తాం? ఇవోరకం కొత్త సంబంధాలు. అలవాటు పడిపోవాలంతే! ఇంకో గమ్మత్తుంది.
వస్తువు పైనే వ్యాఖ్య వున్నప్పుడు ఎవరు రాస్తేనేంటని? వీళ్ళే మరో వితండ వాదం కూడా చేస్తారు. వస్తువుపైనే అసలు గొడవంతా అయినప్పుడు సొంత పేరుతో రాయడానికి వచ్చిన ఇబ్బందేమిటో అర్థం కాదు. రిలేషన్లూ, అవసరాలూ చెడకూడదు. కానీ చక్కగా స్నేహితులనీ దొంగ పేర్లతో ఉతికారేయచ్చు. రోడ్డు కీడ్చి చంకలు గుద్దుకోవచ్చు. ఒకవేళ సదరు రచయిత ఎదురు పడితే సింపతీ వర్షమూ కురిపించవచ్చు. చేతికి మసంటకుండా ఎదుటి వాణ్ణి బొగ్గుతో కడిగేయచ్చు. సర్ఫూ, రిన్నూ అవసరం లేకుండా, తడంటకుండా డ్రై కర్సింగ్ చేసేయచ్చు.
ఆహా! ఎంత చక్కటి సాంకేతిక సౌకర్యం?
కాబట్టి వ్యాఖ్యలకి విలువివ్వడం వృధా - నా ఈ కామెంటుతో సహా!
( నా ఈ కామెంటుక్కక్కూఅజ్ఞాత చొక్కా తొడిగి ప్రపంచమ్మీదికి వదిలేస్తే?……..)
kameswari అభిప్రాయం:
September 16, 2010 11:04 am
ఏది ఏమయినా పేరంటే గుర్తింపు. ఆ పేరును ఎందుకు వదిలివేసినా అది అస్తిత్వ త్యాగమే. భారతీయుల్లో ఆధ్యాత్మికత ఇందుకు కారణమా? దాన్ని వదలకపోతే అంత ప్రమాదమా? ప్రమాదమే అయితే భయంతో ఏ పనయినా ఎందుకు చేయాలి?
కొత్తపేరు పై మోజు , కొత్త పదాన్ని కూర్చటం పై మోజు , తనలోని మరో కోణాన్ని ఆవిష్క రించాల అనే సరదా కూడా ఇందుకు దారి తీస్తాయనుకుంటాను.
యద్దనపూడి కామేశ్వరి.
మారుపేర్ల మాయువు అభిప్రాయం:
September 19, 2010 6:42 pm
మారుపేర్ల మాయువు ఈమాట పత్రికలో పుట్టడానికి ప్రధాన కారణం, వ్యక్తి గత నిందలతో కూడిన అభిప్రాయాలను సెన్సార్ చెయ్యడంలో ఉన్న ఈమాట సంపాదకుల బాధ్యతా రాహిత్యమే. పైకి బాగానే కబుర్లు చెబుతారు గానీ, ఎంతో మంది సంపాదకులు ఎన్నో సార్లు అభ్యంతరమైన వ్యాఖ్యలను సెన్సారు చెయ్యకుండా ప్రచురించారు. ఒక్కోసారి ఒక సంపాదకుడు మిగిలిన సంపాదకులతో సంప్రదించకుండా అటువంటి వ్యాఖ్యని అనుమతించారని ఓ సిల్లీ సంజాయిషీ చెబుతారు. “స్వల్పమైన వ్యంగ్యం ఆరోగ్యకరం, హాస్యదాయకం” అని అనుకుంటూ, వ్యక్తి గత నిందలున్న వ్యాఖ్యలని ప్రచురిస్తారు. అది ‘స్వల్పమో’, ‘అధికమో’ తేల్చడానికి మీరెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇది మీ పత్రిక అని సమాధానం చెబుతారు. ఆ ‘స్వల్పం’ రచయితకి కూడా ‘స్వల్పం’ అవునో, కాదో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? ఇక ఆ రచయిత్రి(త) ఏడవలేక, కృత్రిమ నవ్వు మొహానికి పులుముకుని, ఏదో జవాబివ్వడమో, దాన్ని నిర్లక్ష్యం చెయ్యడమో చేస్తారు. రచన గురించే రాయండీ, రచన గురించే రాయండీ అని ఓ పక్క కేకలు పెడుతూనే వుంటారు. ఇంకో పక్క అలా లేని వ్యాఖ్యలు కూడా ఇక్కడ చోటు చేసుకుంటూనే వుంటాయి. దానికి బాధ్యత ఈ సంపాదకత్వ వర్గానిదే. ఏ రచయిత్రి(త) వచ్చి “నా మీద వ్యక్తిగతమైన నింద వుంది, బాబోయి” అని మీతో చెప్పుకోగలరు?
ఒక పాఠకురాలు(డు) ఒక రచన గురించి, ఆ రచయిత్రి(త) ప్రశక్తి లేకుండా, ఏమన్నా విమర్శ చేస్తే, ఆ రచన నచ్చిన ఒక గుంపు ఇక విరుచుకు పడుతుంది. ఆ విరుచుకు పడ్డం అంతా, రచన గురించో, రచన మీద వచ్చిన విమర్శ గురించో అయితే, ఎవరికీ అభ్యంతరం వుండదు. నెమ్మదిగా మొదలయి, తీవ్రంగా వ్యక్తి గత స్థాయిలోకి వెళుతుంది ఆ నింద. ఒక్కోసారి వ్యక్తి గత మెప్పుదలే కదా, ఎవరికీ అభ్యంతరం వుండదు అని మీరనుకుంటూ, ఆ రచయిత్రి(త)ని ఇష్టపడే వంధిమాగధుల గొప్ప గొప్ప మెప్పుకోళ్ళు ప్రచురిస్తారు. అవి చదవడానికి మాత్రం ఎంత వెగటు పుడుతుందో.
ఈమాట సంపాదకులు వ్యాఖ్యానాల విషయంలో, ఏ మాత్రమైన వ్యక్తి గత రిఫెరెన్సూ లేకుండా సెన్సారు చెయ్యగలిగి నప్పుడు మాత్రమే, ఈ “మారుపేర్ల మాయువు”కి అంతం పుడుతుంది. లేదా, ఈ “మారుపేర్ల మాయువు” వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటీ అని మిమ్మల్ని మీరు ప్రశ్నంచుకోండి. ఇవన్నీ మీరు సెన్సారు చేసి, అనుమతించిన రచనలూ, వ్యాఖ్యానాలూ. ఇంక రాసిన మనిషికి అక్కర్లేని పేరు మీకెందుకూ? ఆ మనిషి అసలు పేరు రాయలేదని మీకు బాధ ఎందుకూ?
ఒక వేలు అవతల వేపు వాళ్ళ కేసి చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్ళూ మీ వేపే చూపిస్తాయన్న నానుడి వుండనే వుంది. స్వవిమర్శ కూడా ముఖ్యమే.
Dr.Tatiraju Venugopal అభిప్రాయం:
September 23, 2010 11:37 am
ఒక ప్రక్క ఉద్యోగ ధర్మం, మరో ప్రక్క ప్రవ్రుత్తి ఉబలాటం వల్ల కొందరు మారు పేరుతో ఆ ప్రవ్రుత్తికి అంకితం అవుతారు. మరి కొందరికి సిగ్గో భయమో కానీ సొంత పేరు బయట పెట్టనే పెట్టరు. ఇక చర్చలూ, వ్యాఖ్యలూ వంటివి చేయాలనిపించినా, ఇదిగో మళ్ళీ ఈ సిగ్గూ భయమే అడ్డు. అప్పుడీ మారుపేరే శరణం. ‘ఇది నా స్వంత రచన–’ అని ఎలా హామీ ఇస్తుంటారో అలా ‘ఇది నా స్వంత పేరు’ అని హామీ ఇవ్వడం ఒక్కటే తక్షణ కర్తవ్యం. ఇంకో రహస్యం- మారు పేరాశ గాళ్ళను ‘మీ ఫోటో ఇద్దురూ’ అంటే ఇస్తారా? -డౌటే! పేరు మారినా ఫేసు మారునా?
-డా. తాతిరాజు వేణుగోపాల్