‘ఆర్తగీతం’ మనను కరుణ రసంలో ముంచెత్తే గొప్ప కవిత. లేమితో అలమటిస్తున్న అసంఖ్యాక ప్రజల దయనీయమైన, భారమైన బ్రతుకులకు అద్దం పడుతుంది. నిజంగానే తిలక్ కన్నీటితో స్పందించిన సన్నివేశాల సమాహారం ఈ గీతం:
నేడు నేను కన్నీరు గా కరిగిన గీతికను
సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును
మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను…
ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు
పసిపాప ఉన్నంతవరకూ…
ఈ గుండె గూడుపట్లు ఎక్కడో కదిలినవి
ఈ కనులు వరదలై పారినవి
ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి…
అలానే, తాడితుల, పీడితుల బడుగు వర్గాల బాధామయ గాధల నావిష్కరిస్తూ ,ఇంకా ఎత్తైన పొయెటిక్ ప్లేన్ మీద ‘అదృష్టాధ్వగమనం’లో ఇలా అంటారు:
ఊరవతల సందులలో దుమ్ము కొట్టుకు పోయిన పిల్లల కండ్లలో ఆరిపోతున్నవెలుగులో
కాలవవడ్డున వంకర తిరిగిన తుమ్మచెట్టు కొమ్మలోంచి కాలి మసై పోతున్నపశ్చిమ దిశాగగనంలో
ఒక భయంకర సృష్టి క్రమాన్ని మానవ యత్న వైఫల్యాన్ని ఊహించుకుని వణికిపోయేవాణ్ణి
ఎంతో సూచకధ్వని బలం ఉన్న కవిత. ఊర్లో చోటు లేని వాళ్ళు, ఊరవతల ఉన్న వాళ్ళు, దుమ్ముకొట్టుకపోవడం కాదు,కళ్ళలో దుమ్ము కొట్టబడ్డ వాళ్ళు, వెలిగీ వెలగకముందే ఆరిపోతున్న దీపాలలాంటి జీవితాలు కల వాళ్ళు, వారి జీవితాలలో బూడిద మినహా మరేమి లేనివాళ్ళు. ఇది భయంకరమైన సృష్టి క్రమమా, చరిత్ర గతియా, దుర్మార్గపు సాంఘిక దోపిడీయా లేదా మానవయత్న వైఫల్యమా? ఆలోచించవలసిన దుస్థితి పాఠకులకు.
అయినా తిలక్ గొప్ప ఆశావాది.అంతిమంగా, మానవుని లోని అంతర్గతంగా ఉన్న మంచితనం, కరుణ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో పెరిగి పెద్దవై, బలోపేతమై, ధరిత్రి నిండా శాంతి, సుఖం, సంపద, సౌందర్యం ఉండేట్లు చూస్తవి. అందరికీ అందుబాటులో ఉండేట్లు చేస్తవి. ఆవిషయంలో ఆయనకు సందేహం లేదు. అందుకే అంటారు, ఆ కవితలోనే దానిని ముగిస్తూ,
అలసిన నా ప్రవాసం లో అద్భుత సౌధాల
మణి కవాటాలు తెరచుకోవటం మానలేదు”
…..
ఇప్పటికీ మధుమాసంలో సహకార తరువుల కింద పవ్వళించిన వేళ
నా గళాన సౌందర్య మధూళి చిందుతుంది
ఇప్పటికీ దిగులు నీరు నిండిన కోటి మనస్సరస్తీరాల నా కవిత
కోరికల కోణాకారపు కొత్తచెట్లను నాటుతుంది
ఇప్పటికీ ఈ చీకటి మొగలో నిలచి పాడుతున్న నా కోసం
కుబుసం విప్పిన గోధుమవన్నె తాచు
మొగలిపొదలనుండి పడగ విప్పి ఆడుతుంది
ప్రాగ్దిశా సుందరి ఖండచంద్ర పరిదీపిత కపోలాల హసిస్తుంది
నా గుండెలపై శుక్రతార కిరణం సూటి గా వచ్చి వాలుతుంది
ఎంతటి జాలి,ఎంతటి కరుణ లేకపోతే ఇలా రాయగలరు!
అన్నా ! నేనొక జ్వాలా వలయితుణ్ణి దుఃఖితుణ్ణి
నా లోపల నా బాధలు
నా వెలుపల క్షతజగత్తు ఆక్రోశించిన కరుణా భీభత్స రవాలు
నిరంతర పరిణామ పరిణాహ జగత్కటాహంలో
సలసలకాగే మానవాశ్రుజలాలు
యుధ్ధాన్ని ,రాజకీయనాయకుల కరుణా రాహిత్యాన్ని ఎంతగా నిరసించకపోతే ఇలా అంటారు!
యుధ్ధాన్ని సృష్టించే మహా నాయకులు
దేశాల సరిహద్దులలో నిలబడి
ద్వేషాల శతఘ్నులను పేలుస్తున్నపుడు.
ఎంతటి సౌందర్యారాధనలేకపోతే ఇలా అనగరలరు!
అన్నా !
నేను నిర్మించుకున్న ఆశాచంద్రశాలలో
కాలం కరిగి వెన్నెలయింది
ఎంతటి రమ్యమైన కవితా సమాధ్యవస్థలో సాధించిన దార్శనికత లేకుంటే ఇలా రాయగలరు!
వానలో కానలో నాకు అవిరామ ప్రాచీనత స్ఫురిస్తుంది
వార్షుకాభ్రం నాకు యక్షపతీ సౌందర్యాన్ని రచిస్తుంది
మానవుణ్ణి గురించి ఎంత మహోన్నతమైన భావం,గౌరవం లేకపోతే ఇలా అంటారు!
నవనవాలైన ఊహావర్ణార్ణవాలమీద ఉదయించిన సూర్యుడు
సాంప్రదాయకవులనీ, భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే విభజన కృత్రిమమైనది. అసలు కవితాతత్వాన్ని పక్కదారి పట్టించేది. కదిలించే కవిత్వాన్ని రాయలేనివాళ్ళకు కవులుగా ఏదోవిధంగా అస్తిత్వాన్ని కలిగించటానికి చేసే వ్యర్ధప్రయత్నం. ఇలా వర్గీకరణ చేసుకుంటూ పోతే భౌతికవాద కవులనీ, హేతువాద కవులనీ, ఆధ్యాత్మికవాద కవులనీ ఇంకా మరేదో వాద కవులనీ కూడా అనవచ్చుగా? కవి నిబద్ధత కవిత్వానికి. వాదాలకు కాదు.కవిత్వం వ్రాయగలిగితే మానవానుభవంలోని ఏ ఉదాత్తమైన విషయాన్నైనా కవితావస్తువుగా స్వీకరించివ్రాయవచ్చు. కానీ అది కవిత్వం అయి తీరాలి. చవకబారు ప్రచార సాధనంగా ఉండకూడదు. తిలక్‌ని అభ్యుదయ కవి అని శ్రీశ్రీ, కుందుర్తి అన్నంత మాత్రాన ఆయన కవితా ప్రతిష్ఠ పెరిగేది లేదు, రారా, కెవీయార్లు కాదంటే ఆయన కవితా స్థాయి తరిగేది లేదు. మంచి కవిత్వం, నిజమైన కవిత్వం తోటి జనుల నాల్కల మీద నడయాడుతుండాలి, మనసులలో మననమవుతూ ఉండాలి.
పరమేశ్వరుడంతటివాడు మన్మధుడి పూబాణాలకు లోను కాక తప్పలేదు. కవితా సుమశరుడైన తిలక్ కవితా సౌరభాలకు తన్మయులు గాని వారెవరుంటారు! సహజ స్వభావ సిద్ధమైన సౌందర్యారాధన, వేదనాక్రోశ రవాలు అయినా మానవుని ప్రగతిశీలక పోరాట పటిమలో అచంచల విశ్వాసం, ఆనందం, వారి కవిత్వంలో వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలాగా, దయాపారావతాలలాగా, విజయ ఐరావతాలలాగా, కలసి మెలసి సుందర పదబంధాలై వారు కలలు గనిన గమ్యం వైపు ఆకాశం మీద అప్సరసలలా పరుగులెత్తుతూనే ఉంటవి. వచనకవితా వినీలాకాశంలో జాతి వజ్రంగా మెరిసే ధృవతారలా సాహిత్యచరిత్ర లో అమరులై నిలుస్తారు తిలక్. కవిత్వం అందం, ఆనందం పరమావధిగా అనంతంగా వారు చూపించిన దారి వెంట సాగుతూనే ఉంటుంది.
