నెహ్రూవియన్ సోషలిజంమీద కొంత మొగ్గు కనపడేది కాని, మొత్తంమీద రాజకీయంగా తిలక్ ఏ ఇజాన్నీ అభిమానించలేదనుకుంటాను. ఒకసారి (1963) మా సంభాషణలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రచయితలకు వ్యక్తిగతంగా ఏ రాగద్వేషాలున్నా, రచనలో అవేవీ ప్రముఖంగా ముందుకు చొచ్చుకురాకూడదని, లేకపోతే అది ప్రచార సాహిత్యం అవుతుందని, రచయిత మానవతకు, సత్యావిష్కరణకు మాత్రమే కమిట్ కావాలి అని, ఏ సంకుచిత రాజకీయ వాదానికి కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. తిలక్ అదే సమయంలో కమ్యూనిజాన్ని పూర్తిగా తిరస్కరించాడు. లెఫ్టిస్టులు ఆయన్ని పూర్తిగా ఆమోదించలేక పోవడానికి అదే కారణమనుకుంటాను.
ఇప్పుడు వెలువడుతున్న ఈ “గోరువంకలు” సంపుటంలో వున్నవి అచ్చంగా తిలక్ పద్య కవితలు. ఇవి మొదటిసారిగా పుస్తకరూపంలో వస్తున్నాయి. తొలిరోజుల్లో ఆయన ఎక్కువగా పద్యచ్ఛందస్సులలోనే కవిత్వం రాసేవాడు. ఇవన్నీ భావకవితా సంప్రదాయానికి చెందినవి. ప్రత్యేకించి ఇవి ప్రణయ కవితలు. అతి సుకుమారమైన భావన, అంతే సుకుమారమైన భాష. ఈ కవితలు ఇప్పుడు చదువుతుంటే The child is father of the man అన్నట్టు, “అమృతం కురిసిన రాత్రి”లోని గొప్ప వచన గీతాల ప్రాతిపదికలు వీటిలో వున్నట్టు కనిపిస్తుంది. కృష్ణశాస్త్రి అనేవారు ప్రతి మాటకు రంగు, రుచి, వాసన ఉంటాయని. ఆ రహస్యం ఎరిగి పదప్రయోగం చేసిన కవి తిలక్. Poetry is music in words and music is poetry in sound అని ఇంగ్లీషులో ఒక నిర్వచనం. తిలక్ కవిత్వం సరిగ్గా అలాంటిది. అతనిది సంగీత మాధుర్య మార్దవాలతో పెనవేసుకున్న కవిత్వం. అంత ట్రాన్స్‌పరెంట్ కాని చీకటిలాంటి అస్పష్టతా, అన్వయ క్లిష్టతా వున్నాయి. అయినా తిలక్ ఒకచోట తనే కవితను నిర్వచించినట్టు, మొత్తంమీద పాఠకుడికి అతని అనుభూతి ఆకారం అందుతుంది, హత్తుకుంటుంది. అతని కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరుస్తుంది.
కొన్ని పద్యాలు ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే తిలక్ స్వయంగా చదివినప్పటి జ్ఞాపకాలు ముసురుతున్నాయి. భాస్కరరావుకీ, నాకు బాగా ఇష్టమైన పద్యాలలో మచ్చుకి ఒకటి –
ప్రతిదినమేగు బాష్పకణ భార నిరోధ దిశాంత నేత్రమై
ప్రతి వకుళమ్ము రాలు శిశిరాత్త దళాంత గళోచ్చ నాదమై
ప్రతి తెలి వేకువన్ తొలగి రాలెను తారలు గాజుపూసలై
అతివ కదల్పకీ వయసు టద్దపు మేడ పునాది గోడలన్
తిలక్‌కు ఇష్టమైన ఇతివృత్తాలలో సీత మహనీయ దయనీయ గాథ ఒకటి కాబోలు, ఆ ఇతివృత్తం తీసుకొని తొలిరోజుల నుంచి మలిరోజుల వరకు చక్కని ఖండికలు ఆయన రాస్తూనే వున్నాడు. స్వయంవర అనే తొలినాళ్ళ ఖండికలో సీత రాముని మొదటిసారి చూసినప్పటి అనుభూతిని కవి ఇలా వర్ణించాడు:
అదిగో సాగెను స్వామి విల్లుకయి ఆ యందమ్ము ప్రాతస్పర
స్సదనోద్దీపిత రాజహంసవలె ఆశాంతమ్ము శోభించు క
న్తుదలన్ చూడవె లౌకికావధుల నాందోళించు క్రొవ్వెల్గు సం
పదలోమున్ చెలి అతడే ఆతడు నా ప్రాణేశు డాజన్మమున్
60లలో రాసిన అద్వైతమాన్మథము పరిణత రచన. సీత రామునితో అంటున్నది:
నేను నీలోన నన్ను సృజించుకొనగ
నీవు నాలో లయింతు వెంతేని వింత
ఇది యపూర్వ క్రమము సృష్టి మొదలు తుదలు
కలసికొన్నవి మనలోన కాలమాగి
భారతజాతికి సీత పట్ల గల పవిత్ర గౌరవ భావాన్ని కవి మరొక ఖండికలో ఇలా వర్ణించాడు.
పాండవపత్ని జీవితపుబాట యగమ్యము నిత్యయాతనా
చండిమమున్; తదన్య గుణశాలినులున్నను, తల్లి నీవు మా
గుండెల రక్తనాళముల కోసిన జాలివి, నిర్మలత్వమే
నిండుగ వెల్గు నీ కనుల నిల్చును జాతికి వెల్గు మిన్నులై
స్వామివివేకానందకు శతజయంతి నివాళిగా రాసిన ఖండికలో ఎంత సరళంగా ఎంత గొప్ప భావాన్ని ప్రకటించాడో ఈ క్రింది పద్యంలో చూడవచ్చు:
దేవుడెచట మనసు తేట తీరిన చోట
దేవుడెచట ఇరులు తెగిన చోట
దేవుడెచట సకల దీనుల కన్నీట
దేవుడెచట స్వామి నీవు నచట
పోనుపోను తిలక్ భాష, భావం తేటతేరి సరళ సౌందర్యంతో భాసించసాగింది. ఆయన వచన కవితలోను, పద్యకవితలోను, ఒక క్రమపరిణామం, పరిణతి ప్రస్ఫుటించాయి. సరిగా ఆ దశలోనే తిలక్ అకాలంలో కన్నుమూశాడు. ఒక గొప్ప సంగీతం మధ్యలో ఆగిపోయినట్టు, మధురంగా నిక్వణిస్తున్న వీణాతంత్రి అకస్మాత్తుగా తెగిపోయినట్టు, ఒక ఉద్యమం అర్థాంతరంగా నిలిచిపోయినట్టు, తిలక్ ప్రపంచరంగస్థలి నుంచి నిష్క్రమించాడు. కీట్స్ ఇంకా చిన్నవయసులోనే మరణించాడు కాని, తిలక్ మృతి కీట్స్ మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. తిలక్ ఇంకా బతికి వుంటే ఎన్ని మహత్తర కవితలు, ఎంత వైవిధ్యంకల రచనలు వెలార్చి వుండేవాడోననే భావం బాధతో మనస్సు చివుక్కుమనిపిస్తుంది.
అయితే తిలక్ వదిలివెళ్ళిన సాహిత్యభాండారం తక్కువేమీ కాదు. రాశిలో కొద్దిదే కావచ్చుగాని వాసిలో దొడ్డది. బహుశా మరణానంతరమే ఆయన కవితా వైశిష్ట్యాన్ని దేశం మరింతగా గుర్తించిందేమో అనిపిస్తుంది.
ఇప్పుడు తిలక్ పద్యాలను గోరువంకలు పేరుతో సంపుటంగా ప్రచురిస్తూ, లండన్‌లో వుంటున్న తిలక్ కుమారుడు డాక్టర్ సత్యనారాయణ మూర్తి తన తండ్రిగారి ఈ పద్య కవితా సంకలనానికి పీఠిక రాయవలసిందిగా నన్ను కోరి నా చిన్ననాటి తిలక్ జ్ఞాపకాలను, ఆయనపట్ల నాకు గల గౌరవాభిమానాలను, ఈ విధంగా జ్ఞాపకం చేసుకునే అవకాశం కలిగించినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ కవితా సంపుటి తిలక్ అభిమానులకు, కవితా రసజ్ఞులకు ఆదరపాత్రం కాగలదని నా ఆశంస.
నండూరి రామమోహనరావు
విజయవాడ, 7.11.92