మళ్ళీ అతను రాలేదు.
లత మళ్ళీ పూయలేదు.
అతని జాడ తెలియదు.
చీకటి లతని ముసుగులా మూసుకుంది.
అతను మళ్ళీ రాలేదు.
అతను మళ్ళీ పిలవలేదు.
అతని పాట అర్ధరాత్రి మబ్బులలోంచి జాలిగా–
ఆమె మూలుగు పాతాళ కుహరంలోంచి బాధగా –
పువ్వులు రాలిపోయాయి. మంచు దట్టంగా పడి మనసులూ, ఆకులూ మూసుకుపోయాయి.
బావురుమనే నిశ్శబ్దం అంతటా…
దేవతలు ఏడుస్తున్న వర్షం. మనుష్యులు కాలుతున్న వాసన.
అతన్ని వెతకడానికి వెళ్ళినవారికి దారిపొడుగునా అతని గుండె రక్తపు మరకలే కనిపించాయి. కాని అతడు మాత్రం కనపడలేదు.
ఆమెను చూడడానికి వెళ్ళినవారికి గదిలో ఆమె కనపడలేదు. కటిక చీకటి తప్ప.
ఇది ప్రళయం – అంది రాలిపోయిన పువ్వు.
ఇది విలయం – అంది జారిపోయిన చుక్క.
పెట్టె లోపల – గదిలో మూలగా పెట్టె లోపల్లోపల్లోపల – మణిప్రవాళం మెరుస్తోంది. ఫక్కున నవ్వింది. ఇలా అంది.
“నా శక్తి అనంతమైనది. నేను కరుణనీ, ప్రేమనీ, సౌందర్యాన్నీ, నశింపచేస్తాను. దైవీయ శక్తుల్ని ఓడిస్తాను. ఈ జగత్తు నాకు బానిస – అవునా?”
అవును అన్నాయి మబ్బులు.
అవును అన్నారు రాక్షసులు.
అవును అన్నాయి చెట్లూ, చెట్టు మీద పిట్టలూ భయంకరంగా.
అవును అన్నాయి పువ్వులు ఏడుస్తూ.
ఒక్కసారిగా నిశ్శబ్దం. కఠినశాసనంలాగా నిశ్శబ్దం. యుగాల దాకా మళ్ళీ ఏ హృదయమూ పలుకలేదు. పలవరించలేదు.
(స్వాతి, 1963).
అద్దంలో జిన్నా
యం. ఏ. జిన్నా కోటు తొడుక్కొని అద్దం ముందు నుంచున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా చాలా గొప్ప జిన్నాలా కనపడ్డాడు. అద్దంలో నిజానికి ఒక జిన్నా ఒక్కడే కనపడలేదు. జిన్నా వెనకాల ఎంతో మంది మహమ్మదీయులు వరసలు తీరి ‘జిన్నాకీ జై’ అంటు నిలబడ్డారు. అందరిలోనూ ఒక్కొక్క జిన్నా వున్నాడు. ప్రతి మహమ్మదీయుడూ ఒక అద్దం. అద్దంలో జిన్నా, అంటే విశాలమూ, వివిధమూ అయిపోయిన జిన్నా. వెడల్పూ పొడుగూ విస్తరించి మరీ రసాస్యమూ, మరీ ప్రకటితము అయిపోయిన జిన్నా.
జిన్నా గొప్పవాడు. కోటు గుండీలు పెట్టుకుంటున్నాడు. ‘పోర్టికోలో’ కారు ఆగింది. ఆ కారుమీద జిన్నా తన గృహావరణం దాటి వీధిలోకి వెళతాడు. పత్రికా విలేఖరులూ, అనుయూయులూ, భక్తులూ, రాజకీయవేత్తలూ, పోర్టికో స్తంభాన్ని ఆనుకుని నుంచున్నారు. ఆతృతతో, నమ్రతతో నుంచున్నారు. తన్ను దర్శించటానికి వచ్చారు. అవి రంజాన్ రోజులు కాబట్టి! తన్ను దర్శించడంలో మహత్తు వుంది. ఒక జగత్తు వుంది. తాను కోటు గుండీలు పెట్టుకునే సామాన్య ప్రాణి కాడు. తాను వారిలో అవ్యక్తంగా వున్న ఒక ఆశ. తన వ్యక్తతలో వాళ్ళందరూ మడతలు పడిపోయిన ఒక అవ్యక్తత.
తానొక రూపం కాదు. ఒక చిత్రం కాదు. ఒక విచిత్రం కాదు. తానొక పెద్దవయస్సు. తానొక పెద్ద భావం. మనసు కండరాలకన్నా కోటు గుండీలకన్నా పెద్దది. గొప్పది. ఆ మనస్సు తనలో వుంది. ఆ మనస్సు తనలో పెద్ద కాంతిలా వుంది. ఆ మనస్సు పరమాణువులా, ఆ పరమాణువు వుంది. తనచుట్టూ వలయాలు కల్పించుకుంటూ శక్తినీ, కదలికనీ ప్రేరేపిసుంది. ఆ కదలికలో కోటి మనస్సులలో వుండే కోటి పరమాణువుల్ని తాకుతుంది. తన మనస్సు రథికుడు. ఆ మనస్సు సృష్టించిన భావం ఒక రథం. ఆ రథాన్ని తాను నడిపిస్తున్నాడు. మహమ్మదీయులందరూ ఆ రథచక్రాలకి కట్టబడి వున్నారు. ఆ రథం అతివేగంతో నడుస్తుంది. వేగం రథంతో నడవలేదు. పంజాబ్, సింధు, బెలూచిస్తాన్, బెంగాల్, అస్సాం భూములమీద ఆ రథం నడుస్తుంది. ఆ చప్పుడుకి కాబూరు కైబరు కనుమలు ప్రతిధ్వనిస్తాయి. కైలాసం మీద మహేశ్వరుడికి బదులుగా ‘అల్లా’ని తాను ప్రతిష్ఠిస్తాడు. తన రథం వెనక మహమ్మదీయులందరూ వస్తారు. ఎందుకు వస్తారో వారికి తెలియదు. తెలిసికుంటే ఎవరూ ఏవిషయం ఏమీ చేయరు. అజ్ఞానం క్రియకీ కర్మకీ కారణం. జ్ఞానం సమాధికీ విధానానికి కారణం. ఆ అజ్ఞానాన్ని తను భద్రంగా కాపాడుతాడు. ఆ అజ్ఞానాన్ని తను భ్రమలతో, ఆశలతో పోషిస్తాడు.
తన మనస్సు తన భావాన్ని నిజానికి నమ్మలేదు. తనలో వుండే అధికార వాంఛ నిజానికి ఆ భావాన్ని తయారు చేసి ఇతరుల్ని నమ్మమంది. తానే నమ్మినట్టుగా నమ్మించింది. తాను నమ్మినట్టుగా వుండిపోవడం వలన ఒక్కొక్కసారి తాను నమ్మేశాడు. అలా నమ్మకపోతే పదికోట్ల జండాలమీద పదికోట్ల అర్థచంద్రరేఖ లెగరవు. పదికోట్లమంది యొక్క ఇరవైకోట్ల కళ్ళల్లోని భక్తినీ, విశ్వాసాన్నీ తాను చూరగొనలేడు. తనకే కాదు, స్వార్థం అందరికీ వుంటుంది. హిట్లర్, చర్చిల్, నెహ్రూ, గాంధీ – అందరికీ వుంటుందనుకున్నాడు జిన్నా. గాంధీ, నెహ్రూ తనలాగే అద్దంలో చూసుకుంటారు. సంతృప్తి పడతారు. తన స్వార్థం గొప్పది. తన స్వార్థం పవిత్రమైనది. తన స్వార్థం లేనిదే తాను ఏమీ కాడు. తాను ఏమీ కాకపోతే ముస్లిం జగత్తు అంతా ఏమీ కాదు. అర్థం లేనిదై పోతుంది. ఆకృతిలేనిదై పోతుంది. ఆశలేనిదై పోతుంది. అబద్ధమై పోతుంది. ఆవిరైపోతుంది.
జిన్నా కోటు గుండీలు పెట్టుకున్నాడు. పోర్టికోలోకి వచ్చాడు. జనం పాయలుగా విచ్చిపోయారు. జనం మిణుగురుల్లా ముడుచుకుపోయారు. నీటిమీద వేసిన తారాజువ్వలా జిన్నా ముందుకు సాగిపోయాడు. పైన అనంతమైన ఆకాశం వుంది. కింద ఎక్కడికో పరచుకున్న భూమి వుంది.
జిన్నా ఆకాశం అంచుకీ, భూమి చివరికీ వ్యాపించాడు. జిన్నాలో ‘అధికారం’ గాలిలో కలసి చెట్లల్లో పచ్చదనంగా మబ్బులలోని నీలిమలా అయిపోయింది. దూరంగా వేలకొలది మహమ్మదీయులు తన కారు చూసి చేయెత్తి సలాము చేశారు. వాళ్ళ కళ్ళు తనని చూడగానే జిగేలుమని మెరిశాయి. వాళ్ళ కళ్ళు ప్రకాశించాయి. వాళ్ళ కళ్ళు ఎర్రపడ్డాయి. వాళ్ళలోని తన భావం విద్యుత్తుతో చేసిన కొరడాలాగ ఒక చరుపు చరిచింది. వాళ్ళు పరిసరాల్నీ, నీతినీ దేహాన్నీ సర్వాన్నీ మరిచిపోయారు. వాళ్ళు తన ‘భావం’ అయిపోయారు. వాళ్ళు జలపాతం వంటి తన భావంతో మోదబడ్డారు. కల్లు వంటి తన భావంతో నింపబడ్డారు. కత్తులూ కర్రలూ పైకి తీశారు. జిన్నా కారు వీధిమలుపు తిర్గింది. తన వెనక కోటి మనస్సులు మలుపు తిరిగాయి. యావత్తు దేశం యొక్క భవిష్యత్తు మలుపు తిరిగింది.