అతను వస్తున్నాడు. లత చిగురుపట్టింది. మొదటి పువ్వు పూసింది.
అతను వస్తున్నాడు. అతనితోటి మబ్బులు వస్తున్నాయి. మబ్బుల వెనక రాక్షసులు దాక్కున్నారు.
నక్షత్రం రాలిపోయిన రాత్రి –
అతను వచ్చాడు. అతని గుండె మీద రాక్షసుల మొదటి గోటి గీత – ఎర్రని చార.
“నన్ను కాపాడగలవా?” అన్నాడతను.
“ఓ” అంది లత.
“అయితే నీ దగ్గరున్న మణిప్రవాళం ఇవ్వు.”
“నా దగ్గర లేదు”
“అయితే – ”
“ఇంకోటి ఇస్తాను”
ఆమె ఏదో ఇచ్చింది. రక్తపుచార కనపడలేదు. అతను నవ్వాడు. ఎప్పటిలాగే వెన్నెల…
కొన్నాళ్ళు గడిచాయి. అతను వచ్చాడు. ఈసారి అతని గుండె మీద రెండు ఎర్రని చారలు. అతను కొంచెం వడలాడు.
“నన్ను కాపాడగలవా?” అన్నాడతను.
“ఓ” అంది లత.
“అయితే నీదగ్గరున్న మణిప్రవాళం ఇవ్వు.”
“నా దగ్గర లేదు”
“మరి – ”
“ఇంకోటి ఇస్తాను”
ఆమె ఏమిటో ఇచ్చింది. రక్తపుచారలు కనపడలేదు. అతను నవ్వాడు. కాని ఆ నవ్వులో నీరసం వుంది.
లత రెండవ పువ్వు తొడిగింది. అతని కోసం చూసింది. రాత్రీ పగలూ ‘ప్రియా’ అని పిలిచింది. ఆ పిలుపుకి ఆకాశపు అంచున ఒక రెల్లు రాలిపడింది.
అతను వచ్చాడు. ఈసారి గుండె అంతా రక్తం. ఎర్రని మడుగులాగా వుంది. అతని వెనుక నల్లటి మబ్బులు. నల్లని మబ్బుల వెనక రాక్షసుల వికటాట్టహాసాలు.
“నన్ను బ్రతికించు. నన్ను చంపేస్తున్నారు” అన్నాడతను.
“ఏం చెయ్యను నేను?” ఏడ్చింది లత. మూడవ పువ్వుతో సహా.
“మణిప్రవాళం ఇవ్వు”
“లేదు”
“ఉంది. నాకు తెలుసును”
“దానిమీద నాకు అధికారం లేదు”
“అయితేనేం – మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానుగా.”
లత ఊగిపోయింది. బాధ పడింది. విహ్వలించింది. కళ్ళు తెరిచి జాలిగా ఇలా అంది: “నా పెద్దల అభిమానం నా వాళ్ళ అనురాగం అన్నీ పోతాయి. నా వాళ్ళు నాకు కాకుండా పోతారు…”
“వాళ్ళందర్నీ వొదిలెయ్యి”
“వదలలేను”
“అయితే మరి…”
“ఇంకోటి ఇస్తాను”
“లాభం లేదు”
ఈసారి అతని కళ్ళల్లో చీకటి. అతని పెదవుల పైన చీకటి. నిర్దయ లాంటి చావు లాంటి చీకటి.
“వెళ్ళిరానా?” అన్నాడు. అతని స్వరం సన్నగా మెలికలు తిరిగి చీకట్లో గిలగిలలాడింది. గుండె నుండి కారే రక్తాలు పిండుకుంటూ అతను వెళ్ళిపోయాడు. అతని వెనక మబ్బులరచుకుంటూ, రాక్షసులరుచుంటూ వెళ్ళిపోయారు.
లత ఏడుస్తూ కూలబడింది. మూర్ఛ పోయింది.