ఆర్ యూ రెడీ?

అటు తర్వాత లావణ్య కొన్నిసార్లు హైద్రాబాదు వచ్చింది. కాని వాసును కలుసుకోడానికి ప్రయత్నించలేదు. వాసు ఎంతగా అడిగినా ఆ అవకాశం ఇవ్వలేదు. ఛాటింగ్, ఈ-మెయిల్ ద్వారా మాత్రమే మాట్లాడేది. ‘ఇహ లాభం లేదు. ధైర్యం చేసి, తెగిస్తేనే తనకు లావణ్య దక్కేది.’ అనుకొన్నాడు. ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చి మనస్సును స్థిరం చేసుకున్నాడు.

ఉదయం పది గంటలు. తలుపు కొట్టిన చప్పుడైతే చదువుతున్న పుస్తకాన్ని మూసేసి తలుపు తెరిచింది లావణ్య. ఎదురుగా హాస్టెల్ వార్డెన్ నిలబడిఉంది.

“నిన్ను కలవటానికి ఎవరో వచ్చారు. కింద హాల్లో కూర్చున్నాడు” అని చెప్పి వార్డెన్ వెళ్ళిపోయింది.

హడావుడిగా మెట్లు దిగుతూ కిందకు చూసింది లావణ్య. ఆశ్చర్యం! హాల్లో సొఫాలో ఎదో మాగజైన్ తిరగేస్తూ కూర్చుని ఉన్నాడు వాసు. సంతోషం, సందేహం కలగల్సి లావణ్య వెళ్ళి వాసుని పలకరించింది.

“హలో వాసు! వైజాగ్ ఎప్పుడు రావడం?” అడుగుతుంటే గొంతులో తడబాటు.

“ఇదిగో పొద్దున్నే గోదావరిలో. నేరుగా నీ దగ్గరకొస్తున్నాను” జవాబిచ్చాడు వాసు.

“మరి బ్రేక్ ఫాస్ట్ చేశావా?”

“ఇంకా లేదు. నీకు రెండు గంటలు టైం ఉంటే మనం అలా బయటికి వెళ్దాం. వీలవుతుందా?” వాసు గొంతులో అభ్యర్థన.

ఇద్దరూ కలిసి బయటికొచ్చారు. మధ్యలో ఒక హోటల్లో వాసు టిఫిన్ చేస్తే అంతకుముందే హాస్టల్ మెస్ లో బ్రేక్ ఫాస్ట్ చేసిన లావణ్య కాఫీ మాత్రం తాగింది.

“నీతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడాలి. ఏదైనా పార్క్‌కి వెడదామా?” అడిగాడు వాసు.

పార్క్ బదులు బీచ్ అయితే బాగుంటుందని ప్రపోజ్ చేసింది లావణ్య. ఇసుకలో నడుస్తూ దూరంగా వెళ్ళి కూర్చున్నారు. వాసు దేన్ని గురించి మాట్లాడుతాడో అంచనా వేయడం ఏమంత కష్టం కాలేదు లావణ్యకి. కాని ఎలా మొదలెడతాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నది. ఆమె గుండె దడ హెచ్చటం తెలుస్తూనే ఉంది. వాసు గొంతు సరిచేసుకొని మాట్లాడం మొదలెట్టాదు.

“నీకు ఈ పాటికి నేను చెప్పబోయేది తెలిసే ఉంటుంది. అయినా చెప్పటం నా ధర్మం. ఈ సంగతి మా అమ్మానాన్నకీ తెలుసు. లావణ్యా! ఐ లవ్ యూ! నువ్వేమంటావు? ” చెప్పాడు వాసు.

బదులుగా చిరునవ్వు నవ్వింది లావణ్య.

“ఇంతవరకు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియటం లేదు. ప్లీజ్! నీ అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పెయ్. నువ్వు నో అన్నా నేను బెదిరిపోయేంత పిరికిపందను కాను” తడబడకుండా ఒక్కొక్క పదమే మాట్లాడాడు వాసు.

“సరే. ముందు నేను ఏమనుకుంటున్నానని నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఆ తర్వాత నేను చెప్పుతాను” ప్రతిసవాలు విసిరింది లావణ్య.

“నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా మరోప్రశ్న వేసి నన్ను ఇంకా ఇరకాటంలో పెట్టకు. సరే. నువ్వేమనుకుంటున్నావంటే… నేనంటే నీకిష్టమేనని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. డు యు లవ్ మీ?”

లావణ్య వెంటనే ఏమి మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నది.

“ప్లీజ్ లావణ్య! నీవు నోరువిప్పి మాట్లాడనంత వరకు నేను నీ గురించి అనుకుంటున్నవన్నీ నా ఊహాలే. నన్ను ఈ సంకటం నుండి బయట పడెయ్” అనునయిస్తూ మాట్లాడాడు.

వాసు కళ్ళలోకి చూస్తూ ‘ఐ లైక్ యూ టూ, వాసూ!” అంది లావణ్య.

‘యస్ ‘ అంటూ వాసు చెంగున గాల్లోకి లేచి వెంటనే ఎదో గుర్తుకు వచ్చిన వాడిలా మళ్ళీ ఇసుకలో కూర్చున్నాడు.

“కాని ఒక సందేహం లావణ్య! నేను ఇంతకాలం ఎంత గింజుకున్నా నువ్వు కనీసం ఒక్కసారి నన్ను కలవలేదెందుకు?” అమాయకంగా అడిగాడు.

“అమ్మాయిగా నా జాగ్రత్తలో నేనుండాలి కాబట్టి నిన్ను కావాలనే కలవలేదు” సముద్రపు గాలికి నుదుటిపై పడుతున్న ముంగురులను పైకి తోస్తూ అంది లావణ్య.

“జాగ్రత్తా? అంటే నేనేమన్నా ప్రమాదకరమైన వ్యక్తిలా అగుపడ్డానా?” ఠపీమని అడిగాడు వాసు.

“నిన్ను తప్పు పడుతున్నాని అపార్థం చేసుకోకు, వాసూ! నే చెప్పేదేమిటంటే, ఒక అమ్మాయి నచ్చిన అబ్బాయితో పబ్బులు, డిన్నర్లు అంటు తిరిగిందనుకో. కాని ఏ బలహీన క్షణంలోనో, తాగిన మత్తులోనో అమ్మాయి, అబ్బాయి ఒకటయ్యారనుకో. దానివల్ల కొన్ని అనర్థాలు జరగవచ్చు” నిర్మలంగా అంది.

“అనర్థాలా? ఒకరికొకరు నచ్చిన తర్వాత అనర్థాలేంటీ?”

“అంతా సవ్యంగా జరిగితే, అబ్బాయి సక్రమంగా ఆలోచిస్తే ఫర్వాలేదు. కాని, అభ్యంతరం చెప్పకుండానే లొంగిపోయిన అమ్మాయిని ‘లూజ్ కారెక్టర్’ అని అపార్థం చేసుకునే మనస్తత్వమే అబ్బాయికి ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోడానికి అతను వెనుకంజ వేయవచ్చు.”

“దటీజ్ టూమచ్! నువ్వు అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నావు.”

“నేను మామూలుగానే మాట్లాడుతున్నాను, వాసూ! అమ్మాయి తిరుగుబోతు అని అలాంటి అనుభవం కొరకే ఎదురుచూస్తున్నదని, అందుకే ‘నో’ అని చెప్పకుండా లొంగిపోయిందని అనుమానం రావడం మానవ సహజం. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకొకుండా వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం సేఫ్ అనుకోవచ్చు.” నెమ్మదిగా మాట్లాడింది లావణ్య.

అదే విషయాన్ని కొనసాగిస్తున్న లావణ్యను చూసి వాసుకు అనుమానమొచ్చింది. ‘కొంపదీసి లావణ్య…’ అలాంటి ఆలోచన రాగానే వాసు వెన్ను జలదరించింది. వెంటనే, ‘ఛీ! లావణ్య లాంటి అమ్మాయి అలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోదు. అంతవరకు వెళ్ళడం అసంభవం’ అని సర్ది చెప్పుకున్నాడు.

“నో లావణ్యా! అనవసరమైన మాటల్తో మన సమయాన్ని వృధా చేస్తున్నావు. మన మధ్య ఆ సమస్య లేదు కాబట్టి మనం ఇంకేమైనా మాట్లాడుకుందాం” అంటూ జోక్ చేస్తూ లావణ్య దగ్గరగా జరిగాడు.

“నేను చెప్పే దాంట్లో నిజం ఎంతో ఉంది వాసూ! ప్రేమ గుడ్డిదంటారు. ఆ మాట పాతకాలానికైతే సరిగ్గా సరిపోతుందేమో. కాని ఈ కాలంలో అమ్మాయిలు ప్రేమ విషయంలో కాస్త తెలివిగా మసలుకోవాలని నా అభిప్రాయం. లేకుంటే తెలివితక్కువతనం వల్ల నష్టపొయేది అమ్మాయే.” లావణ్య ముఖంలో మథన ప్రస్ఫుటమవుతున్నది.

“నువ్వు ఈ విషయం గురించి ఇంత విపరీతంగా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటంలేదు. నిన్నెవరైనా అలా చేశారా? అయినా ఈరోజుల్లో అలాంటి అవాంతరాలు రాకుండా నివారించుకోడానికి ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి” అసహనంగా అన్నాడు వాసు.

“నిజమే! ఇది నా గురించో కాదో తర్వాత. కాని, ఎంత జాగ్రత్తగా ఉన్న తెలియకుండా ఏదైనా తప్పు దొర్లొచ్చు కదా. అప్పుడు నష్టం ఎవరికి?”

వాసు లాలనగా లావణ్య భుజం మీద చెయ్యివేస్తూ, “ఇలాంటివన్నీ ఇప్పుడు మామూలే అయిపోతున్నాయి. కాలం మారుతున్నది. అభిప్రాయాల్లో, విలువల్లో మార్పులొస్తున్నాయి” అన్నాడు. కానీ మనసులో గజిబిజిగా ఆలోచనలు కందిరీగల్లా ముసురుకున్నాయి.

“నేనేమి మార్పును వ్యతిరేకించడం లేదు. కాని, నే చెప్పోచ్చేదేమిటంటే, అబ్బాయిలు మారుతున్న కాలపు స్వేచ్ఛని ఎంజాయ్ చేస్తున్నారు సరే. కానీ కానీ దాంతో వచ్చే సవాళ్ళను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది నా అనుమానం. ఆర్ యూ రెడీ ఫర్ ది చేంజ్? ఈ మధ్య నా ప్రాణ స్నేహితురాలు ఇలాంటి సమస్యతో కొట్టుమిట్టాడింది. ఎంత సరదా మనిషో అది. ఒకతన్ని ఎంతో ప్రేమించింది. అతనితో తిరిగింది. కొన్నిసార్లు కలిశారు కూడా. చివరికి తనను ప్రేమిస్తున్నాను అన్న బాయ్ ఫ్రెండ్ ‘ఇలాగే ఇంతకు ముందు ఇంకెంత మందితో తిరిగావు?’ అన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడట. చివరి నిమిషంలో ఇష్టం లేకపోయినా అబార్షన్ చేయించుకుంది తను. కానీ అతనివల్ల ఎంత కుంగిపోయిందో, మానసికంగా ఎంత దెబ్బతిందో నా ఫ్రెండ్ ను చూస్తే తెలుస్తుంది. నన్నూ ఇలాగే ఎవరో మోసం చేసి వుండుంటే ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోడానికి నువ్వు ఇంత ఉత్సాహం చూపేవాడివా? ఏ అనర్థమూ జరక్కపోయినా నాకూ ఇలాంటి అనుభవమే ఎదురై ఉండిఉంటే నువ్వు తేలిగ్గా తీసుకోగలవా?” లావణ్య గొంతు వణికింది.

వాసు మౌనంగా లేచాడు. రోడ్డు దిక్కు నడవడం మొదలెట్టాడు.

“వాసూ! ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ కం బాక్” అంటూ లావణ్య అరిచింది.

సముద్రపు హోరులో లావణ్య అరుపులు వాసుకు విని కూడా వినపడనట్టు రోడ్డు మీదికి వెళ్ళి ఆటో ఎక్కాడు.

‘నీ ఫ్రెండ్ పేరేమిటి?’ అని వాసు అడిగి ఉంటే ‘లలిత’ అని లావణ్య చెప్పుండేదేమో. కానీ ఆ వివరం అనవసరం.