నవీన్, వనజల పెళ్ళికి ముహుర్తం పెట్టుకున్నాక, రామారావు ఓ రోజు నవీన్ కి ఫోన్ చేసేడు.
“మీ పెళ్ళి అయ్యేక శారద గారు ఎక్కడుందామనుకుంటున్నారు?”
“అమ్మ మమ్మల్ని వేరే ఉండమని చెప్తోంది. సో, ఏమి చెయ్యాలో ఇంకా తేల్చుకోలేదండి.”
“ఒక్కళ్ళూ ఎంతకాలం ఉండగలరు? ఉద్యోగం చేస్తున్నారా?”
“చెయ్యట్లేదు” అన్న నవీన్ రామారావ్ ఏమి మాట్లాడుతున్నాడో ఊహించి మళ్ళీ చెప్పేడు.
“నేను మళ్ళీ పెళ్ళి చేసుకోమని చెప్తూనే ఉన్నాను. కానీ ఒప్పుకోవటం లేదు. వనజ మీ గురించి చెప్పింది. కానీ అడిగితే కోపం వస్తుందేమో అని అడగలేదు ఇప్పటిదాకా.”
రాత్రి భోజనం చేస్తుంటే శారదని అడిగేడు నవీన్ కాజువల్గా, “అమ్మా నువ్వు మమ్మల్ని పెళ్ళి అయ్యేక వేరేగా ఉండమంటున్నావ్. నువ్వు ఒక్కత్తివీ ఎంతకాలం ఉంటావ్? మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోకూడదూ?”
“మళ్ళీ మొదలు పెట్టావా? అయినా ఇప్పుడా నాకు పెళ్ళి? నీ పెళ్ళికి అత్తగారిలా తయారవుతూంటే?”
“జోకులకేం కానీ, అసలు నువ్వెందుకు మళ్ళీ పెళ్ళిచేస్కోకూడదు?”
“మీ ఆఫీసులో వనజని చూసినట్టు నాక్కూడా ఎవర్నో చూసిపెట్టావా ఏమిటి?”
“మా ఆఫీసులో కాదు కానీ ఇంకో చోట ఉన్నారు”
శారద సన్నగా ఉలిక్కిపడి నవీన్ వేపు చూస్తూ ఉండి పోయింది. ఈ నవీన్ తన చేతుల్లో పెరిగిన పిల్లాడేనా? పుట్టినప్పుడు ఈగ మీద వాలితే దాన్ని తోలుకోలేక ఏడ్చిన నవీనే? ఇప్పుడు తనకి పెళ్ళి సంబంధం వెతుకుతున్నాడు. మెల్లిగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి కుర్చీలో సర్దుకుని కూర్చుంది శారద. చాలాసేపు ఆగి అన్నాడు నవీన్ మళ్ళీ, “ఏమంటావ్?”
“అనడానికి చాలా ఉన్నాయ్ కానీ, ముందు ఎవర్ని చూసావో చెప్పు.”
“రామారావు గార్నే చేసుకోవచ్చు కదా?”
“ఈ ఐడియా నీకు వచ్చిందేనా?”
“కాదు, వనజ ముందు చెప్పింది. తర్వాత రామారావు ఫోన్ చేసి ఇన్ డైరక్ట్ గా అడిగేరు”.
“ముందు వాళ్ళ బుర్రల్లో ఈ ఐడియా పెట్టింది నువ్వేనన్న మాట.”
“అరె, అరె, కాదు. వాళ్ళే ముందు అడిగేరు. నిన్ను అడిగితే నన్ను చంపుతావేమో అని ఇప్పటి దాకా అడగలేదు. కానీ రామారావు ఫోన్ చేసారు మళ్ళీ. అంచేత అడుగుతున్నాను. నీకిష్టం లేకపోతే లేదని చెప్పేయడమే. నాదేం లేదు. కానీ ఎంతకాలం ఒక్కత్తివీ ఉంటావు? ఆలోచించు మరి.” చెప్పేడు.
“నేను ఆలోచించుకోవాల్రా,” అని లేచిపోయింది శారద. నవీన్ మనసు కలుక్కుమంది అమ్మ అన్నం తినకుండా లేచిపోయినందుకు.
ఈ పక్కన పడుకున్న శారదకి నిద్ర పట్టలేదు చాలాసేపు. నవీన్ చెప్పింది నిజమే కదా? రేపు వాడు, వనజా ఒకే ఊళ్ళో ఉన్నా తనకి ఏదైనా అయితే ఎవరు చూస్తారు? ఇప్పటిదాకా అయితే కాళ్ళూ చేతులూ ఆడుతున్నాయి కనక ఏమీ ప్రోబ్లెం రాలేదు. కానీ ముందుముందో?
వారం రోజులు పోయేక మళ్ళీ వనజని వెంటపెట్టుకుని నవీన్ పెళ్ళి ప్రస్తావన తెచ్చేడు. ఈ సారి కాస్త ఓపిగ్గా విని ఆఖరికి అంది శారద. “సరే మీ ఇద్దరి ఆలోచన్లు బాగానే ఉన్నాయ్. నేను రామారావు గారితో మాట్లాడాను ఫోను మీద. మీ ఇద్దరి పెళ్ళయ్యేదాకా దీని గురించి మాట్లాడొద్దు. ఆ తర్వాత నేనే చెప్తాను. ఓకే?”
నవీన్ పెళ్ళయ్యేక చేతిలో కవర్ పెడుతూ “బెస్టాఫ్ లక్. ఇద్దరూ సుఖంగా ఉండండి” అంది నవ్వుతూ శారద.
“ఇదేమిటమ్మా నువ్వు కూడా నాకు ప్రెజెంట్ ఇస్తున్నావ్?” అడిగేడు నవీన్ కవర్ చింపుతూ. లోపల అలాస్కా క్రూయిజ్ కి ఇద్దరికి టిక్కట్లున్నాయి.
“ఇద్దరికీ హనీమూన్ టిక్కట్లు. క్షేమంగా వెళ్ళి రండి,” చెప్పింది శారద. హనీమూన్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి కదిపేడు శారదని పెళ్ళి గురించి. “మీరు హనీమూన్ నుంచి వచ్చేసరికి నేను చెప్తాను అన్నీ రడీగా ఉంటాయ్ అప్పటికి” అంది శారద. రామారావ్ సన్నగా నవ్వేడు.
రెండు వారాలు గిర్రున తిరిగేయి. రోజూ కాకపోయినా హనీమూన్లో ఉన్నంతకాలం నవీన్ శారదతో మాట్లాడుతూనే ఉన్నాడు ఫోను మీద. వెనక్కి వచ్చే టైముకి ఎయిర్ పోర్టుకి రాలేను, టాక్సీ లో వచ్చేయండి అని చెప్పింది శారద. ఇంటికొచ్చిన నవీన్, వనజ తలుపు తట్టేరు. సమాధానం లేదు. కాస్సేప్పోయేక తమ దగ్గిరున్న తాళంతో తలుపు తీసి లోపలకెళ్ళేరు. శారద బయటికెళ్ళిందేమో అనుకుని హాల్లోకి వచ్చేసరికి టేబిల్ మీద ఒక కవర్ కనిపించింది. తన పేరుమీద ఉండటంతో నవీన్ విప్పి చదవడం మొదలుపెట్టేడు.
“ఒరే నాన్నా, నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి పెట్టాను. నా భాధ్యత తీరి సంతోషంగా ఉంది. నన్ను పెళ్ళి చేసుకోమన్నావు బాగానే ఉంది. ఈ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి నాకు మనసొప్పటంలేదు. నిజమే, రామారావు గారు అప్పుడు కేవలం క్లాస్‌మేటే కాదు. ఆ తర్వాత కూడా ఆయన గురించి ఆలోచించలేదని అబద్ధమూ చెప్పను. కానీ కొన్ని ఊహలు అలా ఊహలుగా ఉండిపోతేనే మంచిది. వేరేవరో కాకుండా రామారావు గారు కాబట్టే అసలు ఈ విషయం గురించి ఇంతైనా ఆలోచించాను. ఆసరా కావాలంటే పెళ్ళే చేసుకోవాలా? ఒకింట్లోనే ఉండాలా? ఎలా ఆలోచించినా నాకు పెళ్ళి అవసరం శారీరకంగానూ మానసికంగానూ కూడా కనిపించడం లేదు. ఈ విషయాలన్నీ రామారావు గారితో మాట్లాడాను. ఆయన అర్థం చేసుకున్నారు కూడా. రిటైర్ కాగానే ఫ్లోరిడాకే వచ్చి ఉంటానన్నారు. మీరు ఉన్న ఊళ్ళోనే మీకు దగ్గరగా, మీకు అడ్డం కాకుండా ఉందామనే అనుకున్నాము ఎవరి జీవితాలు వారు బతుకుతూ, అవసరానికి తోడుగా ఉంటూ.
ఆలోచించగా నాకు తోచిన, నాకు కనిపించిన మార్గాన్ని నేను ఎన్నుకుంటున్నాను. మదర్ థెరిస్సా వాళ్ళు సౌత్ అమెరికాలో భూకంపం భాదితులకి సహాయం కోసం అడుగుతున్నారు. నేను వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. నా అభిప్రాయం మీకు నచ్చకపోవచ్చు. కానీ చేసేదేముంది? ఎవరి క్రాస్ వాళ్ళు మోసుకోవల్సిందే కదా? నేను ఏదో బాధపడిపోతున్నాను అనే ఐడియా రానివ్వకు. నేను సుఖంగా ఉన్నాను. ఇక్కడ నా అవసరం ఎంతకాలమో తెలియదు. పని తీరగానే తిరిగివస్తాను. ఈ ఉత్తరం మీరు చదివేసరికి నేను బ్రెజిల్ లో ఉంటాను. వీలు చూసుకుని ఈ కింద నెంబరుకు ఫోన్ చెయ్యి. వనజకీ నీకు నా ఆశీస్సులు. రామారావుగార్కి నమస్కారాలు చెప్పు. – అమ్మ ”
ఉత్తరం పూర్తి చేసిన నవీన్ కేసి చూస్తూ వనజ అంది, “ఏమైంది నవీన్? ఆర్యూ ఆల్రైట్?”
కళ్ళు తుడుచుకుంటూ, మౌనంగా ఉత్తరం వనజకిచ్చి మొహం కడుక్కోటానికి లేచేడు నవీన్.