నిశ్శబ్దం నీడల్లో - ముకుందరామారావు కవిత్వం
గత పదిహేనుఏళ్ళల్లో (యల్లపు) ముకుంద రామారావు ఐదు స్వీయ కవితా సంకలనాలు ప్రచురించారు. నాలుగు తెలుగులోను, తన మొదటి రెండు తెలుగు సంకలనాలనూ కలిపి ఒక కన్నడ అనువాదంగానూ. ప్రస్తుత సంకలనం ఆ రకంగా చూస్తే ఐదవది. 2008 లో ‘నాకు తెలియని నే నెవరో’ అనే కవితాసంకలనం వచ్చింది. 2004 నవంబర్ ‘ఎవరున్నా లేకున్నా’ అనే సంకలనం వచ్చింది. ముకుంద రామారావు గారి మొట్టమొదటి కవితాసంకలనం, ‘వలస పోయిన మందహాసం.’ ఈ పుస్తకం ఈమాటలో ఈ-పుస్తకంగా ఉంది. దీనికి చేకూరి రామారావు (చేరా) పరిచయవాక్యాలు రాసారు.

నిశ్శబ్దం నీడల్లో (2009)
ముకుంద రామారావు
రూ.50.00, $5.00
చేరా ఇలా అన్నారు: “తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపథ్యం. ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు. సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు. భావుకుడిలా అనుభవిస్తారు. కవిలా వ్యక్తీకరిస్తారు. ఈయన కవిత్వంలో స్పష్టాస్పష్టత ఉంటుంది. పారదర్శకత్వం ఉండదు. పదౌచిత్యం ఉంటుంది. పదాడంబరత ఉండదు. భావగాంభీర్యం ఉంటుంది. భాష క్లిష్టత ఉండదు. పురోగమన శీలత ఉంటుంది. సిద్ధాంత వలయం ఉండదు. అనుభవం వైయక్తికమే. దృక్పథం విశ్వజనీనం.”
ఈ కొత్త సంకలనంలో 52 పేజీల్లో 40 కవితలున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో ఈ సంకలనం ముద్రించారు. ఈ కారణం మూలంగానేనేమో, పుస్తకం అచ్చొత్తించడంలో హడావుడి లేదు. (19 వ శతాబ్దపు మలార్మె (Stephane Mallarme) అనే ప్రముఖ ఫ్రెంచ్ సింబలిస్ట్ కవికి, కవితలు అచ్చు వెయ్యడం గురించి కొన్ని దృఢమైన అభిప్రాయలున్నాయి. వాటిలో ముఖ్యమైన ఒక అభిప్రాయం: పద్యంలో అచ్చైన మాటలు ఎంత ముఖ్యమో, పేజీలో తెల్లజాగాలుకూడా అంతే ముఖ్యం, అని! అంటే, అచ్చైన పద్యం పేజీలో కనిపించే పద్ధతి పద్యానికి చాలాముఖ్యం. మలార్మే ప్రేరణో, ఐశ్వర్యమో తెలియదు కాని, ఈ మధ్యకాలంలో తెలుగు కవితా సంకలనాలు అత్యంత సుందరంగా అచ్చయి వస్తున్నాయి.)
ఇక ఈ సంకలనంలో కవితల గురించి:
ముకుంద రామారావు ఆయన ఉద్దేశంలో కవిత్వమంటే ఏమిటో ప్రారంభంలోనే చెప్పారు: “మనస్సు, హృదయం, ఆత్మల సమ్మిశ్రితం బహుశా కవిత్వం” అని. అంతే కాదు. తాను కవిత్వం రాయడానికి ప్రేరణ కూడా చెప్పారు: “కవిత్వ తలుపులు తెరిచి, నేను చూసే విశాలవిశ్వాన్ని, అనంతాకాశాన్ని, అద్భుతమైన ప్రకృతిని, అర్థం కాని ప్రపంచాన్ని, అందరితో పంచుకోవాలన్న తపన నాచేత రాయిస్తూనే ఉంది. నాలోని అసంతృప్తికి కారణాల్ని నా లోపలి ప్రపంచంలో వెదుకుతూనే ఉన్నాను. నన్ను తెలిపే పదాలేవో నిశ్శబ్దంలోనే కలిసిపోతున్నాయేమో.”
‘కవిత్వమంటే’ అన్న కవితలో కవిత్వమంటే ఏమిటో:
దోసిట్లో సముద్రం
ఆటుపోట్ల అల
సూర్యకాంతిలో తడిసి మెరిసే
మేఘాల పగుళ్ళలోంచి
చీల్చుకొస్తున్న వెలుగు
ఆకాశానికి వేలాడుతున్న చెట్టు
ఏరుకున్న ఫలక్షణం
తనలో తానే మాటాడుకుంటూ
వీచి విస్తరించే గాలి స్పర్శ
పూలగుండెల్లో ప్రశ్నల మంట
ప్రకృతి కిటికీ
ప్రపంచ గురువు
కళ్ళు కడిగే కన్నీరు
అశరీర ఆత్మ నిశ్శబ్ద నాట్యం
ఇదీ అదని ఎన్ని చెప్పినా
జీవితాన్ని మరణాన్ని
పూర్తిగా విప్పి చెప్పలేనట్లు
కవిత్వం.
అని రాసారు. ఈ కవితలో స్పస్టాస్పష్టతలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి.
‘కూతురు’ అన్న కవిత చూడండి:
ఉదయమెప్పుడూ
కూతురులానే
అందంగా ఆప్యాయంగా వస్తుంది
ఉన్నంతసేపూ ఉత్సాహమే
చీకటిలో కూరుకుపోకుండా
చంద్రుణ్ణి వెలిగించి
లోనున్న నక్షత్రాల్ని బయటకు లాగి
కనుమరుగవుతున్న సూర్యుడిలా
తనింటికి అమ్మాయి
గుర్తు చేసే ఎన్నెన్నో
జాడల్ని వదిలి.
చిన్నచిన్న మాటలు, అందమైన భావన. మొదటి చరణంలో పదాల పొందిక మరీ వాచ్యంగా ఉన్నది.

నిశ్శబ్దం నీడల్లో (2009)
ముకుందరామారావు
నిశిత ప్రచురణలు
ఈయన చాలా కవితల్లో కొన్ని కొన్ని చరణాలు గద్యంలా ఉంటాయి. కానీ, చటుక్కున కవిత మధ్యలోనో, ఆఖర్నో ఒకే ఒక్క చరణం పాఠకుణ్ణి కట్టేస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఒక్క చరణం కోసమే మిగిలిన పదాలన్నీ దానిచుట్టూ అల్లుతున్నారా అన్న అనుమానం రాక మానదు. ఇస్మాయిల్ గారి కవితా పద్ధతిని అనుకరించే చాలామందిలో ఈ లోపం కనిపిస్తుంది. అయితే, వచ్చిన చిక్కల్లా, ఇస్మాయిల్ గారు చిన్న చిన్న మాటలు వాడినా ఆయన భావుకత పరిథి చాలా విస్తృతమైనది. దానితోడు, ఆయన కవితల్లో ఒకరకమైన సంగీత ధ్వని ఉంది.
తెరిపి, నిద్రాట, సున్నితం అన్న కవితల్లో ముఖ్య పాత్రలు పాప, అమ్మ, నాన్న. అలాగని వాచ్యంగా కవి చెప్పడు, అది పాఠకుడికి తట్టే భావన. తెరిపి అన్న కవితలో రైల్లో తల్లి, తల్లి ఒడిలో నిద్రపోతున్న పాప. ఎదురుగుండా కవి. తల్లి ఒడిలో పాప నిద్రపోవడం; రైలు కుదుపుకి తల్లి కూడా కునుకు తీయడం - ఈ దృశ్యం రైల్లో అందరం సాధారణంగా చూసేదే! కాని, ముకుందరామారావుగారికి వచ్చిన అనుభవం, కవి అనుభవం.
నీటిలో మెరుస్తున్న చంద్రుడిలా
పాప నవ్వు
మబ్బులతో ఆడుతున్న సూర్యుడిలా
విప్పీవిప్పని గుండ్రటి కళ్ళు.
పిల్లడు ఎప్పుడు నిద్రలేచినా అది ఆనందమే, అమ్మకి!
రాత్రి వాడు నిద్రలేస్తే
ఉదయంలా ఉంటుందామెకి
ఒక్కోమారు భళ్ళున తెల్లవారేలోగా
ఎన్ని ఉదయాలో
సర్వసాధారణమయిన అనుభవాలకి ముకుందరామారావు తళుకు పెట్టడం చేస్తారు. ఆఖరిగా ఏకాంత సమూహం అన్న కవిత చూడండి.
సూర్యోదయం
సమూహం వేపు తోస్తే
సూర్యస్తమయం
ఏకాంతం వేపు
ఏకాంతం
ఆకాశాన్ని హత్తుకుంటున్న వంతెన
అద్దంలో కనబడని రూపం
సమూహం
దేనికీ బెదరని నది
చూసీ చూదని అద్దం
అలవాటయిన దారిలో
కాళ్ళకీ కళ్ళే.
ఈ సంకలనంలో ఈ కవిత పాఠకుణ్ణి ఆలోచింప జేసే కవిత. భావగాంభీర్యత ఉన్నకవిత.
ఈ మధ్య ఒక హైదరాబాద్ పుస్తక ప్రచురణ సంస్థలో పని చేసే పెద్దమనిషి ఒకాయన అన్నారు - ఈ సంవత్సరంలో (2010 ఇంకా సగం మిగిలే ఉన్నది!) తెలుగులో దాదాపు రెండువందలయాభై కవితా సంకలనాలు వచ్చాయట! ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఆయన అతిశయోక్తిగా అన్నాడేమో అని నా అనుమానం. ఎందుకంటే, అసలు తెలుగు చదవడమే అంతంత మాత్రంగా వున్నదని గోల పెడుతున్న ఈ రోజుల్లో, ఈ కవితా సంకలనాలు ఎందుకోసం ఎవరికోసం అన్న ప్రశ్న వేధించక మానదు. వచన కవితలు చదివే జనం పెరిగారా? వచన కవితలు రాసే జనం పెరిగారా?
నాకు తెలిసిన ఒక వామ పక్షమేధావి ఒకసారి ఇలా అన్నాడు. వచన కవిత్వం రావడం మూలంగా కవిత్వం ‘డెమాక్రటైజ్’ అయ్యింది అని. కవిత్వం డెమాక్రటైజ్ అవడం అంటే ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
(నిశ్శబ్దం నీడల్లో (కవిత్వం) - ముకుంద రామారావు (డిసెంబర్ 2009). నిశిత ప్రచురణలు, హైదరాబాద్. 64 పేజీలు, వెల 50 రూపాయలు / 5 డాలర్లు
దొరికేచోటు: Nishita Publications, 1-7-23/1 Street No. 8, Near ISI, Habsiguda, Hyderabad 500 007.)
rama bharadwaj అభిప్రాయం:
July 2, 2010 1:47 am
ముకుందరామారావు పదచిత్రాలు అనేకమ్ కొత్తగా ఉన్నాయి. అఫ్సర్ రాసిన కవిత కన్నా మెరుగైన భావాలున్నా మరెందుకనో వేలూరి వారు అక్కడ ఒక గొంతుకతో మాట్లాడి ముకుందరామారావు కవిత్వమ్ పుస్తకాన్ని సమీక్షచేసేటప్పటికి మాత్రమ్ ఒకలాంటి ఉదాశీన వైఖరిని తన సమీక్షలో చూపించారు.ఇదీ సమీక్ష చేసేవారి వైఖరి. అయినా పుస్తక సమీక్షలు తెలుగున వాస్తవంగా ఉన్నదెప్పుడు గనకా??
రమ.
K.V.S. Ramarao అభిప్రాయం:
July 3, 2010 3:23 am
ఈ పుస్తకం గాని, అఫ్సర్ గారి పుస్తకం గాని చదవకుండా రాస్తున్న అభిప్రాయం ఇది. లైలా, రమ గార్ల అభిప్రాయాలు ఆలోచనా ప్రేరకాలుగా వుండటంతో చేస్తున్న సాహసం.
మామూలుగానే కవిత్వసమీక్ష కత్తిమీద సాము. దానికితోడు ఒక పత్రిక సంపాదకుడే ఆడా పాడా మద్దెల కొట్టా అన్నట్టు ఆ పని కూడ చెయ్యాల్సి వస్తే ఇంకా ఇరకాటం. చూస్తూ చూస్తూ బాగా తెలిసిన, తమ పత్రికలో అప్పుడప్పుడు ప్రచురిస్తున్న, ఒకరి రచనని గురించి ప్రతికూలంగా రాయలేరు. అదీ లబ్ధప్రతిష్టులైన రచయితలైతే మరీ కష్టం. ఇది వేలూరి గారి పరిస్థితిలో ఉన్న చిక్కు.
సాధారణంగా సమీక్షకులెవరైనా ఒక రచన గురించి వాళ్లు చూపే సానుభూతికీ, వాళ్లకీ ఆ రచయితకీ ఉన్న ప్రత్యక్ష పరిచయానికీ డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ (తెలుగు పదాలు గుర్తుకురావటం లేదు) ఉంటుందని నా నమ్మకం. అలాటి సానుకూల సమీక్షలలో నిజంగా అర్హమయే రచనలే లేవని అనలేము కాని చాలా తక్కువ శాతం. ఐతే మనకు తెలియని వారి గురించి ప్రతికూలంగా అనటం తేలిక కదా !
ఎవరి మెప్పు కోసమో రాసే కవిత్వంలో నిజాయితీ ఉండదని, అది మాటలపేర్పు తప్ప గుండెలోతుల్లోంచి వచ్చి పాఠకుల మనసు పొరల్ని స్పృశించలేదనీ చెప్పనక్కర్లేదు. అలా ఇతరుల మెప్పుని ఆశించకుండా రాసుకోగలిగే అవకాశం విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో వుండే రచయితలు/కవులకు ఉన్నది. (అలాటి వారిని ప్రోత్సహించటం “ఈమాట” మౌలికలక్ష్యాల్లో ముఖ్యమైందని మరోమారు గుర్తుచేసుకోవటం తప్పుకాకపోవచ్చు.) ఐతే దురదృష్టం ఏమిటంటే చాలా కొద్దిమంది - మహా ఐతే ఒక చేతి వేళ్లమీద లెక్కించగలిగేంత మంది - మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు భౌతికంగా ఎక్కడ వున్నా వాళ్ల ఊహాపాఠకులు మాత్రం ఆంధ్రదేశంలో వున్నవారే. వాళ్ల మెప్పు కోసమే వీళ్ల రాతలు. అందుకే వీటికీ అక్కడ వస్తున్న వాటికీ తేడా వుండదు - అవే భావాలు, అవే బాధలు, అవే విప్లవాలు, అవే వాదాలు, అవే నినాదాలు. అదే గాడి, అదే వేడి, అదే ఒరవడి.
ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ.
ఆంధ్రదేశంలో వున్న వారు ఎలాగూ రమ గారు చెప్పిన నానా ఒత్తిళ్ల మూలాన ఈ పని చెయ్యలేరు. ఆ ఒత్తిళ్లు లేని వారు వాటిని కొనితెచ్చుకుని మరీ ఆ ఇరుకు పరిధుల్లోనే గుడుగుడు కుంచాలాడుకోవటం ఎందుకు? విశాల ప్రపంచాన్ని చూశాక కూడ రచనలు చెయ్యబోయేసరికి ఉష్ట్ర దృష్టి ఎందుకు?
ravikiran timmireddy అభిప్రాయం:
July 3, 2010 7:42 pm
ఎవరి మెప్పుకోసవో వ్రాసే రాతల్లో నిజాయితీ ఉండదని రామారావు గారన్న మాట బాగుంది. నిజాయితీ లేని కవిత్వం ఎలాగు పాఠకులని మనసులకి చేరదు. కానీ ఆ నిజాయితీ ఒక్క అమెరికాంధ్రులకు మాత్రవే ఎందుకు పరిమితవో నాకు తెలీదు. అసలాంధ్రుల కవిత్వవంతా కూడా ఆది కవి నన్నయ్య ముందునుంచి అమెరికాంధ్రులవరకునిజాయితీ లేని కవిత్వవేనా? ఎవరో కల తెలుసుకున్న ఐదు అంతకు తక్కువ తెలివిమంతులు తప్ప. కానీ ఈమాట ఐదుగురు అంతకు తక్కువ రచయితలతో నడవదు కదా. పాపం ఈమాట కూడా నిజాయితీ లేని రచనల్ని ప్రచురిస్తూ ఎలాగో ఒకలా గడిపేస్తున్నదనమాట.
ఇక్కడొక మాట. రచనలు చేస్తున్న, చదువుతున్న అమెరికాంధ్రులంతా కూడా ఖచ్చితంగా అమెరికాలో మొదటితరవే. రెండో తరపు ఆంధ్రులు తెలుగు మాట్లాడటవేగొప్ప. సగంకన్నా ఎక్కువ బతుకుని తెలుగూర్లలో గడిపిన ఆ అనుభవాలే కదా ఈరోజు అమెరికాంధ్రుల రచనలకి ఆలంబన. ఇప్పటికీ ఇడ్లీ, దోశలు, పచ్చళ్ళు, ఆవకాయలు, కంచం నిండా అన్నాలు, వారానికి కనీసం రెండు మూడు సార్లు ఇంటితో (తెలుగు దేశంతో) ఫోను పలకరింపులు. అక్కడి ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇక్కడ పెరిగే, తరిగే రక్తపోటులు, భౌతికంగా ఇక్కడున్నా, మనసంతా అక్కడే కదా. మరి రచయితలు, వారి రచనలు, వారి పాఠకులు మాత్రం వేరుగా ఎలా? అమెరికాంధ్రులైతేనేం, అసలాంధ్రులైతేనేవి. ఇద్దరూ ఒకటే కదా. రామా రావు గారేమో అవన్నీ నిజాయితీ లేని రచనలు అంటున్నారు ఒక్క ఐదు అంతకు తక్కువ రచయితలవి తప్ప. మరా ఐదు అంతకు తక్కువున్న ఆ రచయితలు అమెరికాలో తమ చుట్టూ ఏ గోడలు కట్టుకున్నారో, ఏ గూట్లో దాక్కున్నారో ఆ గాడినీ, వేడిని, వాదాల్ని, విప్లవాల్ని వదిలించుకుని ఏ తత్వాన్ని ఒంటపట్టించుకున్నారో?ఇంతకీ ఆ ఐదు అంతకు తక్కువైన ఆ రచయితలు ఎవరో, ఎవరో ఆ గాడి వదిలిన కవులు, ఎవరో ఆ చక్కని నిజాయితీపరులు, ఎవరో వారు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
rama bharadwaj అభిప్రాయం:
July 4, 2010 2:04 am
కెవీయస్ రామారావుగారూ!! ఆధునిక తెలుగు కవిత్వాన్ని గురించిన చర్చ ఎప్పుడు జరిగినా సరిగ్గా ఇలాంటి సందర్భాలే నడుస్తూ వచ్చాయి. అది ఒక లాంటి రక్షణ అకవులకి. ఎవరి కవిత్వానికి చెల్లుబాటు కాదని భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దబాయించి బతకాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక పుస్తకం అచ్చు అయ్యాకా ఆ రచయిత తన పుస్తకాన్ని భుజానికెత్తుకుని తిరిగే కార్యక్రమానికి దిగకూడదు. తానే పూనుకుని చర్చల్లో తలదూర్చడం చేయకూడదు. అలా ఎవరు చేసినా వాళ్ళకి వాళ్ళ రచనల మీద నమ్మకం లేదనే అర్ధం.
ఇకపోతే ఇటీవల వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్న “ప్రాంతీయ - కుల -మత” చైతన్యాలు ఉత్తరోత్తరా పురోగతికి నిదర్శనమా?? తిరోగతికి నిదర్శనమా?? అన్నది సాహిత్య రంగంలో జరూరుగా చర్చ చేయాల్సిన విషయమే!! రచయితలుంటారు. కవులుంటారు. వారు ప్రభవించిన ప్రాంతాలు ఒక పార్శం మాత్రమే!! అది ఆ రచయితని గురించిన బయోగ్రఫీలో ముఖ్యమైన విషయం అవుతుందేగానీ వారి సాహిత్యానికి ఉద్దేశ్యించిన లక్ష్యాలకి.. ప్రయోజనాలకీ కాకూడదు. మంచి కవులు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కావలసిన వాళ్ళే కావాలి. రచయితలకి ప్రాంతీయ తత్వాలు ముఖ్యం కావడం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ రచయితకి ఆ ప్రాంతం వలన ఏదైనా ఆశించే ఒక ప్రయోజనం ఉంటేనే!! అలాంటి ఆశ ఉన్న ఉత్తర క్షణమే అతడిలోని మీరన్న “నిజాయితీ” చచ్చిందనే అర్ధం.
రవికిరణ్ సవాలు నన్నయ్య నాటి నించీ ఐతే ఆనాటికి ఈ స్థితి లేదు గనక మీరన్న మాటలో ఇలాంటి అర్ధాలు రావనీ…. మీరు ఇటీవలి కాలాన్ని మాత్రమే లక్ష్యంగా మాత్లాడేరనీ అతనికి తెలియనంతటి నిగూఢమైన విషయమేమీ కాదు నిజానికి. రాజకీయ పరిభాష కి వీళ్ళంతా ఎంతగా అలవాటు పడిపోయేరంటే అది వీళ్లకి ఒక ఊత కర్ర లాంటిది. ఆ పరిభాష లేనిదే వీళ్ళు నడవలేరివాళ. అదుకే వీళ్ల ఆలోచనా పరిధీ..తద్వారా వీళ్ళ సాహిత్య పరిధీ విస్తరించలేకపోవడం.
రమ.
సంచారి అభిప్రాయం:
July 4, 2010 8:42 am
I am disturbed by the implication of KVS Ramarao that the reviewer is biased. This amounts to ascribing ulterior non-literary motives to the reviewer and a personal insult. One may disagree with the reviewer, but one can not start by questioning the honesty of the review, but none of the above comments seem to even acknowledge that the reviewer honestly spoke his mind. This is more unfortunate given the stature of people who posted these comments.
ravikiran timmireddy అభిప్రాయం:
July 4, 2010 10:18 pm
రమా గారు,
మీ అభిప్రాయవేదో మీరు చెప్పండి. మాకు నచ్చినా నచ్చకపోయినా అది మీ అభిప్రాయంగా దానికొక గౌరవవుంటుంది. మా అభిప్రాయాలు చదివి మా గురించి చిలక జ్యోస్యాలు చెప్పకండి. మా అభిప్రాయం మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఓపికుంటే సహేతుకంగా చెప్పండి, ఓపిక లేకపోతే నచ్చలేదని చెప్పండి. తప్పులెన్నండి, తప్పులేదు. కానీ మీ విమర్శకోసం మా గురించి మీ చిలకజ్యోస్యపు సైకో ఎనాలసిస్ మాత్రం చెయ్యకండి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
rama bharadwaj అభిప్రాయం:
July 5, 2010 12:38 am
చిలక జోస్యాలు చెప్పడంలో నేను ప్రవీణురాలిని కాను. నేను తప్పులూ ఎన్నడమ్ లేదు. విమర్శని స్వీకరించడం చాలా మందికి కస్టం అని నేనెరుగుదుమను. నేను చెప్పింది సాహిత్య పరిధి విస్తృతం గురించి. దానికి నేను ప్రత్యేకంగా ఋజువులు చూపించడం ఎందుకూ?? కవిత్వం పేరుతో అచ్చవుతున్న అనేకమైన సరుకులు ఉదాహరణలే!! వాదనకోసం ఎంతైనా వాదన చేయవచ్చును . దానికేం?? కానీ ప్రతిభావంతమైన సాహితీ కారులు కావాలీ అంటే మాత్రం వాళ్ళకి వాళ్ళు వ్యక్తీకరించుకున్న ప్రక్రియ మీద మంచి పట్టూ..భాష మీద అధికారమూ సాహిత్యం మీద సాధికారతా అన్నవి తప్పనిసరి. ఇవాళ్టి చాలా మంది కవి నామధేయులకి అవి పూజ్యమన్నది తేటతెల్లమైన సంగతి. వారి వారి రచనలే ఇందుకు సాక్ష్యం. ఇందుకు ఎలాంటి జోస్యాలూ అవసరం లేదు. ఇకపోతే మాకు ఇవన్నీ కవితలే అని అనేవాళ్ళూ ఉంటారు. అనడానికి ఇబ్బందిలేని కాలంలో ఉన్నవాళ్ళం గనక. వాళ్ళు “ప్రజాస్వామ్యబధ్ధమైన వచన కవితా ప్రక్రియ” లోని సులువులని వాడుకుని అదంతా కవిత్వమనే దబాయించి బతకొచ్చు. కాదని అంటే వాళ్ల కులాలనీ వాళ్ళ వర్గాలనీ వాళ్ళ మతాలనీ ఎత్తి చూపి బెదిరించే పనికి పూనుకోనూ వచ్చు. ఇవాళ చాలా సందర్భాల్లో తరుచూ జరిగేది ఇదే!! అందువల్లనే ఇంత అసహనం కన్పిస్తూంది విమర్శ మీద.
రామారావుగారి సర్వే చాలామటుకు నిజం కవిత్వ పుస్తకాలకి సంబంధించి.
తెలుగున కవిత్వం అమ్ముడయ్యే సరుకు కాదు. కవులు స్వంతంగా అచ్చు వేసుకుని నలుగురికీ పంచిపెట్టుకుని తాము కవులమని చెప్పుకుందికి ఉపయోగపడే ఒక సాధనం. అయితే ఈ పరిస్థితి కవిత్వానికే కాదు కధలకీ ఉంది. నిజానికి సాహిత్యం మీద ఆసక్తితో పుస్తకాలు కొనేది చాలావరకూ పాత సాహిత్యాన్నే!! కొద్దోగొప్పో పుస్తకాలు కొనేవాళ్ళు ఎక్కువగా భారత రామాయణాలనీ ప్రబంధాలనీ కొంటుంటారు. వీటికే మార్కెట్ ఉందని ప్రచురణకర్తలూ అంటారు.
ఆధునిక కవిత్వం లో అమ్ముడయ్యే కొద్ది పుస్తకాలు ఉండొచ్చునేమో!! కానీ ఎక్కువ పుస్తకాల పరిస్థితి ఇదే!! మరి ఇలాంటప్పుడు దీనిని గురించిన వాస్తవాల ప్రస్తావన ఎవరన్నా చేస్తే…ఆ చేసిన వాళ్ళని కాదు తప్పుపట్టాల్సింది. వాస్తవాలని గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. అబ్బే నిజాలు ఉంటే ఉండనీండి మీరు మటుకు మాట్లాడకండి అని అనేలాంటి ప్రయత్నాలు చర్చించే వాళ్ళ నోరుమూయించడం..కోసం చేసేవి.అవి ఎలా చేసినా. ఎవరెవరు చేసినా.. ఏయే కారణాలకి చేసినా..!అందువలన లాభపడే వాళ్ళూ ఎవరైనా.. నస్టం ఎప్పుడూ సాహిత్యానికే జరిగింది. జరుగుతూ ఉంది.
రమ.
Srinivas Vuruputuri అభిప్రాయం:
July 5, 2010 7:58 am
“కవిత్వం ‘డెమాక్రటైజ్’ అయ్యింది” అన్నమాటకి నేను “కవితావస్తువు ప్రజల జీవితానికీ, ఆశయాకాంక్షలకీ చేరువయ్యిం”దని అర్థం చెప్పుకున్నాను. కాదా?
ఆ వ్యాఖ్యా, అంతకు ముందు పారాగ్రాఫూ మీ సమీక్షలో ఇమిడినట్లు నాకనిపించలేదు.
Kayala Nagendra అభిప్రాయం:
July 14, 2010 9:20 am
ఈమాట.కామ్ చూసాను. చాలా బాగుంది. తెలుగులొ ఒక మంచి పత్రికను అందిస్తున్న మీకు ధన్యవాదాలు.