ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం

మరొక్క విషయం. వియత్నాం యుద్ధం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారంచేసిన పాటకురాలు జోన్‌ బాయెజ్‌ (Joan Baez) అమెరికన్‌ జెండాని నిరసిస్తూ (అంటే వియత్నాం యుద్ధానికి వ్యతిరేకత స్ఫురింప జేస్తూ) ఒకసారి “ఏ జాతీయ జెండా కూడా ఆ జాతి ప్రజల ఆశయాలన్నింటికీ, అభిలాషలన్నింటికీ అద్దంపట్టదు”, అని అన్నది! How True! ఇంతకన్నా క్లుప్తంగా బల్లేల్లా పొడిచే మాటలు ఏ నిరసన వాదుల రాతల్లోనూ నాకు కనిపించలేదు.

యెప్పుడూ ఓ నల్లబూటు కాలు నా శరీరాన్ని
కసిదీరా నలుపుతూ వుంటుంది

…అణిగిపోయిన దేహాలకు
నలిగిపోయిన కంఠాలకు
పోరాటం సిద్ధాంతంకాదు, బతుకు పాఠం!

…నేనే నిషిద్ధమయ్యాను
నా అడుగులకింద గూఢచారి నేత్రాలు మొలిచాయి.

మళ్ళీ మరొకసారి ఖాదర్‌ మొహియుద్దీన్‌ రాసిన ‘పుట్టుమచ్చ’ కవిత గుర్తుకొస్తుంది. ఇదే వరసలో సాగిన ఈ కవిత చివరకి, హైటెక్‌, డాలర్లు… అణిచివేయబడటం (?) ఇంకా… ఇంకా… ఆక్రోశం. ఇంతకీ ఇక్కడ ఎవరు ఎవర్ని అణిచేసారు? ఈ అణిచివేయబడడం ఒక్క మైనారిటీలకే పరిమితమయ్యిందా? పేదరికానికి, మైనారిటీ మెజారిటీ మతాల ఊసుంటుందా? ఇలాంటి ‘అసంబద్ధపు’ ప్రశ్నలు వెయ్యటం బహుశా అమాయకత్వం కింద జమ కట్టబడవచ్చు. చివరకి కవి ఎదురుతిరిగి నిలబడి,

నువ్వు చూపిస్తున్న దృశ్యంలో
బొమ్మని కాను
నువ్వు ఆడిస్తున్న మాటల్లో
మాటని కాను
నేను మాట్లాడిస్తానింక
నేను ఆడిస్తానింక
నీ కాగితాల మీటలకింద నిక్కీ
నీలిగి కూర్చుండను…

అని హామీ/శపథం చేస్తాడు. ఎవరికి ఎదురుతిరిగి నిలబడడం? ‘ఎప్పుడో పుట్టిన ప్రశ్నకి సానబడుతున్నా, కొడవలికిలా’ అని ముగుస్తుంది కవిత.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది పెద్ద గందరగోళం కవిత. వచన కవిత్వాన్ని చదివించేవి, చదువరిని కదిలించేవి, కవితకి ప్రాణం పోసి బతికించేవీ మెటఫర్లు. మోటుబడ్డ కవితావస్తువు మంచి మంచి మెటఫర్లనన్నింటినీ అణగదొక్కేస్తుంది. ఇది నిజం. సరిగ్గా అదే జరిగింది, ఈ కవితలో!

ఒక చారిత్రక సత్యం ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉన్నది. అధికారంలో కొచ్చిన వర్గం ఏదో మిషతో వేలకువేల గొంతుల్ని మాట్లాడకముందే నొక్కేసి, నిర్దాక్షిణ్యంగా మిలియన్లకొద్దీ పౌరులని హత్యలు చేసిన ఖ్యాతి, ఘనత ఒక్క స్టాలిన్‌కి, ఒక్క మావోకీ దక్కింది. ‘అణిచివేయబడ్డ వర్గాల’ ప్రతినిధులుగా కవితలు రాస్తున్నామనుకునే కవులు, రష్యన్‌ కవయిత్రి ఆనా ఆఖ్మతోవా రాసిన ‘రెక్వీమ్‌’ (requiem) అనే కవిత కాస్త జాగ్రత్తగా చదివితే, రాజకీయ కవితలు, ఉద్యమ కవితలూ ఇంత గందరగోళంగా రాయవలసిన అవసరం ఉండదనిపించక మానదు.

వీరుడి శిరస్సు (2007) అనే కవిత: ఇది యుద్ధవ్యతిరేక కవిత. ఫుట్ నోట్‌లో అంకిత వాక్యం ఆధారంగా ఈ కవిత బహుశా ఇరాక్‌ తో అమెరికా చేస్తున్న అన్యాయపు/అధర్మపు యుద్ధానికి నిరసనగా రాసిందై ఉండాలి. ఇది కేవలం నినాద కవిత. నినాదాలకి ప్రాధాన్యం ఇచ్చే కవితల్లో మాటలు చెప్పే బొమ్మలు నినాదాలకింద మరుగునపడిపోతాయి. కేకలు మాత్రమే మిగులుతాయి. (ఈ మధ్యకాలంలో కేకలు, నినాదాలూ లేని యుద్ధవ్యతిరేక కవిత, ఒకేఒక్క కవిత – నా దృష్టిలోకి వచ్చిన వచన కవిత – జి. యస్‌. రామ్మోహన్‌ రాసిన ‘యుద్ధప్రభుస్తోత్రము’ ఈ కవిత మీద వ్యాఖ్య ఈమాట, సెప్టెంబర్‌ 2005 లో మూడు ప్రార్థన పద్యాలు అన్న వ్యాసంలో చూడవచ్చు.)

తెలిసిందికదా, ఇప్పుడు
వొక ధిక్కారం తలతెగనరకడానికి
ఎన్నెన్ని వ్యూహాలు కావాలి!
తెగిపడిన ప్రతితలా సలసల మరిగే నెత్తుటి నగరం!

…ఎన్ని వందల అబద్ధాల కట్టుకథల కళేబరాలు!
ఎన్ని అబద్ధాలు కలిస్తే వొక చరిత్ర!

…యిక యీ క్షణం
వొట్టి మొండేలు కూడా
వీరవిహారం చేస్తాయి నెత్తుటి కడవలై!

‘అయం స రశనోత్కర్షీ…’ తో మొదలై, ‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ వరకూ, ఎటువంటి పోరాటాలయితేనేం? పోరాటాల్లో ఆహుతైన వాళ్ళ చేతులు, తలలూ, కళేబరాలూ మానవ చరిత్ర కథనం చెబుతూనే ఉన్నాయి. నినాదాలు యుద్ధాలు ఆపవని చరిత్ర పదేపదే ఘోషిస్తోంది.

సరే, ఇక్కడ నా ఘోష ఆపి, అఫ్సర్ కవితల్లోకి చూద్దాం. సగమే గుర్తు (2004) అన్న కవిత చూడండి; ఈ కవిత కాస్త romanticగా మొదలై, అనుభూతి కవితగా నడిచి ఆఖరికొచ్చేసరికి ఆవేదన చురుక్కుమనిపిస్తుంది.

వానది వొక్కటే భాష ఎప్పుడయినా ఎక్కడయినా,
దేహం పిచ్చుక సందేహ స్నానాలకింద తడుస్తూ.
…ఎన్ని వానలు చూళ్ళేదని?

మళ్ళీ
ప్రతీ వానా అదేదో కొత్త వాసనేస్తుంది.

…వాన
ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు
జొన్న రొట్టె కాలుతోంది
వొంటి సెగలమీద.

పై కవితని ‘కురిసీ కురవని’ (1997) అనే పాత కవితతో పోల్చి చూడండి:

ఎప్పటిదో తెలీదు
ఎక్కడిదో తెలీదు
తడపటం వొక్కటే తెలుసు వానకి.
లోపలంతా రాత్రంతా
అలా
కురుస్తూనే వున్నా ఏకధారగా.


మధ్యాన్నపు వానా ఇలాగే
కురిసీ కురవని నీ లాగే
గాయకుడు మిగిల్చి వెళ్ళిన
నిశ్శబ్దంలా వాన
సుదీర్ఘ మౌనానికి నిరసనలా వాన
ఇవాళింక తెరిపి లేదు.

ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం. చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం అఫ్సర్ కి తెలుసు. పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇస్తాడు. ఇది అఫ్సర్ ప్రత్యేకత. ‘మూడో యామం’ (2001) కవిత ఒక మంచి ఉదాహరణ.