ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం


ఊరి చివర – అఫ్సర్
పాలపిట్ట ప్రచురణలు
2009, రూ.60.00, $5.00

ఊరి చివర సంకలనంలో వాయులీనమవుతూ… (2004) అన్న కవితలో ఈ క్రింది భాగం చూడండి! కవిత చివర ఇచ్చిన ఫుట్‌నోట్‌లో వివరాలు విపులంగా లేకపోవడం ఈ కవితకి జరిగిన అన్యాయం. ఈ పొరపాటు జరగటానికి సంపాదకుల అశ్రద్ధే కారణం! (ఫుట్‌నోట్‌లో ఉన్న వాక్యం: రెండు సింఫనీల అనుభవం తర్వాత, వొకటి మామూలుగానే బీతోవెన్‌ది. రెండోది స్టాలిన్‌ కాలంలో వసంత మేఘాలమీదుగా తిరుగుబాటుని ఆలపించిన వయొలిన్‌). అయినప్పటికీ, స్టాలిన్‌ కాలంలో రష్యాలో జరిగిన హత్యాకాండ, అణిచివేతలూ చదివినవాళ్ళకి కవితలో ప్రతీకలు స్పష్టంగానే ప్రతిధ్వనిస్తాయి. వయొలినిస్టు ఎవరో తెలిస్తే సహృదయుడైన పాఠకుడికి సానుభూతి పెరుగుతుంది.

…ఊపిరి పీల్చడం నేరం
తన చప్పుళ్ళే మార్మోగాలి
చెట్లకి చిగుళ్ళు పుడితే నేరం
ఆకుపచ్చగా విచ్చుకుంటే శిక్ష
చివరికన్నీ ఇనపగజ్జెలే కావాలి
ఇనప మాటలే వినిపించాలి.
అప్పుడింక
వయిలిన్‌ లోపలి ధ్యానానికి
తుఫాను భాష నేర్పుతుంది
దాచేసిన నిప్పంతా
సుతిమెత్తని కమాను లోంచి
కార్చిచ్చు.

ఎంత చిత్రం! వయొలిన్‌ నినాదమవుతుంది, వసంతం గర్జిస్తుంది, అంటూ ముగుస్తుంది కవిత. ఒకరొట్టె ముక్కా, ఒక దేశమూ, వొక షెహనాయీ… ( 2009?) అన్న కవితలో,

ఆమె కడుపులో (ఫాతిమా) ఏమూలనో దాచేసుకున్న శోకాన్ని
నువ్వు షెహనాయీ లోకి వొంపినప్పుడు అనుకున్నానా,
నాచరిత్ర అంతా వొకానొక కలత కల అని!…

ఇది చిక్కని కవిత. ఈ కవితలో మహ్మద్‌ ప్రవక్త, ఫాతిమా కల, కర్బలా కథని బిస్మిల్లాఖాన్‌ షెహనాయీలోకి అనువదించడం ఫుట్ నోట్లుగా సూచించారు. కాని వీటి పూర్వకథలు, కవితలో వాడిన ప్రతీకల ప్రత్యేకత తెలిస్తే ఈ కవితని అనుభవించడం సులువు. సంకలన సంపాదకుడు ఈ పని చెయ్యకపోవడం మరొక పెద్ద లోపం!

ఇక, తెలంగాణా 2002 అన్న కవిత గురించి. ఇది ఒక విచిత్రమైన కథనం. తెలంగాణా/ఆత్మ కథనం. సంకలనంలో ఏకైక బృహత్కవిత. పదహారు ఖండికలలో అసంతృప్తుల రాజకీయం, మైనారిటీ పేదల ఆవేదన, ‘అణచబడ్డ’ వర్గాల ఆర్తనాదం, పోరాటం, తిరుగుబాటు వగైరా… అంతాకలిపి మొత్తం పదకొండు పేజీలు. ఇంతకుముందు ఈ సంకలనాన్ని సమీక్షించిన వాళ్ళు, విమర్శలు రాసిన వాళ్ళూ అంతగా ఈ కవిత ప్రస్తావన తెచ్చినట్టు లేదు. ‘ఇది రాజకీయ కవిత, మనకెందుకులే’, అన్న ధోరణిలో కప్పదాటు వేశారేమో!

ఈ కవిత గురించి నాలుగు మాటలు చెప్పకుండా నేను ఉండలేను.

…కదులుతున్న ఉరికంబం నా వూరు
సూర్యచంద్రుల్ని వెలేసిన ఆకాశం నాది
నా చుట్టూ వీచే గాలి
అధికారం విసిరిన ఉచ్చు…
మదరసాల పిట్టగోడలు
సిగ్గుపడ్డాయి నేను పుట్టినప్పుడు
యే భాషలో యేడ్వాలో నవ్వాలో తెలియక
కళ్ళకింద నవ్వుని పాతుకుంది అమ్మ.

ఇలా సాగిపోతుంది ఈ బృహత్కవిత. పోలిక సమంజసం కాకపోయినా, ఎందుకో ఖాదర్‌ మొహియుద్దీన్‌ పుట్టుమచ్చ (1991) గుర్తుకొస్తుంది. ఆ కవితలో ఇంతకన్నా సూటిగా తన పుట్టుక గురించి చెప్పుకున్నాడు: ‘ఒక కట్టుకథ నన్ను కాటేసింది… / నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైవుంది నాపేరు…’ అంటూ!

…అన్నీ నానోటిదాకా వచ్చి వెళ్ళిపోయినవే మరి!
చివరికి స్వాతంత్ర్యం కూడా!
…నా పంద్రాగస్టు
ఓ పెద్ద వెక్కిరింత కాదూ!
అందరూ మూడురంగుల జెండాలు ఎగరేస్తున్నప్పుడు
నా శరీరం ఒకేఒక్క నెత్తుటిరంగులో తలకిందులుగా
ఏ చెట్టుకొమ్మకో వేలాడుతోంది

ఆగస్టు 15ని, స్వాతంత్ర్యదినోత్సవాలని, జాతీయ జెండానీ వామపక్షీయులు – ముఖ్యంగా అతివాద వర్గం వాళ్ళు, ఒకానొకప్పుడు దిగంబర కవులూ ఇంతకన్నా ఎక్కువగా హేళన చేస్తూ రాసారు. ఇది అతివాద రాజకీయ కవులని ప్రేతంలా వెంటాడుతున్న ఒక పాత ఫేషన్‌. అఫ్సర్ లాంటి తాత్విక కవుల కలం నుంచి ఇలా రావటం చిరాకేస్తుంది. సరిగ్గా ఇదే ధోరణిలో వలస సంకలనం లో ‘అగర్‌ జిందో మె హై,’ (25 అగస్టు 1998) అన్న కవిత. నిస్సహాయధోరణిలో మొదలై, మధ్యలో అఫ్సర్ – బ్రాండ్‌ ప్రతీకలతో ఉత్తేజపరిచి, చివరికి స్వాతంత్ర్యదినం, జాతీయజెండా, జాతీయగీతాలంటూ విషాద పరిహాసంతో ముగుస్తుంది. చూడండి:

ఏ చరిత్రాలేని నాకు
చరిత్ర పాఠం ఒక్కటే భలే ఇష్టం;

…నాచరిత్ర పాఠాలు
నేను మరిచిపోలేని పాత పద్యాలు…

…గొంతులోనే విరిగిపోయిన పద్యపాదాలమీద
ఎప్పుడూ మోగే బెత్తానికి నాచరిత్ర తెలుసు
నాకాలం తెలుసు
నేను తెలుసు

ఈ పద్యంలో
చివరిపాదం వొట్టి కొయ్యకాలేనని తెలుసు
వందేమాతరంలో నాతరం లేదు
జణగణమణలో నా జనం లేరు
కంఠనాళాలు తెగిపోయాయి
నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు
నా ఆగస్టు పదిహేనులన్నీ
స్మశాన వాటికలోనే…

ఆఖరి చరణంలో మొదటి రెండు లైనులతో పద్యం అంతం అయితే ఎంత అందంగా ఉండేదో ఆలోచించండి. ‘వందేమాతరం’ లో తన తరం లేకపోవడం, ‘జనగణమణ’లో తన జనం లేకపోవడం; ఇటువంటి వాక్యాలు చదవడానికి – అమెరికన్‌ భాషలో చెప్పాలంటే – ‘క్యూట్’ గా ఉంటాయి, అంతే! పుస్తకాలమ్ముకునేవాడు వెనక అట్టమీద బ్లర్బ్ లో వేసుకోడానికి పనికి రావచ్చు.