శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము

వాదిరాజు: దాసకూటము లానే ఆ కాలంలో వ్యాసకూటము అని ఉండేది. వ్యాసతీర్థులకు సమకాలీనులయిన వాదిరాజయతి వ్యాసతీర్థులను తమ గురువుగా భావించాడు. అద్వైతమతావలంబులలో శంకరుడు, విశిష్ఠాద్వైతములో వేదాంతదేశికన్, ద్వైతములో వాదిరాజయతి మతప్రచారకులు మాత్రమే కాదు, గొప్ప కవులు కూడ. వాదిరాజయతి వంద సంవత్సరాలకు పైనే జీవించాడు. ఉడుపిలోని అష్ట మఠములు రెండు సంవత్సరాలకు ఒక మారు శ్రీకృష్ణుని పూజ చేస్తారు. ఈ నియమాన్ని ప్రతిపాదించినది వాదిరాజతీర్థులే. ఒకప్పుడు రాయల కోశాగారం కొద్దిగా సన్నగిల్లిందట. దానినెలా నింపాలనే ఆలోచనలో రాయలు సతమతమవుతుండగా, ఆ సమయంలో వాదిరాజతీర్థులు విజయనగరానికి వచ్చాడట. రాయలు అతడిని ఆహ్వానించి తన చింతను తెలిపాడట. ఒక నాడు వాదిరాజు రాయలను వాలీసుగ్రీవుల గుహగా పేరుపడ్డ ఒక గుహకు తీసికొని వెళ్ళాడట. అక్కడ ఉండే ఒక రాతిపైన తన కమండలమునుండి నీళ్ళు చల్లగా అది విరిగి అందులో ఒక పెద్ద భోషాణము బయటపడిందనీ, దాని నిండా బంగారం, రత్నాలు, ఆభరణాలు ఉన్నాయనీ, రాజు యతికి వాటిని ప్రసాదించగా వాదిరాజు నాకు ఇవి అక్కరలేదని వాలి పూజించిన విష్ణు విగ్రహాన్ని, సుగ్రీవుడు పూజించిన రాములవారి విగ్రహాన్ని మాత్రం తీసికొన్నాడనీ కథనం. ఆ తరువాత రాయలు ఉడుపికి వెళ్ళి అక్కడి ఆలయాల పునరుద్ధరణకు సహాయపడ్డాడు.

వాదిరాజయతి వ్రాసిన స్తోత్రాలు ఈనాటికీ భక్తులు చదువుతున్నారు. ద్వైత సాంప్రదాయములో ఇతని స్తోత్రాలు లెక్కకు లేనన్ని ఉన్నాయి. ఇతడు కూడ కన్నడములో ఎన్నో పాటలు వ్రాసాడు. ఇతని లక్ష్మీ శోభానె నేడు కూడ శుక్రవారమునాడు కర్ణాటకరాజ్యములో ఇంటింటా వినబడుతుంది.

ఇతడు అశ్వధాటి వృత్తంలో వ్రాసిన దశావతారస్తుతి అత్యుత్తమమైనది. సంస్కృత వాఙ్మయంలో దేవీ అశ్వధాటి (కాళిదాసో లేక శంకరులో వ్రాసినది), వాదిరాజుల దశావతారస్తుతి, పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు వ్రాసిన రామాష్టకము మాత్రమే ఈ వృత్తంలో దొరుకుతున్నాయి. అదే విధంగా మాఘుని శిశుపాలవధకు పోటీగా వ్రాసిన రుక్మిణీశవిజయ కావ్యం కూడా చక్కనిది. రుక్మిణీశవిజయమునుండి ఒక పద్యము –

హారాధార-మనోహరోరసి లసన్నారీ-కరాంభోరుహం
తారాధీశముఖం విహర-సరసోదార-స్ఫురద్వీక్షణం
స్మేరం చారు-పరార్ఘ్య-భూషణ-ధరం కారుణ్య-వారాంనిధిం
కారాగారమిదం విహాయ భజ తం ధారాధర-శ్యామలం

– వాదిరాజయతి, రుక్మిణీశవిజయము, 9.21

(హారాలచే శోభిల్లు మనోహరమైన వక్షఃస్థలము గలవాడు, అందమైన యువతుల కరకమలములచే ప్రకాశించువాడు, చంద్రముఖుడు, క్రీడలచే అలరారు మంచి చూపులు గలవాడు, సుందరమైన ఆభరణాలను ధరించినవాడు, దయాసాగరుడు, నీలమేఘశ్యాముడు ఐన ఆ కృష్ణుని ఈ కారాగారమువంటి దేహమును మరచి భజించుమా!)

ఈ మధ్యగా శ్రీకృష్ణదేవరాయల రాజ్యాభిషేక మహోత్సవాలు జరిగినప్పుడు కొందరు రాయల బిరుదు కన్నడరాజ్యరమారమణుడైనా అతడు కన్నడ సాహిత్యాన్ని ఎక్కువగా ఆదరించక తెలుగు కవులను సన్మానించాడని నిందించారు. కన్నడ సాహిత్యం తెలుగు సాహిత్యంకన్నా పాతది. నృపతుంగుని కవిరాజమార్గము నన్నయ భారతం కన్నా సుమారు వంద సంవత్సారాలకు ముందే వ్రాయబడినది. అదే విధంగా కన్నడంలోని నాగవర్మ ఛందోంబుధి కూడా. ఇంతకు ముందే కన్నడంలో హరిదాసుల భక్తి గీతాలను గురించి ముచ్చటించాను. ఇప్పుడు రాయల ఆస్థానంలోని ముగ్గురు కన్నడ కవులను పరిచయం చేస్తాను.

తిమ్మణ్ణ:
మొట్టమొదట పంపకవి కన్నడములో భారతమును విక్రమార్జునీయము అనే పేరుతో వ్రాసాడు. ఇది జైన పద్ధతులను అనుసరించి వ్రాయబడినది. ఆ తరువాత గదుగిన వీర నారాణప్ప అనే కవి కుమారవ్యాసుడు అనే పేర భారతాన్ని అందరు చక్కగా పాడుకోడానికి అనువుగా ఉండే భామినీషట్పది ఛందస్సులో రచించాడు. ఈ భామినీషట్పదికి ఆరు పాదాలు. మొదటి మూడు పాదాలవలె చివరి మూడు పాదాలు. మొదటి రెండు పాదాలలో (3, 4, 3, 4) మాత్రలు. మూడవ పాదములో (3, 4, 3, 4, 3, 4, 2) మాత్రలు. కాని కుమారవ్యాస భారతాన్ని పది పర్వములు వ్రాసి అది పూర్తికాకముందే చనిపోయాడు.

కుమారవ్యాసుడు మిగిల్చిన ఆ శేష భారతమును ముగించమని రాయలు కర్ణాటక కవిసార్వభౌమ తిమ్మణార్యుని ప్రార్థించాడు. ఆవిధంగా అతడు మిగిలిన ఎనిమిది పర్వాలను వ్రాసి ముగించాడు. ఈ భారతానికి కృష్ణరాజ భారతము అని పేరు. ఇతడు భారత రచనలో తిక్కనసోమయాజిని అనుకరించాడని చెబుతారు. అతడు కృష్ణరాయని పొగడుతూ శాంతిపర్వారంభములో వ్రాసిన ఒక పద్యము –

వర రజత హిమగిరిగళను మొద-
లెరడ నా నిర్మిసిదెనివు బే-
రెరడు జనిసివెయందు వాణీ స్తనగళను నోడి
ఇరదె నలివ విరించ నీయలి
కరుణదలి దీర్ఘాయువను వర
నరస నరపాలక కుమారక కృష్ణరాయనిగె

వర రజత హిమగిరుల రెంటిని
వఱల నే నిర్మించితిని మఱి
గిరులు రెండెటులొ యని వాణీ స్తనములను జూచి
హరుస మొందెడు బ్రహ్మ యొసగును
కరుణతో దీర్ఘాయువును వర
నరస భూపతి తనయు డగు శ్రీకృష్ణరాయనికి

మల్లణార్య: రాయల ఆస్థానములో ఉన్న మరొక కన్నడ కవి గుబ్బి మల్లణార్యుడు. ఇతడు ఒక శివకవి. భావచింతారత్న, వీరశైవామృతపురాణ అనే కావ్యాలను రచించాడు. భావచింతారత్నమునకు సత్యేంద్రచోళుని కథ అని కూడా పేరు. ఇతడు ఈ కావ్యాన్ని వార్ధకషట్పది ఛందస్సులో వ్రాసాడు. వార్ధకషట్పదికి మొదటి రెండు పాదాలలో నాలుగు పంచమాత్రలు, మూడవ పాదములో ఆరు పంచమాత్రలు. అందులోని పద్యము ఒకటి –

త్రిణయణుగం తిరుజ్ఞాని సంబంధీశ
నణియరది జినమతవిదారణగైదు ధా-
రిణియల్లి తిరుపాట పదినారు సావిరనొరెయుత కులచ్చరియగె
ప్రణవ పంచాక్షరియ మహిమెయ తిళిపె స-
ద్గుణియప్ప సత్యేంద్ర చోళ భూపన కథా
భణితెయం ద్రావిడాదొళోదిదం కన్నడది పేళ్దె నలిసె సుజనరు

(శివజ్ఞాని సంబంధీశుడు జైనమతమును నిర్మూలించి, పదహారువేల శివనామములను కులచ్చయ అనే ఆమెకు చెప్పుతూ పంచాక్షరీమంత్రపు మహిమను వివరించే సందర్భముగా తమిళములో సత్యేంద్రచోళుని కథను చెప్పాడు, దానిని నేను కన్నడములో మళ్ళీ చెబుతున్నాను.)

వీరశైవామృతమునుండి స్త్రీలను వర్ణిస్తూ ఒక పద్యము –

ఇవర నుడి యతివరర బాయ హుడి భావిస-
ల్కివర బాహుగళు సజ్జనర బేహుగళు బళి-
కివర చెల్విన తురుబు సుజ్ఞానిగళ సదాచారిగళ మనద బిరుబు
ఇవర నల్పిన దేహ వుత్తమర దాహవిం-
తివర నడెయనఘరసుగళిగివే కడెయెంబ
యువతియరు బందరా దేవదేవేశనం నోడె తమతమగె కూడె

(వారి పలుకులను విన్న యతివరులు నోరు తెరచి చూస్తున్నారు; వారి బాహువులు సజ్జనులను ఆకర్షిస్తున్నాయి; వారి సౌందర్యము జ్ఞానులను, సదాచారులను సవాలు చేస్తున్నయి; వారి కోమల శరీరాలు కామపిపాసను కల్గిస్తున్నాయి; వారి నడకలు చివరి క్షణాలు అన్నట్లు యువతులు వచ్చారు.)