ఇతరుల సంస్కృత కావ్యములు
మాలలోని దారానికి పూల సుగంధం అబ్బినట్లు కృష్ణరాయలతో పరిచయము ఉన్నవారికి కూడ కవిత్వం ప్రాప్తించిందేమో? ఏది ఏమైనా మహామంత్రి తిమ్మరసు కూడ కవియే. అగస్త్యుడు వ్రాసిన చంపూభారతానికి తిమ్మరసు వ్యాఖ్యను వ్రాసినాడు. ఆ కావ్యములో ఆశ్వాసాంత గద్యము ఇలాగుంటుంది – ఇతి శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర కర్ణాటేశ్వర శ్రీకృష్ణరాయ శిరఃప్రధాన సకలాగమ పారావారపారీణ సాళ్వతిమ్మయదండనాథ విరచితాయాం బాలభారత వ్యాఖ్యాయాం మనోహరాఖ్యాయాం పంచమ సర్గః.
తిమ్మరసు సహోదరి కృష్ణాంబికకు ముగ్గురు కొడుకులు కోన మంత్రి, అప్ప మంత్రి, గోప మంత్రి. అప్ప మంత్రి తిమ్మరసు అల్లుడు కూడ. ఈ అప్పమంత్రికి అంకిత మివ్వబడిన కావ్యమే మాదయ్యగారి మల్లన రచించిన రాజశేఖరచరిత్రము. నాదిండ్ల గోప మంత్రి కొండవీటికి అధికారిగా ఉన్నాడట. ఇతడు తెలుగులో కృష్ణార్జున సంవాదము అనే ద్విపద కావ్యాన్ని, సంస్కృతములో కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోద్య కావ్యానికి ఒక వ్యాఖ్యను వ్రాసినాడు.
యః కొండవీడునగరీం వినికొండముఖ్యైః
దుర్గైత్సమం సమధిగమ్య మహామహిమ్నా
ప్రాదాన్ముదా సకల భూసురపుంగవేభ్యః
శ్రీరామచంద్రపురముఖ్య మహాగ్రహారాన్
సోऽయం ప్రధానోత్తమమౌలిరత్నం
నాదిండ్లగోపప్రభురాత్మవేత్తా
ప్రబోధచంద్రోదయ నాటకస్య
టీకాం హితార్థే వ్యతనోద్బుధానాం
(కొండవీడు, వినుకొండ మొదలగు దుర్గాలకు అధిపతిగా బ్రాహ్మణులకు సంతోషము కలుగజేస్తూ రామచంద్రపురాది అగ్రహారాలలో ముఖ్యమైన అమాత్యుడిని నాదిండ్ల గోపమంత్రిని ప్రబోధచంద్రోదయ నాటకానికి టీకను వ్రాస్తున్నాను.)
లొల్లా లక్ష్మీధరుడు: ఈ మహాపండితుడు ఓఢ్ర ప్రభువుకు ఆపాదించబడిన సరస్వతీవిలాసము అనే న్యాయశాస్త్ర గ్రంథానికి నిజమైన రచయిత. ఇతని శిష్యుడైన దేసయామాత్యుడు గోపమంత్రికి అనుచరుడు. ఇతడు పంచిక అనే మహిమ్నాస్తవముపై వ్యాఖ్యను లక్ష్మీధరునికి అంకితము చేశాడు.
వల్లభాచార్యులు: కృష్ణాగోదావరి నదుల మధ్య ఉన్న కాకరవాడులో వల్లభాచార్యుల పూర్వీకులు నివసించారు. వల్లభాచార్యుల తండ్రి కాశీలో స్థిరపడి తీర్థయాత్రలు చేస్తూ తిరుపతిలో మరణించారు. వల్లభాచార్యులు మిగిలిన కుటుంబ సభ్యులను విజయనగరములో మేనమామ దగ్గర వదలిపెట్టి తాను తీర్థయాత్రలు చేస్తూ, దక్షిణ దిగ్విజయ యాత్రలో శ్రీకృష్ణదేవరాయల కొలువులో మతసంబంధమైన చర్చలో విజయాన్ని సాధించాడు. అద్వైత, విశిష్ఠాద్వైత, ద్వైత మతావలంబులు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రము, భగవద్గీతలనుండి తమ సిద్ధాంతాలను గ్రహించగా ఇతడు భాగవతపురాణమునుండి కూడ గ్రహించాడు. మురళీధరదాసుడు రచించిన వల్లభాచార్యుల జీవితచరిత్రలో వీటిని గురించిన వివరాలు ఉన్నాయి. వల్లభాచార్యుల దర్శనము చింతలపూడి ఎల్లనార్యునికి రాధామాధవ కావ్య రచనకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందేమో? వల్లభాచార్యుని మధురాష్టకము (అధరం మధురం) కృష్ణ స్తోత్రాలలో మధురతరమైనది. అతడు వ్రాసిన కృష్ణప్రేమమయీ రాధా అనే అష్టకము కూడ చాల అందమైనది, భావభరితమైనది. అందులోనుండి ఒక చరణము –
కృష్ణగేహే స్థితాం రాధా
రాధాగేహే స్థితో హరిః
జీవనేన ధనైర్నిత్యం
రాధాకృష్ణ గతిర్మమ
(కృష్ణుని ఇంటిలో (మనసులో) రాధ ఉంటుంది, రాధ ఇంటిలో (మనసులో) కృష్ణుడు ఉంటాడు, అదే జీవనములోని నిత్య సంపద, రాధాకృష్ణులే నాకు దిక్కు.)
వ్యాసతీర్థులు: తత్త్వవాదమని చెప్పబడే ద్వైత సాంప్రదాయ పద్ధతిని ఉద్ఘటించినవారు ముగ్గురు – ద్వైతమత స్థాపకుడైన ఆనందతీర్థులు, ఆనందతీర్థుల అనేక కృతులకు టీకలు వ్రాసి టీకాచార్యులు అని పిలువబడే జయతీర్థులు, తరువాత వ్యాసతీర్థులు. వీరిని ఆచార్యత్రయము అంటారు. వ్యాసతీర్థులు వ్రాసిన గ్రంథములలో ముఖ్యమైనవి న్యాయామృత, తాత్పర్యచంద్రిక, తర్కతాండవ. వీటిని వ్యాసత్రయము అంటారు. వ్యాసతీర్థులు శ్రీకృష్ణదేవరాయలకు ఆస్థాన గురువు. కృష్ణ రాయలకు ఇతనిపై శ్రద్ధాభక్తులు ఎక్కువ. 1521లో దుష్టగ్రహ కూటమివల్ల రాజ్యము కోల్పోయే అవకాశము రాయల జాతకములో ఉన్నదని అందరు ఆందోళన పడినారని (దీనినే కుహూ యోగము అంటారు), ఆ సమయములో (8 జనవరి 1521) వ్యాసతీర్థులు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి తాను కప్పుకొన్న కాషాయ వస్త్రముతో కృష్ణరాయలకు కలగబోయే అపాయాన్ని వారించినాడనీ ఒక ప్రస్తావన ఉంది. ఈ వ్యాసతీర్థుని ప్రోద్బలము, ఆశీస్సులతో వ్రాసిన కావ్యమే రాయల సకలకథాసంగ్రహము. ఇతరులను ఖండించేటప్పుడు వ్యాసతీర్థులు సహజంగా, వైషమ్యాలు లేకుండా తర్కించేవాడు. రాజగురువుగా అన్యమతాలను, సిద్ధాంతాలను ఎంతో ఆదరించాడు. గురువులా రాజు, రాజులా గురువు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ద్వైతసారాన్ని ఒకే పద్యములో వ్యాసతీర్థుడిలా వివరిస్తాడు –
శ్రీమన్మధ్వమతే హరిః పరతరః సత్యం జగత్ తత్త్వతో
భేదో జీవగణా హరేరనుచరాః నీచోచ్ఛభావం గతాః
ముక్తిర్నైజసుఖానుభూతిరమలా భక్తిశ్చ తత్సాధనం
హ్యక్షాదిత్రయం ప్రమాణమఖిలామ్నాయైకవేద్యో హరిః
(శ్రీమన్మధ్వ సిద్ధాంతములో శ్రీహరి సర్వోత్తముడు, ప్రమాణప్రమితమైన ఈ జగత్తు సత్యము, జీవగణములో భేదములు ఉన్నవి, అందరు హరికి అనుచరులు, వారందరికి తరతమ భేదములు గలవు, ఆనందానుభవమే ముక్తి, విష్ణుభక్తి ఆ ముక్తికి సాధనము, ప్రమాణములు మూడే, శ్రీహరియే అఖిల సదాగమములనుండి తాత్పర్యపూర్వకమైన ప్రతిపాద్యుడు.)
కన్నడ కావ్య సాహిత్యములు
దాసకూటము: వ్యాసతీర్థులు చేసిన మరొక ఘనకార్యం కొన్ని శతాబ్దాలుగా నిలిచి ఉన్నది. అదే దాసకూటము. పామరులకు వారి భాషలోనే పదాలను అల్లడానికి వ్యాసతీర్థుడు బృహత్ప్రయత్నము చేసాడు. ఇతని శిష్యులయిన పురందరదాసు, కనకదాసులలో కనకదాసు బ్రాహ్మణుడు కాదు. ఆ కాలములో బ్రాహ్మణేతరుని ఒక మతాచార్యుడు శిష్యునిగా స్వీకరించి ఆదరించి ప్రోత్సహించడం ఒక గొప్ప విశేషమే. పురందరదాసు వేలాది దేవరనామగళను (దేవుని పేరులతో కీర్తనలు) వ్రాసి పండిత పామరులను రంజిల్ల జేయడం మాత్రమే కాక, మనకు తెలిసిన కర్ణాటక సంగీత సాధనకు సోపానాలను నిర్మించినవాడు. నేడు సంగీత శిక్షణారంభములో అందరు నేర్చుకొనే మాయామాళవగౌళ రాగము పురందరదాసు ప్రతిపాదించినదే. అందరికీ తెలిసిన అతని భాగ్యద లక్ష్మీ బారమ్మా అనే కీర్తన, అలాగే శ్రీగణనాథ వంటి పిళ్ళారి గీతాలు కూడ ఈయనవే.
కనకదాసు: ఇతను కూడ గొప్ప వాగ్గేయకారుడు. పూర్వజీవితములో యుద్ధం చేసిన వీరుడు.
బాగిలను తెగెదు సేవెయను – పి. బి. శ్రీనివాస్
ఒకప్పుడు పెద్ద దెబ్బ తగిలి చావు నుండి తప్పించుకొన్న తరువాత హరిదాసై శేషజీవితాన్ని సంగీతసాహిత్యాలకు అంకితం చేసాడు. ఇప్పటికీ ఉడుపిలో ఉన్న కనకన కిటికీ అని ఒక గవాక్షం గుండా ఇతడు శ్రీకృష్ణుని దర్శనం చేసుకొనేవాడట. కాగినెలె (ఒక ఊరి పేరు) ఆదికేశవ అనేది ఇతని ముద్ర. ఇతని బాగిలను తెగెదు సేవెయను కొడు హరియే అనే పాట బాగా ప్రసిద్ధి చెందినది.
కనకదాసు దేవరనామగళను మాత్రమే కాక నళ చరిత్రె, మోహన తరంగిణి కావ్యాలను కూడ వ్రాసినాడు. మోహనతరంగిణి నుండి ఒక రెండు పద్యాలు ఇక్కడ ఉదహరిస్తాను. ఇవి సాంగత్య ఛందస్సులో ఉన్నాయి (సీసంలో చివర ఒక సూర్య గణము తప్పిస్తే సాంగత్యం వస్తుంది).
ఆ పర్వతద దక్షిణభాగదొళు జంబూ-
ద్వీపద మధ్యదొళిర్దు
సోపస్కరవెత్త నిఖిల దేశంగళ స్వ-
రూపవనే వణ్ణిసువెను
మాళవ మగధ కాశ్మీర గుజ్జర గౌళ
చోళ కోసల దేశ బోట-
లాళ కన్నడ వంగ చౌట హొయ్సళ మలె-
యాళ దేశంగళొప్పిదువు
ఇంతివు మొదలాద బహు దేశదల్లి శ్రీ-
కాంతంగె తవరూరెనిసి
సంతసవడెదు సౌరాష్ట్ర సకల ది-
గంతక్కె సత్కీర్తి వడెదు
(మేరుపర్వత దక్షిణ దిశలో ఉన్న జంబూద్వీప మధ్య భాగములో ఉన్న వివిధ దేశాలను మీకు చెబుతున్నాను. మాళవాది దేశాలనుండి మలయాళ దేశమువరకు ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలో శ్రీకృష్ణుడు ఉండే సౌరాష్ట్ర దేశము దిగంతాలలో కీర్తిని పొందింది.)
ఈ ఇద్దరు గొప్ప హరిదాసులకు గురువైన వ్యాసతీర్థులు కూడ గొప్ప వాగ్గేయకారుడే. అతని కృష్ణా నీ బేగనె బారోఅనే పాట అత్యంత మధురమే.